వీక్షణం నవంబర్ 2012 సంపాదకీయం
ప్రస్తుత అధికార కూటమి అధ్యక్షురాలు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఎన్ని అక్రమ లావాదేవీలతో, కుంభకోణాలతో సంబంధం ఉన్నదో, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఎన్ని వందల ఎకరాలు, వందలకోట్ల రూపాయల ఆస్తులు పోగుచేసుకున్నాడో బైటపడుతున్నది. అంతకు ముందు కాంగ్రెస్ కు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు పాలుపంచుకున్న కుంభకోణాలెన్నో బయటపడ్డాయి. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి ఎన్ని అక్రమ వ్యాపారాలున్నాయో, ఎన్ని కుంభకోణాలలో భాగం ఉందో కూడ బైటపడుతున్నది. భాజపా కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రాలలో అధికారాలలో ఉన్నచోట్ల కూడ ఇటువంటి అవినీతి ఉదంతాలెన్నో బైటపడ్డాయి.
ఇవాళ రాబర్ట్ వాద్రా, నితిన్ గడ్కరీ అనే ఇద్దరు వ్యక్తులు ఎంతగా చట్టాలను ఉల్లంఘించారో, తప్పుడు వ్యాఖ్యానాలు చేశారో, చట్టవ్యతిరేక కార్యకలాపాలకూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికీ, చట్ట నిబంధనలకు లోబడే దేశ సంపదలను హక్కుభుక్తం చేసుకోవడానికి పాల్పడ్డారో రోజురోజూ కొత్త వివరాలు బైటపడుతున్నాయి. ఇది ఆ ఇద్దరికీ మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఈ రెండు ఉదాహరణలు ప్రతీకాత్మక చిహ్నాలు మాత్రమే. అధికారంలో ఉన్నా, ప్రధాన ప్రతిపక్షం అయినా ఆయా రాజకీయ పక్షాలు ఎంతగా అవినీతిలో, అక్రమార్జనలో, ప్రజావ్యతిరేక కార్యకలాపాలలో, స్వార్థభరిత ప్రవర్తనలో కూరుకుపోయాయో ఈ రెండు ఉదాహరణలు చూపుతున్నాయి.
ఆమాటకు వస్తే కాంగ్రెస్, భాజపా మాత్రమే కాదు, పార్లమెంటరీ రాజకీయ పక్షాలన్నీ ఆ తానులోని ముక్కలే. అన్వేషించగల శక్తి సామర్థ్యాలూ, ఓపికా ఉంటే ఈ దేశంలో పార్లమెంటరీ రాజకీయ నాయకులలో తొంభై శాతానికి పైగా, గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయిదాకా, ఏ ఒక్క పార్టీ మినహాయింపు లేకుండా, ఇటువంటి అక్రమ లావాదేవీలున్న విషయం బయటపెట్టవచ్చు. బెంగళూరు – మైసూరు రహదారి కుంభకోణంలో మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు భాగస్వాములని ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అటు తెలుగుదేశం పాలనలోనైనా, ఇటు కాంగ్రెస్ పాలనలోనైనా సహజవనరులను, భూమిని, ఖనిజాలను, అడవిని, సముద్రతీరాన్ని, పాలనా అవకాశాలను అప్పగించి వేలకోట్ల రూపాయల ముడుపులు, ‘నీకది – నాకిది’ లోపాయికారీ పంపకాలు విచ్చలవిడిగా సాగాయి, సాగుతున్నాయి. రాజకీయ నాయకుడు కావడమంటే వందల, వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని కైంకర్యం చేయడమేనని అర్థం స్థిరపడిపోతున్నది.
దీన్ని అవినీతి అని పిలుస్తున్నప్పటికీ ఇది నీతి లేకపోవడం అనే నైతిక సమస్య మాత్రమే కాదు. నిజానికి ప్రజలను దోపిడీ చేసి స్వలాభం చూసుకోవడమే వర్గ సమాజంలో పాలకవర్గ నీతి. ఆ నీతిని ఇవాళ్టి పాలకవర్గాలు నిస్సిగ్గుగా, నగ్నంగా, బహిరంగంగా అమలు చేస్తుండడమే మధ్యతరగతి ఏవగింపు పెరగడానికి కారణమవుతున్నది. ప్రతి విషయాన్నీ నైతికదృష్టితో చూడడం మధ్యతరగతికి అలవాటు గనుక కుంభకోణాలను, ప్రజాధనం కైంకర్యాన్ని, వనరుల దోపిడీని అవినీతి పరిభాషలో అర్థం చేసుకోవడం జరుగుతున్నది. కాని ఇది రాజకీయార్థిక సమస్య. ఒక మనిషిని వేరొక మనిషి పీడించే, దోపిడీ చేసే సాంఘిక ధర్మపు సమస్య. సొంత ఆస్తి పెంచుకోవడం వ్యసనంగా మారిన సామాజిక విలువల సమస్య. ‘నేను చేసిందంతా నీతి, ఇతరులు చేసేదంతా అవినీతి’ అనుకునే సాంస్కృతిక కపటత్వపు సమస్య. సామాజిక శాంతి భద్రతలకోసం మోసపూరితంగా రాసిపెట్టిన నామమాత్రపు చట్టాలను కూడ ఉల్లంఘిస్తున్న సమస్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సొంత ఆస్తి సమాజపు మౌలిక సమస్య. వర్గ అంతరాల సమాజపు ప్రధాన సమస్య.
ఇంత విశాలమైన సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక, నైతిక, చట్టపరమైన సమస్యను కేవలం అంకెలతోనో, మంచి చట్టాలతోనో, నీతిమంతులైన అధికారులతోనో, తమను తాము స్వచ్ఛమైన వారిగా భావించుకునే వాచాలత్వపు సంస్కర్తలతోనో పరిష్కరించడం అసాధ్యం. ఈ పద్ధతులలో ఎక్కువలో ఎక్కువ ఈ రుగ్మతలకు తాత్కాలిక ఉపశమనం కనిపించవచ్చు. ఈ చిరుగుల బొంత వ్యవస్థకు కొత్త అతుకులూ మాట్లూ పడవచ్చు. కాని జరగవలసింది ఈ రుగ్మతలు శాశ్వతంగా రద్దు కావడం. ఈ వ్యవస్థ సంపూర్ణంగా, మౌలికంగా మారిపోవడం. వ్యవస్థ మారే వరకూ అవినీతి సమస్య రూపాలు మార్చుకోవచ్చు గాని రద్దయిపోదు.
ఈ వ్యవస్థను రద్దు చేయవలసిన అవసరం పెరుగుతున్నదనడానికి అవినీతి మాత్రమే కాదు, మరెన్నో ఆధారాలు రోజురోజూ కనబడుతున్నాయి. ఈ గజదొంగలూ బందిపోట్లూ అధికార పక్షంగానో, ప్రతిపక్షంగానో ప్రజా ప్రతినిధులుగా నటిస్తూ చేస్తున్న పని అక్షరాలా దేశద్రోహం. ప్రజాద్రోహం. దేశదేశాల సంపన్నులతో భుజాలు రాసుకు తిరుగుతూ దేశ వనరులను కారుచౌకగా అమ్మివేయడం. దేశ మార్కెట్లను బహుళజాతి సంస్థలకు అప్పగించడం. ముడుపులూ ఎంగిలి మెతుకులూ సంపాదించడం. తమ దొంగల దోపిడీని సమర్థించుకునే చట్టాలు అమల్లోకి తేవడం. మరొకవైపు ఆ దోపిడీని ప్రశ్నించే, ఈ దేశ వనరులు ఈ దేశ ప్రజలకే దక్కాలని పోరాడే శక్తులపై విరుచుకుపడడం. వారిని దేశ వ్యతిరేక శక్తులని ముద్రవేయడం, నిర్బంధాల పాలు చేయడం. కూడంకుళంలో అణువిద్యుత్ ప్రాజెక్టు తమ జీవనాన్ని భగ్నం చేస్తుందని గుర్తించి దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై, వారికి సహాయ సహకారాలు అందిస్తున్నవారిపై, సానుభూతి తెలుపుతున్నవారిపై ప్రభుత్వాల అమానుష వైఖరి చూస్తే ఈ ప్రభుత్వాలను, పాలకవర్గాలను, వ్యవస్థను ధ్వంసం చేయడం తప్ప గత్యంతరం ఏమీ లేదని స్పష్టంగా తేలిపోతున్నది. దేశాధినేతలు, పాలకవర్గాలు ఇంతింత దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఎదిరించవలసినవాళ్లు మౌనంగా ఉండడమే విషాదం. ప్రజలు తమంతట తామే పెద్ద ఎత్తున వీరోచితంగా ప్రతిఘటిస్తుంటే వారితో చేతులు కలపవలసిన, వారికి గళం ఇవ్వవలసిన వాళ్లు నిర్లిప్తంగా ఉండడమే విచారం. తన ప్రగతిశీలత గురించి తానే గొప్పలు పోయే మధ్యతరగతి పలాయనమే విచిత్రం.
సంపాదకీయ వ్యాఖ్యలు
పాదయాత్రల రుతువులో వాగ్దానాల వెల్లువ
రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా ప్రజాద్రోహుల పాదయాత్రల భూకంపాలు చెలరేగుతున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారం కోసం, పాలకవర్గాలనూ ప్రభుత్వాలనూ నిలదీయడం కోసం దశాబ్దాల కింద ప్రారంభమైన అద్భుతమైన ప్రచార, ఉద్యమ రూపం గత దశాబ్దంగా దగాకోరుల చేతుల్లో పడి తన సార్థకతను కోల్పోతున్నది. చైనా కమ్యూనిస్టు పార్టీ నడిపిన లాంగ్ మార్చ్ గాని, బ్రిటిష్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ మద్రాసు రాష్ట్రంలోని తెలుగుజిల్లాలలో అటు చివర ఇచ్ఛాపురం నుంచి రాష్ట్ర రాజధాని మద్రాసు దాకా 1938లో సాగిన రైతు రక్షణ యాత్ర గాని, ప్రజలను చైతన్యవంతం చేసి, పోరాట పథంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో సాగాయి. కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న పాదయాత్రల ఏకైక లక్ష్యం తాము అధికారం లోకి రావడానికి ప్రజలను మాయ చేయడం. అప్పటి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించే పేరుతో 2003లో వై ఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్ఛాపురం నుంచి చేవెళ్ల దాకా నిర్వహించిన పాదయాత్ర వల్లనే ఆయనకు అధికారం దక్కిందని రాజకీయ నాయకులు ఒక సూత్రం తయారు చేసిపెట్టుకున్నారు. ఇప్పుడు ఆ సూత్రాన్నే మళ్లీ ఒకసారి ప్రయోగిస్తున్నారు. కాని ఆ పాదయాత్ర జరిగినా, జరగకపోయినా, అప్పటికే తొమ్మిదిన్నర సంవత్సరాల చంద్రబాబు పాలనలో, ప్రపంచబ్యాంకు నిర్దేశిత విధానాలతో, వరుస మూడు సంవత్సరాల కరవుతో విసిగిపోయిన ప్రజలు తెలుగుదేశం పార్టీని గద్దె దించడానికి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానికి పాదయాత్ర కొంత తోడ్పడి ఉండవచ్చు గాని అదే ఏకైక కారణం కాదు. అదే ఫార్ములాను అమలుచేస్తూ చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అక్టోబర్ 2న హిందూపురం నుంచి ‘వస్తున్నా మీకోసం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఇది మొదటి దశలో 13 జిల్లాలలో 2,340 కి.మీ. సాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల, మరొక ప్రత్యామ్నాయం కనబడక ప్రజలు ఈ యాత్రలో చంద్రబాబుకు ఆదరణ చూపుతుండవచ్చు. కాని ఇప్పటికి సాగిన మూడు వారాల యాత్రలో చంద్రబాబు ఉపన్యాసాలలో వాగ్దానాల వెల్లువ చూస్తే అవి ఆయన నోటినుంచి వస్తున్న మాటలేనా అని ఆశ్చర్యం కలుగుతున్నది. ఈ అబద్ధాలతో, బూటకపు వాగ్దానాలతో ఆయన మళ్లీ అధికారానికి వస్తానని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. మరొకపక్క రాజశేఖర రెడ్డి కూతురు, ప్రస్తుతం అక్రమార్జన కేసులలో జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి మూడువేల కి.మీ. యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలలో అటు చంద్రబాబు నాయుడైనా, ఇటు షర్మిల అయినా స్పష్టంగా, బహిరంగంగా తమకు అధికారం ఇమ్మని, తమకు అధికారం ఇస్తే ప్రజల బతుకులు బాగుపడతాయని మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారు. ప్రజలు వీరిలో ఒకరి పాలనను స్వయంగా చూసి ఉన్నారు, మరొకరి తండ్రి పాలననూ చూసి ఉన్నారు. అవినీతి, అక్రమార్జన, ప్రజల వనరులను కొల్లగొట్టడం, ప్రజలమీద భయంకరమైన నిర్బంధాన్ని, పీడనను అమలు చేయడం తప్ప ఆ పాలనలలో మరేమీ లేదు. ఈ పాదయాత్రలవల్ల యాత్రికుల పాదాలకు కొత్తగా బొబ్బలు వస్తాయేమో గాని, నిప్పుల గుండాలలోనే బతుకుతున్న ప్రజల జీవితాలకు, ఉపాధులకు తగిలిన బొబ్బలూ దెబ్బలూ ఎప్పటికీ మరపుకు రావు.
ఛావెజ్ గెలుపు ఆశాసూచికేనా?
వెనిజ్యులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ అక్టోబర్ 7న జరిగిన ఎన్నికలలో 54.5 శాతం వోట్లు సంపాదించి 2013 జనవరి 19 నుంచి 2019 జనవరి 13 దాకా అధికారంలో ఉండే అధ్యక్షుడిగా నాలుగోసారి గెలుపొందారు. వెనిజ్యులాలో బొలివారియన్ విప్లవ నాయకుడిగా, ఇరవయ్యొకటో శతాబ్ది సోషలిజం నిర్మాతగా ప్రశంసలు అందుకుంటున్న ఛావెజ్ గెలుపు ప్రగతిశీల శక్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పదమూడు సంవత్సరాల కింద, 1999లో అధికారం చేపట్టిన నాటి నుంచి కుట్రలను, హత్యా ప్రయత్నాలను, దుష్ప్రచారాలను, ఆర్థిక ఆంక్షలను, వ్యక్తిగత అనారోగ్యాన్ని ఎదుర్కొంటూ, మూడుసార్లు ఎన్నికలలో విజయం సాధించి, తనదైన శైలిలో సోషలిజం నిర్మాణానికి ప్రయత్నిస్తున్న నేతగా కూడ ఛావెజ్ అభినందనీయుడే. కాని లాటిన్ అమెరికా రాజకీయాలను అధ్యయనం చేస్తే, ఛావెజ్ ను ప్రశంసిస్తూనే ఈ విజయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని అనిపిస్తున్నది. అసలు వ్యవస్థ మారకుండా, ఉన్న వ్యవస్థలోనే ఎన్నికల ద్వారా అధికారం లోకి వచ్చి నిజమైన ప్రజానుకూల సోషలిస్టు వ్యవస్థను నిర్మించడం సాధ్యమేనా అనే ప్రశ్నకు తగిన సమాధానం చెప్పుకోకుండా ఛావెజ్ గెలుపును ప్రశంసించడం సాధ్యం కాదు. అలా ప్రశంసించడం సంస్కరణవాదులకు, ఉన్న వ్యవస్థలో చిన్నచిన్న మార్పులతో సంతృప్తి పడదలచినవారికి సరిపోతుందేమో గాని, మౌలిక పరివర్తన కోరుకునేవారు ఈ గెలుపును ఆశాసూచికగా చూడలేరు. స్వయంగా ఛావెజే తన మొదటి మంత్రివర్గ సమావేశంలో తాము ఎంత కోరుకున్నా కమ్యూన్లు స్థాపించడంలో విఫలమయ్యామని, ఆత్మవిమర్శ చేసుకుంటున్నామని అన్నారంటే తన ప్రయోగపు పరిమితులు ఆయన కూడ గుర్తించారనుకోవాలి. ఉత్పత్తి సాధనాలపై, వినియోగంపై సామాజిక యాజమాన్యం పెంచాలనీ, సంక్షేమ కార్యక్రమాల వ్యయం పెంచాలనీ, స్థానిక నిర్ణయాధికారంలో మరింత ప్రజా భాగస్వామ్యం కావాలనీ, స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలనీ, ప్రజానుకూల పన్నుల విధానం ఉండాలనీ, ఉచిత ప్రజారోగ్యం, ఉచిత విద్య, దేశంలోని చమురు నిక్షేపాలపై ప్రజలకే అధికారం ఉండాలనీ ఛావెజ్ వాదిస్తున్నారు. ఇవన్నీ జరగాలంటే రాజకీయార్థిక శక్తుల బలాబలాలు మారాలి. ప్రజావ్యతిరేకశక్తుల బలం తగ్గాలి. కాని వ్యవసాయ, చమురు రంగాలలో తప్ప మిగిలిన ఎ రంగంలోనూ, పదమూడు సంవత్సరాల తర్వాత కూడ బొలివారియన్ విప్లవ శక్తుల అదుపు పెరగలేదు. దేశంలో ఇప్పటికీ ద్రవ్య రంగంలో ఎనభై శాతం అధికారం సంపన్న వర్గాల చేతుల్లోనే ఉంది. ఉత్పత్తి, సేవా, వర్తక వాణిజ్య రంగాలలో ఇప్పటికీ ప్రైవేట్ పెట్టుబడిదే ఆధిక్యత. ప్రచార సాధనాలపై అభివృద్ధి నిరోధక సంపన్న వర్గాల గుత్తాధిపత్యమే ఉంది. లాటిన్ అమెరికాలో ప్రధాన చమురు ఉత్పత్తి దేశంగా వెనిజ్యులా చమురు ఎగుమతుల మీద మాత్రమే ఆధారపడుతోంది. ఇరుగుపొరుగు లాటిన్ అమెరికన్ దేశాల ప్రభుత్వాలతో సఖ్యత కోసం రాజీలకు సిద్ధపడుతోంది. చివరికి కొలంబియా సరిహద్దులు దాటివచ్చిన ఆ దేశపు మార్క్సిస్టు గెరిల్లాలను వెనిజ్యులా ప్రభుత్వం బంధించి కొలంబియా ప్రభుత్వానికి అప్పగించింది. ఈ లోపాలతోనైనా, తన పరిమితుల లోపలే అయినా సోషలిస్టు విధానాలను వెనిజ్యులా నిజంగా అమలు చేస్తే అమెరికా, సిఐఎ ఊరుకుంటాయా? చిలీ పునరావృతం అవుతుందా? హ్యూగో ఛావెజ్ మరొక సాల్వదార్ అయెండె అవుతారా? సోషలిజానికి దగ్గరదారి లేదని అయెండె చూపారు. ఉందని ఛావెజ్ చూపగలరా?