ఈభూమి నవంబర్ 2012 సంచిక కోసం
దేశ రాజకీయార్థిక విధానాలలో సంస్కరణల పేరుతో జరుగుతున్న బందిపోటు దోపిడీ మొదటి దశ ఇరవై సంవత్సరాలు గడిచి, ఇప్పుడు రెండో దశ ప్రారంభించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు పది సంవత్సరాలుగా రెండో దశ సంస్కరణలు ప్రారంభించాలని బహుళజాతి సంస్థలు, దేశదేశాల సంపన్నులు, దేశంలోని దళారీలు, వారి ప్రచార సాధనాలు పెద్ద ఎత్తున చర్చలు, ప్రచారాలు సాగిస్తున్నా, తీవ్రమైన ప్రజా వ్యతిరేక వెల్లువ వల్ల ప్రభుత్వాలకు అది సాధ్యం కాలేదు. కాని ఆ ఒత్తిడి నానాటికీ మరింత పెరిగి, దేశ పాలకవర్గాలలో కనీస సిగ్గుబిళ్లలు కూడ ఊడిపోతూ, ఏ నీతి నియమాలు లేని శక్తులదే పై చేయి కావడంతో రెండో దశ సంస్కరణలు మొదలయ్యాయి. సెప్టెంబర్ రెండో వారంలో డా. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ రెండో దశ సంస్కరణలు దేశాన్ని, దేశ భవిష్యత్తును, ప్రజాజీవనాన్ని మరింత దుర్మార్గంగా మరిన్ని కడగండ్లలోకి నెట్టనున్నాయి. ఆర్థిక మంత్రిగా తానే ప్రారంభించిన మొదటి దశ సంస్కరణలను ప్రధానమంత్రిగా కొనసాగించి రెండో దశ కూడ అమలు చేసి దేశాన్ని సర్వనాశనం చేయడానికి మన్మోహన్ సింగ్ కంకణం కట్టుకున్నట్టున్నారు. తన యజమానులైన బహుళజాతి సంస్థలకూ, వారి దళారీలకూ ఈ దేశ వనరులనూ మార్కెట్లనూ అప్పగించడం, ఆలోచించే, మాట్లాడే, రాసే శక్తి ఉన్న ఎగువ మధ్యతరగతికి నాలుగు ఎంగిలి మెతుకులు అందించడం మాత్రమే ఆయన తన ముందు పెట్టుకున్న కర్తవ్యాలు. ఆ కర్తవ్యాలు మొదటి దశ సంస్కరణలతో పరిపూర్తి కాలేదు గనుక, 2014 ఎన్నికల తర్వాత తాను అధికారంలో ఉంటానో ఉండనో అనేది అనుమానం గనుక రెండో దశ సంస్కరణలకు ఆయన ముందు మిగిలి ఉన్న సమయం ఇంకా రెండు సంవత్సరాల లోపు మాత్రమే.
అసలు మొట్టమొదట పాలకవర్గాలు వాడుతున్న భాషలోని కపటత్వాన్నీ దుర్మార్గాన్నీ అర్థం చేసుకోవలసి ఉంది. సంస్కరణలు అనే మాటకు చాల సానుకూలమైన, ఉదాత్తమైన అర్థం ఉంది. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి, పరిణామం సరిగా లేకపోతే దానిలో సంస్కరణలు తేవలసి ఉంటుంది. అంటే సంస్కరణలు అనే మాటకు మంచి, మేలైన, ఉపయోగకరమైన మార్పులు అనే సాధారణ అర్థం ఉంది. నిజంగానే భారత రాజకీయార్థిక, సామాజిక విధానాలలో చాల సంస్కరణలు జరగవలసి ఉన్నాయి. ఒక మనిషిని వేరొక మనిషి పీడించే సాంఘిక ధర్మం మారవలసి ఉంది. ఒకరి శ్రమను, ఉత్పత్తిని మరొకరు దోపిడీ చేయడానికి, ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరగడానికి అవకాశమిస్తున్న ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు జరగవలసి ఉంది. జాతీయోద్యమ ఆదర్శాలనూ, రాజ్యాంగంలో నిర్దేశించుకున్న ఆదేశిక సూత్రాలనూ తుంగలో తొక్కి అధికారం చలాయిస్తున్న రాజకీయ వ్యవస్థలో సంస్కరణలు రావలసి ఉంది. కాని పి వి నరసింహారావు ప్రధానమంత్రిగా, డా. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా 1991 జూలైలో ప్రారంభించిన సంస్కరణలు ఆ అత్యవసరమైన సంస్కరణలు కావు. అవి సంస్కరణల పేరుమీద రాజ్య చేస్తున్న కుసంస్కరణలు. అవి సంస్కరణల ముసుగు వేసుకున్న విధ్వంసచర్యలు. జాతీయోద్యమ ఆదర్శాల అవశేషాలుగా పాలనా విధానాలలో ఉన్న నామమాత్రమైన పద్ధతులను కూడ తొలగించిన, కత్తిరించిన సంస్కరణలు అవి. దేశ రాజకీయార్థిక విధానాలను దేశదేశాల సంపన్నులకు అనుకూలంగా మార్చడానికి, ఒక్క మాటలో చెప్పాలంటే దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఆ సంస్కరణలు తెచ్చారు.
ఆ మొదటి దశ సంస్కరణలలో ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి, సేవా రంగాలను ప్రైవేటు శక్తుల లాభాపేక్షకు అప్పగించడం జరిగింది. విదేశీ వాణిజ్యంలో అప్పటివరకు ఎంతో కొంత దేశ అనుకూలంగా ఉండిన ఎగుమతి-దిగుమతి-ద్రవ్య విధానాలన్నిటినీ మార్చి విదేశీ రాబందులు వాలడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. కార్మికులకు, రైతాంగానికి, మధ్యతరగతికి, నిరుపేద వర్గాలకు, మొత్తంగా ప్రజలకు అనుకూలంగా ఉండిన చట్టాలెన్నిటినో ఈ సంస్కరణల క్రమంలో రద్దుచేయడం, సవరించడం, మార్చివేయడం జరిగింది. వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూసి, మౌలిక సాధనా సంపత్తి కల్పించడానికి అవసరమైన కేటాయింపులను తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముక విరవడం జరిగింది. విద్యా, వైద్య, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం వంటి సాంఘిక సంక్షేమ రంగాల కేటాయింపులను కత్తిరించి దేశ మానవవనరుల విధ్వంసానికి మార్గం వేయడం జరిగింది. ఆదివాసులు, దళితులు, వెనుకబడిన వర్గాలు వంటి అనాదృత వర్గాల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టవలసిన ప్రజాధనాన్ని వృధా రక్షణ వ్యయానికి విలాసవస్తువుల దిగుమతులకు, సంపన్నుల వైపు దారి మళ్లించడం జరిగింది. ఈ మొదటి దశ సంస్కరణల వల్ల దేశ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులలో నిరుద్యోగం, ఆత్మహత్యలు, వలసలు, నేరం పెరిగాయి. ఒక ఐదు శాతం జనాభా పెద్ద ఎత్తున లాభపడగా, మరొక ఐదు శాతం మందికి ఏవో చిన్న పాటి ఫలితాలు అందాయి. జాతీయోత్పత్తిలో పావు వంతు – ఇరవై ఐదు శాతం – కేవలం వంద కుటుంబాల చేతిలో ఉండగా, దేశ జనాభాలో అత్యధికులు అరవై కోట్లకు పైగా తలసరి రోజుకు ఇరవై రెండు రూపాయల కన్న తక్కువతో గడపవలసిన దుస్థితిలోకి నెట్టబడ్డారు.
అయినా ఈ సంస్కరణలు సరిపోవని, ఇంకా ఇంకా దేశ వనరులను, మార్కెట్లను తమ చేతికి అప్పగించాలని బహుళ జాతి సంస్థలు భారత ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూ వచ్చాయి. దేశంలోని అపారమైన భూవనరులు, సంపన్నమైన ఖనిజాలు, అటవీ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, మానవవనరులు తమకే దక్కే పాలనా విధానాలు కావాలని బహుళ జాతి సంస్థలు కోరుకున్నాయి. దేశంలో అమ్మకమయ్యే ప్రతి సరుకూ తమదే కావాలని, దేశంలో చిందే ప్రతి చెమటచుక్కా తమ ఖజానాల్లో డాలర్లుగా మారాలని, దేశ మార్కెట్ అంతా తమ గుప్పెట్లో ఉండాలని బహుళ జాతి సంస్థలు కోరుకున్నాయి. ఆ కోరికలు నెరవేరాలంటే 1991లో మొదలయిన సంస్కరణలు మరింత ముందుకు సాగాలి. రెండో దశ సంస్కరణలు అమలు జరగాలి.
మొదటి దశ సంస్కరణల అమలులో కేంద్రంలోనో, రాష్ట్రాలలోనో అధికారంలో ఉండిన అన్ని రాజకీయ పక్షాలకూ, కాషాయం నుంచి ముదురు ఎరుపు వరకూ అన్ని పార్టీలకూ భాగస్వామ్యం ఉంది గనుక రెండో దశకు పెద్దగా ఆటంకాలు ఉండబోవని బహుళ జాతి సంస్థలు భావించాయి. కాని రాజకీయ ఎత్తుగడల వల్ల కొంత, రాజకీయ పక్షాలకు అలవాటయిన అవకాశవాదం వల్ల కొంత కొన్ని రాజకీయ పక్షాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క వైఖరి తీసుకోవడం ప్రారంభించాయి. దానితో రెండో దశ సంస్కరణల వేగం తగ్గింది. ఇక దేశంలోని బడా దళారీ వ్యాపార సంస్థలు, దళారీ మేధావులు రెండో దశ సంస్కరణలు కావాలనే బృందగానం ప్రారంభించారు. ఆ వర్గాల ప్రచార సాధనాలు గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వం మీద తమ ఒత్తిడిని పెంచుతూ వస్తున్నాయి.
ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక గత సంవత్సరం ఎజెండా ఫర్ రెన్యువల్ పేరుతో రెండో దశ ఆర్థిక సంస్కరణల కోసం ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఆరుగురు ప్రధాన దళారీ బడా పెట్టుబడిదారీ సంస్థల ప్రతినిధులతో ఒక పది అంశాల సంస్కరణ ప్రణాళికను రూపొందించి అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి సమర్పించింది. ఈ బృందంలో ఎచ్ డి ఎఫ్ సి అధ్యక్షుడు దీపక్ పరేఖ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ ల అధ్యక్షుడు కె వి కామత్, హిందుస్తాన్ యునిలివర్ మాజీ అధ్యక్షుడు అశోక్ గంగూలీ, ఎ జెడ్ బి పార్ట్నర్స్ అధినేత్రి జియా మోడీ, భారతి ఎంటర్ ప్రైజెస్ అధ్యక్షుడు సునిల్ భారతి మిత్తల్, ఇన్ఫోసిస్ నిర్మాత ఎన్ ఆర్ నారాయణ మూర్తి ఉన్నారు. ఈ ఆరుగురూ బ్యాంకింగ్, ఐటి, ఎఫ్ ఎం సి జి (త్వరితగతిన అమ్ముడయ్యే వినియోగ సరుకులు), కార్పొరేట్ చట్ట వ్యవహారాలు, టెలికమ్యూనికేషన్స్, ఖనిజాల తవ్వకం వంటి రంగాల వారు కావడమే ఈ రెండో దశ సంస్కరణల లక్ష్యం ఏమిటో తెలియజెపుతుంది. బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్లడానికి ముందు రానున్న స్వతంత్ర భారత ప్రభుత్వం ఏమి చేయాలో కర్తవ్య నిర్దేశం చేసిన పెట్టుబడిదారుల ప్రణాళిక బొంబాయి ప్లాన్ తో సమానమైనదిగా ఈ పది అంశాల ప్రణాళికను ఎకనమిక్ టైమ్స్ ప్రచారం చేసింది. ఆ ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి ఎకనమిక్ టైమ్స్ పత్రిక దేశంలో ఈ సంస్కరణలను ఆమోదించే డజన్ల కొద్దీ మేధావులతో వరుసగా వ్యాసాలు కూడ రాయించింది. తన ప్రయత్నం ప్రారంభించి ఏడాది గడిచిన తర్వాత ఎకనమిక్ టైమ్స్ పది అంశాల ప్రణాళిక సూచనలేమిటో, వాటిలో భారత ప్రభుత్వం ఏమేమి అమలు లోకి తెచ్చిందో, ఇంకా ఎంతదూరం ప్రయాణించవలసి ఉందో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడ ప్రచురించింది.
ఆ ప్రయత్నం సాగుతుండగానే భారత ప్రభుత్వం అనేక సంస్కరణ కార్యక్రమాలు చేపట్టింది. చిల్లర వర్తకంలో, విమానయానంలో, బీమా, పెన్షన్ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ, ఆంక్షలు సడలిస్తూ నిర్ణయాలు తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను మార్కెట్ ఆటుపోట్లకు అనుసంధానం చేయాలని, ప్రభుత్వ నియంత్రణను తొలగించాలని నిర్ణయించింది. సంక్షేమ కార్యక్రమాల కేటాయింపులలో మరింత కోత విధించింది. రక్షణ వ్యయం కేటాయింపులను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతూ బహుళజాతి ఆయుధ, యుద్ధపరికరాల ఉత్పత్తి, వ్యాపార సంస్థలకు వేల కోట్ల రూపాయల లాభాలు సమకూరే కొనుగోలు నిర్ణయాలు తీసుకుంది. ఈ మధ్య కాలంలో రెండో దశ సంస్కరణలలో భాగంగా బయటపడిన ఇటువంటి చర్యలు అసలు తీసుకున్న ఎన్నో చర్యలలో అతి కొద్ది మాత్రమే.
ఎఫ్ డి ఐ సంస్కరణలతో సహా భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న తొమ్మిది కీలకనిర్ణయాలు తమ ప్రభావం వల్లనే జరిగాయని స్వయంగా యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. మన్మోహన్ సింగ్ ను టైమ్ వారపత్రిక ‘అసమర్థుడి’గా చిత్రించడం, వాషింగ్టన్ పోస్ట్ దినపత్రిక ‘విషాద వ్యక్తి’గా వర్ణించడం ఈ ప్రభావితం చేసే చర్యలలో భాగమే.
ఆ అమెరికన్ ప్రభుత్వం, బహుళజాతి సంస్థలు చేసిన ప్రయత్నాలకు అనుగుణంగా దేశంలోని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు సూచించిన పది అంశాల ప్రణాళిక:
- భారత ఆర్థిక వ్యవస్థ గురించి అంతర్జాతీయ పెట్టుబడిదారులలో ఉన్న వ్యతిరేకతను, అనుమానాలను తొలగించాలి.
- చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించాలి.
- విద్యారంగాన్ని వ్యాపారంగా ప్రకటించాలి. “లాభార్జన ధ్యేయంతో వచ్చే విద్యాసంస్థలను” అనుమతించాలి.
- సంకుచితంగా ఉండే మంత్రిత్వశాఖలను తొలగించాలి. వ్యాపారానికి సులభతరమైన పరిస్థితి కల్పించాలి.
- భూసేకరణలో ఉన్న అవరోధాలను తొలగించాలి.
- పట్టణీకరణను ప్రోత్సహించాలి.
- రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థల విరాళాలను అనుమతించాలి. న్యాయవ్యవస్థను విస్తరించి వివాదాలను తగ్గించాలి.
- మదుపుదార్ల విశ్వాసం పెరిగే చర్యలు తీసుకోవాలి. పర్యావరణ అనుమతులు త్వరితంగా ఇవ్వాలి. పన్నులను ఇబ్బడి ముబ్బడిగా పెంచకుండా ఉండాలి.
- వ్యవసాయ రంగాన్ని సంస్కరించాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీల చట్టాలను తొలగించాలి. వ్యవసాయోత్పత్తుల రవాణాపై ఆంక్షలు తొలగించాలి. ప్రభుత్వ గిడ్డంగులలోని నిల్వలను బహిరంగ మార్కెట్లలో అమ్మకానికి పెట్టాలి.
- అన్ని ఇంధనాల అమ్మకాల మీద నియంత్రణ తొలగించాలి. చమురు అన్వేషణ రంగాలలోకి పెట్టుబడి అనుకూల విధానాలు ప్రవేశపెట్టాలి.
ఈ అంశాలు చూడగానే వాటికవిగానే ఎంత ప్రజా వ్యతిరేకమైనవో, బహుళజాతి సంస్థలకు, వారి దళారీలకు, పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు అనుకూలమైనవో స్పష్టంగానే కనబడుతోంది. మామూలుగానైతే ఇటువంటి సూచనల అంతరార్థం బహిరంగంగా కనబడకుండా ఏవో మాయమాటల వెనుక దాచి చెప్పడం స్వార్థ ప్రయోజన శక్తులకు అలవాటు. కుత్తుకలు ఉత్తరించే కత్తులకు కూడ తేనెపూతలు పూయడం అలవాటు. కాని ఇవాళ ఆ శక్తులు ఎంత తెంపరితనానికి, బేహద్బీకి దిగాయంటే నిస్సిగ్గుగా, బహిరంగంగా, నగ్నంగా తమ ప్రయోజనాలు చెప్పుకున్నా ఎవరూ అడ్డుకోబోరని, ప్రభుత్వాలు తాము అడిగినదాన్నల్లా గుడ్డిగా ఆమోదిస్తాయని అనుకుంటున్నాయి.
చూడగానే ప్రజల మెడలమీద వేలాడే కత్తులుగా కనబడుతున్న ఈ ప్రణాళికలోని ఒక్కొక్క అంశం వెనుక దాగి ఉన్న విస్తృత ప్రయోజనాలను, లోతులను అర్థం చేసుకోవలసి ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థ గురించి అంతర్జాతీయ పెట్టుబడిదారులలో ఉన్న వ్యతిరేకతను, అనుమానాలను తొలగించాలని వీళ్లు కోరుతున్నారు. అంటే మొట్టమొదట ఆ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత ఆర్థిక వ్యవస్థ గురించి వ్యతిరేకత, అనుమానాలు ఎందుకు ఉన్నాయో ఆలోచించాలి. మూడు వందల సంవత్సరాల వలస పాలన వల్ల, సరుకుల మారుబేరానికి వచ్చినవాళ్లు మన పాలకులై అత్యంత దుర్మార్గంగా మనను దోపిడీ పీడనలకు గురిచేసినందువల్ల భారత జాతీయోద్యమం సహజంగా, న్యాయంగా విదేశీ పెట్టుబడి గురించి అనుమానాల్ని మన మనసులో నాటింది. నిజానికి అదే దేశభక్తియుతమైన దృక్పథం. మన హక్కులను, మన వనరులను మనం పరిరక్షించుకునే దృక్పథం. అది మనలో ఉండడం ఇవాళ్టి అంతర్జాతీయ పెట్టుబడిదారులకు కంటగింపుగా ఉంది. ఆ దృక్పథంతో తయారయిన మన చట్టాలపట్ల, విధానాలపట్ల వారికి వ్యతిరేకత, అనుమానం ఉన్నాయి. ఆ వ్యతిరేకతను, అనుమానాలను వాళ్లు ప్రపంచ బ్యాంకుద్వారా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థద్వారా, ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా, చెప్పన్నారు ద్రవ్య, ఆర్థిక, రేటింగ్ సంస్థల ద్వారా, ప్రచార సాధనాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యతిరేకతకు, అనుమానానికి మనం ఏమీ భయపడనవసరం లేదు. దానివల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. నిజానికి మనం లొంగకపోయినా మన సంపన్నమైన వనరులు, విశాలమైన మార్కెట్లు వాళ్లకే అవసరం గనుక వాళ్లే మన కాళ్ల బేరానికి వస్తారు. కాని మన రాజకీయ నాయకత్వం, పారిశ్రామిక, వ్యాపార నాయకత్వం దళారీ స్వభావం వాళ్లకు తెలుసు గనుక తమ వ్యతిరేకతను, అనుమానాలను చూపు మననే లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించడం వల్ల దేశ ప్రజలకు ఎంత నష్టం వాటిల్లబోతోందో, దేశంలోని చిల్లర వర్తకం, చిన్న వ్యాపారులు ఎట్లా ధ్వంసం కాబోతున్నారో, అంతర్జాతీయ చిల్లర వ్యాపారుల భారీ తిమింగిల సంస్థలు ఎలా వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జించబోతున్నాయో ఇప్పటికే ఎంతో సమాచారం వెలువడింది. విద్యారంగాన్ని వ్యాపారంగా ప్రకటించాలని, “లాభార్జన ధ్యేయంతో వచ్చే విద్యాసంస్థలను” అనుమతించాలని ఈ రెండో దశ సంస్కరణవాదులు కోరుతున్న కోరిక ఎంత దుర్మార్గమైనదో చెప్పనక్కరలేదు. విద్య విజ్ఞానదాయిని అని, వివేకదాయిని అని, సామాజికశ్రేయస్సుకు మార్గమని నమ్మే విలువలు ఉన్న భారత సమాజానికి ఈ సంస్కరణవాదులు విద్యను లాభనష్టాల లెక్కలలో చూడడం అలవాటు చేయదలచుకున్నారు.
“సంకుచితంగా ఉండే మంత్రిత్వశాఖలను తొలగించాలి” అని అనడం ద్వారా ఈ దళారీలు తమ లాభాపేక్షా జగన్నాథ రథచక్రాలకు ఎక్కడైనా ఎవరైనా అడ్డు పడతారేమో, వారిని తొలగించాలని కోరుతున్నారన్నమాట. భూసేకరణలో ఉన్న అవరోధాలను తొలగించాలి అన్నప్పుడు కూడ రైతులను చంపి అయినా, బుల్డోజర్లు నడిపి అయినా వందలాది, వేలాది ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కోరుతున్నారన్నమాట. అలా గ్రామీణ, వ్యవసాయ రంగాలు కునారిల్లిపోతే ఇక మిగిలేది పట్టణాలకు వలసవెళ్లి, అడ్డుక్కుతినడమో, అడ్డాకూలీలుగా మారడమో గనుక పట్టణీకరణను ప్రోత్సహించాలని కూడ ఈ దళారీలు కోరుతున్నారు.
ఈ రకమైన కార్పొరేట్ అనుకూల రాజకీయార్థిక విధానాలను కిమ్మనకుండా ఆమోదించి, అమలుచేయాలంటే రాజకీయ పార్టీలన్నీ కార్పొరేట్ సంస్థల మోచేతినీళ్లు తాగేవిగా ఉండాలి. అందుకే ఈ ప్రణాళిక రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థల విరాళాలను అనుమతించాలని సూచిస్తోంది. ఆ కార్పొరేట్ సంస్థల ఉప్పు తిని బతికే రాజకీయపార్టీలు మదుపుదార్ల విశ్వాసం పెరిగే చర్యలు తీసుకోవాలని, పర్యావరణం, ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమం వంటి అడ్డంకులు లేకుండా అనుమతులు త్వరత్వరగా ఇవ్వాలనీ, ఆ కార్పొరేట్ సంస్థలు వందల వేల కోట్ల రూపాయలు లాభాలు చేసుకున్నా వారిమీద పన్నులు వేయకుండా ఉండాలనీ కూడ ఈ ప్రణాళిక సూచిస్తోంది.
గత పదిహేను సంవత్సరాలలో రెండున్నర లక్షల మంది రైతుల ఆత్మహత్యలు జరిగి, వ్యవసాయ రంగ సంక్షోభం కట్టెదుట కనబడుతూ ఉండగా ఈ దళారీలు వ్యవసాయ రంగ సంస్కరణల పేరుతో, వ్యవసాయ మార్కెట్ కమిటీల చట్టాలను తొలగించాలనీ, వ్యవసాయోత్పత్తుల రవాణాపై ఆంక్షలు తొలగించాలనీ, ప్రభుత్వ గిడ్డంగులలోని నిల్వలను బహిరంగ మార్కెట్లలో అమ్మకానికి పెట్టాలనీ, ఒక్కమాటలో చెప్పాలంటే వ్యవసాయాన్ని మార్కెట్ శక్తుల విచ్చలవిడి అరాచక లాభాపేక్షా నాట్యానికి వేదిక చేయాలనీ కోరుతున్నారు.
అన్ని ఇంధనాల అమ్మకాల మీద నియంత్రణ తొలగించాలనే కోరిక పెట్రోల్, డీజిల్ ధరలను ఎట్లా పెంచి, తద్వారా అన్ని సరుకుల ధరల పెరుగుదలకు, సామాజిక సంక్షోభానికి కారణమవుతున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
మొత్తం మీద ఈ అన్ని చర్యలూ కూడ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తాయి. ప్రజల భూముల్ని కొల్లగొడతాయి. ఉద్యోగాలను మాయం చేస్తాయి. జీవితాల్ని కూలగొడతాయి. సహజ వనరులను, మార్కెట్లను దేశదేశాల సంపన్నులకు అప్పగిస్తాయి. సమాజాన్ని తీరని సంక్షోభంలోకి నెడతాయి.