వానలు లేవు, విత్తనాలు లేవు, మద్యం మాత్రం పుష్కలం!
ఇది రాసే సమయానికి వానకాలం ప్రవేశించి ఇరవై రోజులు అవుతున్నది. అంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వానలు పడి, వాగులూ వంకలూ పారి, చెరువులు నిండి, ఏరువాక సాగి, దుక్కులు దున్ని, విత్తనాలు చల్లి, ముమ్మరంగా వ్యవసాయ పనులు నడుస్తుండవలసిన స్థితి. కాని నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడానికే పది రోజులు ఆలస్యమయింది. ప్రవేశించాక కూడ రెండు మూడు రోజులు వానలు పడి ఆగిపోయాయి. ఇప్పటికి రాష్ట్రంలో కురిసి ఉండవలసిన వర్షపాతంలో సగం కూడ కురవలేదు. మధ్యలో నేల తడిసిందని ఆశతో వేసిన విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. రెండు జీవనదులు ప్రవహిస్తూ, అన్నపూర్ణ అని పేరు తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో వలస పాలన తొలగి ఆరు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడ మొత్తం విస్తీర్ణంలో మూడో వంతుకు కూడ రక్షిత నీటి పారుదల సౌకర్యాలు లేని దౌర్భాగ్యం కొనసాగుతున్నది. మిగిలిన మూడింటరెండు వంతుల వర్షాధార వ్యవసాయ భూభాగంలో రైతులు మృగశిర ప్రవేశించిన నాటినుంచీ రాని మేఘాలవైపు ఎదురుతెన్నులు చూడక తప్పడంలేదు. అత్యాధునిక పాలనా యంత్రాంగాలూ సాంకేతిక పద్ధతులూ ఎన్నో ఉన్నప్పటికీ తెలుగు సీమ రైతు ఇంకా ప్రకృతికి అధీనంగా, నిస్సహాయంగా తెలియని ఏ తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచిన అజ్ఞానపుటంధ యుగంలోనే ఉండవలసి వస్తున్నది. అంతమాత్రమే కాదు, నాలుగు చినుకులు పడినచోట అదునుచూసి దుక్కులు దున్ని విత్తనాలు వేద్దామంటే ఆ విత్తనాలూ దొరకని స్థితి. తాము పండించిన దానిలోంచే విత్తనాలు దాచుకునే ప్రాచీన వివేకాన్ని రద్దు చేసిన పాలక, వ్యాపార వర్గాలు, ప్రతి గింజకూ దేశదేశాల బడా విత్తన వ్యాపార సంస్థల ముందు మోకరిల్లే దుస్థితిని తెచ్చిపెట్టాయి. ఆ వ్యాపారసంస్థలు కృత్రిమ విత్తనాల కొరత సృష్టించి రైతుల నిస్సహాయ స్థితిని ఇబ్బడిముబ్బడి లాభాలుగా మార్చుకుంటుంటే ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలు మౌనసాక్షిగా, అక్రమాల భాగస్వామిగా ఉండిపోతున్నాయి. సంక్షేమరాజ్య భావనలో భాగంగా మేలైన విత్తనాలు సరైన ధరలకు అందించడానికే ఏర్పాటయిన ప్రభుత్వరంగ విత్తన సంస్థలు ఉన్నాయో లేవో తెలియని స్థితి. బిటి పత్తి విత్తనాల సంచికి ప్రభుత్వం నిర్ణయించిన ధర రు. 930 కాగా, చీకటి బజారు వ్యాపారులు రు. 2000 నుంచి రు. 2500 వరకూ అమ్ముతున్నారని, ధరలు పెంచడానికి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ వ్యాపారసంస్థల మీద నియంత్రణ లేదు, నిఘా లేదు, విచారణ లేదు, శిక్షలు అసలే లేవు. ఈ స్థితిలో రాష్ట్రం నలుమూలల నుంచీ విత్తనాల కోసం రైతులు పడుతున్న ఇబ్బందుల, ఆందోళనల వార్తలు వస్తున్నాయి. హైబ్రిడ్, క్రాస్ బ్రీడ్, ఎక్కువ దిగుబడి వంగడాల వంటి ఆధునిక విత్తనాలు మాత్రమే కాక దేశవాళీ మామూలు విత్తనాల కోసం కూడ రైతులు పడిగాపులు పడవలసి వస్తోందనీ, రైతుల అవసరాలను తీర్చగలిగిన పరిమాణంలో విత్తనాలు లేవని వ్యాపారులు చెపుతున్నారనీ వార్తలు వస్తున్నాయి. పత్తి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్ వంటి వాణిజ్య పంటల విత్తనాలు మాత్రమే కాదు, వరి, జొన్న, మక్కజొన్న, పెసర, మినుము, కంది, జనుము, ఆముదం వంటి సాంప్రదాయిక విత్తనాలకు కూడ రైతులు కొరతను ఎదుర్కొంటున్నారు. విత్తనాలను నిలువ చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. నామమాత్రంగా ఎక్కడో ఒకచోట దాడి చేసి విత్తనాల నిలువలను పట్టుకున్న వార్తలు వస్తున్నా, మొత్తం మీద అధికారులకూ అక్రమ విత్తన వ్యాపారులకూ లాలూచీ నిష్పూచీగా సాగి పోతున్నది. అటు వానలూ దైవాధీనమై, ఇటు విత్తనాలు, ఎరువులు కూడ నియంత్రణ లేక దైవాధీనంలా మారిపోయి తొలకరితోనే రైతాంగం ఆందోళనల పర్వం మొదలయింది. రాష్ట్ర జనాభాలో డెబ్బై శాతం ఆధారపడే వ్యవసాయరంగ దుస్థితిని సవరించడానికి ఎటువంటి చిన్నమెత్తు ప్రయత్నమూ చేయని ప్రభుత్వం మద్యం వ్యాపార నేర రాజకీయాలకు అదనపు అవకాశాలు కల్పించడానికి మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. ఒక్కొక్క గ్రామంలో, పట్టణంలో జనాభాను బట్టి మద్యం అమ్మకాలను అంచనావేసి, దాన్నిబట్టి లైసెన్స్ రుసుం నిర్ణయించింది. గతంలోని వేలం పాట ద్వారా మద్యం దుకాణాలను అప్పగించే పద్ధతి స్థానంలో ప్రస్తుతం లాటరీ పద్ధతి ప్రవేశపెట్టారు. దుకాణాలు పెట్టదలచుకున్నవారు రు. 25,000 రుసుం కట్టి దరఖాస్తు చేస్తే దరఖాస్తుదారుల పేర్లలో ఒకరి పేరును లాటరీ ద్వారా నిర్ణయిస్తారు. దరఖాస్తుదారులు మరొకరికి దుకాణం ఇవ్వగూడదని, మరొకరిని భాగస్వాములుగా చేర్చుకోవాలంటే అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించి, తద్వారా బేనామీలను అడ్డుకోవచ్చునని చెపుతున్నారు. కాని ఈ ఆంక్షలన్నిటినీ అధిగమించి మళ్లీ పాత నేర రాజకీయ వ్యాపారులే మద్యం దుకాణాలను ఆక్రమించగలరని ఎవరయినా ఊహించగలరు. అసలు జనాభాను బట్టి తాగుబోతులు ఎంతమంది ఉండగలరో, ఎంత మద్యం అమ్మకం కాగలదో నిర్ణయించడమే దుర్మార్గం. లైసెన్స్ రుసుంకు ఆరు రెట్ల విలువైన మద్యాన్ని అమ్ముకోవచ్చునని, అంతకన్న ఎక్కువ అమ్మదలచుకుంటే కొనుగోలు మీద అదనంగా 8 శాతం పన్ను చెల్లించాలని కొత్త నిబంధన విధించారు. అంటే లైసెన్స్ ఫీ కన్న ఆరు రెట్ల విలువైన మద్యం అమ్మకాలు కనీసంగా ఉంటాయన్న మాట. పదివేల లోపు జనాభా ఉన్న గ్రామంలో లైసెన్స్ ఫీ రు. 32.50 లక్షలు. అంటే ఆ గ్రామంలో కనీసం ఒక కోటి తొంబై ఐదు లక్షల రూపాయల మద్యం అమ్ముకోవచ్చు. అంటే ప్రతిరోజూ ప్రజలు తమ చెమటా నెత్తురూ వెచ్చించి సంపాదించిన ధనంలోంచి యాభై వేల రూపాయలు మద్యానికే దుబారా అయిపోతాయి. ఈ నిర్ణీత కోటాకు మించిన అమ్మకాలు, కనీస గరిష్ట ధర కన్న ఎక్కువ అమ్మకాలు సరేసరి. ఆరోగ్య, సామాజిక, సాంస్కృతిక అనర్థాల ప్రస్తావన లేకుండానే సాగే ప్రజాధన నష్టం, బందిపోటు దొంగతనం ఇది. ఇంత పెద్ద ఎత్తున ప్రజాధన దోపిడీ విధానాన్ని ప్రభుత్వమే ప్రకటించడం, దాని ద్వారా పన్నుల ఆదాయం వస్తుందని, దానివల్ల ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని బుకాయించడం పాలకవర్గాల దుర్మార్గానికి చిహ్నం. సాంస్కృతిక, నైతిక కారణాలతో మాత్రమే కాదు, రాజకీయార్థిక కారణాలతో కూడ మద్యనిషేధం అమలు చేయాలని ప్రజాఉద్యమం నిర్మించవలసిన అత్యవసర సందర్భం ఇది.
సంపాదకీయ వ్యాఖ్యలు
రాష్ట్రపతి ఎన్నికలో అవకాశవాదం గెలుపు
రాష్ట్రపతిగా ఎవరు ఓడినా, ఎవరు గెలిచినా దేశానికి, దేశ ప్రజలకు ఒరిగేదేమీ లేదు. దేశ ప్రజల మౌలిక రాజకీయార్థిక సామాజిక సమస్యలు తీరబోవు. కాని, ప్రజలను తమ నిజమైన నిత్యజీవిత సమస్యలనుంచి, ఆ సమస్యల పరిష్కారం కొరకు జరపవలసిన పోరాటాల నుంచి పక్కదారి పట్టించడానికి ఈ దేశ పాలకులు పన్నిన అనేక వలలలో ఒకటి ఈ ఎన్నికల తతంగం. అటు యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గెలిచినా, ఇటు ఎన్ డి ఎ అభ్యర్థి పి ఎ సంగ్మా గెలిచినా ఏమీ తేడా ఉండబోదు గాని ఈ అభ్యర్థిత్వాల విషయంలో, ఎన్నికల విషయంలో అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలు ఆడుతున్న ఆటలు రసవత్తరంగా ఉన్నాయి. ముదురు ఎరుపు నుంచి కాషాయం దాకా ఈ దేశ పార్లమెంటరీ రాజకీయ పక్షాలన్నిటికీ ఎటువంటి మినహాయింపులు లేకుండా అబ్బిన అవకాశవాద రాజకీయాలకు రాష్ట్రపతి ఎన్నికలు అద్దం పడుతున్నాయి. ఈసారి రాష్ట్రపతి ఎన్నికలో ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున అవకాశవాద రాజకీయాలు కనబడడానికి నిర్దిష్టమైన సందర్భం ఉంది. దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు భయంకరమైన సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న భౌతిక పరిస్థితి వల్ల అన్ని పాలకవర్గ, పార్లమెంటరీ రాజకీయపక్షాల ఆచరణ ఇలా ఉండక తప్పదు. మరొకవైపు ఆ సంక్షోభం వల్లనే పాలకవర్గ ముఠా తగాదాలు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. ఈ ముఠా తగాదాల వల్ల కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ భిన్న రాజకీయపక్షాల ప్రభుత్వాలు, వాటి మధ్య ఒకచోట మైత్రి, మరొకచోట ఘర్షణ కనబడుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు వోటర్ల నియోజకవర్గంగా ఉండే లోకసభ, రాజ్యసభ సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి సభ్యులు వేరువేరు రాజకీయ పార్టీలకు చెందినవారు కాబట్టి ఎవరు ఎటు వోటు వేస్తారో స్పష్టంగా చెప్పగల స్థితి లేదు. కేంద్రంలో ఒక కూటమిగా ఉన్న వారే రాష్ట్రాలలో వేరు కుంపట్లతో ఉన్నారు. ఒకే కూటమి వారందరూ ఒకేలా వోటు వేస్తారనుకున్నా ఈ ఎన్నికల ప్రత్యేక లెక్కింపు పద్ధతి సమస్యను మరింత క్లిష్టం చేస్తున్నది. ఈ నియోజకవర్గ వోటర్లందరి విలువలో సగానికన్న ఎక్కువ వస్తేనే గెలుపు ఖాయమవుతుంది. కాని ఏ ఒక్క కూటమికి కూడ సగానికన్న ఎక్కువ వోట్లు లేవు. అందువల్ల అభ్యర్థులిద్దరూ వారి వారి రాజకీయ, భావజాల నిబద్ధతలను పక్కనపెట్టి శత్రువులనూ, ప్రత్యర్థులనూ, మిత్రులనూ కూడ వోట్లు అడుక్కునే యావలో పడ్డారు. వోటర్లందరూ కూడ తమ రాజకీయ, భావజాల నిబద్ధతలను పక్కనపెట్టి స్వప్రయోజనాల కోసం ఎవరికి వోటు వేయాలో లెక్కలు వేసుకుంటున్నారు. కప్పల తక్కెడలో కప్పలు ఒక పళ్లెంలోంచి మరొక పళ్లెం లోకి దూకుతున్నాయి. అత్యున్నత పదవి, ప్రతిష్టాత్మకమైన పదవి, వివాదం చేయకూడని పదవి అంటూ గంభీరమైన అబద్ధాలతో తమ వైఖరులను సమర్థించుకుంటున్నాయి. ఆ పదవి అంత పవిత్రమైనదేమీ కాదని, ఈ దేశ పార్లమెంటరీ రాజకీయాల కుళ్లు అంతా ఆ పదవికి అంటి ఉందని, చరిత్ర చెప్పే నిజాన్ని ఇవాళ్టి ఎన్నికలు మరొకసారి నిరూపిస్తున్నాయి.
ఈజిప్ట్ లో గెలుపు ప్రజాఉద్యమానిదేనా?
ఏడాదిన్నర కింద ఈజిప్ట్ రాజధాని నగరం కైరోలో నైలు నదీ తీరాన తెహ్రీర్ స్క్వేర్ లో ఎగిరిన స్వేచ్ఛాపతాక ఇవాళ ప్రజాస్వామ్య ఎన్నికల ముసుగు వేసుకున్న సైనిక పదఘట్టనల కింద నేలరాలుతున్నది. మూడు దశాబ్దాల పాటు నిరంకుశ ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన అధ్యక్షుడు హోస్ని ముబారక్ ను కూలదోసిన ఆ తిరుగుబాటు ఎలా పర్యవసిస్తుందా అని ప్రపంచ ప్రగతిశీల శక్తులన్నీ ఊపిరి బిగబట్టి ఎదురుచూశాయి. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిన ఆ ప్రజా వెల్లువలో మతఛాందస శక్తులనుంచి విప్లవశక్తులదాకా అందరూ పాల్గొన్నందువల్ల, ఆ వెల్లువను తమ వైపు తిప్పుకోవడానికి సామ్రాజ్యవాదుల నుంచి పాత పాలకవర్గాల దాకా, సైనికాధికారుల దాకా ప్రతి ఒక్కరూ ప్రయత్నించినందువల్ల తెహ్రీర్ స్క్వేర్ ప్రజాఉద్యమంలో అంతిమంగా ప్రజలు గెలవకపోవచ్చుననే అనుమానాన్ని విశ్లేషకులు వెలిబుచ్చారు. ముబారక్ కుటుంబం దేశం వదిలి పారిపోవడం, ముబారక్ ను బోనెక్కించి, విచారించి, శిక్ష విధించడం వంటి అనుకూల ఫలితాలను సాధించినప్పటికీ, ఈజిప్ట్ ప్రజాఉద్యమానికి నాయకత్వం వహించి దాన్ని నిజంగా ప్రజల విజయంగా మార్చగలిగినంత బలాన్ని ప్రగతిశీల శక్తులు సంతరించుకోలేదు. దానితో ఏర్పడిన ప్రతిష్టంభనలో సైన్యానిదే పైచేయి అయింది. ఈజిప్షియన్ సైన్యంలోని 21 మంది సీనియర్ అధికారులతో ఏర్పడిన సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ (స్కాఫ్) దేశపు నిజమైన పాలకవర్గంగా మారింది. ప్రజాస్వామ్యం గురించి పైకి ఎన్ని ధర్మపన్నాలు పలికినా సామ్రాజ్యవాదులు ఈ స్కాఫ్ కే తమ అండదండలు అందించారు. స్కాఫ్ పాలనా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుని పార్లమెంటును రద్దు చేసింది. రాజ్యాంగాన్ని రద్దు చేసింది. అధ్యక్షపదవికి, పార్లమెంటుకు ఎన్నికలు జరుపుతానని, ప్రజాస్వామిక పాలనను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చింది. ఆ మాటకు కట్టుబడినట్టుగానే అధ్యక్ష ఎన్నికలు ప్రకటించింది. కాని రాజ్యాంగమే లేకుండా, అధ్యక్ష పదవి విధులు, బాధ్యతలు ఖరారు కాకుండా ఆ పదవికి అర్థమే లేదు. ఆ పదవికి ముబారక్ అనుచరుడు, మాజీ ప్రధాని అహ్మద్ షఫిఖ, ముస్లిం బ్రదర్ హుడ్ నాయకుడు మహ్మద్ మొర్సి, మరొక పది మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎవరు గెలిచినా సైన్యానిదే ఆధిపత్యం అని తెలుసుగనుక 43 శాతం మంది మాత్రమే పోలింగ్ లో పాల్గొన్నారు. ఐదు కోట్ల మంది వోటర్లలో రెండుకోట్ల ముప్పై లక్షల వోట్లు పడగా, అందులో మొర్సికి 52 శాతం, షఫిఖ్ కు 48 శాతం వోట్లు వచ్చి, మొర్సి అధ్యక్షుడయ్యాడు. తనది మతవాద ఛాందస పార్టీ కాదని, ఐక్యసంఘటన ప్రభుత్వాన్ని ఏర్పరుస్తానని వాగ్దానాలు చేస్తున్నప్పటికీ, ఈ కొత్త అధ్యక్షుడు సైన్యం చేతుల్లో, ఆ సైన్యాన్ని నడిపిస్తున్న సామ్రాజ్యవాద శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా తప్ప స్వతంత్రంగా పాలన సాగించలేడు. ప్రజావెల్లువలు అప్రమత్తంగా లేకపోతే, లక్ష్య స్పష్టత లేకపోతే, ప్రజాదృక్పథంతో నడవకపోతే ప్రజాఉద్యమ కెరటాల మీద కూడ ప్రజావ్యతిరేకులు, ఇతరులు స్వారీ చేయగలరనే చేదు పాఠాన్ని ఈజిప్ట్ నేర్పుతున్నది.