యాభై ఏళ్లు కనుమరుగై దొరికిన మావో రచన

వీక్షణం అక్టోబర్ 2012 సంచిక కోసం

నవ జనచైనా నిర్మాత మావో సే టుంగ్ విప్లవోద్యమ నిర్మాణంలో భాగంగా ఎన్నో ప్రాంతాలలో గ్రామ అధ్యయనాలు జరిపి దాదాపు ప్రతి అధ్యయనం మీద నివేదికలు తయారు చేశారు. ఆయన సైద్ధాంతిక, రాజకీయ, ఆర్థిక, సైనిక, సాంస్కృతిక రంగాల గురించి విస్తృతంగా రాసిన వందలాది వ్యాసాలలో ఎన్నోచోట్ల వ్యవసాయ, గ్రామీణ అధ్యయనాలను ప్రస్తావించడంతో పాటు, ప్రత్యేకంగా వ్యవసాయ, గ్రామీణ విశ్లేషణలతో కనీసం ఇరవై నివేదికలు, వ్యాసాలు రాశారు. వాటిలో కొన్ని ఆయాకాలాలలో జరిగిన దమనకాండల లోనో, జాగ్రత్త చేయవలసిన వారి నిర్లక్ష్యం వల్లనో మాయమైపోయాయి. కొన్ని మాత్రమే మిగిలి, అచ్చుకెక్కి ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. అలా 1930లో ఆయన చైనా ఆగ్నేయ ప్రాంతంలోని జియాంగ్సీ రాష్ట్రంలో క్సున్ వు కౌంటీని (కౌంటీ అంటే జిల్లాతో సమానమైన పాలనా భాగం) అధ్యయనం చేసి వెంటనే ఒక ఐదు అధ్యాయాల నివేదిక రాశారు. ఈ క్సున్ వు నివేదికకు 1931లో రాసిన ముందుమాటలో తాను అంతకుముందే కొన్ని గ్రామ అధ్యయనాలు చేశానని, కాని ఆ సమాచారం దమనకాండలో మాయమైపోయిందని  రాశారు.

మొదట క్సున్ వు నివేదికను మరొక పది అధ్యయనాలతో కలిపి 1937లో ప్రచురించాలని అనుకున్నారు గాని ఎందువల్లనో అది జరగలేదు. అప్పుడు మావో రాసిన ముందుమాటలో, ఆ పుస్తకంలో క్సున్ వు నివేదికతో సహా 11 గ్రామ అధ్యయనాలు ఉన్నాయని మొత్తం జాబితా ఇచ్చారు. చివరికి యేనాన్ లిబరేషన్ పబ్లిషింగ్ హౌజ్ ప్రచురణగా 1941లో ‘గ్రామ సర్వేలు’ వెలువడేటప్పటికి క్సున్ వు నివేదిక మాయమైపోయింది. ఆ 1941 పుస్తకానికి రాసిన ముందుమాటలో తాను పోగొట్టుకున్న నివేదికల గురించి మావో ప్రస్తావించారు. ఆ తర్వాత, 1950లో క్సున్ వు నివేదిక రాతప్రతి దొరికింది. దాన్ని మొత్తంగా పునర్ముద్రించడం అవసరం లేదని, చివరి అధ్యాయాన్ని మాత్రం ప్రచురిస్తే చాలని భావించి మావో స్వయంగా దానికి మెరుగులు దిద్దారు. కాని 1960లో మావో ఏరిన రచనల సంపుటాల ప్రచురణ మొదలయినప్పుడు ఆ అధ్యాయమూ, నివేదికా కూడ కనబడకుండా పోయాయి. అలా ఏరిన రచనల్లో ఆ అధ్యాయం చేరలేదు. ఆ తర్వాత 1970 దశకం చివరలోనో, 1980 దశకం మొదట్లోనో ఆ నివేదిక ప్రతి మళ్లీ  దొరికింది. నలభై సంవత్సరాల కింద ప్రచురితమైన ‘గ్రామ సర్వేలు’ పుస్తకానికి కొత్త కూర్పుగా ‘సమగ్ర గ్రామ సర్వేలు’ పేరుతో 1982లో చైనీస్ భాషలో ప్రచురించినప్పుడు, దానిలో ఈ క్సున్ వు నివేదికను కూడ చేర్చారు. దాన్ని ఇంగ్లిష్ లోకి అనువాదం చేసి, వివరమైన నలభై పేజీల ముందుమాటతో, ముప్పై పేజీల పాదసూచికలతో, మావో అధ్యయనం చేసిన నాటి పటాలతో, ఫొటోలతో కలిపి చైనా చరిత్ర పరిశోధకుడు, ప్రస్తుతం వెస్టర్న్ వాషింగ్టన్ యూనివర్సిటీ చరిత్ర శాఖలో ప్రొఫెసర్ రోగర్ ఆర్ థాంప్సన్ 1990లో స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురణగా ‘రిపోర్ట్ ఫ్రమ్ క్సున్ వు’ పేరుతో వెలుగులోకి తెచ్చారు.

ఈ నివేదిక మావో తొలి రచనలలో ఒకటి. అది చైనా గ్రామ సీమల గురించి, ప్రజల గురించి, రోజువారీ ప్రజాజీవితం గురించి, అప్పటికే అక్కడ సాగుతున్న వ్యవసాయ విప్లవం గురించి అపారమైన సమాచారాన్ని అందించడం మాత్రమే కాదు, ఒక పరిశీలనాంశాన్ని అర్థం చేసుకోవలసిన సంవిధానాన్ని కూడ సూచిస్తుంది. సార్వత్రిక సమ్మె, కార్మికవర్గం ప్రధానంగా ఉండే సోషలిస్టు విప్లవం వంటి బోల్షివిక్ పంథా, చైనా వంటి వ్యవసాయ ప్రధాన, అర్ధభూస్వామ్య, అర్ధవలస దేశానికి సరిపోకపోవచ్చునని, ఇక్కడ జరగవలసినది వ్యవసాయ విప్లవమని, నూతన ప్రజాస్వామిక విప్లవమని మావో చేసిన ఆలోచనలకు మూలం ఈ గ్రామ అధ్యయనాలలోనే ఉంది. ఆ తర్వాత రెండు మూడు దశాబ్దాలలో మావో చేసిన ఎన్నో ఆలోచనలకు, చేపట్టిన ఎన్నో ఆచరణ రూపాలకు బీజాలు క్సున్ వు నివేదికలో కనబడతాయి. గ్రామ అధ్యయనాల గురించి, గ్రామాల వర్గ విశ్లేషణ గురించి, రైతాంగంలో విప్లవోద్యమ నిర్మాణం గురించి ఆలోచించే వారెవరైనా తప్పనిసరిగా అధ్యయనం చేయవలసిన పుస్తకం ఇది.

“మనకు ఈ నివేదికలో జిల్లాలోకెల్లా అత్యంత శక్తిమంతుడైన పెద్దమనిషి నుంచి తిండి కోసం కన్నబిడ్డలను అమ్ముకున్న నిరుపేద రైతుల వరకూ వందలాది మంది ప్రజలు తారసపడతారు. ఈ రెండు కొసల మధ్య మరెందరో, ఉప్పు వ్యాపారులూ, ధనిక రైతులూ, భూస్వాములూ, దర్జీలూ, కమ్మరులూ, మాంసం వ్యాపారులూ, బాణసంచా తయారీదారులూ, వేశ్యలూ, ప్రభుత్వాధికారులూ, పదిహేడో శతాబ్దపు పురాతన క్వింగ్ రాజవంశపు బిరుదులు పొందినవారూ, యువ విద్యార్థులూ, కొత్త జీవితం కోసం తపనపడుతున్న మహిళలూ, మావో చిత్రణలో మనకు కనబడతారు. బియ్యం, సారా, పంది మాంసం, చిక్కుడు గుజ్జు ఎంత ఖరీదుకు దొరుకుతాయో, అప్పులు ఎట్లా పుడతాయో, భూమి కౌలు తీసుకోవడానికి దస్తావేజు ఎలా రాయాలో, పన్నులు ఎలా చెల్లించాలో వివరాలు కూడ మనకు తెలుస్తాయి. స్థానిక పాఠశాలలను, దేవాలయాలను, పూర్వీకుల స్మారక మందిరాలను పేరుపేరునా పరిచయం చేసి చర్చించడం జరుగుతుంది. శిరోజాలంకరణ, వస్త్రధారణ పాతరోజుల్లో ఎలా జరిగేవో, ఇప్పుడెలా జరుగుతున్నాయో, క్రమబద్ధంగా జరిగే సంతలలో ఏయే వస్తువులు అమ్ముతారో కూడ తెలుస్తుంది. మావో సే టుంగ్ దృష్టి నుంచి ఏ చిన్న వివరమూ తప్పించుకున్నట్టు లేదు” అని సంపాదకుడు, అనువాదకుడు థాంప్సన్ తన ముందుమాటలో వ్యాఖ్యానించారు. ఆయనే అన్నట్టు “చైనా చరిత్రలో అతి ముఖ్యమైన సందర్భంలో ఒక జిల్లాకూ, ప్రాంతానికీ సంబంధించిన సమాజం, ఆర్థికవ్యవస్థ, రాజకీయాలు, చరిత్రల గురించి సమస్త సమాచారమూ ఈ నివేదికలో నిక్షిప్తమయింది.”

చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన 1921 నుంచి 1927 వరకూ గడిచిన సంక్షుభిత కాలం గురించి కొంచెం అర్థం చేసుకుంటే గాని ఈ నివేదిక ప్రాముఖ్యతను గుర్తించలేం. ఒకవైపు సోవియట్ యూనియన్ మార్గదర్శకత్వం, రష్యా తరహా విప్లవమే చైనాలో కూడ వస్తుందనే అమాయక, యాంత్రిక ఆలోచనలు, జాతీయ బూర్జువా వర్గ ప్రతినిధిగా ముందుకు వచ్చిన కొమింటాంగ్ తో ఐక్యతా ప్రయత్నాలు, యుద్ధప్రభువుల భూస్వామ్య దౌష్ట్యం ఆ దశాబ్దంలో చైనా కమ్యూనిస్టు పార్టీ మీద తీవ్ర ప్రభావం వేశాయి. కమ్యూనిస్టులతో ఐక్యతను కోరుకున్న కొమింటాంగ్ నాయకుడు సన్ యట్ సేన్ మరణించడం, కమ్యూనిస్టులను ద్వేషించే చాంగ్ కై షేక్ ఆధిపత్యానికి రావడం ఆ దశాబ్దంలోనే జరిగాయి. బలం పుంజుకున్న వెంటనే 1927లో చాంగ్ కై షేక్ కమ్యూనిస్టుల మీద విరుచుకుపడి లక్షలాది మందిని ఊచకోత కోశాడు. కొమింటాంగ్ తో ఐక్యత భగ్నమైపోయి కమ్యూనిస్టు పార్టీ ఒంటరి అయిపోయింది. అప్పటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు లీ లిసాన్, వాంగ్ మింగ్ ల విధానాలు చైనా విప్లవాన్ని ఒక ప్రమాదం నుంచి మరొక ప్రమాదంలోకి నెట్టడం మొదలుపెట్టాయి. మావో ఆ విధానాలను వ్యతిరేకిస్తూ చైనాలో జరగవలసిన విప్లవ దిశను పునరన్వేషిస్తూ గ్రామ ప్రాంతాలకు తరలివెళ్లాడు. ఆ క్రమంలోనే లీ లిసాన్, వాంగ్ మింగ్ ల నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ సోవియట్ ప్రాంతాల ప్రతినిధుల జాతీయ మహాసభను షాంఘైలో నిర్వహిస్తూ అందులో పాల్గొనమని మావోను ఎన్నోసార్లు కోరింది. కాని, మావో ఆ ఆహ్వానాన్ని పెడచెవిన పెట్టి జియాంగ్సీ రాష్ట్రంలో విముక్త ప్రాంతాలను, విప్లవోద్యమ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలను అధ్యయనం చేస్తూ ఉండిపోయారు. రైతాంగమే చోదకశక్తిగా విప్లవ నిర్మాణానికి అవకాశం ఉందా, రైతాంగమే శ్రేణులుగా విశాల ప్రజాబాహుళ్య పార్టీని నిర్మించే అవకాశాలున్నాయా అని అధ్యయనం చేస్తూ ఉండిపోయారు. అందులో భాగమే క్సున్ వు అధ్యయనం.

క్సున్ వు ప్రాంతంలో 1921 నుంచే కమ్యూనిస్టుల ప్రభావం ఉండింది. 1928లో అక్కడ విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ప్రయత్నం కూడ జరిగింది గాని కొమింటాంగ్ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని రక్తపుటేర్లలో ముంచి అణచివేసింది. మార్చ్ లో ఈ తిరుగుబాటు, అణచివేత జరిగితే, కొద్ది నెలల్లోనే కమ్యూనిస్టులు మళ్లీ తమ శక్తులను కూడదీసుకున్నారు. వ్యవసాయ విప్లవ కార్యక్రమాన్ని చేపట్టి, భూస్వాముల భూములు స్వాధీనం చేసుకుని, పంపిణీ చేయడం ప్రారంభించారు. అలా 1930 ఏప్రిల్ నాటికి ఈ ప్రాంతమంతా కమ్యూనిస్టుల అధీనంలోకి వచ్చింది. ఆ స్థితిలో బహుశా మేలో మావో క్సున్ వు అధ్యయనం ప్రారంభించారు. అప్పటికే స్థానిక నాయకులు చేసిన సర్వేల మీద ఆధారపడి తన నివేదిక తయారు చేయాలని మావో అనుకున్నారు గాని, ఆ పాత సర్వేలలో అవసరం లేని సమాచారమెంతో సేకరించారు. అందుకని 1930 జనవరిలో సమాచార సేకరణకు కొత్త విధివిధానాలు నిర్ణయించారు. ఈ సర్వే సమాచారాన్ని దగ్గర పెట్టుకుని మావో తనదైన పద్ధతిలో స్థానిక ప్రజలతో ‘పరిశోధనా సమావేశాలు’ ఏర్పాటు చేసి తన నివేదికకు అవసరమైన వివరాలను రాబట్టారు. “మావోకు కావలసింది వాస్తవాలు మాత్రమే కాదు, అంతకన్న ఎక్కువ. ఆ వాస్తవాలు అలా ఎందుకు ఉన్నాయని అన్వేషించడమే ఆయన పని” అని థాంప్సన్ అంటారు.

క్సున్ వు నివేదిక రాసిన 1930 నాటికే మావో దాదాపు పదిహేను సంవత్సరాల గ్రామ అధ్యయన అనుభవం సంపాదించి ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సంవిధానం ‘పరిశోధనా సమావేశం’ (నిజనిర్ధారణ సమావేశం అని కూడ కొన్ని అనువాదాలు ఉన్నాయి). పార్టీ నాయకత్వం ప్రజలతో సంబంధం పెట్టుకోవడానికి, ప్రజల గురించి తెలుసుకోవడానికి, ప్రజల నుంచి తెలుసుకోవడానికీ, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాపంథా అభివృద్ధి చెందడానికీ ఈ సంవిధానం చాల ఉపయోగపడింది. ఈ సంవిధానం గురించి కూడ మావో 1930లోనే ‘పుస్తకపూజను వ్యతిరేకించండి’ వ్యాసంలో వివరంగా రాశారు. క్సున్ వు నివేదికకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి ‘పరిశోధనా సమావేశం’లో మావోతో కలిసి పాల్గొన్న వాళ్లు పదకొండు మంది. వాళ్లు ఇరవై రెండేళ్ల నుంచి అరవై ఒక్క ఏళ్ల వయసు వరకూ ఉన్నవాళ్లు. ఎన్నో విషయాల మీద వ్యక్తిగత అనుభవం ఉన్నవాళ్లు. కేవలం సమాచార వనరులు మాత్రమే కాదు, వాళ్లందరూ కూడ అంతకు ముందరి దశాబ్దంలో క్సున్ వులో జరిగిన సంక్షుభిత చరిత్రలో, విప్లవోద్యమ నిర్మాణంలో, పోరాటాలలో పాల్గొన్నవాళ్లు. అందుకే థాంప్సన్ అన్నట్టు “మనం ఈ నివేదికను చరిత్ర, మానవ పరిణామ శాస్త్రం, మానవ శాస్త్రం, వాణిజ్యం, వ్యవసాయం, విద్యారంగం వంటి రంగాలను అధ్యయనం చేసే సమాచార వనరుగా భావించడం సరైనదే అయినప్పటికీ, అంతకన్న ముఖ్యంగా ఇది ఒక రాజకీయ దస్తావేజు అని, నిర్మాణమవుతున్న విప్లవ దస్తావేజు అని గుర్తుంచుకోవడం అవసరం.”

ఈ అధ్యయనాల క్రమంలోనే మావో పరిశీలనా పద్ధతుల గురించీ, వాస్తవాల సేకరణ గురించీ, విప్లవోద్యమ నిర్మాణంలో ఈ అధ్యయనాలు నిర్వహించే పాత్ర గురించీ, అధ్యయనాల రాజకీయ లక్ష్యం గురించీ చాల విలువైన నిర్ధారణలు, సూత్రీకరణలు చేశారు. విప్లవ పోరాటానికి తగిన ఎత్తుగడలేవో అన్వేషించడమే, పోరాటంలో చోదకశక్తులైన వర్గాలేవో, కలుపుకురాదగిన వర్గాలేవో, కూలదోయవలసిన వర్గాలేవో గుర్తించడమే పరిశోధనా లక్ష్యం అని మావో స్పష్టం చేశారు. మనకు తెలిసిన సిద్ధాంతాన్ని సామాజిక వాస్తవికత మీద రుద్దడం కాకుండా, అట్టడుగు గ్రామస్థాయిలో వాస్తవికంగా ఉన్న స్థానిక ఆధిపత్య సంబంధాలనూ, రాజకీయాలనూ గుర్తించడం కోసమే ఈ అధ్యయనాలు సాగించాలని ఆయన అన్నారు. ఇలా గ్రామీణ స్థానిక ఆధిపత్య సంబంధాలనూ, రాజకీయాలనూ లోతుగా అధ్యయనం చేసినందువల్లనే 1930, 40 దశకాలలో కమ్యూనిస్టులు చైనా గ్రామసీమలలో విస్తారమైన ప్రజా సమీకరణ సాధించగలిగారు. వర్గ విశ్లేషణ గురించిన సైద్ధాంతిక అవగాహనలను, నిర్వచనాలను చైనా సమాజానికి సృజనాత్మకంగా అన్వయించగలిగారు.

క్సున్ వు నివేదికను పరిశీలించడానికన్న ముందు, అసలు మావో చేసిన గ్రామీణ అధ్యయనాల జాబితాను ఒకసారి చూడాలి. ఆయన తన ఇరవైమూడవ ఏట, 1916లో చాంగ్షాలో ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు మొట్టమొదటి గ్రామీణ అధ్యయనం చేశారు. ఒక స్నేహితుడితో కలిసి హునాన్ రాష్ట్రంలో చాంగ్షా పరిసరాల్లో ఉన్న ఐదు జిల్లాలు కాలినడకన తిరిగి అధ్యయనం చేశారు. అప్పుడు ఆయన రాసుకున్న దినచర్య పుస్తకం చాంగ్షా విద్యార్థులలో చాల ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ పర్యటన గురించి ఆయన అప్పుడే హునాన్ నుంచి వెలువడే పత్రికలో వ్యాసాలు రాశారు. ఆ తర్వాత 1918లో ఆయన పెకింగ్ కు వెళ్లడానికి రైలు ప్రయాణంలో ఉండగా ఎల్లో రివర్ కు వరదలు వచ్చి రైలు ఆగిపోయినప్పుడు ఆ సమయాన్ని ఆయన హెనాన్ రాష్ట్ర పరిస్థితులు అధ్యయనం చేయడానికి వాడుకున్నారు. అలాగే 1920లో చాంగ్షా నుంచి పెకింగ్ కు వెళ్తూ మార్గమధ్యంలో వుహాన్ ప్రాంతంలో పది రోజులు ఆగి స్థానిక పరిస్థితులు అధ్యయనం చేశారు. అదే సంవత్సరం నవంబర్ లో జియాంగ్సీ రాష్ట్రంలోని పింగ్ క్సియాంగ్ జిల్లాను అధ్యయనం చేశారు. ఏడాది తర్వాత 1921లో మళ్లీ అదే ప్రాంతాన్ని, దానితోపాటే అన్ యువాన్ జిల్లాలో గనికార్మికుల జీవితాలను అధ్యయనం చేశారు. ఈ ప్రాంతాలను 1922 సెప్టెంబర్ లోనూ, కొద్ది నెలల తర్వాత మరొకసారీ కూడ అధ్యయనం చేశారు. ఇక తన స్వరాష్ట్రం హునాన్ లో క్సియాంగ్టన్, తదితర ఐదు జిల్లాల్లో 1927లో చేసిన అధ్యయనం, అంతకు మూడు సంవత్సరాల ముందు ఆ ప్రాంతంలోనే చేసిన అధ్యయనాల నోట్స్ తో కలిపి ఆయన రాసిన ‘హునాన్ రైతాంగ ఉద్యమంపై నివేదిక’ 1927 మార్చ్ లో అచ్చయి సుప్రసిద్ధమయింది. ఆ తర్వాత జరిగిన దమనకాండలో కొండప్రాంతాలకు వెళ్లిన మావో జియాంగ్సీ రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో అధ్యయనాలు జరిపి మరొక రెండు నివేదికలు రాశారు. అయితే 1927లో ఆయన రాసిన ఈ నివేదికలన్నీ కనబడకుండా పోయాయి.

తాను హునాన్ ప్రాంతంలో చేసిన ఐదు అధ్యయనాల నివేదికలను తన భార్య యాంగ్ కైహుయి దగ్గర పెట్టానని, 1930లో కొమింటాంగ్ సైనికులు ఆమెను చంపివేసినప్పుడు అవి ధ్వంసమైపోయి ఉంటాయని, అలాగే తాను జియాంగ్సీ ప్రాంతంలో చేసిన రెండు అధ్యయనాల నివేదికలను, 1929లో ఎర్రసైన్యం జింగాంగ్షాన్ ను వదిలి వచ్చేటప్పుడు మరొక స్నేహితుడి దగ్గర పెట్టానని, అవి కూడ పోయాయని, క్సున్ వు నివేదిక ముందుమాటలో మావో చాల విచారంగా రాశారు. “వస్తువులు పోగొట్టుకున్నందుకు నేను ఎప్పుడూ విచారించలేదు. కాని ఈ అధ్యయనాలు (ప్రత్యేకించి హెంగ్షాన్ గురించీ, యాంగ్సిన్ గురించీ చేసినవి) మాయమైపోవడం మాత్రం నాకు చాల బాధ కలిగించింది. వాటిని నేను ఎన్నటికీ మరచిపోలేను” అని ఆయన 1931 ఫిబ్రవరిలో రాశారు. ఆ తర్వాత 1934 సెప్టెంబర్ లో ఆయన జియాంగ్సీ రాష్ట్రంలోని యుదు జిల్లాను అధ్యయనం చేశారు. తర్వాత కొద్దిరోజులకే లాంగ్ మార్చ్ ప్రారంభమయింది. ఇక విప్లవ విజయం వరకూ గాని, విప్లవానంతరం గాని ఆయనకు ప్రత్యక్షంగా గ్రామ అధ్యయనాలు సాగించడానికి అవకాశం దొరికినట్టు లేదు గాని, 1960ల దాకా కూడ ఆయన గ్రామ అధ్యయనాల గురించి రాస్తూనే ఉన్నారు.

ఇక మావో రాసిన క్సున్ వు నివేదికను చూస్తే, ఇది ఒక చిన్న, మూడు పేజీల ముందుమాటతోపాటు, క్సున్ వు లో పరిపాలనా విభాగాలు, క్సున్ వు లో రవాణా, సమాచార సంబంధాలు, క్సున్ వు లో వాణిజ్యం, క్సున్ వు లో సాంప్రదాయిక భూసంబంధాలు, క్సున్ వు లో భూపోరాటం అనే ఐదు అధ్యాయాల, 173 పేజీల నివేదిక. ముందుమాటలో తాను అప్పటికే చేసిన అధ్యయనాల గురించి, పోగొట్టుకున్న సమాచారం గురించి చెప్పిన తర్వాత, అప్పటికి ధనిక రైతుల గురించీ, వాణిజ్యం గురించీ తన పరిజ్ఞానం సంపూర్ణంగా లేకుండిందనీ, అందువల్లనే ఈ పరిశీలన జరపవలసి వచ్చిందనీ మావో వినయంగా రాశారు. పరిశోధనా సమావేశాలలో తనతో పాల్గొన్న పదకొండు మంది గురించీ వివరంగా రాశారు. చివరిగా, ఈ నివేదికలో ఒక పెద్ద లోపం ఉన్నదనీ, అది మధ్యతరగతి రైతుల గురించీ, జీతగాళ్లు-రోజుకూలీల గురించీ, దేశదిమ్మరుల గురించీ విశ్లేషించలేదని, అలాగే సాంప్రదాయిక భూసంబంధాలు అధ్యాయంలో ధనిక రైతులు, మధ్యతరగతి రైతులు, పేద రైతుల భూకమతాల గురించి ప్రత్యేక చర్చ జరపలేకపోయానని కూడ రాశారు.

మొదటి అధ్యాయం ‘క్సున్ వు లో పరిపాలనా విభాగాలు’ మొత్తం పుస్తకంలోకి చాల చిన్నది. దానిలో మావో కేవలం క్సున్ వు కౌంటీలో ఏయే పరిపాలనా విభాగాలు ఉన్నాయో. ఈ కౌంటీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడిందో వివరించారు.

రెండో అధ్యాయం ‘క్సున్ వు లో రవాణా, సమాచార సంబంధాలు’ లో ఆ ప్రాంతంలోని నదీజల రవాణా మార్గాల గురించి, రహదారుల గురించి, టెలిగ్రాఫ్, పోస్టల్ సౌకర్యాల గురించి, కౌంటీలో ప్రయాణ సాధనాల గురించి వివరించారు.

మూడో అధ్యాయం ‘క్సున్ వు లో వాణిజ్యం’ లో ఈ కౌంటీ నుంచి ఇతర కౌంటీలకు ఎగుమతి అయ్యే సరుకుల గురించీ, ఇతర కౌంటీల నుంచి దిగుమతి అయ్యే సరుకుల గురించీ చాల సూక్ష్మమైన వివరాలు రాశారు. బియ్యం, తేయాకు, సోయా చిక్కుళ్లు, తేయాకు నూనె, కోళ్లు, ఎద్దులు, పందులు, విదేశీ సరుకులు,  సముద్రాహార పదార్థాలు, ఉప్పు, కిరోసిన్, బట్టలు, పంచదార, పిండి, కాగితం, కలప, పుట్టగొడుగులు వంటి సరుకులన్నీ ఏయే పరిమాణాలలో ఎగుమతి, దిగుమతి అవుతాయో, వాటి విలువ ఎంతో వివరంగా నమోదు చేశారు. ఎద్దుల అంగళ్లు ఎప్పుడెప్పుడు జరుగుతాయో, అక్కడ ఎన్నెన్ని ఎద్దులు అమ్మకం – కొనుగోలు అవుతాయో, ఎంత డబ్బు చేతులు మారుతుందో వివరించారు. ‘విదేశీ సరుకులు’ అనే పేరుతో ఈ అంగళ్లలో అమ్ముడయ్యే వస్తువులన్నీ నిజంగా విదేశీవి కావని, కాని వాటిని అలా పిలవడం ఆనవాయితీ అని రాశారు. క్సున్ వు లోని ప్రధాన మార్కెట్లను, అక్కడ జరిగే లావాదేవీలను వివరించారు.

గ్రామీణ ప్రాంతాల గురించి వివరణ అయిపోయాక క్సున్ వు నగరంలో జరిగే వాణిజ్యం గురించి కూడ చాల వివరాలు నమోదు చేశారు. ఈ క్రమంలో వాణిజ్యం గురించి ఎందుకు తెలుసుకోవాలో వివరిస్తూ, చాల మంది కామ్రేడ్స్ కు ఈ విషయాలు తెలియనందువల్ల వర్తక బూర్జువా వర్గంతో ఎలా వ్యవహరించాలో తెలియడం లేదని, అందుకే తానది తెలుసుకోదలచుకున్నానని, కాని ఆ లోపలి విషయాలు చెప్పేవారు అంతవరకూ దొరకలేదని  రాశారు. ఇప్పుడు క్సున్ వులో స్థానిక నాయకుడు కామ్రేడ్ గు బో ఇద్దరు పెద్దమనుషులను పరిచయం చేశాడని, వారిలో ఒకరు వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు, మరొకరు కౌంటీ సోవియట్ అధికారిగా పనిచేసినవారని, వారివల్ల చాల విషయాలు తెలిశాయని మావో రాశారు.

“మనకు గ్రామీణ సమస్యల అధ్యయనం ఎటువంటిదో పట్టణ సమస్యల అధ్యయనం కూడ అటువంటిదే. ఒక స్థలాన్ని అధ్యయనం చేయడంలో మనం ఏ ఒక్క అంశాన్నీ వదలగూడదు. (ఈ వాక్యం ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి మావో దీని కింద గీత గీశారు). అలా ఒక స్థలం గురించి అధ్యయనం చేసిన తర్వాత మనకు మరొక స్థలం గురించి అధ్యయనం చేయడం, సాధారణ పరిస్థితులను అర్థం చేసుకోవడం సులభమవుతుంది. ఒక కామ్రేడ్ చెప్పినట్టు ఏదో ఒక చోటికి వెళ్లడం, యథాలాపంగా ప్రశ్నలు అడగడం అనే పద్ధతి పెట్టుకుంటే, గుర్రం మీద కూచుని పూలను పరిశీలించినట్టు ఉంటుంది. అలా చేస్తే జీవితాంతం ప్రయత్నించినా ఒక సమస్యను లోతుగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఆ అధ్యయన పద్ధతి స్పష్టంగా సరైన పద్ధతి కాదు” అని మావో ఇక్కడ రాశారు.

నగర పరిశీలనలో ఆయన ప్రత్యేకంగా ప్రజలు వాడే ప్రధాన వస్తువులు ఒక్కొక్కటీ తీసుకుని వాటి వాణిజ్యాన్ని వివరించారు. ఉప్పు, సాధారణ వస్తువులు (ఈ శీర్షిక కింద 131 సరుకులు ఇచ్చారు), మిల్లు బట్టలు, చేనేత బట్టలు, పొగాకు, తినుబండారాలు, సాంబ్రాణి, పూజాద్రవ్యాలు, బాణసంచా, నూనెలు, సోయా చిక్కుళ్లు, మాంసం, సారా, సముద్ర ఆహార పదార్థాలు, కూరగాయలు, మిరియాలు, పళ్లు, ఔషధ దినుసులు, గొడుగులు వంటి సరుకులు అమ్మే దుకాణాలు నగరంలో ఎన్ని ఉన్నాయో, అవి రోజుకు, నెలకు, సంవత్సరానికి ఎంత వ్యాపారం చేస్తాయో, ఆ దుకాణాలలో ఎంత మంది పనివాళ్లున్నారో, యజమానులెవరో సమస్త విషయాలూ మావో సేకరించి, ఈ నివేదికలో నమోదు చేశారు. అలాగే దర్జీలు, వడ్రంగులు, పూటకూళ్ల ఇళ్లు, చిక్కుడు గుజ్జు అమ్మే దుకాణాలు, క్షౌరశాలలు, కమ్మరులు, బాణసంచా తయారీదారులు, నగల దుకాణాలు, తగరపు పనివాళ్లు, గడియారాల మరమ్మత్తు దుకాణాలు (1930లో క్సున్ వు జనాభా ఒక లక్షా ఇరవై వేలు కాగా, అందులో రెండు శాతం మందికి, అంటే 2,400 గడియారాలు ఉన్నాయట), క్రమబద్ధంగా ఆయారోజుల్లో జరిగే సంతలు, వేశ్యలు (2,700 జనాభాగల క్సున్ వు నగరంలో 30,40 వేశ్యాగృహాలున్నాయట), ప్రభుత్వాధికారులు, దేశదిమ్మరులు, మతాధికారులు వంటి అన్ని విషయాల గురించీ ఈ అధ్యాయంలో మావో కళ్లకు కట్టినట్టు వివరించారు.

నాలుగో అధ్యాయం ‘క్సున్ వు లో సాంప్రదాయిక భూసంబంధాలు’ భూఆదాయాన్ని, పంటలో వారికి అందే వాటాను బట్టి గ్రామీణ జనాభాను వర్గాలుగా విశ్లేషించడంతో మొదలవుతుంది. గ్రామీణ జనాభాను మావో ఇక్కడ భూస్వాములు, మధ్యతరగతి భూస్వాములు, చిన్న భూస్వాములు, ధనిక రైతులు, మధ్యతరగతి రైతులు, పేద రైతులు, శారీరక శ్రమ చేసే వృత్తిపనివారు, దేశదిమ్మరులు, జీతగాళ్లు-రోజుకూలీలు అనే తొమ్మిది విభాగాల కింద విభజించారు. విప్లవానికి ముందు మత, భూస్వామ్య సంస్థల చేతుల్లో 40 శాతం, భూస్వాముల చేతుల్లో 30 శాతం, రైతుల చేతుల్లో 30 శాతం భూమి ఉండేదని మావో చెపుతారు. చైనా సమాజ ప్రత్యేకతగా వంశాల పేరుమీద ఉమ్మడి ఆస్తిగానూ, ఊరుమ్మడి భూమిగానూ, మత, ధార్మిక సంస్థల పేరుమీదా, దేవాలయాల పేరుమీదా, విభిన్న బౌద్ధశాఖల పేరుమీదా భూమి ఉండేది. దాన్ని కౌలుకు సాగు చేసుకోవడానికి రైతులకు ఇచ్చేవారు. వ్యవసాయ మిగులును భూస్వాములు హస్తగతం చేసుకోవడానికి అక్రమ కౌలు రూపాలు మాత్రమే కాక, ఇతర అనేక దోపిడీ రూపాలు ఉండేవి. మావో చాల వివరంగా ఆ రూపాలన్నిటినీ చర్చించారు.

మొత్తం భూమి గురించీ, భూసంబంధాల పద్ధతుల గురించీ వివరించిన తర్వాత కౌంటీలో ఉన్న ఎనిమిది మంది పేరుపొందిన పెద్ద భూస్వాముల గురించి, పన్నెండు మంది ఇతర పెద్ద భూస్వాముల గురించి పేరుపేరునా వివరాలు తెలియజేశారు. “వీరందరి గురించి పేరుపేరునా ఎందుకు రాశాను? ఆ వర్గపు రాజకీయ వైఖరి ఏమిటో అర్థం చేసుకోవడానికి. మనం ఆ ఉదాహరణలు ఇవ్వకపోతే, ఆ వర్గపు దృక్పథం గురించి స్పష్టంగా చెప్పలేం. పెద్ద భూస్వాములకూ మధ్యతరగతి భూస్వాములకూ మధ్య విభజనరేఖ గీయడం ఎందుకంటే ఈ మధ్యతరగతి భూస్వాములకు అటు పెద్ద భూస్వాములతో పోల్చినా, ఇటు చిన్న భూస్వాములతో పోల్చినా స్పష్టంగా చూపదగిన రాజకీయ దృక్పథం ఉంది” అని మావో వివరణ కూడ రాశారు. అందుకే, ఆ కౌంటీలోని ఒక్కొక్క జిల్లాలో ఉన్న 113 మంది మధ్యతరగతి భూస్వాముల గురించి కూడ వివరంగా రాశారు. పెద్ద, మధ్యతరగతి భూస్వాములకు ఉత్పత్తి పట్ల, రాజకీయాల పట్ల ఉండే విభిన్న దృక్పథాలను కూడ మావో వివరంగా చర్చించారు. మధ్యతరగతి భూస్వాములను కూడ మళ్లీ సూక్ష్మంగా పరిశీలించాలనీ, వారిలో ప్రగతిశీలవాదులు (పెట్టుబడిదారీ విధానం ప్రభావంలో ఉన్నవాళ్లు), తటస్థులు (సగం కొత్త, సగం పాత), పాత అభిప్రాయాలు, జీవనసరళి ఉండే భూస్వామ్య వాదులు అనే మూడురకాలు ఉన్నారనీ మావో రాశారు.

ఈ వివరణలో భూస్వాములందరినీ కట్టగట్టి శత్రువులుగా చూడడం కాకుండా, విడివిడిగా ఒక్కొక్క భూస్వామి గురించీ ‘విప్లవ ప్రతీఘాతకుడు’, ‘తనపని తాను చూసుకునేవాడు’, విప్లవ ప్రతీఘాతకుడు కాడు’, ‘ఈ లోకం పట్టని వాడు’, ‘విప్లవానికి అనుకూలుడు’, ‘వడ్డీవ్యాపారిగా ప్రారంభమయ్యాడు, కాని ప్రస్తుతం విప్లవ వ్యతిరేకి కాదు’, ‘నిజాయితీపరుడు’, ‘పిసినారి’ అని నిర్ధారణలు చేశారు.

విప్లవ క్రమంలో ఈ భూస్వాముల భూములు స్వాధీనం చేసుకుని పంచడం గురించి, వారిలో కొందరిని చంపివేయడం గురించి, వారి మీద జరిమానాలు విధించడం గురించి కూడ మావో రాశారు. ఒక మధ్యతరగతి భూస్వామి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కూడ అయ్యాడని, ఆయనను బందిపోట్లు కాల్చేశారని మావో రాశారు. వీరిలో ఒక మధ్యతరగతి భూస్వామి కొడుకు రైతు సంఘంలో చేరినప్పటికీ, పొరపాటు అంచనావల్ల రైతులు ఆయనను కాల్చిచంపారని కూడ మావో రాశారు.

తర్వాత చిన్న భూస్వాముల గురించి వివరిస్తూ వారిలో చాలమందికి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయని, పిల్లలకు చదువు చెప్పిస్తున్నారని, సహకార సంఘాలు ఏర్పాటు చేస్తున్నారని రాశారు. వారిలో అటు పెట్టుబడిదారీ ఆలోచనల వైపు మళ్లడానికైనా, ఇటు విప్లవం వైపు రావడానికైనా తగిన ప్రగతిశీల భావాలు, ముందుచూపు ఉన్నాయని విశ్లేషించారు. అలాగే ఈ వర్గంలోని ఒక చిన్న భాగం అత్యంత తీవ్రమైన విప్లవ వ్యతిరేక శక్తిగా మారుతున్నదని, పేదరైతుల దృష్టిలో వీరే ప్రధాన శత్రువుగా ఉన్నారని కూడ రాశారు. ఆ తర్వాత ధనిక రైతాంగం గురించి, పేద రైతుల గురించి, కొండ ప్రాంతాలలో భూసంబంధాల గురించి వివరించారు.

ఈ అధ్యాయంలో మిగిలిన భాగాన్ని మావో ఆ ప్రాంతంలో ప్రజల మీద దోపిడీ జరిగే పద్ధతులను వివరించడానికి వాడుకున్నారు. భూమి కౌలు రూపంలో దోపిడీ (పొత్తు, కౌలు, కౌలు రేట్లు, భూమి కౌలు పద్ధతులు, పన్నులు, నజరానాలు, విందులు, ధాన్యరూప కౌలు, ద్రవ్యరూప కౌలు, స్థిర కౌలు, అస్థిర కౌలు, భూమి క్రయ విక్రయాలు, భూమి ధరలు), అధిక వడ్డీ రేట్ల రూపంలో దోపిడీ (డబ్బు అప్పు వడ్డీ రేట్లు, ధాన్యం అప్పు వడ్డీ రేట్లు, తేయాకు నూనె అప్పు వడ్డీ, పిల్లల అమ్మకాలు, పొదుపు, పరపతి సంస్థల ఏర్పాటు), పన్నులు, సుంకాల రూపంలో దోపిడీ (భూమి శిస్తు, ప్రభుత్వ కౌలు, సాంప్రదాయిక పన్ను, భూబదిలీ పన్ను, దస్తావేజు పన్ను, రశీదు రుసుము, పండగ పన్ను, పొగాకు పన్ను, సారా పన్ను, కబేళా పన్ను, వ్యాపార పరిరక్షణ పన్ను, అమ్మకపు పన్ను, ఎద్దు పన్ను, జూదం పన్ను, వ్యభిచార పన్ను) లాంటి పన్నులను, రుసుములను వివరంగా చర్చించి వాటి ద్వారా మొత్తంగా ఎంత ధనం పోగు పడేదో, ప్రభుత్వ ఆదాయ వ్యయాల వివరాలు ఏమిటో కూడ మావో రాశారు.

ఈ అధ్యాయంలో చివరిగా క్సున్ వు లో సంస్కృతి అనే శీర్షిక కింద అక్షరాస్యత గురించి, విద్యాస్థాయి గురించీ, పాఠశాలలు, కళాశాలల గురించీ రాశారు. విప్లవ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి జనావాసం లోనూ పాఠశాలలు ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి కూడ రాశారు.

ఐదో అధ్యాయం ‘క్సున్ వు లో భూపోరాటం’లో భూపంపకం సమస్యను పార్టీ ఎలా పరిష్కరించిందో వివరంగా చర్చించారు. ఒక విషయం గురించిన అవగాహనలు వర్గపోరాట క్రమంలో ఎలా మారుతూ, పదునెక్కుతూ ఉంటాయో చూడడానికి ఈ అధ్యాయం గొప్ప ఉదాహరణ. భూపంపిణీ జరిపేటప్పుడు ఏ ప్రాతిపదిక ఉండాలి? తలకు ఇంత భూమి సమానంగా పంపిణీ చేయడం సమానత్వం అవుతుందా, మనుషుల ఉత్పాదకతను బట్టి వారికి భూమి కేటాయింపు జరగాలా, ఆ మనుషుల ఆర్థిక వనరులను ప్రాతిపదికగా తీసుకుని పంపిణీ జరపాలా, భూసారాన్ని బట్టి పంపిణీ జరపాలా – ఈ నాలుగు ప్రశ్నలకు జవాబులు వెతకడంలో పార్టీ ఎలా పరిణతి చెందిందో మావో వివరించారు. అలాగే కొండ ప్రాంతాల, అటవీ ప్రాంతాల భూముల పంపిణీ గురించి కూడ వివరంగా చర్చించారు. చెరువులను, నివాసగృహాలను పంపిణీ చేయాలా వద్దా అనే సమస్యలను చర్చించారు. భూపంపిణీ జరిపేటప్పుడు ప్రాతిపదికగా తీసుకోవలసినది గ్రామమా, మండలమా అనే ప్రశ్నా ఉంది. ఇంతకాలం వ్యవసాయంతో, శారీరకశ్రమతో సంబంధం లేని దేశదిమ్మరులకు, వేశ్యలకు, రైతులు కానివారికి భూమి ఇవ్వాలా లేదా, ఒక్కొక్క వ్యక్తికి అందే భూమి మనుగడకు సరిపోతుందా, సరిపోకపోతే అదనపు జీవనోపాధి ఎలా కల్పించాలి, ఊరుమ్మడి భూములు ఉంచాలా లేదా వంటి సమస్యలూ చర్చకు వచ్చాయి. భూపంపిణీ ఎంత వ్యవధిలో సాధ్యమవుతుంది, భూపంపిణీలో న్యాయంగా ఉండడం ఎట్లా, న్యాయమైన పంపిణీని వ్యతిరేకించేవారెవరు, పంట వేసిన తర్వాత పంపిణీ జరిగితే ఆ పంట ఎవరికి చెందుతుంది లాంటి ప్రశ్నలను కూడ మావో చర్చించారు. పాత అప్పులను, రుణ పత్రాలను రద్దు చేయడం గురించి, భూమి శిస్తును కొత్త పద్ధతిలో విధించడం గురించి కూడ చర్చించారు. చిట్టచివరిగా భూపోరాటంలో మహిళలు అనే శీర్షిక కింద విప్లవానికి ముందు ఉత్పత్తిలో మహిళల పాత్ర, విప్లవంలో మహిళల పాత్ర, విప్లవ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా విముక్తి కోసం నాయకత్వం తీసుకున్న చర్యలు, వాటిలో లోటుపాట్లు, ఆ చర్యలను అతి తక్కువ కాలంలోనే నాలుగు సార్లు మార్చవలసివచ్చిన తీరు గురించి మావో వివరించారు.

మొత్తం మీద క్సున్ వు నివేదిక చదవడం ఒక గొప్ప, ఉత్తేజకరమైన, ఆలోచనాస్ఫోరకమైన అనుభవం. ఇది ఎప్పుడో ఎనబై సంవత్సరాల కింద రాసిన, ముప్పై సంవత్సరాల కింద అచ్చయిన కాలం చెల్లిన పుస్తకం కాదు. సామాజిక పరివర్తన మీద ఆసక్తి ఉన్నవారు ఇవాళ్టికీ ఆలోచించవలసిన ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. భారత సామాజిక వాస్తవికతకు, భారత విప్లవానికి అవసరమైన వర్గ విశ్లేషణకు, గ్రామ అధ్యయనానికి, సైద్ధాంతిక అన్వయానికి సమానమైన అంశాలు ఈ నివేదికలో ఎన్నో చోట్ల కనబడతాయి. మావో రాసినందువల్ల, యాభై ఏళ్లు కనుమరుగై మళ్లీ దొరికిన అరుదైన రచన అయినందువల్ల మాత్రమే కాదు, ఒక అద్భుతమైన విప్లవోద్యమ నిర్మాణంలో అత్యంత కీలకమైన ఆధారంగా ఈ పుస్తకానికి చాల ప్రాధాన్యత ఉంది. ఇరవయో శతాబ్ది చరిత్రలో ఒక వ్యవసాయ సమాజంలోని రైతాంగాన్ని, గ్రామీణ ప్రాంతాలను ఏ ప్రేరణలు విప్లవం వైపు నడిపించాయో తెలియజెప్పే పుస్తకం ఇది. మన సమాజంలోని రైతాంగ స్థితిగతుల మీద, గ్రామ అధ్యయనాల మీద, విప్లవోద్యమ నిర్మాణం మీద ఆసక్తిగలవాళ్లందరూ తప్పనిసరిగా చదవవలసిన, సృజనాత్మకంగా అన్వయించుకోవలసిన నివేదిక ఇది.

(గ్రామ అధ్యయన పద్ధతుల మీద గత ఎనిమిది సంచికలలో ధారావాహికగా రాసిన వ్యాసం కోసం పరిశోధనలో భాగంగా సహజంగానే చైనాలో విప్లవ క్రమంలోనూ, విప్లవానంతరమూ మావో సేటుంగ్ నాయకత్వాన సాగిన గ్రామ పరిశీలనలన్నిటినీ మళ్లీ లోతుగా చదవడం జరిగింది. ఫారిన్ లాంగ్వేజెస్ ప్రెస్, బీజింగ్ ప్రచురించిన మావో సెలెక్టెడ్ వర్క్స్ ఐదు సంపుటాలు, శ్రామికవర్గ ప్రచురణలు, హైదరాబాద్ ప్రచురించిన మరి నాలుగు సంపుటాలు చూస్తే వాటిలో గ్రామీణ అధ్యయనాల మీద మావో రచనలు దాదాపు పదిహేను కనబడ్డాయి. ఇంకా పరిశోధిస్తుండగా గూగుల్ బుక్స్ ద్వారా ఈ ‘రిపోర్ట్ ఫ్రమ్ క్సున్ వు’ గురించి తెలిసింది. గూగుల్ బుక్స్ లో థాంప్సన్ ముందుమాట మాత్రమే ఉంది గాని, మావో నివేదిక మొత్తం లేదు. ఆ పుస్తకం ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నప్పుడు వెంటనే ఆ పుస్తకం కొని పంపించి, ఈ ప్రయత్నానికి సహకరించిన మిత్రుడు, అమెరికాలోని ఒహైయోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బి. రంజిత్ కు కృతజ్ఞతలు)

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in Telugu, Veekshanam. Bookmark the permalink.

1 Response to యాభై ఏళ్లు కనుమరుగై దొరికిన మావో రచన

  1. chavakiran says:

    మంచి వ్యాసం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s