మళ్లీ 1991, మళ్లీ మన్మోహన మాయాజాలం!

ఈభూమి జూలై 2012 కోసం

 ఆర్థిక సంస్కరణలకు, నూతన ఆర్థిక విధానాలకు దారితీసిన 1991 సంక్షోభం పునరావృతమవుతోందా?

దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనా విధానాలలో పెనుమార్పులకు నాంది పలికిన 1991 నాటి కాలం మళ్లీ వస్తోందా?

ఆర్థిక మంత్రిగా డా. మన్మోహన్ సింగ్ వంటి ప్రపంచ బ్యాంకు ఏజెంటును నియమించవలసిందే అని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు పట్టుబట్టిన 1991 తిరిగివస్తోందా?

ఇటువంటి ప్రమాదసూచికలను పాలకపక్షం ప్రకటిస్తే అవి కేవలం తన పాలనను స్థిరపరచుకోవడానికి వేస్తున్న ఎత్తుగడలుగా, సాగిస్తున్న తప్పుడు ప్రచారంగా కొట్టివేయవచ్చు. కాని ప్రధాన ప్రతిపక్షమూ అదే మాట అంది, అంతర్జాతీయ ద్రవ్య, వాణిజ్య సంస్థలూ అదేమాట అన్నాయి. దేశంలోని అంతర్గత ఆర్థిక సూచికలూ, బాహ్య సూచికలూ కూడ అదేమాట అన్నాయి. చివరికి, ఇప్పటిదాకా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థి కావడంతో, ఆర్థిక మంత్రిత్వశాఖ బాధ్యతలను డా. మన్మోహన్ సింగ్ స్వీకరించడం కూడ జరిగిపోయింది.

ఈ ఆర్థిక సంక్షోభ స్థితి గత మూడునాలుగు నెలలుగా మరింతగా విస్తరిస్తోంది. యూరపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలలో గందరగోళం మొదలయిన నాటినుంచీ భారత ఆర్థిక సూచికలలో కూడ తిరోగమనం స్పష్టంగా కనబడుతోంది. ఆర్థికాభివృద్ధి రేట్లు పడిపోవడం, మితిమీరిన ద్రవ్యోల్బణం, రూపాయి మారకపు విలువ నానాటికీ పడిపోవడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి.

మొట్టమొదట దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటు ఆశించినంత లేకపోవడం మాత్రమే కాదు, ముందు ఊహించిన స్థాయికి కూడ చేరలేదు. మార్చ్ 2011తో అంతమైన ఆర్థిక సంవత్సరంలో 8.4 శాతం ఉన్న పెరుగుదల రేటు మార్చ్ 2012తో అంతమైన ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పడిపోయింది. నిజానికి ఈ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటు అనేది వాస్తవికమైనదో, ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సంబంధించినదో, ప్రజాజీవితపు మెరుగుదలకు సంబంధించినదో ఏమీ కాదు. ప్రత్యేకించి తీవ్రమైన అసమానతలు ఉన్న భారత దేశంలో వంద మంది అత్యంత సంపన్నులను మినహాయించి లెక్కవేస్తే, స్థూల జాతీయోత్పత్తి 25 శాతం తగ్గిపోయే పరిస్థితి ఉంది. కనుక నూట ఇరవై కోట్ల ప్రజల బాగోగుల కన్న ఆ వందమంది బాగోగుల ప్రభావమే పెరుగుదల రేటు మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ అంకెతో దేశ ఆర్థిక పరిస్థితి ఆరోగ్యాన్ని గ్రహించడం అంత సులభమేమీ కాదు గాని, సాంప్రదాయికంగా ఆ అంకెను ఆర్థిక వ్యవస్థ స్థితికి సూచికగా గ్రహిస్తున్నారు. అది పడిపోవడం అంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే అని భావిస్తున్నారు. ఈ స్థూల జాతీయోత్పత్తిని లెక్కగట్టడంలో భాగమైన పారిశ్రామిక రంగ ఉత్పత్తి రేటు అంతకు ముందు సంవత్సరం 9 శాతం ఉన్నదల్లా తర్వాతి సంవత్సరంలో 3 శాతానికి పడిపోయింది.

రెండవది, దేశంలో ద్రవ్యోల్బణ రేటు నానాటికీ పెరిగిపోతోంది. ఈ సంవత్సరం లెక్కలే చూసినా జనవరిలో 7.7 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 8.8 శాతంగా, మార్చ్ లో 9.4 శాతంగా, ఏప్రిల్ లో 10.4 శాతంగా పెరుగుతూ వచ్చింది. ద్రవ్యోల్బణం అనే అర్థశాస్త్ర పారిభాషిక పదాన్ని చాలమంది ధరల పెరుగుదలకు పర్యాయపదంగా చూస్తారు గాని ఇది ధరల పెరుగుదలకు ఒకానొక సూచిక మాత్రమే. నిజానికి ఇది గత సంవత్సరంలో, లేదా గతనెలలో ఉన్న ధరలకూ ప్రస్తుత ధరలకూ మధ్య ఉన్న తేడా పెరుగుదల రేటు మాత్రమే. ఆ ధరలు కూడ నిత్య జీవితావసర సరుకుల ధరలు మాత్రమే కాదు. ఎప్పుడో తయారు చేసిన ఒక సరుకుల బుట్ట ఈ సూచిక తయారీకి ఆధారం. ఆ సరుకుల బుట్టలో ఒక్కొక్క సరుకుకూ ఒక్కొక్క విలువ ఎప్పుడో నిర్ణయించారు. కాని ఆ బుట్టలోని సరుకుల వాడకమూ మారిపోయింది, వాటి విలువలూ మారిపోయాయి. కనుక ఈ ద్రవ్యోల్బణం మదింపే లోపభూయిష్టమైనది. అందుకే మనకు ఎల్లప్పుడూ మన మార్కెట్లలో, మనం కొనే సరుకుల ధరలు పెరుగుతున్నట్టే కనబడినా, ద్రవ్యోల్బణం మాత్రం తగ్గిందని ఒక్కొక్కసారి ప్రకటనలు వినబడుతుంటాయి. అయితే ఎంత లోపభూయిష్టమైనదైనా ధరల పెరుగుదల అనే ఒక నిత్యజీవిత మహమ్మారిని కనిపెట్టడానికి మనకు ఉన్న ఏకైక ఆధారం అదే గనుక దానిమీద ఆధారపడక తప్పడం లేదు. అది నానాటికీ పెరుగుతూ పోతుండడం ప్రమాదసూచికే. అంతర్జాతీయంగానే ద్రవ్యోల్బణ రేటు రెండంకెల స్థితి దాటడం (అంటే 9 కన్న ఎక్కువ కావడం) తక్షణమే చర్యలు తీసుకోవలసినంత తీవ్రమైన ప్రమాద సూచికగా చెపుతారు. దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యకు అటూ ఇటూ ఊగిసలాడుతూ ఏప్రిల్ లో అటు దాటేసింది.

మూడవదీ, బాహ్య సూచికలలో ముఖ్యమైనదీ వాణిజ్య లోటు. అంటే ఎగుమతి ద్వారా ఆదాయానికీ దిగుమతికి చెల్లించవలసిన ఖర్చుకూ మధ్య ఉండే లోటు. ఇది 2010-11 సంవత్సరానికీ, 2011-12 సంవత్సరానికీ 56 శాతం పెరిగింది. ఈ లోటు స్థూల జాతీయోత్పత్తిలో 10.6 శాతం కన్న ఎక్కువ. అంటే అంత ఎక్కువగా దిగుమతులు సాగాయని, ఆమేరకు విదేశీ మారకద్రవ్యం ఖర్చయిందని అర్థం. చెల్లింపుల లోటు ఇలా పెరిగిపోతున్నందువల్ల భారత ప్రభుత్వం దగ్గర విదేశీ మారక ద్రవ్య నిలువలు నానాటికీ తరిగిపోతున్నాయి. సరిగ్గా ఇటువంటి చెల్లింపుల లోటు, విదేశీ మారక ద్రవ్య సంక్షోభాలను చూపెట్టే 1990లో రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిలువ ఉన్న బంగారాన్ని టన్నులకొద్దీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు కుదువ పెట్టారు. దేశదేశాల ద్రవ్య సంస్థల దగ్గరికి వెళ్లి అప్పులకోసం దేబిరించారు. అంతర్జాతీయ ద్రవ్యసంస్థల షరతులకు లోబడి నూతన ఆర్థిక విధానాలు ప్రకటించారు.

నాలుగవది, డాలర్ తో రూపాయి మారకపు రేటు చాల అనూహ్యంగా, నిష్కారణంగా పడిపోవడం మొదలయింది. దానితో భారతదేశం నుంచి ఎగుమతులకు రూపాయలలో చూసినప్పుడు తక్కువ దక్కడం, దిగుమతులకు ఎక్కువ రూపాయలు చెల్లించవలసి రావడం, విదేశీ సరుకుల ధరలు పెరిగిపోవడం, భారత విదేశీ రుణం హఠాత్తుగా పెరిగిపోవడం వంటి విపరిణామాలు సంభవించాయి.

ఈ అంతర్గత, బాహ్య సూచికలు ఒకవైపు ప్రమాదఘంటికలు వినిపిస్తుండగానే, అంతర్జాతీయ ద్రవ్య, వాణిజ్య సంస్థలు భారత్ పరపతి తగ్గిపోయిందని ప్రకటించడం మొదలుపెట్టాయి. సరిగ్గా 1991లో జరిగినట్టుగానే స్టాండర్డ్ అండ్ పూర్స్, ఫిచ్, మూడీస్ వంటి అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థలు భారత దేశపు రేటింగ్ తగ్గిపోయిందని ప్రకటించాయి. ఈ క్రెడిట్ రేటింగ్ అనేది ఒక అంతర్జాతీయ మోసం. దగుల్బాజీ వ్యవహారం. ఒక ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగానే ఉన్నదని, దానికి రుణం ఇస్తే తిరిగి తీర్చగల సామర్థ్యం ఉందని ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను పరిశీలించి ఈ క్రెడిట్ రేటింగ్ సంస్థలు రేటింగ్ ప్రకటిస్తాయి. ఈ సంస్థలన్నీ ప్రైవేట్ సంస్థలు, బహుళజాతి సంస్థల అనుబంధ సంస్థలు మాత్రమే. వాటి మాటలకు ఏ చట్టబద్ధతా, ప్రామాణికతా లేదు. కాని ఇవాళ నడుస్తున్న అంతర్జాతీయ ద్రవ్య ఆర్థిక వ్యవస్థలో ఈ సంస్థలకు అనవసరమైన, నిర్హేతుకమైన ప్రాధాన్యత వచ్చిపడింది. అవి ఆయాదేశాలకు, కొన్ని నెలలకోసారో, సంవత్సరానికోసారో డబుల్ ప్లస్, ప్లస్, స్టేబుల్, మైనస్, డబుల్ మైనస్ లేదా ఎ, బి, సి వంటి రేటింగులు ఇస్తూ ఉంటాయి. అంతర్జాతీయ బ్యాంకులు, సంపన్న దేశాల ప్రభుత్వాలు ఈ రేటింగ్ ను బట్టి ఆయా దేశాలకు రుణాలు, పరపతి సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాయి. ధనిక దేశాలనుంచి, ఆ దేశాల బ్యాంకుల నుంచి రుణ సహాయాలు, పరపతి సంపాదించదలచిన పేద దేశాల ప్రభుత్వాలన్నీ ఈ రేటింగు తగ్గిపోకుండా చూసుకోవడానికి నానా తంటాలు పడతాయి. భారత దేశపు రేటింగ్ తగ్గిపోయిందని ఈ సంస్థలు ప్రకటించగానే, ఆ రేటింగ్ పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. విదేశీ పెట్టుబడికి ఇంకా ఎక్కువ రాయితీలు కల్పిస్తే, అవకాశాలు కల్పిస్తే, మినహాయింపులు ఇస్తే వెంటనే రేటింగ్ పెరుగుతుంది. దీన్ని తిరగేసి చూస్తే, బహుళజాతిసంస్థలు తమ మార్కెట్ అవకాశాలను పెంచుకో దలచుకున్నప్పుడల్లా, తమ ముడిసరుకులు తరలించుకు పోయే అవకాశాలు పెంచుకోదలచుకున్నప్పుడల్లా ఏదో ఒక క్రెడిట్ రేటింగ్ సంస్థను పట్టుకుని భారతదేశపు రేటింగ్ ను తగ్గించినట్టు ప్రకటింపజేస్తే సరిపోతుందన్నమాట. గత ఇరవై సంవత్సరాల ప్రపంచీకరణ క్రమంలో ఇది అనేకసార్లు జరిగింది.

ఇది కేవలం ధనికదేశాల, అంతర్జాతీయ ద్రవ్యసంస్థల, బహుళజాతిసంస్థల, పాలకపక్షాల కుట్ర మాత్రమే కాదు, ప్రతిపక్షాలని పేరు పెట్టుకున్న పక్షాలు కూడ ఈ కుట్రలో భాగమవుతాయి. ఈ దేశ వనరులను ఈ దేశ ప్రజల అవసరాలకు వినియోగించడం, ఈ దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షించడం కాకుండా వనరులను బహుళజాతి సంస్థలకు దోచిపెట్టడమెట్లా, దేశ మార్కెట్ ను బహుళజాతి సంస్థలకు అప్పగించడమెట్లా, వందకోట్ల ప్రజలు నాశనమై పోయినా సరే, బహుళజాతి సంస్థల ముడుపులతో తాము బాగుపడడమెట్లా అనేదే ఈ దేశ పార్లమెంటరీ రాజకీయ పక్షాలకు, వ్యవస్థా నిర్వాహకులకు ఏకైక కార్యక్రమం అయిపోయింది.

అందుకే పార్లమెంటరీ ప్రతిపక్షాలు కూడ మౌలిక ప్రశ్నలు వేయడం లేదు. రూపాయి మారకపు రేటు అతి తక్కువగా, మున్నెన్నడూ లేని స్థాయికి, డాలరు కు రు. 54.46కు చేరినందువల్ల పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలలో మే 16న హాహాకారాలు చెలరేగాయి. ఈ మారకపు రేటు వల్ల దేశం మరొకసారి చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందనీ, అంటే 1991 నాటి ఆర్థిక సంక్షోభం పునరావృతమవుతుందనీ ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి అన్నారు. ఈ స్థితిని అరికట్టడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుందో తక్షణమే చెప్పాలనీ, ఆ చర్యలు చర్చించడానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలనీ ఆయన కోరారు. ఆ సమావేశం జరగలేదు, చర్చా జరగలేదు గాని సంక్షోభ నివారణ చర్యలు మొదలయినట్టే కనబడుతున్నాయి. బహుశా డా మన్మోహన్ సింగ్ స్వయంగా ఆర్థిక శాఖను నిర్వహించడం ఆ సంక్షోభ నివారణ చర్యల తొలి అడుగు.

ఆర్థిక మంత్రిత్వశాఖలో ప్రవేశించిన తొలిరోజే డా. మన్మోహన్ సింగ్ చేపట్టిన చర్యలు, చెప్పిన మాటలు రానున్న రోజుల్లో ఆయన పనితీరు ఎలా ఉండబోతోందో స్పష్టం చేస్తున్నాయి. ఒక మంత్రిత్వ శాఖలో ఒకరు ఉంటే ఒకలాగ, మరొకరు ఉంటే మరొక లాగ విధానాలలో వైవిధ్యం ఉంటుందని భ్రమపడనక్కర లేదు గాని వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, కనీసం మొండితనాలు, మూర్ఖత్వాలు కూడ కొంతవరకు పనిచేస్తాయని చూడవచ్చు. ప్రణబ్ ముఖర్జీ కనీసం అటువంటి మొండితనంతోనైనా మొన్నటి బడ్జెట్ లో వోడాఫోన్ వంటి బహుళ జాతి టెలికమ్యూనికేషన్స్ కంపెనీ మీద ఎక్కువ పన్ను విధించాడు. ఆ పన్ను విధింపు సమర్థనీయమే అయినప్పటికీ, అప్పటినుంచీ దేశంలోని బడా వాణిజ్య పత్రికలు దాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇటువంటి పన్నుల విధానం ఉంటే మేం మీ వైపు కన్నెత్తి చూడబోం అని బహుళ జాతి సంస్థలు బెదిరిస్తున్నాయి. రెండు నెలలు తిరగకుండానే ఆర్థిక మంత్రి మారిపోయాడు. బహుళ జాతి సంస్థలు వంగమని కోరితే పాకడానికి సిద్ధపడే వ్యక్తి, ప్రపంచ బ్యాంకు మాజీ ఉద్యోగి ఆ స్థానంలో అడుగుపెట్టాడు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఆర్థిక మంత్రిత్వశాఖలో ఉన్నతోద్యోగులందరినీ కూచోబెట్టి దేశం పట్ల ఇటీవల ఏర్పడిన ప్రతికూల అభిప్రాయాలకు కారణం పన్నుల విషయంలో       తనకంటె ముందరి ఆర్థిక మంత్రి తీసుకున్న తప్పుడు నిర్ణయాలేనని, అవన్నీ మారిస్తేనే మళ్లీ బహుళ జాతి సంస్థలకు విశ్వాసం ఏర్పడుతుందని అన్నాడు. కొత్త పన్నుల విధానాన్ని తాను ఆమోదించబోనన్నాడు. మరో మాటల్లో చెప్పాలంటే 1991-96 మధ్య ఆర్థిక మంత్రి హోదాలో చేసిన గులామీ చాలనట్టు, 2004-12 మధ్య ప్రధానమంత్రి హోదాలో చేస్తున్న గులామీ చాలనట్టు, 2012 జూన్ 29న మరొకసారి ఆర్థిక మంత్రి కుర్చీలో కూచుని దేశదేశాల సంపన్నులకు, బహుళ జాతి సంస్థలకు “జీ హుజూర్, జో హుకుం, ఆప్ కీ గులాం” అని చెపుతున్నాడు.

మొదటి దఫా గులామీతో ధ్వంసమైపోయిన దేశం ఈ రెండో దఫా గులామీని సహిస్తుందా?

“ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత గల వాస్తవాలు, వ్యక్తులు రెండుసార్లు కనబడతారని, పునరావృతం అవుతారని హెగెల్ అన్నాడు. కాని ఆయన మరచిపోయిన సంగతేమంటే మొదటిసారి కనబడినప్పుడు ఆ వాస్తవాలు, వ్యక్తులు విషాదంగా ముగుస్తారు. రెండోసారి హాస్యాస్పదంగా ముగుస్తారు” అని కార్ల్ మార్క్స్ ‘ది ఎయిటీన్త్ బ్రుమేర్ ఆఫ్ లూయీ బోనపార్టీ’ పుస్తకం మొదలుపెడుతూ అన్నాడు. మన్మోహన మాయాజాలం మొదటిసారి దేశ ప్రజలకు విషాదాన్ని మిగిల్చింది. రెండోసారి, ఆయనను హాస్యాస్పదం చేస్తుందా?

 

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s