నేరం – శిక్ష – బాల్ ఠాక్రే – అజ్మల్ కసబ్

వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం

ముంబైలో నాలుగు సంవత్సరాల కింద 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు “పాకిస్తాన్-ప్రేరేపిత తీవ్రవాదులు” జరిపిన బాంబు దాడులలో, కాల్పులలో 164 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఆ నేరానికి పాల్పడిన వారిలో సజీవంగా దొరికిన ఒకే ఒక్క వ్యక్తి అజ్మల్ కసబ్ అనే పాకిస్తాన్ పౌరుడు. రెండు సంవత్సరాల విచారణ ప్రక్రియ తర్వాత 2010 మేలో కసబ్ కు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆ శిక్షను రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టు కూడ నిర్ధారించాయి. చివరి అవకాశంగా పెట్టుకున్నక్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి నవంబర్ 5న నిరాకరించారు. ఆ తర్వాత నవంబర్ 21 ఉదయం కసబ్ ను ఎరవాడ జైలులో ఉరితీశారు. ఈ చట్టబద్ధ హత్యకు దేశంలో చాలమంది ఆనందోత్సాహాలతో స్పందించి ఉత్సవంగా జరుపుకున్నారని వార్తలు వచ్చాయి. ప్రచార, ప్రసార సాధనాలన్నీ మితిమీరిన దేశభక్తితో ఉరి వార్తను, ఉరి తర్వాత దాన్ని సమర్థించే చర్చలను చేపట్టాయి.

ముంబై దాడులలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఈ “ప్రతీకారానికి” సంతోషం వ్యక్తం చేసి ఉంటే, వారిలోని వ్యక్తిగత ప్రతీకారవాంఛను అర్థం చేసుకోవచ్చు గాని, ముంబై తోనూ, ఆ ఘటనలతోనూ ఏ సంబంధమూ లేనివారు కూడ సంతోషపడ్డారని వార్తలు వచ్చాయి. అంటే వాళ్లు కసబ్ చేసినది ఒక నేరంగా గుర్తించి, దానికి శిక్ష పడినందుకు సంతోషిస్తున్నారనుకోవాలి. మరి కసబ్ చేసిన నేరాల కన్న ఘోరమైన నేరాలు చేసిన, కసబ్ చంపినవారి కన్న ఎక్కువ మందిని చంపిన, చంపించిన మరొక వ్యక్తి అదే ముంబైలో సరిగ్గా రెండు రోజుల ముందు చనిపోయినప్పుడు ఎవరూ సంతోషించినట్టు వార్తలు రాలేదు సరిగదా, రాష్ట్రపతి నుంచి సాధారణ ముంబైకర్ దాకా చాల మంది విచారం, సంతాపం ప్రకటించారు. ముంబై జైలు నుంచి ఎరవాడ జైలుకు మార్చి కసబ్ ను ఉరి తీయడానికి మూడు రోజుల ముందు అదే ముంబైలో చనిపోయిన వ్యక్తి పేరు బాలా సాహెబ్ ఠాక్రే. ఆయన గుండెపోటుతో మరణిస్తే ముంబైలో నిర్బంధంగా బంద్ జరిపారు. కసబ్ మూడు రోజులపాటు ఒక నేరం చేసి, 164 మందిని చంపాడేమో గాని, బాల్ ఠాక్రే అటువంటి నేరాలే నలభై సంవత్సరాలకు పైగా చేస్తూ వేలాది మంది హత్యలకు దారితీసిన రాజకీయాలు నడిపాడు. ద్వేషభావం రెచ్చగొట్టాడు. మరి ఒకరి నేరానికేమో ఉరిశిక్ష అమలు జరగగా, మరొకరి నేరానికేమో శిక్ష లేకపోవడం మాత్రమే కాదు, విచారణ కూడ జరగలేదు.

అంటే ఈ దేశంలో నేరాలన్నీ ఒకటి కావన్నమాట. అన్ని నేరాలకూ శిక్షలు పడవన్నమాట. నేరాలు చేసిన వారందరూ చట్టం ముందర సమానం కాదన్నమాట. చేసిన మనిషి ఎవరనేదాన్నిబట్టి ఆ నేరం శిక్షార్హమైన నేరంగానో, విచారణాతీత నేరంగానో మారిపోతుందన్నమాట. ఇద్దరూ మనుషులను చంపినవాళ్లే అయినప్పటికీ ప్రచార సాధనాలు ఒకరి గురించి ముష్కరుడు, కరడుగట్టిన ఉగ్రవాది, ఖతం లాంటి మాటలు వాడాయి. మరొకరి గురించి ఉద్యమ ప్రయాణం ముగించిన నేత, ఇకలేరు, శోక సంద్రం, స్తంభించిన ముంబై లాంటి మాటలు వాడాయి. అంటే నేరం, శిక్ష విషయాల్లో అందరికీ సమానంగా వర్తించే తటస్థ ప్రమాణాలు లేవన్నమాట.

మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఫరీద్ కోట్ గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు. తండ్రి తోపుడు బండి మీద రొట్టెలు అమ్ముకుంటూ తిరిగి జీవనం గడిపేవాడు. అటువంటి కటిక దారిద్ర్యంలో మగ్గుతూ, పెద్దగా చదువుకోని కసబ్ ఏదో ఒక ఉపాధి కోసం వెతుకుతూ, లష్కర్ ఎ తయెబాలో చేరి, ఫిదాయీగా మారడం ఒక ఉద్యోగంగానే చేశాడని అన్ని కథనాలూ చెపుతున్నాయి. మత భావాలతో ప్రేరేపితుడై, తాను చేయబోతున్నది మహాకార్యమని, దానికి ప్రతిఫలంగా స్వర్గంలో భగవంతుని పక్కన స్థానం దొరుకుతుందని హామీ దొరికి ముంబై మారణకాండకు పాల్పడ్డాడు. అది కసబ్ కు ప్రత్యేకం కాదు, ఇస్లాంకూ ప్రత్యేకం కాదు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఏ మతంలోని వ్యక్తి అయినా అటువంటి ఉద్యోగానికి సిద్ధపడవచ్చు. భారత్ లోనైనా, పాకిస్తాన్ లోనైనా మనుషుల్ని చంపే, నేరాలు చేసే వృత్తిని ఉద్యోగంగా ఎంచుకోక తప్పని ఆర్థిక దుస్థితిలో యువత ఉన్నందుకు వ్యవస్థలు తల వంచుకోవాలి. పండుగకు కొత్త బట్టలు కుట్టించమని అడిగితే తండ్రి కాదన్నాడని కసబ్ పద్దెనిమిదో ఏట ఇంటి నుంచి పారిపోయాడు. రెండేళ్ల పాటు చిన్న చితకా దొంగతనాలతో పొట్టపోసుకుని, 2007లో లష్కర్ ఎ తయెబా ప్రభావంలోకి వచ్చి, ఆయుధ శిక్షణ పొందాడు, ఇరవై ఒకటో ఏట 2008 నవంబర్ 23న మరొక తొమ్మిది మందితో కలిసి కరాచీలో బయల్దేరి, సముద్రం మధ్యలో భారతీయ చేపలపడవలోకి మారి ముంబైకి అతి సులభంగా చేరగలిగాడు.

వీపున సంచీతో, చంకలో ఎకె 47తో ఛత్రపతి శివాజీ టర్మినస్ లో ప్లాట్ ఫారంపై నడుస్తున్న కసబ్ అక్కడి సిసిటివి కెమెరాలకు చిక్కాడు. అక్కడా, మెట్రో సినిమా దగ్గరా కాల్పులు జరిపి, చౌపాటీ వైపు వెళ్తుండగా జరిగిన కాల్పులలో గాయపడి పోలీసులకు దొరికాడు. కాల్పులు, పేలుళ్లు జరిగిన అన్ని ప్రాంతాలలోనూ నేరస్తులు కాల్పులలో హతులైపోగా, మొత్తం నేరస్తుల బృందంలో సజీవంగా పోలీసుల చేత చిక్కినది కసబ్ మాత్రమే. పదకొండు వేల పేజీలకు మించిన ఛార్జి షీట్ లో ప్రాసిక్యూషన్ కసబ్ మీద ఎనభై నేరారోపణలు చేసింది. అసలు తనకు ఈ ఘటనలతో ఏ ప్రమేయమూ లేదని, ఉద్యోగం కోసం వెతుకులాటలో ముంబై వచ్చానని, ఈ ఘటనలు జరగడానికి మూడు రోజుల ముందే తనను పోలీసులు అనుమానాస్పదం తిరుగుతున్నాడని అరెస్టు చేశారని కసబ్ మొదట చెప్పాడు. తాను పాకిస్తాన్ పౌరుడినని, లష్కర్ ఎ తయెబా శిక్షణ ఇచ్చి ఈ విధ్వంసకాండ కోసం పంపించిందని మరొకసారి చెప్పాడు. కసబ్ ఒప్పుకోలు ప్రకటన అంటూ పోలీసులు ప్రకటించినది కనీసం మూడు సార్లు మారింది. కసబ్ తరఫు న్యాయవాదుల మీద హిందుత్వ శక్తులు చేసిన దాడులవల్ల ప్రభుత్వం మొక్కుబడిగా అందించిన న్యాయసహాయం తప్ప సమర్థమైన న్యాయసహాయం అందలేదు. ఎంతో మంది అమాయకులు మరణించి, విధ్వంసం జరిగిన నేపథ్యంలో న్యాయ విచారణ కూడ భావోద్వేగాలతో జరిగింది గాని, నిష్పక్షపాతంగా, సత్యాన్వేషణ దృష్టితో జరగలేదు. ఈ నేర విచారణ కోసమే ఏర్పాటయిన ప్రత్యేక న్యాయస్థానం చివరికి 2010 మే 6న కసబ్ కు మరణశిక్ష విధించింది. ఆ శిక్షను ముంబై హైకోర్టు, సుప్రీం కోర్టు కూడ ధృవీకరించాయి. మరణశిక్ష పడిన నేరస్తులు చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అభ్యర్థన పెట్టుకునే అవకాశం ఉంది. కసబ్ ఆ అభ్యర్థన కూడ చేయగా, ప్రతిభా పాటిల్ తన పదవీకాలంలో ఆ అభ్యర్థనను తిరస్కరించకుండా, ఆమోదించకుండా అలా ఉంచారు. రాష్ట్రపతిగా జూలై 25న పదవి స్వీకరించిన ప్రణబ్ ముఖర్జీ వందరోజులు గడవకుండానే నవంబర్ 5న ఆ అభ్యర్థనను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రెండు వారాలకే మరణశిక్ష అమలయిపోయింది.

నిజానికి కసబ్ విచారణకు, ముంబై విధ్వంసకాండ విచారణకు సంబంధించి కీలకమైన ప్రశ్నలెన్నో మిగిలే ఉన్నాయి. అంత సులభంగా ఆగంతుకులు భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించగల అవకాశం ఎలా వచ్చింది? తీర రక్షణ దళం, నావికాదళం, వైమానిక దళం, సరిహద్దు భద్రతా దళం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాధారణ పోలీసులు వంటి వందలాది, బహుశా వేలాది భద్రతా సిబ్బంది, ఈ పది మంది ఆగంతుకులు పాకిస్తాన్ సరిహద్దుల్లోంచి భారత సరిహద్దుల్లోకి వచ్చి, ముంబై తీరంలో ప్రవేశిస్తుండగా ఏం చేస్తున్నారు? భారత భద్రతా బలగాల ఈ తప్పును ఎవరూ వేలెత్తి చూపలేదు. ముంబై నగరంలో అత్యున్నత భద్రత ఉండే ప్రాంగణాలలోకి సాయుధ ఆగంతుకులు ఎలా ప్రవేశించగలిగారని విచారణే జరగలేదు. ఇంతగా విదేశీ శక్తుల, ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న నేరాన్ని సరిగా విచారించాలంటే ఆ నేరస్తులను సజీవంగా పట్టుకుని వివరాలన్నీ సంపాదించాలని భద్రతా బలగాలు అనుకోలేదు. పైగా ఒక్క సాక్ష్యమూ మిగలకుండా నేరస్తులందరినీ అక్కడికక్కడ చంపివేయడం వెనుక మరేదన్నా కుట్ర ఉందా విచారణ జరగలేదు. నేరస్తులకు ముంబైలో ఆశ్రయాలు, వాహనాలు, నిధులు సమకూర్చినవారెవరో విచారణ జరగలేదు. వారు కాల్పులకు ముందు పోలీసు వాహనాలలోనే ప్రయాణించారని ఆధారాలున్నప్పటికీ, వారు భయపెట్టి ఆ వాహనాలు చేజిక్కించుకున్నారనే కల్లబొల్లి వాదనలు తప్ప, నిజంగా ఆ వాహనాలు వారి చేతికి ఎలా చిక్కాయన్న విచారణ జరగలేదు. ఆ దాడులలో సూటిగా కాల్పులకు గురయి మరణించిన పోలీసు అధికారి హేమంత్ కర్కారే అంతకుముందు హిందుత్వవాదులను ఎదిరించిన చరిత్రగలవాడని, ఆయన మీద హిందుత్వవాదులే ఎక్కుపెట్టి ఉండవచ్చునని వచ్చిన ఆరోపణలకు నమ్మదగిన జవాబు లేదు.

కనుక మొత్తం మీద చూస్తే కసబ్ నేరస్తుడని ఒప్పుకున్నా మిగిలిపోయే ప్రశ్నలున్నాయి. నేరస్తుడు కాకపోవచ్చునని, పోలీసులు బనాయించే సాధారణ తప్పుడు కేసులలో ఇదీ ఒకటి కావచ్చుననే అనుమానాలూ ఉన్నాయి. ఇంత అనుమానాస్పదమైన పునాది మీద ఒక మనిషి ప్రాణాలను చట్టబద్ధంగా తీయడం జరిగిపోయింది. అది కూడ అసాధారణమైన తొందరపాటుతో, రహస్యంగా జరిగిపోయింది.

ఇక ఈ మరణశిక్ష అమలు చేసిన సందర్భం చూస్తే ప్రభుత్వం శిక్ష అమలు జరపడం కన్న, చట్టబద్ధ నిబంధనలు పాటించడం కన్న తన స్వప్రయోజనాలు ముఖ్యమని భావించిందని అర్థమవుతుంది. ముంబై దాడులు జరిగి నాలుగు సంవత్సరాలు నిండడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు ప్రతీకాత్మకంగా ఈ శిక్ష అమలు జరిగింది. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి మీద వివాదాస్పదమైన పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు ఈ ఉరిశిక్ష అమలయింది. మరొక మూడు వారాల్లో జరగనున్న గుజరాత్ ఎన్నికలలో ప్రచారాస్త్రంగా వాడుకోవడానికి, మోడీ కన్న తామే ఎక్కువగా ముస్లిం వ్యతిరేకులమని, హిందూ ప్రజల సంరక్షకులమని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ఈ ఉరిశిక్షను అమలు చేసింది. మరణశిక్షను రద్దు చేయాలనే తీర్మానానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి మాట్లాడిన రోజునే ఈ మరణశిక్ష అమలయింది.

కసబ్ మరణశిక్ష అమలు కాగానే హిందుత్వ శక్తులు ‘ఇక అఫ్జల్ గురును ఉరితీయాలి’ అనే ప్రచారం ప్రారంభించారు. స్వయంగా మోడీ తన ట్విట్టర్ సందేశంలో ఈ మాట రాశాడు. అఫ్జల్ గురు పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు. ఉరిశిక్ష 2004లో విధించబడినా, ఇంకా అమలు కాలేదు. కాని అఫ్జల్ గురు పార్లమెంటుపై దాడికి కుట్ర పన్నాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది. “ఈ నిందితుడు నేరం చేశాడని నమ్మదగిన సాక్ష్యాధారాలేమీ లేనప్పటికీ, నేరస్తుడికి మరణశిక్ష విధిస్తేనే, సమాజపు సామూహిక అంతరాత్మ సంతృప్తి చెందుతుంది” అని నిస్సిగ్గుగా, నేరం చేసినట్టు రుజువు చేయకపోయినా ప్రతీకార వాంఛను సంతృప్తి పరచడం కోసం ఉరిశిక్ష విధించామని స్వయంగా సుప్రీంకోర్టు తీర్పులోనే రాశారు.

మరొకవైపు నుంచి చూస్తే, సరిగ్గా కసబ్ చేసినలాంటి నేరాలే భారత ప్రభుత్వం తరఫున పాకిస్తాన్ లో చేసిన సరబ్ జిత్ సింగ్ ఉన్నాడు. లాహోర్ లోనూ, ఫైసలాబాద్ లోనూ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో సరబ్ జిత్ నేరస్తుడని, సరిగ్గా భారత న్యాయస్థానాలు కసబ్ విషయంలో విచారణ జరిపి తేల్చినట్టే, పాకిస్తాన్ న్యాయస్థానాలు నిర్ధారించి 1991లోనే మరణశిక్ష విధించాయి. ఆ మరణశిక్ష ఇంకా అమలు చేయలేదు. సరబ్ జిత్ కు క్షమాభిక్ష పెట్టాలని, వదిలెయ్యాలని, భారత ప్రభుత్వం ఇన్నాళ్లుగా పాకిస్తాన్ ప్రభుత్వంతో రాయబారాలు నడుపుతున్నది. మరి లాహోర్, ఫైసలాబాద్ పేలుళ్లు, మారణకాండ శాంతియుతమైనవీ, ముంబై పేలుళ్లు, మారణకాండ మాత్రం నేరాలూ ఎలా అవుతాయి?

సమాజంలో శాంతి భద్రతలు సక్రమంగా కొనసాగాలని, ఆ శాంతి భద్రతలను భంగపరచడం నేరమని, ఆ నేరం చేసిన వారికి శిక్ష విధించాలని, ఆ శిక్ష ఇకముందు నేరం చేయదలచినవారికి బెదురుగా నిలుస్తుందని, నేరం – శిక్ష ప్రక్రియ సమాజాన్ని శాంతిభద్రతలతో ఉంచుతుందని చాల మంది నమ్ముతారు. ప్రతి నేరానికీ శిక్ష ఉండాలనేది సాధారణంగా అంగీకరించదగిన విలువే. కాని నేరం అంటే ఏమిటి అని నిర్వచించబూనుకుంటే, సమాజంలో నేరాలుగా వేటిని పరిగణిస్తున్నారో చూస్తే, శిక్షల తీరును, పర్యవసానాలను చూస్తే ఇది అంత సులభమైన వ్యవహారం కాదని తేలిపోతుంది. ఒక వ్యక్తో, ఒక సమాజమో ఏదయినా చర్యను నేరం అనుకున్నంత మాత్రాన అది నేరం కాదు, చట్టంలో క్రోడీకరించబడినది మాత్రమే నేరం అవుతుంది. మరి చట్టాలను తయారుచేసే అధికారం ఉన్నవారు తమ ఇష్టారాజ్యంగా నేరాలను నిర్వచిస్తే, వాటికి శిక్షలను విధిస్తే అంగీకరించవలసిందేనా? అందుకే నేరం – శిక్ష ప్రక్రియ చాల సంక్లిష్టమైనది. అనేక చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలతో కలగలిసినది.

అసలు ఒక నేరానికి విధించే శిక్ష సమాజంలో ఆ నేరాలు మళ్లీ జరగకుండా శిక్షణ ఇవ్వగలిగిన, మానసిక పరివర్తన తేదగిన సామర్థ్యం కలిగినదై ఉండాలి. అసలు సమాజంలో ఏ మూలకారణాలవల్ల ఆ నేరం జరగడానికి అవకాశం వస్తున్నదో ఆ మూలకారణాలను తొలగించగలిగినదీ, తగ్గించగలిగినదీ అయి ఉండాలి. కాని ప్రస్తుత శిక్షలేవీ అంత విశాలమైన సంస్కరణ దృష్టిగానీ, రాజకీయార్థిక దృష్టిగానీ కలిగినవి కావు. తమ పాలన సజావుగా సాగడం కోసం బ్రిటిష్ వలసవాదులు రాసిపెట్టిన చట్టాలను యథాతథంగా అమలుచేస్తున్న భారత పాలకులు నేరం – శిక్ష ప్రక్రియ గురించి అంత నిశితమైన వైఖరి తీసుకుంటారని ఆశించలేం.

కాని మామూలు మధ్యతరగతి వ్యాఖ్యాతలు శిక్షలను, ముఖ్యంగా మరణశిక్షను సమర్థించేటప్పుడు, ఇకముందు అటువంటి నేరం జరగకుండా బెదురు కలిగించేలా శిక్ష ఉండాలని వాదిస్తారు. సమాజంలో ఎంత తీవ్రమైన శిక్షలు అమలవుతున్నప్పటికీ మళ్లీ మళ్లీ పదే పదే అవే నేరాలు జరుగుతూ ఉండడమే ఈ వాదన డొల్లవాదన అని చెప్పడానికి ఉదాహరణ. నిజంగానే శిక్షలు బెదురుగా పనిచేస్తే ఇన్ని నేరాలు జరుగుతూనే ఉండేవి కావు. నిజానికి ఈ వాదన చేసేవారికి నేరాలు ఎందుకు జరుగుతాయో తెలియదు. అసలు నేరం అంటే ఏమిటి, పాలకవర్గాలు, చట్టాలు నిర్వచించినదే నేరమా వంటి తాత్విక ప్రశ్నలను కాసేపు పక్కన పెట్టినా, నేరాలు జరగడానికి మూడు రకాల కారణాలు ఉంటాయి: తమ చుట్టూ ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల ఒత్తిడివల్ల జరిగేవి మొదటి రకం. అటువంటి ఒత్తిడి వల్ల నేరాలు జరుగుతాయి గనుక ఆ నేరాలను ఏవో బెదురులు చూపి ఆపడం సాధ్యం కాదు. రెండో రకం నేరాలు క్షణికావేశానికి గురయి చేసేవి. ఆ నేరాలు స్వభావం వల్లనే మనుషులు ఉద్దేశపూర్వకంగా, ఆలోచించి చేసేవి కావు. అప్పటికప్పుడు భావోద్వేగం తోసుకువస్తే చేసేవి. ఆ భావోద్వేగంలో తాను చేసేది నేరమని, దానికి శిక్ష ఉంటుందని బెదిరే సమయం గాని, ఆలోచన గాని ఉండే అవకాశం లేదు. ఇక మూడో రకం నేరాలు పథకం ప్రకారం, ఉద్దేశ పూర్వకంగా, నేరానికి సంపూర్ణ ప్రణాళిక రచించుకుని, వ్యూహం పన్ని చేసే నేరాలు. ఈ నేరస్తులకు చట్టం అనేది ఉందని, తాము చేసే నేరానికి ఫలానా ఫలానా శిక్షలు ఉన్నాయని సంపూర్ణంగా తెలుసు. వారికి ఆ శిక్షల బెదురే ఉండదు. అంటే ఎలా చూసినా శిక్ష అనేది నేరస్తులకు బెదురుగా పనిచేస్తుందని, అందువల్ల మరణశిక్ష లాంటి పెద్దశిక్షలు ఉండవలసిందేనని చేసే వాదనలకు అర్థం లేదు. అవి ఎప్పటికీ తాము అనుకున్న ఫలితాన్ని కూడ సాధించలేవు.

మరి మరణశిక్షకు, లేదా ఇటువంటి పెద్ద శిక్షలకు సమర్థన ఎక్కడినుంచి వస్తున్నది? ఇవి కేవలం ప్రతీకారవాంఛ నుంచి పుట్టినవి. అవతలివాళ్లు మనకు నష్టం, బాధ కలగజేశారు కాబట్టి, వాళ్లకు మనం అంతే సమానమైన నష్టాన్ని, బాధను కలగజేయాలి అని బహుశా ప్రతివ్యక్తీ అనుకుంటారు. వ్యక్తిగత స్థాయిలో ఉండే ఈ ప్రతీకారవాంఛ వల్లనే కసబ్ ఉరితీత జరగగానే ముంబై మారణకాండ బాధిత కుటుంబాలు సంతోషించాయి. కాని కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఈ ఆదిమ, మధ్యయుగాల ప్రతీకార న్యాయం నాగరికమైనది కాదని కొన్ని శతాబ్దాలుగా మానవజాతి ఆలోచిస్తున్నది. వ్యక్తి తన పట్ల  జరిగిన నేరానికి ప్రతీకారం తీసుకోవాలనే కోరికతో కంటికి కన్ను, పంటికి పన్ను కోరుతాడని, అందువల్ల ఆ ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని బాధిత వ్యక్తికి ఇవ్వగూడదని, సమాజంలోని భిన్న ప్రయోజనాల మధ్య సమన్వయం కుదిర్చే రాజ్యమే ఆ ప్రతీకార బాధ్యతను వహిస్తుందని, ఆ ప్రతీకారాన్ని నాగరిక పద్ధతుల్లో సాధిస్తుందని ఆధునిక చట్టబద్ధ పాలనా భావన చెపుతుంది. అందుకే మిగిలిన నేరాలన్నీ వ్యక్తిగత స్థాయిలో ఉన్నా, హత్యా నేరాలలో మాత్రం బాధితుల తరఫున ప్రభుత్వమే వాదిస్తుంది. కంటికి కన్ను, పంటికి పన్ను అని ప్రతి ఒక్కరూ అనుకుంటే మొత్తం సమాజమే గుడ్డిదై పోతుంది అని గాంధీ అన్న మాట మరణశిక్షను దృష్టిలో పెట్టుకున్నదే.

ఈ ప్రతీకారం గురించి, నేరానికి తగిన శిక్ష ఉండడం గురించి వాదించే మధ్యతరగతి అన్ని నేరాల గురించీ ఇలాగే ఆలోచిస్తుందా అని చూస్తే దాని వాదనల దివాళాకోరుతనం మరింత బయటపడుతుంది. అణగారినవర్గాలు, అధికారంలో లేని వర్గాలు, నిస్సహాయ వ్యక్తులు, బృందాలు చేసే “నేరాల”కు కఠిన శిక్షలు విధించాలని, మరణశిక్ష తప్పనిసరిగా ఉండాలనీ వాదించేవారు, ఆధిపత్య వర్గపు నేరాల విషయంలో, పాలకవర్గ విధానాలే నేరాలుగా మారే సందర్భాలలో తమ నేర నిర్వచనాన్ని మార్చేసుకుంటారు. ఆస్తి, అగ్రవర్ణం, మెజారిటీ మతం, పురుషాధిపత్యం, పెద్ద వయసు, అభివృద్ధి చెందిన ప్రాంతం వంటి అవకాశాలు ఉన్నవారు చేసే నేరాలు నేరాలుగా కనబడవు. వాటికి శిక్షలు విధించాలని ఎవరూ గొంతెత్తి పలకరు. ఇక అధికారాన్ని చేపట్టిన పాలకవర్గ విధానాల పర్యవసానాలను నేరాలుగా గుర్తించడం, వాటికి శిక్షలు పడాలని కోరడం అసాధ్యమే అవుతుంది.

కసబ్ కొన్ని మరణాలకు, 164 మందో, 167 మందో మరణించడానికి ప్రత్యక్ష బాధ్యుడు గనుక ఉరి తీయవలసిందే అని వాదించేవారు అటువంటి మరణాలకే కారణమవుతున్న ఇతర నేరస్తుల గురించి పట్టించుకుంటారా? ఉత్పత్తి సాధనాలను తమ గుప్పెట్లో పెట్టుకుని, అశేష పీడిత ప్రజానీకాన్ని ఆకలికీ, చీకటికీ, అనారోగ్యానికీ, అవిద్యకూ, నిరుద్యోగానికీ గురిచేస్తున్న, అందువల్ల కోట్లాది మంది మరణాలకు కారణమవుతున్న నేరస్తులను ఎలా శిక్షించాలి? తోటి మానవుల పట్ల కుల వివక్ష చూపుతూ కోట్లాది మందిని అవమానానికీ, నిరాదరణకూ, దారిద్ర్యానికీ గురిచేస్తున్న అగ్రవర్ణాల నేరాలు ఎక్కడయినా నమోదవుతున్నాయా, వాటికి శిక్షలు పడుతున్నాయా? స్త్రీని అసమానంగా చూసి, భ్రూణ హత్యల నుంచి వరకట్నపు చావుల దాకా తక్షణ హత్యలకూ, బతికి ఉండనిచ్చినా దుర్మార్గమైన అసమానతకూ వివక్షకూ, దీర్ఘకాలిక హత్యలకూ గురిచేస్తున్న పితృస్వామిక, పురుషాధిపత్య అహంకారాన్ని నేరంగా గుర్తిస్తారా? ఆ నేరానికి శిక్ష విధిస్తారా?

పోనీ, అవన్నీ సామాజిక వ్యవస్థలో, భావజాలంలో భాగమైన, అలవాటైన స్వభావాలని అనుకున్నా, మన కళ్ల ముందర, మూడువేల మందిని ఊచకోతకోసిన నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని, రేపో మాపో ప్రధానమంత్రి కావాలని కలలు కంటూ, ఆయన చేసిన, చేయించిన హత్యలలో ఇరవయ్యో వంతు కూడ చేయని కసబ్ ను మాత్రం ఉరితీయవలసిందే అని వీరాలాపాలకు దిగడం సవ్యమేనా? లక్షన్నరమంది రైతుల ఆత్మహత్యలకు ప్రత్యక్షంగా కారణమైన నూతన ఆర్థిక విధానాలను ఈ దేశంలోకి తెచ్చిన మన్మోహన్ సింగ్ ను ఆ హత్యలు చేసినందుకే ఆర్థిక మంత్రినుంచి ప్రధాన మంత్రిగా పదోన్నతి ఇచ్చి, పదవీకాలాన్ని రెండో దఫా పొడిగించి, నూట అరవై మందిన హత్య చేసిన వాడిని మాత్రం ఉరితీయవలసిందే అని అడగడం భావ్యమేనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతున్నదని ఒక విధాన ప్రకటన చేసి, దాన్ని ఉపసంహరించుకుని, నిరాశా నిస్పృహలను వ్యాపింపజేసి వెయ్యి మందిని ఆశోపహతులను చేసి హత్య చేసిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండగా, నూట అరవై మందిని చంపినవాడు మాత్రం ఉరికంబం ఎక్కవలసిందేనా? కనీసం లెక్కల ప్రకారం చూసినా పెద్ద నేరస్తులను వదిలిపెట్టి, చిన్న నేరస్తులను బలి తీసుకోవడం న్యాయమా?

అవన్నీ కూడ పోనీండి, కసబ్ ఉరితో ఓలలాడేవాళ్లు అంతకు మూడు రోజుల ముందు మరణించిన బాల్ ఠాక్రే గురించి అయినా ఆలోచించవద్దా? ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన శివసేన అనే మతోన్మాద పార్టీని, సామ్నా అనే పత్రికను నడిపేవారు. ఆయన రాసిన ఏ వ్యాసం చదివినా, ఆయన ఉపన్యాసాలు విన్నా ఆయనను మించిన తీవ్రవాది ఎవరూ ఉండరని తేలిపోతుంది. ఆ రచనలు, ఉపన్యాసాలు అలా ఉంచి, 1960ల చివరినుంచి చనిపోవడానికి కొద్ది ముందుదాకా బొంబాయి లోనూ, మహారాష్ట్ర లోనూ మరాఠీలు కానివారందరి మీద, ప్రత్యేకించి ముస్లింల మీద విపరీతమైన ద్వేషభావనను రెచ్చగొట్టిన హిందుత్వ తీవ్రవాది ఆయన. 1966లో దసరా ఊరేగింపులో భాగంగా బొంబాయిలోని దక్షిణ భారత హోటళ్ల మీద, దుకాణాల మీద దాడులతో ప్రారంభించి, 1969లో అరవై మంది కన్నడిగులను హత్య చేసిన, వందలాది మందిన గాయపరచిన భాషా కల్లోలాలు రెచ్చగొట్టాడు. సిపిఐ శాసనసభ్యుడు కృష్ణ దేశాయి, దళిత్ పాంథర్ కవి భగవతీదళ్ జాదవ్ లతో సహా వందలాది మంది భిన్నస్వరాలను హతమార్చిన ఘన చరిత్ర ఆయనది. దళితుల మీద, దక్షిణాది వారి మీద, సిక్కుల మీద, ముస్లింల మీద, తాజాగా బిహారీల మీద ఆయన నేతృత్వంలోని శివసేన సాగించిన దాడుల పూర్తి జాబితా పేజీలకు పేజీలు అవుతుంది.    1993లో వెయ్యి మంది మరణించిన ముంబై అల్లర్లకు ప్రధాన కారణం ఆయన రచనలేనని, శివసైనికులకు ఆయన చేసిన ఉద్బోధలేనని బి ఎన్ శ్రీకృష్ణ న్యాయవిచారణ కమిషన్ నిర్ద్వంద్వంగా ప్రకటించింది. 1997లో రమాబాయి అంబేద్కర్ నగర్ హత్యాకాండలో ఆయన శివసైనికులు ఒక్కరోజు పది మంది దళితులను హత్య చేశారు. మొత్తం మీద ముంబైలో, విదర్భలో బహుశా వేలాది మందిని ఊచకోత కోసిన ఘటనలకు రూపశిల్పి. వ్యూహకర్త బాల్ ఠాక్రే. మరి మన కళ్లముందరి ఈ హంతక సామ్రాజ్య చక్రవర్తికి సంతాప, శోక సందేశాలేమిటి? అటువంటి హంతక సామ్రాజ్యంలో చక్రవర్తో, సామంతుడో కూడ కాదు, పొట్టకూటికి చేరిన ఉద్యోగధర్మంగా, లేదా తలకెక్కిన మతోన్మాదపు హింసాకాండగా అటువంటి హత్యలే కొన్ని చేసిన ఒక చదరంగపు పావును చంపేసి, చంపినందుకు ఆనందించి, ఇంకా చంపాలని రెచ్చగొడుతూ….ఎటు పోతున్నాం మనం?

ఈ సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేరం – శిక్ష ప్రక్రియ గురించి, ముఖ్యంగా మరణ శిక్ష గురించి, అధికారవర్గపు మారణకాండల నేరాల గురించి, వారికి వేయవలసిన శిక్షల గురించి కాస్త ఆలోచించవలసి ఉంది.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s