భారత్ – చైనా యుద్ధం 1962 – నిజానిజాలు

వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం

 దేశ అంతర్గత విధానాల గురించి ప్రభుత్వాలను, పాలకవర్గాలను ఎంతో తీవ్రంగా విమర్శించే వారికి కూడ విదేశాంగ విధానం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడలేని దేశభక్తీ ఆవరిస్తుంది. అంతర్గత విధానాలలో ప్రభుత్వాలు, పాలకవర్గాలు చెప్పేవన్నీ అబద్ధాలే అని కచ్చితంగా నమ్మేవాళ్లు కూడ, విదేశాల విషయంలో, ముఖ్యంగా యుద్ధాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు, పాలకవర్గాలు చెప్పేవన్నీ అక్షర సత్యాలేనని నమ్ముతారు, వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించడం కాకుండా, మన పాలకవర్గాలు చెప్పేదంతా నిజమన్నట్టు, విదేశీ పాలకులు చెప్పేదంతా అబద్ధమన్నట్టు తమను తాము వంచించుకుంటారు, ఇతరులను వంచిస్తారు. “మన ప్రభుత్వం” చెప్పేదానిలో కొంతయినా అబద్ధం ఉండవచ్చునని, విదేశీ ప్రభుత్వం చెప్పేదానిలో కొంతయినా నిజం ఉండవచ్చునని కూడ అనుమానించరు. ఇక “మన ప్రభుత్వం” చెప్పేవి పచ్చి అబద్ధాలుగా, అవతలి ప్రభుత్వం చెప్పేవి సగమైనా నిజాలుగా ఉండే సందర్భం వస్తుందని అనుకోనే అనుకోరు. అసలు చారిత్రక పరిణామాల గురించి మన, ఇతర అనే దృష్టితో కాక వాస్తవికంగా చూడాలనే అవగాహన వాళ్లలో కొరవడుతుంది. అటువంటి సమయాలలో దేశభక్తి రసం కుప్పలుతెప్పలుగా ప్రవహిస్తుంది. “మన” మీద “వాళ్ల” దాడి అని, “మనం” అంతా ఒకటయినట్టు, “మన” పాలకవర్గాలు మన దేశం కోసమే ఉన్నట్టు అర్ధసత్యాలు, అబద్ధాలు, అతిశయోక్తులు వెల్లువెత్తుతాయి. మొత్తం మీద చరిత్ర గురించి తలకిందుల అవగాహన రాజ్యమేలుతుంది.

ఇటీవలి భారత చరిత్రలో ఇటువంటి తలకిందుల అవగాహన పెచ్చరిల్లిన సందర్భాలలో 1962లో భారత దేశానికి, చైనాకు జరిగిన యుద్ధం ప్రధానమైనది. (అసలు భాషే ఎలా ఉంటుందో చూడండి – అది భారత ప్రభుత్వానికి, చైనా ప్రభుత్వానికి మధ్య, లేదా ఆ ప్రభుత్వాలు నడిపే సైనిక బలగాల మధ్య జరిగిన యుద్ధం కాగా, దాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంగా చెప్పడం సాధారణమై పోతుంది. దేశమంటే మట్టి కాదని మాత్రమే కాదు, ప్రభుత్వాలు కూడ కాదని, మనుషులని ఆలోచిస్తే, ఆ మనుషులకూ ఈ మనుషులకూ మధ్య, ఆ దేశానికీ ఈ దేశానికీ మధ్య యుద్ధం జరగవలసిన అవసరమే లేదు!)

భారత చైనా యుద్ధం మొదలై ఈ అక్టోబర్ 20కి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా కూడ ఇటువంటి భావోద్వేగాల వెల్లువతో అనేక పత్రికల్లో లెక్కలేనన్ని వార్తలు, వ్యాసాలు వచ్చాయి. మామూలుగా ప్రగతిశీల పత్రికలుగా పేరుపొందినవాటిలో కూడ ఇటువంటి వ్యాసాలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చాల వచ్చాయి. నెహ్రూ మంచితనం, అమాయకత్వం వల్ల యుద్ధంలో భారత్ ఓడిపోయిందని, వైమానిక దళాన్ని వాడి ఉంటే గెలిచేదని, బారత భూభాగాన్ని చైనా దురాక్రమించిందని, భారత్ శాంతికాముక దేశం కాగా చైనా దురాక్రమణదారు అని యాభై ఏళ్లుగా వినిపించిన వాదనలే మళ్లీ వినిపించాయి. చారిత్రక వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని, భారత ప్రభుత్వం అప్పుడు తప్పు చేసి ఉండే అవకాశం ఉందని, భారత ప్రజలకు ఇన్నాళ్లుగా ఈ యుద్ధం గురించి అందుతున్న సమాచారమంతా నిజం కాదని ఏవో ఒకటి రెండు పత్రికలలో ఎవరో ఒకరిద్దరు రచయితలు మాత్రమే రాశారు.

నిజానికి ఈ యాభై ఏళ్లలో కూడ భారతదేశంలో అప్పుడప్పుడు, అక్కడక్కడ ఈ యుద్ధం గురించిన నిజాలు బైటికి రాకపోలేదు. లండన్ కు చెందిన ది టైమ్స్ పత్రిక దక్షిణాసియా విలేఖరిగా 1959 నుంచి 1967 దాకా ఢిల్లీలో పనిచేసిన బ్రిటిష్ జర్నలిస్ట్ నెవిలీ మాక్స్ వెల్ రాసిన ‘ఇండియాస్ చైనా వార్’ (భారతదేశపు చైనా యుద్ధం) 1970లో ప్రచురితమై చాల సంచలనం సృష్టించింది. సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, భారత ప్రభుత్వమే దుందుడుకుగా వ్యవహరించిందని, చైనా బాధితురాలని ఆయన పూర్తిగా భారత ఆధారాల పునాదిగానే రుజువు చేశారు. మొదట బ్రిటన్ లో అచ్చయిన ఆ పుస్తకాన్ని భారతదేశంలో జైకో సంస్థ 1970 సెప్టెంబర్ లో ప్రచురించింది. నవంబర్ కల్లా పునర్ముద్రణ అవసరమయింది. “ఆ పుస్తకాన్ని భారత ప్రభుత్వం నిషేధించిందని అభిప్రాయం ఉంది గాని అది నిజం కాదు” అని ఈ అక్టోబర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్స్ వెల్ అన్నారు. యుద్ధం జరిగిన యాభై ఏళ్లయిన సందర్భంగా ఔట్ లుక్ పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూలో ఎనభై ఆరు సంవత్సరాల మాక్స్ వెల్ భారత ప్రజలు ఇంతకాలంగా వింటున్న అబద్ధాల నుంచి బయటపడాలని, తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలెన్నో చెప్పారు.

సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వ వైఖరి ఆమోదయోగ్యంగా లేదని నెహ్రూ సన్నిహిత మిత్రుడు, 1953లో ఏర్పడిన భారత – చైనా మిత్రమండలి తొలి అధ్యక్షుడు పండిట్ సుందర్ లాల్ కూడ అప్పుడే రాశారు. ఆ కాలపు అధికారిక, అనధికారిక పత్రాల మీద సాధికారికమైన, సుదీర్ఘమైన పరిశోధన జరిపిన చరిత్రకారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ఎ జి నూరాని 2011లో ప్రచురించిన ‘ఇండియా – చైనా బౌండరీ ప్రాబ్లమ్ 1846-1947’ లో కూడ సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఎంత అనుచితమో, అచారిత్రకమో రుజువు చేశారు. చైనా అధికారిక పుస్తకాలు, చైనా రచయితలు, చైనా అనుకూల రచయితలు మాత్రమే కాదు, దేశదేశాలలోని స్వతంత్ర పరిశోధకులెందరో ఈ వివాదంలో భారత ప్రభుత్వపు అపసవ్యపు మొండి వైఖరిని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపారు.

అయినా ఈ వాస్తవాలన్నిటినీ పక్కనపెట్టి దేశంలోని, రాష్ట్రంలోని ప్రధాన పత్రికలన్నీ 1962 యుద్ధంలో చైనాదే పూర్తి తప్పు అన్నట్టుగా, చైనా భారత భూభాగాన్ని దురాక్రమణ చేసినట్టుగా, జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టే రచనలు అచ్చు వేశాయి. మరి ఈ సరిహద్దు వివాదం నిజానిజాలేమిటి? ఆ వివాదంలో ప్రధానమైన అంశాలు ఏమిటి? ఆ వివాదం యుద్ధానికి ఎలా దారి తీసింది? యుద్ధ పర్యవసానాలేమిటి?

చైనాతో భారత దేశానికి ఉత్తర కొస నుంచి ఈశాన్యం దాకా హిమాలయ పర్వత ప్రాంతాలలో 3,225 కి.మీ. సరిహద్దు ఉంది. ఆ ప్రాంతపు భౌగోళిక దుర్గమస్థితి వల్ల ఈ సుదీర్ఘ సరిహద్దు రేఖలో చాల భాగం కచ్చితంగా, నిర్దిష్టంగా, నిర్దుష్టంగా నిర్ధారణ కాలేదు. దేశ పటాలలో నమోదు కాలేదు. పైగా ఈ సరిహద్దు ప్రాంతంలో కాశ్మీర్ వంటి వివాదాస్పద ప్రాంతాలు, నేపాల్, సిక్కిం, భూటాన్ వంటి దేశాలు ఉన్నాయి. (స్వతంత్ర దేశంగా ఉండిన సిక్కింలోకి భారత ప్రభుత్వం 1975 ఏప్రిలో తన సైన్యాన్ని పంపి దురాక్రమించింది. అప్పటిదాకా రాచరిక పాలనలో ఉండిన ఆ దేశాన్ని తనలో అంతర్భాగమైన రాష్ట్రంగా 1975 మే 16న ప్రకటించింది). ఈ సుదీర్ఘ సరిహద్దు ప్రాంతంలో లడ్డాఖ్ ను ఆనుకుని ఉన్న అక్సాయి చిన్, అప్పటి ఈశాన్య సరిహద్దు ప్రాంతం (ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్) సరిహద్దులలో ఉన్న మెక్ మోహన్ రేఖ 1962 యుద్ధానికి తక్షణ కారణమైన, యుద్ధం జరిగిన ప్రధాన స్థలాలు.

అక్సాయి చిన్

అక్సాయి చిన్ సముద్ర మట్టం నుంచి 16,000 అడుగుల నుంచి 23,000 అడుగుల ఎత్తున ఉన్న ఎడారి. అక్కడక్కడా ఉప్పునీటి సరస్సులు మాత్రం ఉన్న ఈ 38,000 చ.కి.మీ. ప్రాంతంలో మానవ ఆవాసాలేమీ లేవు. ఈ ప్రాంతానికి లడ్డాఖ్ వైపు నుంచి, అంటే భారతదేశం వైపు నుంచి వెళ్లే మార్గం కూడ లేదు. అటువైపున అక్సాయి చిన్ కు ఇటువైపున భారత భూభాగానికీ మధ్యన దుర్గమమైన కారకోరం పర్వతశ్రేణి ఉంది. ఈ ప్రాంతం చైనాలోని క్సిన్ జియాన్ రాష్ట్రం (స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతం) లోకి చొచ్చుకుని ఉంది. టిబెట్ నుంచి క్సిన్ జియాంగ్ లోకి వెళ్లే ప్రాచీన వ్యాపార బిడారుల రహదారి అక్సాయి చిన్ మీదుగా వెళుతుంది. పంజాబ్ పాలకులు 1834లో జమ్మూ సంస్థానాన్ని తమ రాజ్యంలో విలీనం చేసుకున్నప్పుడు, లడ్డాఖ్ లో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడ ఆక్రమించుకున్నారు. పంజాబ్ పాలకులు ఇంకా ముందుకువెళ్లి 1841లో టిబెట్ మీద దాడి చేశారు. ఆ దాడిని తిప్పికొడుతూ వారిని తరుముతూ చైనా సైన్యాలు లడ్డాఖ్ లోని లే దాకా వచ్చాయి. ఈ ఘర్షణ తర్వాత 1842 సెప్టెంబర్ లో ఒకరి భూభాగంలోకి మరొకరు చొరబడగూడదని పంజాబ్ పాలకులకూ చైనా పాలకులకూ మధ్య ఒప్పందం కుదిరింది.

కాని 1846లో పంజాబ్ పాలకులు బ్రిటిష్ వారి చేతుల్లో ఓడిపోవడంతో లడ్డాఖ్ బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు సరిహద్దు విషయమై చైనా పాలకులతో చర్చలు జరపడానికి ప్రయత్నించారు గాని, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. సహజమైన, నైసర్గికమైన సరిహద్దులను గుర్తించాలని, ఒకరి జోలికి ఒకరు రాగూడదని అలిఖిత ఒడంబడిక కుదిరినట్టయింది. ఈ ప్రాంతానికి ఉత్తర కొసన ఉన్న కారకోరం కనుమను, దక్షిణ కొసన ఉన్న పాంగాంగ్ సరస్సును సహజ సరిహద్దులుగా గుర్తించడం జరిగింది గాని ఈ రెంటి మధ్య ఉన్న 200 కి.మీ. పైగా దూరానికి సరిహద్దు రేఖ లేకపోయింది. అటువంటి సరిహద్దు రేఖను తయారుచేయడానికి 1865లో సర్వే ఆఫ్ ఇండియా అధికారి డబ్ల్యు ఎచ్ జాన్సన్ ప్రయత్నించాడు గాని అప్పటికి క్సిన్ జియాంగ్ రాష్ట్రంలో తిరుగుబాటు జరిగి, అక్కడ చైనా అధికారం కోల్పోయినందువల్ల ఆ జాన్సన్ రేఖ ఇరుదేశాల ఆమోదిత రేఖ కాలేకపోయింది. ఈ రేఖను తప్పుల తడకగా తయారుచేశాడని బ్రిటిష్ ప్రభుత్వమే మందలించడంతో జాన్సన్ తన పదవికే రాజీనామా చేసి వెళ్లిపోయాడు. తర్వాత 1890లలో క్సిన్ జియాంగ్ మళ్లీ చైనా అధీనంలోకి వెళ్లింది. చైనా బలహీనపడుతూ రష్యా బలం పుంజుకోవడంతో ఈ ప్రాంతం మీద తన పట్టు ఉండాలనుకున్న బ్రిటిష్ ప్రభుత్వం తరఫున సైనికాధికారి జాన్ అర్దాఘ్ మరొక రేఖ తయారుచేశాడు. ఈ రేఖ జాన్సన్ రేఖకు కొద్ది మార్పులతో తయారయింది గనుక దీన్ని జాన్సన్ – అర్దాఘ్ రేఖ అని పిలుస్తారు.

ఆ తర్వాత బ్రిటన్ కూ చైనాకూ స్నేహం బలపడి, అక్సాయి చిన్ తనదేనని చైనా వాదించడంతో కారకోరం పర్వత సానువులు సహజ సరిహద్దుగా, అక్సాయి చిన్ ను చైనాలో అంతర్భాగంగా చూపుతూ బ్రిటిష్ ప్రభుత్వం మెక్ కార్ట్ నీ – మెక్ డొనాల్డ్ రేఖను తయారుచేసి 1899లో చైనా ప్రభుత్వానికి అందజేసింది. నైసర్గిక అంశాలను ప్రధానంగా తీసుకున్న ఈ సరిహద్దు రేఖ సింధూనది పరీవాహక ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో భాగంగా, తారిమ్ నది పరీవాహక ప్రాంతాన్ని చైనాలో భాగంగా చూసింది. అయితే ఈ ప్రతిపాదన పట్ల చైనా మౌనం పాటించగా, ఆ మౌనం అంగీకారమేనని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత 1899 నుంచి 1947 దాకా బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన పటాలలో అటు జాన్సన్ – అర్దాఘ్ రేఖ, ఇటు మెక్ కార్ట్ నీ – మెక్ డొనాల్డ్ రేఖ రెండూ చూపేవారంటే ఈ సరిహద్దు ఎంత అనిర్దిష్టంగా, అస్పష్టంగా ఉండిపోయిందో అర్థమవుతుంది.

ఆ ప్రాంతం గురించి నెహ్రూ మాటల్లోనే చెప్పాలంటే, “అక్సాయి చిన్ తమ భూభాగమని చైనీయులు అంటున్నారు. వారి పటాలలో కూడ, కొత్త పటాలలో మాత్రమే కాదు, పాత పటాలలో కూడ, అది వారి భూభాగంగానే ఉంది. మొత్తానికి అది వివాదాస్పద ప్రాంతం. దాని మీద రెండు అభిప్రాయాలున్నాయి… అది సరాసరి పదహారు వేల నుంచి పదిహేడు వేల అడుగుల ఎత్తున ఉన్న చెట్లూ చేమలూ లేని, గడ్డి కూడ మొలవని, ఏ రకమైన జీవజాలం లేని ప్రాంతం.”

మెక్ మోహన్ రేఖ

భారత – చైనా సరిహద్దు పశ్చిమ దిశలో అటువంటి అనిశ్చిత స్థితి ఉండగా, తూర్పు కొసన కూడ వలస పాలకుల వల్ల ఇటువంటి స్థితే కొనసాగింది. తూర్పు వైపు చివరన భూటాన్, బర్మాల మధ్యన భారత, చైనా దేశాల ఉమ్మడి సరిహద్దును సూచిస్తూ గీసిన 1150 కి.మీ. రేఖను మెక్ మోహన్ రేఖ అంటారు. అప్పటి భారత ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శి హెన్రీ మెక్ మోహన్ 1914లో బ్రిటిష్ ఇండియా తరఫున టిబెట్ తో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందంలో ఈ రేఖ ఖరారయింది. కాని దానికి ఏడు సంవత్సరాల ముందు 1907లో కుదిరిన ఆంగ్లో – రష్యన్ ఒడంబడికకు ఇది భిన్నమైనది గనుక, టిబెట్ చైనా అధీన ప్రాంతమైనందువల్ల టిబెట్ గురించిన ఏ ఒడంబడికనైనా చైనా ఆమోదించవలసి ఉంటుంది గనుక, సిమ్లా ఒడంబడిక కుదిరిన కొద్ది వారాలకే మొదటి ప్రపంచ యుద్ధం మొదలయింది గనుక మెక్ మోహన్ రేఖ విస్మృతిపథంలో పడిపోయింది. దాన్ని పట్టించుకున్నవారూ, సమర్థించినవారూ ఎవరూ లేకపోయారు. అది ఎక్కడా అధికారిక పటాల్లోకి కూడ ఎక్కలేదు.

కాని 1935లో బ్రిటిష్ అధికారి ఒలాఫ్ కారో దీన్ని తవ్వితీసి, ఇక నుంచి దాన్ని పటాల్లో చిత్రించాలని, నిజమైన భారత – చైనా సరిహద్దు అదేనని వాదించాడు. అలా 1937లో సర్వే ఆఫ్ ఇండియా ముద్రించిన పటాల్లో మొదటిసారిగా భారత చైనా సరిహద్దుగా మెక్ మోహన్ రేఖను చిత్రించారు. మరొక దేశంతో సరిహద్దు ఒడంబడిక చేసుకునే అధికారం తమ దేశంలో ఒక భాగమైన టిబెట్ ప్రభుత్వానికి ఉండదని, అందువల్ల సిమ్లా ఒప్పందాన్ని, మెక్ మోహన్ రేఖను తాము గుర్తించబోమని, ఆ రేఖకు దక్షిణంగా 65,000 చ.కి.మీ. భూభాగం టిబెట్ లో, తమ దేశంలో భాగమేనని చైనా వాదించింది. దాన్ని దక్షిణ టిబెట్ అని పిలిచింది.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన పిట్టకథ కూడ ఉంది: సి యు ఐచిసన్ సంపాదకుడుగా 1929లో వెలువడిన ఎ కలెక్షన్ ఆఫ్ ట్రీటీస్ (ఒడంబడికల సంకలనం) లో సిమ్లా ఒడంబడికను చేర్చలేదు. తమ అధీన దేశంగా ఉన్న టిబెట్ కు  సర్వాధికార సంతకం చేయడానికి అర్హత లేదని చైనా అనడం వల్ల ఒడంబడిక కుదరలేదు అని కూడ సంపాదక వ్యాఖ్య రాశారు. కాని 1938లో ఆ పుస్తకాన్నే మళ్లీ ప్రచురించినప్పుడు సిమ్లా ఒప్పందాన్ని చేర్చారు. పాత పుస్తకాలను వెనక్కి రప్పించడం మాత్రమే కాదు, 1938 పుస్తకంలో 1929లో ముద్రణ జరిగినట్టుగా తప్పుడు సమాచారం చేర్చారు.

బ్రిటిషిండియా సైన్యాలు 1938లోనే ఈ ప్రాంతంలోని తవాంగ్ పట్టణంలో ప్రవేశించి, అది భారత భూభాగమని ప్రకటించాయి. టిబెట్ ప్రభుత్వం అందుకు అభ్యంతరం తెలిపి తన అధికారాన్ని పునఃస్థాపించుకుంది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల బ్రిటిషిండియా జోక్యం ఉన్నప్పటికీ, అది తన అధికారం కింది భూభాగమేనని 1947 దాకా టిబెట్ వాదిస్తూ వచ్చింది.

యుద్ధానికి ముందు వివాదాలు

భారత – చైనా సరిహద్దులోని ఈ రెండు ప్రధాన రంగాల స్థితి ఇలా ఉండగా, 1947లో భారత దేశంలో అధికార మార్పిడి జరిగింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం పశ్చిమాన అక్సాయి చిన్ మొత్తం తనదేనని, అంటే జాన్సన్ రేఖను మాత్రమే తాను గుర్తిస్తున్నానని, అలాగే తూర్పున మెక్ మోహన్ రేఖను తాను గుర్తిస్తున్నానని, దానికి కూడ కొన్ని చోట్ల సవరణ చేయవలసి ఉన్నదని, దానికి దక్షిణాన ఉన్న భూభాగం అంతా తనదేనని వాదించడం మొదలుపెట్టింది. ఆ వాదనకు అనుగుణంగా అప్పటిదాకా అనిర్దిష్టంగా ఉన్న పటాలను నిర్దిష్ట సరిహద్దులతో పునర్ముద్రించాలని నిర్ణయించుకుంది. ఈ రెండు ప్రాంతాలను భారత భూభాగాలుగా చిత్రిస్తూ పటాలు తయారు చేయమని, ఈ భూభాగాల మీద ఎవరితోనూ చర్చలకు ఆస్కారం లేదని నెహ్రూ 1954 జూలై 1న ఒక ఆదేశం ఇచ్చారు. అంతకు చాల ముందే 1950 నవంబర్ 20న లోక్ సభలో ఒక ప్రకటన చేస్తూ “పటంలో ఉండనీ, ఉండకపోనీ మెక్ మోహన్ రేఖే మన సరిహద్దు, ఆ రేఖ దాటి రావడానికి ఎవరినీ అనుమతించేది లేదు” అని నెహ్రూ అన్నారు. భారత భూభాగం రెండు వేల ఏళ్లుగా అవే సరిహద్దులతో ఉందని, తాము ఆ సరిహద్దులను పరిరక్షించ దలచుకున్నామని భారత పాలకులు పచ్చి అబద్ధాన్ని ప్రకటించారు. నిజానికి జాతీయోద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ కూడ, భారత సరిహద్దులను వలస పాలకులు తమ ప్రయోజనాల కోసమే సృష్టించారనే వైఖరి తీసుకుంది.

ఆ రెండు రేఖలు కూడ గత కాలపు చైనా ప్రభుత్వాలు అంగీకరించినవి కావని, అవి వలసవాద చరిత్ర అవశేషాలని, అయినా వాటిని ప్రాతిపదికగా తీసుకుని రెండు దేశాల ప్రభుత్వాలు చర్చలు జరిపి ఉమ్మడి అంగీకారానికి రావచ్చునని చైనా ప్రభుత్వం వాదించింది. అక్సాయి చిన్ తమ అధీనంలోనే ఉంది గనుక, భారత దేశానికి ప్రవేశమార్గం కూడ లేదు గనుక, తమ రెండు రాష్ట్రాలను కలిపే రహదారి అక్సాయి చిన్ నుంచి వెళ్లడం సులభం గనుక అక్సాయి చిన్ ను తమకు పూర్తిగా వదలాలని, మెక్ మోహన్ రేఖను అంగీకరించడానికి తమకు అభ్యంతరం లేదని, కాని అది పాత వలస ప్రభుత్వాల ప్రాతిపదికపై కాక, కొత్తగా ఇరు ప్రభుత్వాల మధ్య చర్చల ద్వారా జరగాలని, ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలని చైనా ప్రభుత్వం వాదించింది.

ఈ రెండు వాదనలు చూస్తే భారత ప్రభుత్వం చర్చలకు కాలు అడ్డం పెడుతూ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్టు మొండిగా ఉండిందని, చైనా ప్రభుత్వం ఏదైనా చర్చల ద్వారా తేలవలసిందే అని సామరస్య పూర్వక వైఖరి తీసుకుందని అర్థమవుతుంది. భారత ప్రభుత్వం ఆ మొండి వైఖరిని ప్రదర్శిస్తూనే మరొకవైపు ‘భారత్ చీనీ భాయి భాయి’ అని, ‘పంచశీల విధానం అని స్నేహాన్ని నటించడం మొదలుపెట్టింది.

మొత్తంగా ఆయా వాదనలు ఎలా ఉన్నా, సరిహద్దుల దగ్గరా, దౌత్య రంగంలోనూ 1950 దశకంలో కొన్ని పరిణామాలు జరిగాయి. చైనా ప్రభుత్వం 1950ల తొలిరోజుల్లోనే టిబెట్ నుంచి క్సిన్ జియాంగ్ కు నిర్మించిన 1,200 కి.మీ. రహదారిలో 179 కి.మీ. అక్సాయి చిన్ గుండా, జాన్సన్ రేఖకు దక్షిణంగా వెళ్లింది. నిజానికి ఈ ప్రాంతం తమదని పటంలో ఎవరు చెప్పుకున్నప్పటికీ భారత దేశం వైపునుంచి చేరడానికి వీలు కానిది, చైనా నుంచి రహదారి వేయడానికి వీలైనది. అసలు ఆ రహదారి నిర్మించారనే సంగతి కూడ భారత ప్రభుత్వానికి 1957లోనే తెలిసింది. చైనా ప్రభుత్వం 1958లో ముద్రించిన పటాలలో ఆ రహదారి ఉండడంతో భారత ప్రభుత్వానికి అది నిర్ధారణ అయింది. ఆ ప్రాంతంలో ఏమి జరుగుతున్నదో ఏళ్ల తరబడి తెలియకపోయినా అక్సాయి చిన్ శతాబ్దాలుగా భారతదేశంలో అంతర్భాగమని, దాని మీద ఎవరితోనూ చర్చలకు ఆస్కారమే లేదని భారత ప్రధాని నెహ్రూ అంటూ వచ్చారు. తమ గత ప్రభుత్వాలు కూడ జాన్సన్ రేఖను అంగీకరించలేదని, మెక్ కార్ట్ నీ – మెక్ డొనాల్డ్ రేఖ గురించి తమకు సమాచారం ఇవ్వడం మాత్రమే జరిగిందని, ప్రస్తుతం తాము మెక్ కార్ట్ నీ – మెక్ డొనాల్డ్ రేఖనే గుర్తిస్తామని చైనా ప్రధాని చౌ ఎన్ లై అన్నారు. అయినా చర్చలు జరుపుకోవచ్చునని, ఆ చర్చలు యథాతథ స్థితిని గుర్తించి జరగాలని చైనా ప్రభుత్వం వాదించింది. చర్చలు జరిపే అవసరమే లేదని నెహ్రూ ప్రభుత్వం వాధించింది. దేశ సరిహద్దు అనేది రెండుదేశాలూ చర్చల ద్వారా, సామరస్యపూర్వకంగా, ఇచ్చిపుచ్చుకునే వైఖరితో, నైసర్గిక, సాంస్కృతిక అంశాల ప్రాతిపదికగా ఆమోదించవలసిన వ్యవహారం కాగా, భారత ప్రభుత్వం ఏకపక్షంగా సరిహద్దులను నిర్ణయించింది, లేదా వలసపాలకులు నిర్ణయించిన సరిహద్దులను యథాతథంగా ఆమోదించి ఇక చర్చించడానికేమీ లేదని అంది. నిజానికి 1950 నుంచి 1960 వరకూ భారత ప్రభుత్వానికీ, చైనా ప్రభుత్వానికీ మధ్య వందలాది లేఖలు, పరస్పర సాక్ష్యాధారాల వినిమయం, దౌత్య అధికారుల స్థాయి నుంచి రక్షణ మంత్రులు, ప్రధాన మంత్రుల స్థాయి దాకా ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. కాని ఈ ప్రయత్నాలేవీ వివాద పరిష్కారం దిశగా అడుగులు వేయలేదు.

ఈ వివాదాలు ఇలా ఉండగానే భారత ప్రభుత్వం చైనా ప్రభుత్వానికి ప్రతికూలమైన రెండు చర్యలు చేపట్టింది. మొదటిది దలైలామాకు భారతదేశంలో ఆశ్రయం ఇవ్వడం, రెండవది, ‘ముందడుగు విధానం’ పేరు మీద వాస్తవాధీన రేఖలను దాటి చైనా అధీనంలో ఉన్న భూభాగంలోకి ప్రవేశించి సైనిక శిబిరాలు ఏర్పాటు చేయడం.

టిబెట్ స్వయంపాలిత ప్రాంత ప్రజల ఆమోదంతోనే చైనా ఆ ప్రాంతాన్ని తనలో అంతర్భాగం చేసుకుందా, దురాక్రమించిందా, టిబెట్ చైనాలో అంతర్భాగం అనడానికి చారిత్రక ఆధారాలున్నాయా లేదా, టిబెట్ ప్రజలు చైనా నుంచి స్వాతంత్ర్యం కోరుతున్నారా లేదా, వేరే చర్చ. టిబెట్ చైనాలో అంతర్భాగమేనని భారత ప్రభుత్వం స్వయంగా అంగీకరించి 1954 ఏప్రిల్ లో చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది. కాని 1959లో టిబెట్ బౌద్ధుల నాయకుడైన దలైలామా చైనాపై తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు, ఆయనకు ఆశ్రయం ఇవ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధపడింది. అలాగే, చైనా ఆక్రమించిన భాగాలని తాము అనుకుంటున్న చోట్లకు సైనిక బలగాలను పంపించి, అక్కడ శిబిరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కూడ భారత ప్రభుత్వం 1959లో తీసుకుంది. ఈ విధానాన్ని ‘ముందడుగు విధానం’ పేరుతో 1961 నవంబర్ లో అధికారికంగా ప్రకటించినప్పటికీ, 1959 నుంచే ఇలా భారత సైనిక బలగాలు వివాద ప్రాంతాలలోకి చొరబడుతుండడంతో ఘర్షణలు మొదలయ్యాయి.

ఈ మొత్తం వివాదం మీద సునిశిత పరిశోధన చేసి పుస్తకం రాసిన నూరాని ఆ దశాబ్దంలో భారత ప్రభుత్వం చేసిన ఐదు కీలకమైన తప్పిదాలను పేర్కొన్నారు: అవి 1. మెక్ మోహన్ రేఖను 1954లో ఏకపక్షంగా సవరించడం, పటాలు ముద్రించడం. 2. 1954-58 మధ్య చైనా ప్రభుత్వం అనేక సార్లు ప్రతిపాదించినప్పటికీ చర్చలు జరపడానికి తిరస్కరించడం. 3. తమ భూభాగం కాని దాన్ని తప్పుడుగా తమదేనని నొక్కి చెప్పడం. 4. అక్సాయి చిన్ మీద చైనా అధికారాన్ని నిరాకరించడం. 5.మెక్ మోహన్ రేఖను, ముందడుగు విధానాన్ని ఆమోదిస్తూనే చర్చలకు రమ్మని చౌ ఎన్ లై 1960 ఏప్రిల్ లో చేసిన ప్రతిపాదనను తిరస్కరించడం.

యుద్ధం

ఈ వివాదాల నేపథ్యంలో ఆగస్ట్ 1959లో మొదటిసారిగా మెక్ మోహన్ రేఖకు దిగువన లాంగ్ జు అనే చోట భారత సైనిక శిబిరంపై చైనా బలగాలు దాడి చేశాయి. ఇటువంటి ఘర్షణలు వద్దని, ఇరు దేశాల సైన్యాలు వాస్తవాధీన రేఖను గుర్తించి, దానికి ఇరవై కి.మీ. అవతలికి ఉపసంహరించుకుని, చర్చలకు సిద్ధపడాలని చౌ ఎన్ లై 1959 అక్టోబర్ 24న నెహ్రూకు రాశారు. దీనికి జవాబు ఇవ్వకపోగా భారత ప్రభుత్వం తన చొరబాటు విధానాన్ని ముమ్మరం చేసింది. ‘ముందడుగు విధాన’ ప్రకటనతో 1961 నవంబర్ తర్వాత భారత సైన్యాలు వాస్తవాధీన రేఖను దాటి ముందుకు కదిలి కనీసం 43 చోట్ల శిబిరాలను ఏర్పాటు చేశాయి. దానితో చైనా బలగాలు 1962 సెప్టెంబర్ 8న ధోలా శిబిరం మీద దాడి చేసి ఖాళీ చేయించాయి. అప్పటికీ మిగిలిన భారత సైనిక శిబిరాలను తొలగించక పోవడంతో ఆరు వారాలు వేచి చూసి, అక్టోబర్ 20న చైనా బలగాలు భారత శిబిరాలపై పెద్ద ఎత్తున దాడి ప్రారంభించాయి. భారత ప్రభుత్వం కూడ దాన్ని యుద్ధంగా గుర్తించి ఎదురుదాడి ప్రారంభించింది.

యుద్ధక్రమంలో చైనా బలగాలు మెక్ మోహన్ రేఖ నుంచి దాదాపు 90 కి.మీ. ఇవతలి వరకూ భారత సైన్యాలను వెనక్కినెడుతూ వచ్చాయి, అప్పటి ఈశాన్య సరిహద్దు ప్రాంతం ( చైనా ప్రభుత్వ దృష్టిలో దక్షిణ టిబెట్ – ప్రస్తుత అరుణాచల ప్రదేశ్) పూర్తిగా చైనా బలగాల ఆక్రమణలోకి వెళ్లింది. చైనా బలగాలు సులభంగానే కలకత్తాను కూడ ఆక్రమించుకుంటాయని వదంతులు వచ్చాయి. కాని చైనా బలగాలు నవంబర్ 20న ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, మెక్ మోహన్ రేఖ దగ్గరికి ఉపసంహరించుకున్నాయి. యుద్ధ ఖైదీలుగా పట్టుకున్న భారత సైనికులను విడిచిపెట్టాయి. ఇప్పటికీ ఈ వివాదం సమసిపోలేదు.

“ఇదంతా చైనావాళ్లేదో పవిత్రులని వాదించడానికి కాదు. కాని వారి 1962 చర్య ప్రధానలక్ష్యం ‘ముందడుగు విధానం’ అనే భారత ప్రభుత్వపు తప్పుడు విధానాన్ని తిప్పికొట్టడం. సరిహద్దు సమస్యను లోతుగా చర్చకు తేకుండా వివాదాస్పద ప్రాంతాల నుంచి భారత సైనికులను వెనక్కి పంపించడం” అని ఈ వివాదం మీద, యుద్ధం మీద వ్యాఖ్యానిస్తూ ప్రఫుల్ బిద్వాయి అన్నారు.

యాభై ఏళ్ల తర్వాత

యాభై ఏళ్లు గడిచినప్పటికీ ఈ రెండు వివాదాలూ సమసిపోలేదు. అటు చైనా లోనూ ఇటు భారత్ లోనూ ప్రభుత్వాలు చాల మారిపోయాయి గాని, రెండు దేశాల పాలకులకూ ఈ వివాదం రగులుతూ ఉండడమే అవసరం. భారత పాలకులకైతే ప్రజలలో అబద్ధాల ద్వారా జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి, ప్రజల దృష్టిని అసలు సమస్యలనుంచి పక్కదారి పట్టించడానికి ఇటువంటి వివాదాలు, శత్రు దేశాలు కావాలి. తీరికా, అవకాశాలూ ఉన్న మధ్యతరగతి బుద్ధిజీవులలో కూడ ఈ చరిత్రను వాస్తవికంగా అధ్యయనం చేసి పాలకుల దుర్మార్గ చరిత్రను, అబద్ధ ప్రచారాలను అడ్డుకోవాలనే కోరిక లేదు. సాధారణ ప్రజానీకానికి అందుకు తీరికా లేదు, అవకాశాలూ లేవు. ఈ స్థితిలో పాలకులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. సరిహద్దు వివాదాల, శత్రుదేశాల బూచిని చూపుతూ, ఏడాదికేడాదికీ రక్షణ వ్యయాన్ని వేల కోట్ల రూపాయలు పెంచుతూ, ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ, ఆ రక్షణ నిధులలోంచి పెద్దఎత్తున కుంభకోణాలకు పాల్పడుతూ ఉన్నారు.

అందువల్ల ఈ చరిత్రను అధ్యయనం చేయడం కేవలం గత కాలపు కంకాళాలను తవ్వితీయడానికి మాత్రమే కాదు. కేవలం పాత కంకాళాలను తవ్వితీసినందువల్ల ప్రయోజనమేమీ లేదు. ఎంత అనవసరమైన, అవాస్తవికమైన, అచారిత్రకమైన, నిర్హేతుకమైన  విషయాల మీద ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయడానికి, విలువైన ప్రాణాలు బలిపెట్టడానికి పాలకవర్గాలు ప్రయత్నిస్తున్నాయో వర్తమానం తెలుసుకోవడానికి ఈ చరిత్ర అవసరం. అవకాశం ఉన్న చోట్ల కూడ సామరస్యపూర్వకంగా, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించడానికి పూనుకోకుండా పాలకులు ఎటువంటి కుటిల పన్నాగాలు పన్నుతున్నారో అర్థం చేసుకోవడానికి ఈ సరిహద్దు వివాదం, యుద్ధం, యుద్ధానంతర పరిణామాలు గొప్ప సూచికలు. పాలకవర్గాల మాటలను యథాతథంగా నమ్మడానికి వీలు లేదని గుర్తించడానికి ఈ వివాదాన్ని మించిన ఉదాహరణ లేదు.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

1 Response to భారత్ – చైనా యుద్ధం 1962 – నిజానిజాలు

  1. jayaraj says:

    excellent information

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s