వీక్షణం నవంబర్ 2012 సంచిక కోసం
తెలంగాణ ప్రజా బాహుళ్యంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో సెప్టెంబర్ 30న విజయవంతమైన తెలంగాణ మార్చ్ మరొకసారి తేటతెల్లం చేసింది. ప్రభుత్వం వైపు నుంచీ, పోలీసుల వైపు నుంచీ పెద్ద ఎత్తున నిర్బంధకాండ అమలయినా, ప్రధాన తెలంగాణ పార్టీ సంపూర్ణంగా సహకరించకపోయినా, అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా లక్షలాదిగా ప్రజలు ఆ ప్రదర్శనకు తరలివచ్చారు. ప్రభుత్వ, పోలీసు బలగాల వ్యతిరేకత, అనుమతిపై అనిశ్చితి, ప్రదర్శనాస్థలం మార్పు, కుదింపు, రాజకీయ పక్షాల అవకాశవాదం, నిర్లిప్తత, రవాణా సౌకర్యాల తొలగింపు, బెదిరింపులు, గృహ నిర్బంధాలు, అరెస్టులు, మధ్యదారిలో అడ్డంకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ దిగ్బంధనం, లాఠీచార్జిలు, బాష్పవాయుగోళాల ప్రయోగాలు వంటి అసంఖ్యాక అవరోధాలను దాటుకుని తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షను, ఐక్యతను సహజంగా, స్వచ్ఛందంగా, అసాధారణంగా ప్రకటించారు.
అంత అద్భుతమైన ప్రజా ఆకాంక్షల ప్రదర్శన జరిగి మూడు వారాలు గడిచినా, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ వంచనాశిల్పాన్ని యథాతథంగా ప్రదర్శిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాటతో తెలంగాణ ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రజలు కోరినప్పుడు తీర్చకపోవడమే, తన రాజకీయ అవసరాల ప్రకారం పనిచేయడమే నూట ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ నైజం అని మరొకసారి రుజువవుతున్నది. తెలంగాణ సాధన కోసమే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇంకా ఉద్యమం వద్దనీ, కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇస్తుందనీ వాయిదాల మీద వాయిదాలతో నమ్మబలుకుతోంది. ప్రజల సృజనాత్మకత వెల్లువ కావడం, ఉద్యమం ప్రజల చేతిలోకి వెళ్లడం ఇష్టం లేని ఒకానొక పాలకవర్గ పార్టీగా తెరాస అలా ప్రవర్తించడం కూడ సహజమే. తమ నాయకత్వంలో, ప్రధాన శ్రేణులలో నరనరాన జీర్ణించిన తెలంగాణ వ్యతిరేకతను దాచిపెట్టడానికి తెలుగుదేశం పార్టీ అష్టకష్టాలు పడుతోంది. తమ మతోన్మాద ఎజెండాపై తెలంగాణ అనుకూల మేలిముసుగు కప్పి దక్షిణాదిలో మరొక రాష్ట్రంలో మోడీ రాజ్యం తేవాలని భారతీయ జనతాపార్టీ శతవిధాల ప్రయత్నిస్తోంది. మొన్నటి దాకా తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన చరిత్రను మూసిపెట్టి, తామే ప్రధాన తెలంగాణ శక్తులుగా కనిపించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ, న్యూడెమోక్రసీ ప్రయత్నిస్తున్నాయి. తెరాస కాంగ్రెస్ లో విలీనమైతే, అసంతృప్త తెరాస శ్రేణులను తమలోకి ఆకర్షించడానికి ఒక కొసన భాజపా, మరొక కొసన సిపిఐ, న్యూ డెమోక్రసీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తున్నామని చెప్పుకుంటున్న రాజకీయ పార్టీలన్నీ కూడ తమ రాజకీయ ప్రయోజనాలనే ప్రధానంగా చూసుకుంటున్నాయి.
అయినా రాజకీయ పార్టీలను పూర్తిగా పక్కన పెట్టగలిగిన అవకాశం తెలంగాణ ప్రజలకు లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక రాజ్యాంగబద్ధమైన, రాజకీయ పరిష్కారం. పార్లమెంటులో బిల్లు ద్వారా జరగవలసిన పరిష్కారం. అందువల్ల రాష్ట్రసాధన ఉద్యమంలో రాజకీయ పక్షాలకు గణనీయమైన పాత్ర ఉండక తప్పదు. కాని రాష్ట్ర సాధన ఉద్యమం అపజయానికి గురవుతున్నదీ, విజయానికి దూరమవుతున్నదీ రాజకీయపక్షాల ఎత్తుగడల వల్ల మాత్రమే. గత ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షల చరిత్రలో ఆ ఆకాంక్షలకు ద్రోహం చేయని, వక్రీకరించని, తమ ప్రయోజనాలతో పోటీ వచ్చినప్పుడు తెలంగాణను బలిపెట్టని రాజకీయ పక్షం ఏదీ లేదు. బహుశా తెలంగాణ సమస్య జటిలం కావడానికి మూలం ఈ వైరుధ్యంలోనే ఉంది. ప్రజా ఆకాంక్షల స్వచ్ఛత, స్వచ్ఛందత, వైశాల్యం ఒకవైపు, రాజకీయపక్షాల కుటిలత్వం, కృత్రిమత, సంకుచితత్వం మరొకవైపు ఉండడమే తెలంగాణ ప్రత్యేకత. అందువల్లనే తెలంగాణ అకాంక్ష ఆరు దశాబ్దాల వ్యక్తీకరణ తర్వాత, నాలుగు దశాబ్దాల ఉద్యమం తర్వాత, పదిహేను సంవత్సరాల రాజకీయ సంఘటిత రూపం తర్వాత, మూడు సంవత్సరాల వెల్లువ తర్వాత ఎక్కడవేసిన గొంగడి అక్కడే లాగ ఉంది.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయి యాభైఆరు సంవత్సరాలు నిండాయి. విలీనానికి ముందే ఉన్న వ్యతిరేకత, విలీనానికి పునాది అయిన షరతులలో ఏ ఒక్కటీ అమలు కాకపోవడం వల్ల ప్రారంభమైన అసంతృప్తి కలగలసి 1969లో రక్షణల, హామీల అమలు కోసం మొదలైన ఉద్యమం విభజన ఆకాంక్షగా మారింది. ఆ విభజన ఆకాంక్ష నలభై మూడు సంవత్సరాలుగా నిర్బంధానికి, భ్రమలకు, బుజ్జగింపులకు, మళ్లీ మళ్లీ హామీలకు పడిపోతున్నా ఓడిపోకుండా కొనసాగుతున్నది. పదకొండు సంవత్సరాల కింద ఆ విభజన ఆకాంక్ష ప్రాతిపదిక మీదనే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి, ప్రజా ఆకాంక్ష రాజకీయ రూపం కూడ ధరించింది. అది 2004 ఎన్నికల నాటికి రాజకీయ ఆయుధంగా కూడ మారి కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంగా, తెరాసతో ఎన్నికల పొత్తుగా ముందుకు వచ్చింది. ఆ వాగ్దానమే అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీని గద్దె దించి, ప్రతిపక్షంగా ఉండిన కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టింది. కేంద్రంలో కూడ కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అధికారానికి వచ్చి, తెలంగాణ ఏర్పాటును తన కనీస ఉమ్మడి కార్యక్రమంలోను, రాష్ట్రపతి ప్రసంగంలోను చేర్చింది. రాజకీయాభిప్రాయ సేకరణ కొరకు ఒక కమిటీని వేసింది. కాని ఈ ప్రయత్నాలన్నీ కేవలం కంటి తుడుపు చర్యలుగా, కాలయాపన తతంగంగా మిగిలిపోయాయి. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మరొకసారి వాగ్దాన భంగానికి పాల్పడింది.
ఆ తర్వాత 2009 ఎన్నికలలో అప్పటి ప్రతిపక్షాలు విభజన ఆకాంక్షకు మద్దతు తెలిపాయి. దానితో పార్లమెంటరీ రాజకీయాలలో ఉన్న అన్ని పక్షాలూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఆమోదించిన స్థితి ఏర్పడింది. అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రయత్నాలు ముందుకు కదలలేదు. ఈ లోగా తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనుకూలంగా ఉండిన ఒక నిబంధనను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తెలంగాణ ఆకాంక్ష మరొకసారి రాజుకుంది. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో తెరాస అధినేత కె చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. ప్రభుత్వం ఆ దీక్ష జరగకుండా అడ్డుకోవడంతో తెలంగాణ అగ్నిగుండంగా మారింది. చంద్రశేఖర రావు నిర్బంధంలోనే నిరాహార దీక్ష కొనసాగించారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు తమ నిరసనను, పోరాటాన్ని ప్రారంభించారు. విద్యార్థులు అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు.
ఆ పూర్వరంగంలో డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పక్షాలూ తెలంగాణ ఏర్పాటుకు తమ ఆమోధాన్ని ఏకవాక్య తీర్మానంలో తెలియజేశాయి. ఆ తీర్మానం పునాదిగా డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతున్నదని ప్రకటించింది. కాని రెండు వారాలు తిరగకుండానే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకటన నుంచి వెనక్కి పోయి, విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరగవలసి ఉన్నదని డిసెంబర్ 23న ప్రకటించింది. ఆ ఏకాభిప్రాయ సాధనలో భాగంగా 2010 జనవరి 5న అఖిలపక్ష సమావేశం జరిగింది. డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశానికి భిన్నమైన వైఖరిని, అంటే ఒక్క నెల లోపలే తమ అభిప్రాయాలు తలకిందులుగా మారిన వైఖరిని పార్టీలు చూపాయి.
ఆ అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ప్రజల చేతుల్లోకి పోనివ్వగూడదని, ప్రజా ఆకాంక్షలు నెరవేరడం కన్న శాంతి భద్రతలు నెలకొనడం ముఖ్యమని అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించింది. న్యాయాన్యాయాల సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చి చూపడం, పరిష్కారాలను నానబెట్టడం, తమ సమస్యలపై ఆందోళన చేసే హక్కు ప్రజలకు లేదన్నట్టుగా ప్రవర్తించడం ఈ దేశ పాలకవర్గాలకు, వాటి ప్రతినిధులైన పార్లమెంటరీ రాజకీయ పక్షాలకు మొదటినుంచీ అలవాటే. అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలు పాల్గొన్న జనవరి 5 అఖిలపక్ష సమావేశపు లోపాయకారీ ఒప్పందం కాలయాపన ద్వారా ఉద్యమాన్ని చల్లార్చడం. అందులో భాగంగా నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఏడాది పాటు కాలయాపన చేసి, సమస్య పరిష్కారానికి సూచనలు చేయకపోగా మసిపూసి మారేడుకాయ చేసింది. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం రెండు సంవత్సరాలుగా ఒకదాని తర్వాత ఒకటిగా వాయిదాలు వేస్తూ వచ్చాయి. స్వయంగా తెలంగాణ ఆకాంక్ష కోసమే ఉన్నామని చెప్పుకునే రాజకీయ పక్షాలు ఆ వాయిదాలను నమ్ముతూ, ప్రజలను నమ్మిస్తూ వచ్చాయి. ఇటువంటి కాలయాపన ప్రయత్నాలెన్ని జరిగినా ప్రజల ఆకాంక్ష చల్లారలేదు. ప్రజలు ఉద్యమ పథం నుంచి వైదొలగలేదు. ఉద్యమాన్ని నిలిపి ఉంచడానికి, కొనసాగించడానికి, ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొందడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేశారు. సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, హైదరాబాద్ మార్చ్ వంటి అనేక కొత్త పోరాట రూపాలు కనిపెట్టారు. కొత్త వర్గాలు, సమూహాలు పోరాటంలోకి వచ్చాయి. ఎన్నో నాయకత్వాలు వచ్చాయి. ఆయా నాయకత్వాలను నమ్మి అయినా, నమ్మకుండా అయినా ప్రజలు తమ పోరాటాలు తాము చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఉద్యమ విస్తృతి, వైవిధ్యం, లోతు పెరిగాయి. అయినా ఉద్యమం విజయం సాధించలేకపోయిందనేది నిజం. నిజానికి ఈ ఉద్యమ విజయం వ్యవస్థలో, సమాజంలో, పాలనలో మౌలికమైన మార్పులతో ముడిపడినదేమీ కాదు. అది కనీస, రాజ్యాంగబద్ధ, ప్రజాస్వామిక, భౌగోళిక ప్రత్యేక విభజన కోరిక మాత్రమే. అంత కనీసమైన కోరికను కూడ ప్రజలు అడుగుతున్నారు గనుక తీర్చగూడదనుకునేంత దుర్మార్గమైన పాలకవర్గాల పాలన సాగుతున్నది. ఆ ప్రజా ఆకాంక్షను తీర్చకపోవడానికి ప్రత్యర్థులు సమకూరుస్తున్న డబ్బు సంచులు, వనరుల దోపిడీ దురాశలు, బహుళ జాతి సంస్థల ప్రయోజనాలు, పాలకులకు సహజంగా ఉండే ప్రజావ్యతిరేకత, వాస్తవ రాజకీయార్థిక స్థితితో సంబంధం లేని ఐక్యత వంటి తప్పుడు భావజాలం లాంటి చిన్నా పెద్దా కారణాలెన్నో ఉన్నాయి. ఈ కారణాలు ఇవాళ ఎంత బలమైనవిగా, తెలంగాణ ఆకాంక్షను అడ్డుకోగలిగినవిగా కనబడుతున్నా, అవన్నీ ప్రజాశక్తి ముందు ఓడిపోక తప్పదు.
అయితే ఉద్యమం సాధించిన అద్భుతమైన ముందడుగులను, ప్రజా భాగస్వామ్యాన్ని, అంతిమ విజయాన్ని గుర్తిస్తూనే, ఉద్యమ క్రమంలో తలెత్తిన, తలెత్తుతున్న కొన్ని అపసవ్య ఆలోచనలను, పరిణామాలను కూడ గమనంలోకి తీసుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయత్నం ఎంతగా రాజకీయ ఉద్యమమైనప్పటికీ దాన్ని పూర్తిగా రాజకీయ పక్షాలకే వదిలివేయడం, ఆ రాజకీయ పక్షాలు తమ సంకుచిత, రాజకీయ ప్రయోజనాల కొద్దీ అవకాశవాద ఎత్తుగడలతో ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తుండడం స్పష్టంగా కనబడుతున్నది. రాజకీయ పార్టీలను వాటి స్వభావాన్ని వదులుకొని నిస్వార్థంగా, తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రజల కోసం పని చేయమని కోరడం సాధ్యం కాకపోవచ్చు. కాని రాజకీయ పార్టీలను వాటి హద్దులలోపల ఉండమని, అవసరమైనంత వరకే ఉద్యమం లోకి రమ్మని, వాయిదాలతో కాలయాపన చేయవద్దనీ, తెలంగాణ ప్రయోజనాల కన్న తమ పార్టీ ప్రయోజనాలే మిన్న అనుకుంటే పక్కకు తొలగమనీ చెప్పే అధికారం ప్రజలకు తప్పకుండా ఉంది. సమాజంలో రాజకీయపార్టీల ప్రాధాన్యత, బలం అవి ప్రజల ప్రయోజనాల కోసం నిలబడినంత కాలమే ఉంటుంది గాని, భ్రమలతో, ఆకర్షణలతో, ధనబలంతో, తప్పుడు వాగ్దానాలతో ఉండదు. తరతరాలుగా గొప్ప పోరాటశీల వారసత్వం ఉన్న తెలంగాణ ప్రజలు రాజకీయపార్టీల పట్ల సరైన దృక్పథం తీసుకుని, వాటిని కేవలం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం లాంటి సాంకేతిక ప్రక్రియలకు పరిమితం చేయవలసిన స్థితి వచ్చింది.
రాజకీయపార్టీల మీద మితిమీరిన శ్రద్ధాసక్తులు, ఆదరణల వల్ల పార్టీలకు అతీతంగా పనిచేయవలసిన ప్రజా ఉద్యమం, స్వతంత్ర ఉద్యమకారుల పాత్ర నానాటికీ కుంచించుకుపోతున్నది. ప్రజా ఉద్యమ శక్తులు, స్వతంత్ర ఉద్యమకారులు తమ కార్యక్షేత్రాన్ని విస్తరించుకుని, క్రియాశీల ఉద్యమాలు నడిపి, పార్టీల మీద ఒత్తిడి తెచ్చి, పాలకుల మెడలు వంచే బదులు, క్రమక్రమంగా నిష్క్రియాపరత్వంలోకి, నామమాత్రపు ఆచరణలోకి దిగజారుతున్నారు. చాల సందర్భాలలో ఉద్యమాలు నడిచినట్టు, ప్రజా భాగస్వామ్యం పెరుగుతున్నట్టు కనబడుతున్నది గాని పరిష్కార దిశలో అంగుళం పురోగతి కూడ కనబడడం లేదు. ఈ స్థితిని మార్చి పరిష్కారాన్ని త్వరితం చేయగలిగిన క్రియాశీల పోరాట రూపాలు చేపట్టవలసి ఉంది. ఇతోధిక ప్రజా భాగస్వామ్యానికి అవకాశం కల్పించి, అట్టడుగు స్థాయి నుంచి ప్రజా నిర్మాణాలు రూపొందించవలసి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ పెత్తందారీ శక్తులు, వారికి దళారీలుగా పనిచేస్తున్న తెలంగాణ నాయకులు దిగివచ్చి, తెలంగాణ ఏర్పాటు చేయక తప్పదని భావించే స్థితి తీసుకురావడం ఇవాళ స్వతంత్ర ఉద్యమ కారుల ముందున్న కర్తవ్యం.
ఒక పని సాధించడానికి పార్టీలు, నిర్మాణాలు అవసరమే, కాని నిర్మాణం అంటూ రాగానే దానికి తనను తాను సంరక్షించుకునే ప్రవృత్తి ఏర్పడి అది ఆ పనిని, ఆ పని అవసరమైన ప్రజలను వదిలేసే అవకాశం ఉంది. ఈ అనివార్య వైరుధ్య స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజల ఆగ్రహం నిస్సహాయంగా మిగిలిపోతున్నది. అందువల్లనే నిరాశా నిస్పృహలు వ్యాపిస్తున్నాయి. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకుని, ప్రజలకు, ఆకాంక్షకు, నిర్మాణానికి మధ్య సంబంధాలను సమన్వయం చేయవలసి ఉంది. ప్రజలే మౌలిక శక్తి అని, ప్రజలకూ నిర్మాణానికీ పోటీ వచ్చినప్పుడు ప్రజలదే పైచేయి అవుతుందని గుర్తుంచుకుని, ఈ వైరుధ్యాన్ని పరిష్కరించవలసి ఉంది. ఈ సంక్లిష్టతను అర్థం చేసుకోలేకపోతున్న యువకులు నిర్మాణాల పట్ల అసంతృప్తితో, త్వరితగతి పరిష్కారం జరగడం లేదనే తొందరపాటుతో ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు. ప్రజలకూ, ఆకాంక్షకూ, నిర్మాణానికీ మధ్య తేడా లేదనుకుని, భంగపడి, అందువల్ల నిరాశా నిస్పృహలు పెరిగి ఆత్మహత్యల వైపు నెట్టబడుతున్నారు. నిర్మాణ అవసరాన్ని గుర్తిస్తూనే, గుర్తింపజేస్తూనే, నిర్మాణాలను దాటి ఆకాంక్షతో, ఆకాంక్షను దాటి ప్రజలతో నిబద్ధంగా ఉండాలనే అవగాహనను స్వతంత్ర ఉద్యమ కారులు ప్రచారం చేయవలసి ఉంది. ఆ అవగాహన పెరిగితే నిర్మాణాలు ద్రోహం చేసినా నిరాశా నిస్పృహలు రావు సరిగదా, ప్రతి ద్రోహమూ నిబద్ధతను మరింతగా పెంచుతుంది.
తెలంగాణ ఉద్యమంలో తలెత్తిన, తలెత్తుతున్న తప్పుడు ధోరణులలో ప్రధానమైనది అనైక్యత. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోరిక కొనసాగుతున్న సామాజిక విభజనలకు ఒక రకంగా అతీతమైనది. అందులో విడివిడిగా కుల, మత, స్త్రీపురుష, వర్గ ప్రయోజనాలు ఉండవచ్చుగాని, ఈ ప్రాంతంలోని ఆయా సమూహాలన్నిటికీ సంబంధించిన ఉమ్మడి కోరికగా అది ఈ విభజనలను పక్కన పెట్టి ముందుకు వచ్చిన, వచ్చే కోరిక. అంటే ఇటువంటి ప్రాంతీయ ఉద్యమానికి మిగిలిన అస్తిత్వాలన్నిటినీ తాత్కాలికంగానైనా పక్కన పెట్టి సాధించవలసిన ఐక్యత ఒక కీలకాంశంగా, బలంగా ఉంటుంది. కాని తెలంగాణ ఉద్యమ విజయం దూరమవుతున్న కొద్దీ ఆయా భాగస్వామ్య సమూహాలు తమ స్వతంత్ర అస్తిత్వాలను, తమ తమ కోరికలను ప్రకటించుకుంటున్నాయి. పునరుద్ధరించుకుంటున్నాయి. అంతవరకూ అయినా ఫరవాలేదు గాని, మిగిలిన అస్తిత్వాల మీద వ్యతిరేకతను ప్రకటిస్తున్నాయి. అంటే బహిరంగ అనైక్యతా ప్రదర్శన, చీలికలు వ్యక్తమవుతున్నాయి. ఈ పని ఎంత ఎక్కువగా జరిగితే ప్రాంతీయ ఆకాంక్షలు అంతగా బలహీనపడతాయి. తమ స్వతంత్ర అస్తిత్వం, ఆ అస్తిత్వ సమస్యలు, ఆకాంక్షలు వాస్తవికమైనవే అయినప్పటికీ, ఆ అస్తిత్వాలన్నిటినీ కలగలుపుకున్న ప్రాంతీయ అస్తిత్వమే వర్తమానంలో ఏకైక ప్రమేయమని భావించినప్పుడు, అలా ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే ప్రాంతీయ ఉద్యమానికి బలం ఉంటుంది. విడివిడిగా విభిన్న అస్తిత్వాలు ఉన్నమాట, వాటి మధ్య విభేదాలు ఉన్న మాట నిజమే అయినా, ఇవాళ్టి ఉద్యమ స్థితిలో ఆ విభేదాలు బైటపెట్టుకోవడం పాలకవర్గాలకు, ప్రాంతీయ ఆకాంక్షల ప్రత్యర్థులకు ఉపయోగపడుతుందని మరచిపోగూడదు.
ప్రస్తుత ఉద్యమంలో మరొక ప్రధానమైన తప్పుడు ధోరణి, గతాన్ని బేషరతుగా, సంపూర్ణంగా కీర్తించే ధోరణి. తమ ప్రాంతపు విశిష్టతను, ఆధిక్యతను చెప్పుకోవడానికి దాని ప్రత్యేక చరిత్రను, సంస్కృతిని, వారసత్వాన్ని ఎత్తిపట్టడం అవసరమే. కాని ఆ చరిత్ర, సంస్కృతి, వారసత్వం సంపూర్ణంగా సమర్థించదగినవీ కావు, తిరస్కరించదగినవీ కావు. మన గతం మనదే అయినప్పటికీ గత కాలపు భూస్వామిక, రాచరిక, హైందవ, బ్రాహ్మణీయ, కుల అంతరాల, మత భావజాలాల ప్రభావాల వల్ల దానిలో పరిహరించదగినవీ, విమర్శించదగినవీ ఎన్నో ఉంటాయి. కాళోజీ తరచుగా ఉటంకించిన తెలంగాణ సామెతలో చెప్పినట్టు ‘పిల్ల ముద్దు అయితే పియ్యి ముద్దు కాదు’. తెలంగాణ చరిత్ర, సంస్కృతులను ఎత్తిపడుతూనే, వాటిపట్ల జరిగిన విస్మరణను, అన్యాయాన్ని ఖండిస్తూనే, వాటిలోని తప్పుడు భావాలను కూడ విమర్శించగలగాలి. కాని అటువంటి హేతుబద్ధ, సమన్వయ దృక్పథానికి బదులు, ‘ఇక్కడ పుట్టినదయితే ఏదయినా మంచిదే’ అనే అభిప్రాయాన్ని నాయకులలో కొందరయినా తీసుకుంటున్నారు. ప్రజలలో కొందరయినా ఆ అభిప్రాయంతో ప్రభావితమవుతున్నారు. ప్రాంతీయ అస్తిత్వాన్ని గౌరవించడం అనే పేరుతో, ఆ అస్తిత్వంలోని చెడును, మూఢనమ్మకాలను, కుల, మత భావనలను, ప్రజా వ్యతిరేకతను గౌరవించడం జరుగుతున్నది. చివరికి ప్రాంతీయ ఆకాంక్షలను వ్యతిరేకించినవారయినా సరే, ఈ ప్రాంతంలో పుట్టినవారయితే గౌరవించాలనే ధోరణి తలెత్తుతున్నది. ఇచట మొలిచిన చిగురు కొమ్మైన చేవ, లేదురా ఇటువంటి భూమి ఇంకెందు వంటి భావాలు ఆత్మవిశ్వాసానికి, స్థానిక అభిమానానికి ఎంత అవసరమో, అదే సమయంలో అవి దురభిమానానికి, దురహంకారానికి, ఇతరులను చిన్నచూపు చూసే ఆధిక్యతా ధోరణికి దారి తీస్తాయని కూడ గుర్తించాలి.
ఈ క్రమంలోనే ప్రత్యర్థుల శవదహనాలు, పిండ ప్రదానాలు, తెలంగాణ ఇప్పించమని దేవతలను కోరడం వంటి మూఢాచార రూపాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. అలాగే తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ సాంస్కృతిక చిహ్నాలుగా బతుకమ్మ పండుగ, గ్రామదేవతల పూజలు చాల గౌరవించదగిన ప్రజా సంరంభాలే. కాని బతుకమ్మ పాటలలో, గ్రామదేవతల పూజలలో చాల ఎక్కువగా పితృస్వామ్య భావజాలాన్ని, భూస్వామ్య భావజాలాన్ని, స్త్రీ వ్యతిరేక మతాచారాలను, కుల అంతరాలను, మూఢాచారాలను చెప్పడానికి ఉద్దేశించినవి ఉన్నాయి. ప్రాంతీయ సాంస్కృతిక అస్తిత్వాన్ని గౌరవించడం పేరుతో ఆ మూఢాచారాల పునరుద్ధరణ జరగడం భవిష్యత్తు తెలంగాణ సమాజానికి మంచిది కాదు.
తెలంగాణ ఉద్యమ క్రమంలో, మరీ ముఖ్యంగా అది విజయం సాధిస్తుందనీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందనీ నమ్మకం కలిగిన తర్వాత, ఉద్యమ నాయకులలో, కార్యకర్తలలో అధికార లాలస పెరిగిపోతుండడం కూడ కనబడుతున్నది. నాయకులుగా గుర్తింపు పొందాలనీ, వేదికల మీద కనబడాలనీ, తద్వారా రానున్న తెలంగాణ రాష్ట్రంలో ఏదో పదవినో, అధికారాన్నో సంపాదించాలనీ, లేదా ఉద్యమ క్రమంలోనే ఆ గుర్తింపును ఆర్థిక ప్రయోజనంగా మార్చుకోవాలనీ కొందరయినా ప్రయత్నిస్తున్నారు. అసాధారణంగా, అద్భుతంగా జరిగిన సెప్టెంబర్ 30 మార్చ్ లోనే వేదిక మీదికి ఎక్కవలసిన అవసరం లేని వారు ఎక్కారనీ, వారు దిగిపోవాలనీ వందల సార్లు ప్రకటనలు చేయవలసి వచ్చిందంటే, ఈ గుర్తింపు తపన తెలంగాణ ఉద్యమంలో ఎంత ప్రమాదకర పరిమాణానికి చేరిందో అర్థమవుతుంది.
తెలంగాణ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ పాలక విధానాలకూ తెలంగాణ ప్రజలకూ మధ్య వైరుధ్య చిహ్నమే తప్ప, తెలంగాణ ప్రజలకు మరే ప్రాంత ప్రజలతోనూ విభేదం ఉండనవసరం లేదు. కాని దురదృష్టవశాత్తూ తెలంగాణ ఉద్యమ క్రమంలో కొందరిలోనైనా ఇతర ప్రాంతాల ప్రజల పట్ల అవాంఛనీయమైన వ్యతిరేకత, నింద కనబడుతున్నాయి. తెలంగాణను దోపిడీ పీడనలకు గురిచేసిన ఆయా ప్రాంతాల రాజకీయ నాయకుల పట్ల, పెట్టుబడిదారుల పట్ల ఉండవలసిన ద్వేషం అక్కడి ప్రజల మీద వ్యక్తమవుతున్నది. ప్రజలు ఎక్కడైనా ప్రజలే. ప్రజా వ్యతిరేకులు ఎక్కడయినా ప్రజావ్యతిరేకులే. ఇక్కడ పుట్టినందువల్ల ప్రజావ్యతిరేకులు ఆమోదించదగినవారైపోరు. అక్కడ పుట్టినందువల్ల ప్రజలు వ్యతిరేకించదగినవారైపోరు. కాని తెలంగాణ ఉద్యమం విస్తరిస్తున్నకొద్దీ దానిలో ఈ ప్రజాసౌభ్రాతృత్వ దృష్టి తగ్గిపోతూ వస్తున్నది. ఇది స్పష్టంగా పాలకవర్గ దృక్పథం. పాలకవర్గాలు ప్రజలను చీల్చి, ఒక సమూహంలో మరొక సమూహం పట్ల ద్వేషభావాన్ని నింపడం ద్వారా పాలిస్తారు. తెలంగాణ ఉద్యమ శక్తులు తమ మధ్య ఐక్యతను నిలిపి ఉంచుకోవడం ఎంత అవసరమో, ఇతర ప్రాంతాల పీడిత ప్రజలతో ఐక్యతను, వారి సౌభ్రాతృత్వాని సంపాదించడం కూడ అంతే ముఖ్యం. నిజానికి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినది కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల వల్ల కాదు. ఆ ప్రాంతాల రాజకీయ నాయకులవల్ల, పెత్తందార్ల వల్ల, దోపిడీదారుల వల్ల. ఆ అన్యాయానికి తెలంగాణలో పుట్టిన రాజకీయ నాయకులు, పెత్తందార్లు, దోపిడీదార్లు కూడ సహకరించారు.
తెలంగాణ ఉద్యమంలో మరొక అతిశయోక్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సర్వరోగ నివారిణి అన్నట్టుగా జరుగుతున్న ప్రచారం. తెలంగాణ రాష్ట్రం తప్పనిసరిగా ఏర్పడవలసిందే. అది ప్రజల కోరిక. అది ఆరు దశాబ్దాల అన్యాయాలకు, వాగ్దానాల ఉల్లంఘనలకు, ప్రత్యేక అస్తిత్వ నిరాకరణకు జవాబు. కాని తెలంగాణ ప్రజాసమస్యలన్నిటినీ అది పరిష్కరించజాలదు. ప్రస్తుతం దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటిలోనూ ఎటువంటి పాలన సాగుతున్నదో అటువంటి పాలనే సాగుతుంది. కాకపోతే తెలంగాణ ప్రజలకు చెందవలసిన నీరు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజలకే చెందుతాయి. ప్రగతిశీలమైన, ప్రశ్నించే స్వభావం ఉన్న తెలంగాణ సమాజం పాలకులను నిరంతరం ప్రశ్నిస్తూ మెరుగైన పాలనను కూడ సాధించవచ్చు. కాని రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం, తెలంగాణ వనరుల మీద తెలంగాణ ప్రజలకే సంపూర్ణ అధికారం, కుల, మత, ప్రాంత, వర్గ, స్త్రీపురుష విభేదం లేని సర్వతోముఖాభివృద్ధి వంటి లక్ష్యాలు ఈ రాజ్యాంగానికి, ప్రస్తుత రాజకీయార్థిక వ్యవస్థకు లోబడిన పాలనలో అమలు జరగవు. ఈ సమతౌల్యమైన అవగాహనను కూడ తెలంగాణ ఉద్యమం ప్రచారం చేయవలసి ఉంది.
ఈ అపసవ్య ధోరణులలో కొన్ని వెలువడడానికి కూడ ప్రధాన కారణం ఉద్యమం తగిన సమయంలో విజయం సాధించలేకపోవడమే. ప్రజల ఆకాంక్షల ప్రకటన, ఐక్యత వ్యక్తీకరణ, నిరసన ప్రదర్శన ఎంతో కాలంగా సాగుతూ వస్తున్నాయి. వాటితో మాత్రమే పరిష్కారాన్ని సాధించగల సున్నితత్వం పాలకులలో లేదని కూడ రుజువై పోయింది. ఇక పాలకుల మెడలు వంచాలన్నా, వారికి బెదురు పుట్టించాలన్నా, పరిష్కరించక తప్పని అనివార్య స్థితి కల్పించాలన్నా కావలసింది ప్రజల ప్రతిఘటన. తెలంగాణ రాష్ట్ర సాధనకు అడ్డంకిగా ఉన్న శక్తుల రాజకీయార్థిక ప్రయోజనాలు నెరవేరవని హెచ్చరిక కావాలి. వారు తెలంగాణలో నిరాటంకంగా సాగిస్తున్న వనరుల దోపిడీ ఇంక చెల్లదనే హెచ్చరిక కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్న వైఖరి కొనసాగడానికి వీల్లేదని హెచ్చరిక కావాలి. ఈ హెచ్చరికలు గంభీరమైన ప్రకటనలుగా కాక, కనీస మాత్రమైన, ప్రతీకాత్మకమైన ఆచరణ రూపాలుగానైనా ఉండాలి. అప్పుడు మాత్రమే తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు నిజమైన సాఫల్యం సిద్ధిస్తుంది.
తెలంగాణ కనీసం మూడు సంవత్సరాలుగా చౌరస్తాలో నిలిచి ఉంది. ఆ ప్రయాణాన్ని ఆపిన లైటు ఎరుపో, కాసేపట్లో ఆకుపచ్చగా మారబోయే పసుపో తెలియడం లేదు. ఆకుపచ్చగా మారడానికి ఎక్కువసేపు లేదని నమ్మబలికే వాగ్దానాలకూ కొదవలేదు. కాని మూడు సంవత్సరాలుగా చౌరస్తాలో నిలబడిన ప్రతిష్టంభన ప్రజల అసహనాన్ని, అసంతృప్తిని మరింతగా పెంచుతున్నది. ఎవరూ చౌరస్తాలలో ఎక్కువకాలం నిలబడలేరు. ఉన్నచోట కదం తొక్కుతూ ఉండలేరు. చౌరస్తాలో నిలిపి ఉంచాలని ప్రయత్నిస్తున్నవారు ఎంత బలవంతులైనా ఏదో ఒకరోజు ప్రజల అసహనం కట్టలు తెంచుకుంటుంది. ఆరోజున ఎర్రలైట్లను, పసుపు లైట్లను మాత్రమే కాదు, అన్ని ఆటంకాలనూ పగలగొట్టి, ప్రజలు తమకు తాము ఆకుపచ్చ పురోగమనాన్ని ప్రకటించుకోగలరు.
ఆ ఆగ్రహం కట్టలు తెంచుకునే సందర్భం వచ్చినప్పుడు అది ఎంత విస్ఫోటకంగా, అరాచకంగా ఉంటుందో ప్రపంచ చరిత్ర ఎన్నో సార్లు తెలియజెప్పింది. ఆ సందర్భం రాకముందే మేలుకుని ఆ ఆగ్రహ కారణాలను తొలగించడం, మార్పును శాంతియుతంగా, సున్నితంగా ఆహ్వానించడం పాలకుల విధి. ఆ దిశగా పాలకులకూ సమాజానికీ చైతన్యం అందించడం బుద్ధిజీవుల కర్తవ్యం.