ఒబామా గెలుపు ఎవరికి మేలు?

వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం

అమెరికా అధ్యక్షుడుగా బారక్ హుసేన్ ఒబామా మొదటిసారి గెలిచినప్పుడు వీక్షణం 2008 డిసెంబర్ సంచికలో ‘ఒబామా మార్పు తేగలడా?’ అని సంపాదకీయ వ్యాఖ్య రాశారు. ఇప్పుడు ఒబామా రెండోసారి గెలిచిన సందర్భంగా ఆ వ్యాఖ్యను యథాతథంగా గుర్తు తెచ్చుకోవడం అవసరం.

“రెండువందల ముప్పై సంవత్సరాల తర్వాత, నలభైముగ్గురు అధ్యక్షులతర్వాత అమెరికా అధికార పీఠం మీదికి ఆ సమాజంలోని అతి ముఖ్యభాగానికి చెందిన వ్యక్తికి అవకాశం దొరకడం కొత్తగాలి వీస్తున్నదనడానికి సూచనే. అంతమాత్రమే గాక, తెల్లవారికి, నల్లవారికి మధ్య సమానత్వం ఉండాలని అన్నందుకే ఇద్దరు అధ్యక్షులు హత్యకు గురయిన దేశంలో, ఒక నల్లజాతి వ్యక్తి ఎన్నికల ద్వారా అధ్యక్ష పదవికి రావడం కూడ ఆహ్వానించవలసిన సంగతే. అమెరికా సమాజంలో వ్యక్తీకరణ పొందుతున్న కొత్త తరం ఆలోచనలకు, ప్రజాస్వామిక ధోరణులకు ఒబామా ఎన్నిక ఒక సూచనే. అయితే అమెరికన్ సమాజంలోని కొత్తధోరణులు తనమీద పెట్టిన ఈ నమ్మకాన్ని ఒబామా నిలుపుకోగలడా అనే అనుమానాన్ని అమెరికన్ సమాజంలోని ప్రగతిశీల శక్తులన్నీ వ్యక్తంచేస్తున్నాయి. అమెరికన్ పాలకవర్గాలలో ఒక ముఠా కోరికలమేరకు, ఆ ముఠా ఆర్థికసహాయంతో అధికారపగ్గాలు చేపట్టిన ఒబామా ఆ వర్గపు ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించగలడా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ ముఠా ప్రయోజనాలు రిపబ్లికన్ పార్టీ ప్రయోజనాలకన్న, జార్జి బుష్ ప్రయోజనాలకన్న భిన్నమైనవేమీ కావు. వాళ్ల నినాదాలు వేరు కావచ్చుగాని, పశ్చిమాసియా చమురు నిల్వల విషయంలో, ఇజ్రాయిల్ పాలకులను సమర్థించే విషయంలో, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అమెరికన్ యుద్ధస్థావరాల విషయంలో, అఫ్ఘనిస్తాన్, ఇరాక్ లతో యుద్ధం విషయంలో, ప్రపంచీకరణ రాజకీయార్థిక విధానాల విషయంలో, ప్రపంచాన్ని బహుళజాతిసంస్థల దోపిడీ పీడనలకు అనుకూలంగా తయారుచేసిపెట్టే విషయంలో వాళ్ల ఆలోచనలు ఒకటే. అమెరికన్ ఆంతరంగిక రాజకీయార్థిక విధానాలలో ఏ స్వల్పమైన మార్పులనో ఒబామా తీసుకు రాగలడేమోగాని, అమెరికన్ విదేశాంగనీతినీ, అంతర్జాతీయ రాజకీయార్థిక వ్యవహారాలలో అమెరికా పాలకులు నిర్వహిస్తున్న దౌర్జన్య, దోపిడీ విధానాలనూ మార్చగలడా అనే ప్రశ్న వేయవలసినదే. మార్చజాలడనే విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు” అని నాలుగేళ్ల కింద వీక్షణం రాసిన వ్యాఖ్యలో అక్షరం కూడ మార్చవలసిన అవసరాన్ని ఒబా        మా కల్పించలేదు.

గెలుస్తాడా, ఓడుతాడా అని చివరి నిమిషం దాకా ఉత్కంఠకు గురి చేసి ఒబామా చివరికి రెండోసారి గెలిచి మరొక నాలుగేళ్ల కొరకు అమెరికా అధ్యక్షుడయ్యాడు. శ్వేత జాత్యహంకారానికీ, నల్లజాతి పట్ల వివక్షకూ పేరుపొందిన అమెరికాలో నల్లజాతికి చెందిన వ్యక్తి అధ్యక్షుడు కావడమే విశేషం గనుక మొదటిసారి 2008 ఎన్నికలలో ఒబామా ఎన్నికను చాలమంది విమర్శనాత్మకంగా అయినా ఆహ్వానించారు. అమెరికా విదేశాంగ విధానం ప్రధానంగా సామ్రాజ్యవాద, బహుళజాతి సంస్థల చేతుల్లోనే ఉంటుంది గనుక అది మారకపోవచ్చునని, కాని నల్లజాతి వ్యక్తిగా, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కనీసం దేశ అంతర్గత విధానాలలో ఒబామా పాలన కొంత ప్రగతిశీలంగా ఉండవచ్చునని కొందరు ఆశించారు. ఒబామా నాలుగు సంవత్సరాల పాలన ఆ ఆశలన్నిటినీ వమ్ము చేసింది.

ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాద రాజకీయాలను కొనసాగించడం, నాటో దళాలతో కలిసి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో సైన్యాలను తిష్టవేయించి, దుర్మార్గమైన దాడులు కొనసాగించడం, చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాల మీద కయ్యానికి కాలు దువ్వడం, అక్కడి ప్రజాందోళనలకు, కుట్రలకు సహకరించడం, లిబియా మీద దాడి చేయడం, గల్ఫ్ దేశాలకు పక్కలో బల్లెంలా అమెరికన్ పాలకవర్గాలు తయారు చేసిపెట్టిన ఇజ్రాయెల్ ను కనీసంగానైనా అదుపు చేయకపోవడం వంటి విధానాలన్నీ ఒబామా పాలనలో యథాతథంగా సాగాయి. వాటిని మౌలికంగా మార్చగలిగిన శక్తి అమెరికా అధ్యక్షుడికి లేకపోవచ్చు. కాని అమెరికా ఆర్థిక వ్యవస్థలోపల పెరుగుతున్న అసమానతలను తగ్గించడానికి ప్రయత్నించడం, సంక్షేమ వ్యయాల మీద కోత విధించకపోవడం, నల్లజాతి, లాటినోలు, ఆసియన్లు, స్త్రీలు వంటి అణగారిన అమెరికన్ వర్గాల పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడం వంటి పనులన్నా ఒబామా నాయకత్వంలోని డెమొక్రటిక్ ప్రభుత్వం చేయగలదని ఆశించినవారికి ఆశాభంగమే మిగిలింది.

ఒబామా వ్యక్తిగతంగా గాని, డెమొక్రటిక్ పార్టీ మొత్తంగా గాని 2008 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నీ జాబితా తయారుచేసి, వాటిలో నెరవేర్చనివెన్నో రాజకీయ విశ్లేషకుడు మాట్ స్టోలర్ నిర్ధారించారు. ఆ జాబితా ప్రకారం కార్మికులు యూనియన్లలో చేరడాన్ని సులభతరం చేసే ఎంప్లాయీ ఫ్రీ చాయిస్ ఆక్ట్ అనే చట్టం తీసుకువస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. సమ్మె చేసిన కార్మికులను శాశ్వతంగా తొలగించడంపై నిషేధం విధిస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కార్మికులందరికీ ఏడురోజుల వేతనసహిత అనారోగ్య సెలవులు ఇస్తామమే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఆధారపడిన పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు ఎర్న్ డ్ ఇన్ కమ్ టాక్స్ క్రెడిట్ రాయితీ ఇస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కనీస వేతనాలను పెంచుతామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. తనఖా అప్పులను రద్దు చేసే అధికారం స్థానిక న్యాయాధికారులకు ఇస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అమెరికన్ పౌరుల టెలిఫోన్ సంభాషణలను రహస్యంగా, వారంట్ లేకుండా వినడం రద్దు చేస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. దేశంలోని ప్రజాఉద్యమ బృందాల మీద, కార్యకర్తల మీద కేంద్ర ప్రభుత్వ దాడులను ఆపుతామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. హెబియస్ కార్పస్ హక్కును పునరుద్ధరిస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అసలు వీటిని అమలు చేయడంలో విఫలం కావడం కాదు, ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయడానికి చిన్నమెత్తు ప్రయత్నం కూడ ఈ నాలుగేళ్లలో జరగలేదని స్టోలర్ వ్యాఖ్యానించారు.

“వీటిని కేవలం వాగ్దానాల ఉల్లంఘనలుగా మాత్రమే చూడగూడదు. ఇవి అణగారిన ప్రజల ఆర్థిక రాజకీయ హక్కుల ఉల్లంఘనలు. వ్యక్తిగత అంశాలు, యూనియన్ హక్కులు, రుణగ్రహీతల హక్కులు, క్రియాశీల కార్యకర్తల హక్కులు వంటివన్నీ వాగ్దానాలలో ఉన్నాయి గాని ఏ ఒక్కటీ అమలులోకి మాత్రం రాలేదు. ఇందుకు భిన్నంగా, బడా వ్యాపారవేత్తల, బ్యాంకుల, మొత్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదపు సేవలో, వారికోసం మాత్రం ఒబామా ప్రభుత్వం ఎన్నెన్నో పనులు చేసింది. భారీ బ్యాంకులను రక్షించడానికి, వాల్ స్ట్రీట్ సహాయార్థం లక్షల కోట్ల డాలర్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాన్ని కొనసాగించింది. లిబియా, పాకిస్తాన్, యెమెన్, తదితర ప్రాంతాలకూ సైనిక చర్యలను విస్తరించింది. చివరికి ఒబామా తెచ్చిన కొత్త ఆరోగ్య రక్షణ చట్టంలో కొన్ని అనుకూల అంశాలున్నప్పటికీ, వాటికన్న ఎక్కువగా కొన్ని నిబంధనలు లక్షలాది ప్రజలను బీమా కంపెనీల లాభార్జనా పథకాల వలలోకి నెట్టివేసేలా ఉన్నాయి” అని ఆయన రాశారు.

ఇది వ్యక్తిగత సమస్య కాదు. బారక్ ఒబామా అనే వ్యక్తి నల్లజాతికి చెందినవాడిగా వివక్ష, అవమానం, పేదరికం, కష్టాలు తెలిసినవాడే కావచ్చు. కాని ఆ పుట్టుక మాత్రమే ఆయన విధానాలను నిర్ణయించదు. వర్గ సమాజంలో అధికార పీఠం ఎక్కేవారు ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ భావజాలంతో, విలువలతో ఉన్నారు అనేదే ప్రధానమవుతుంది, పాలకవర్గంలో చేరిపోయిన వ్యక్తిగా, పాలకవర్గ ప్రతినిధిగా, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిగా ఒబామా ముందు ఉండే కర్తవ్యం తాను పుట్టిన అస్తిత్వ బృందపు హక్కులను రక్షించడం ఎంతమాత్రం కాదు. ఆ ఆస్తిత్వాన్ని వదిలేసి, లేదా కేవలం ప్రదర్శనావస్తువుగా మాత్రమే ఉంచుకుంటూ, చూపుతూ, వాస్తవంలో మాత్రం పాలకవర్గ ప్రయోజనాలను కాపాడడం, పెంపొందించడం మాత్రమే ఆయన బాధ్యత. ఆ కర్తవ్యాన్ని ఆయన ఎంతకాలం సమర్థంగా నెరవేర్చగలిగితే అంతకాలం మాత్రమే ఆయనకు ఆ ప్రాతినిధ్య పాత్ర దక్కుతుంది. గత నాలుగేళ్లలో ఆ పని చాల సమర్థంగా చేశాడని రుజువైనందువల్లనే ఆయనకు మరో అవకాశం దక్కింది. అణగారిన ప్రజలను, డెమొక్రటిక్ పార్టీ శ్రేణులను చాలవరకు, ప్రగతిశీల శక్తులను కూడ కొంతవరకు ఆకర్షించడానికి, మోసగించడానికి ఎట్లాగూ వాగ్దానాలు, వాగాడంబరం ఉండనే ఉన్నాయి. అవి చాలవనుకుంటే ఎన్నికల అక్రమాలు కూడ తోడ్పడతాయని వార్తలు, వ్యాఖ్యలు వస్తున్నాయి.

పుట్టుక వల్ల ఒబామా ఏదో ఒరగబెడతాడని సగటు అమెరికన్ పౌరులకు ఆశలున్నాయో లేవో గాని భారతదేశంలో మాత్రం శ్వేతసౌధంలో నల్లకలువ వగైరా విశేషణాలతో 2008 గెలుపు సందర్భంగా చాలా ఆశాభావం వ్యక్తమయింది. అయితే పుట్టుక వల్ల తమ అస్తిత్వ బృందానికి సహాయం చేస్తారనే మాట నిజం కాదని అందరికన్న ఎక్కువగా భారతీయులకు తెలుసు. భారత రాష్ట్రపతి సింహాసనం మీద అణగారిన వర్గాలలో పుట్టినవారందరూ (దళితుడు కె ఆర్ నారాయణన్, ముస్లింలు జాకీర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, అబ్దుల్ కలామ్, సిక్కు జైల్ సింగ్, స్త్రీ ప్రతిభా పాటిల్) కూచున్నారు. కాని ఆయా వర్గాల జీవితాల పురోభివృద్ధికి, కనీసం వివక్ష, అత్యాచారాలు ఆపడానికి వారు చేసిన మేలు అణువంత కూడ లేదని ప్రతి ఒక్కరికీ తెలుసు.

అసలు అమెరికాలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమే కాదని, అందువల్లనే అధ్యక్షుడుగా ఏ పార్టీకి చెందిన ఏ వ్యక్తి ఉంటారనేది ముఖ్యం కాదని ఒబామా గెలుపుకు కొద్ది ముందే వామపక్ష రచయిత రాబర్ట్ మెక్ చెస్నీ ఒక సుదీర్ఘమైన విశ్లేషణా వ్యాసం రాశారు.

‘ప్రస్తుత అమెరికా ఎన్నికల రాజకీయాలలో ఒకవైపు రాజకీయ నాయకులూ మేధావులూ చేసే గంభీరమైన ప్రకటనలున్నాయి. మరొకవైపు తీవ్రమైన, విస్తారమైన, సాధారణంగా నిర్లక్ష్యానికి గురవుతున్న అమెరికన్ ప్రజానీకపు సమస్యలున్నాయి. ఈ రెంటి మధ్యా అఖాతం నానాటికి పెరిగిపోతున్నది’ అని ఆయన రాశారు. ‘ప్రజలకూ పాలకులకూ మధ్య ఈ దూరానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ప్రతి ఏటా సైనికీకరణకూ యుద్ధానికీ ఖర్చవుతున్న లక్ష కోట్ల డాలర్ల నిధుల మీద ఎటువంటి ప్రజాసమీక్ష, చర్చ ఉండడం లేదు. అలాగే ఆర్థిక వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద కార్పొరేట్ శక్తుల నియంత్రణ గురించి కూడ ఎక్కడా చర్చకు రావడం లేదు. సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన, వర్గ వ్యవస్థ, పెరిగిపోతున్న పేదరికం, రోజురోజుకూ కునారిల్లుతున్న సామాజిక సేవలు  వంటి అంశాలు రాజకీయవాదుల ఉపన్యాసాలలో, ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ ప్రస్తావనకు కూడ రావడం లేదు’ అని మెక్ చెస్నీ అంటున్నారు.

ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకునే అమెరికా ప్రభుత్వాలు ఇలా ఎందుకు ప్రజలకు దూరదూరంగా జరిగిపోతూ, ప్రజావ్యతిరేకంగా మారిపోతున్నాయో చర్చిస్తూ ఆయన ‘నిజంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలకూ ప్రధాన స్రవంతి రాజకీయాలకూ ఏమీ సంబంధం లేని స్థితి నానాటికీ పెరుగుతున్నది. లేదా, ఇంకా సరిగా చెప్పాలంటే ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కల్పిస్తున్న ప్రధాన శక్తి ప్రధానస్రవంతి రాజకీయాలే’ అన్నారు.

‘పెట్టుబడిదారీ విధానానికీ ప్రజాస్వామ్యానికి మధ్య సంబంధం ఎప్పుడూ సమస్యల మయమే. పెట్టుబడిదారీ విధానమేమో దారుణమైన అసమానతను సృష్టిస్తుంది. ప్రజాస్వామ్యమేమో రాజకీయ సమానత్వ భావన మీదనే ఆధారపడుతుంది. కాని రాజకీయ సమానత్వాన్ని ఆర్థిక అసమానత్వం దెబ్బతీసినప్పుడు, తీవ్రమైన ఆర్థిక అసమానతల పరిస్థితులలో ప్రజాస్వామ్యం మనుగడ అసాధ్యమైపోతుంది” అని ఆయన నిర్ధారించారు. “చాల కాలంగా అమెరికాను ‘బలహీన ప్రజాస్వామ్యం’ అని అభివర్ణిస్తున్నారు. కాని కొత్త శతాబ్దపు రెండో దశాబ్దానికల్లా ఆ వర్ణన అతిశయోక్తి అయిపోయింది. ఇవాళ అమెరికా గురించి కచ్చితంగా చెప్పాలంటే అది డాలరోక్రసీ – డాలర్ స్వామ్యం – తప్ప మరేమీ కాదు. అది ప్రజల పాలన కాదు, డబ్బు పాలన. ఇది అమెరికాకే ప్రత్యేకమైన అత్యల్ప సంఖ్యాక సంపన్న ముఠా రాజ్యం. ఎవరి దగ్గర ఎక్కువ డాలర్లుంటే వాళ్లే ఎక్కువ వోట్లు తెచ్చుకుంటారు, వాళ్లే పాలన సాగిస్తారు” అని ఆయన అన్నారు.

వ్యక్తిగా బారక్ ఒబామా దగ్గర గాని, రాజకీయ పార్టీగా డెమొక్రటిక్ పార్టీ దగ్గర గాని ఆ డబ్బులు ఉన్నాయా లేవా, వారి ప్రకటిత ఆదర్శాలేమిటి, వారి శరీరపు రంగు ఏమిటి, వారు ఎక్కడ పుట్టారు అనేవన్నీ ఈ డాలరోక్రసీ కింద అణగిపోతాయి. అధికారిక ప్రకటనల ప్రకారం మొన్నటి ఎన్నికల ప్రచార వ్యయం కోసం ఒబామా 934 మిలియన్ డాలర్లు సేకరించి 852 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టగా, ప్రత్యర్థి మిట్ రోమ్నీ 881 మిలియన్ డాలర్లు సేకరించి 752 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టాడు. అంటే రూపాయల్లో చెప్పాలంటే ఒబామా సేకరించినది రు. 5,200 కోట్లు. ఇందులో అత్యధిక భాగం బహుళజాతి సంస్థల నుంచి అందిన విరాళాలే. ఇంకా విశాలమైన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు అలా ఉంచినా, ఈ విరాళాలకైనా ప్రతిఫలం ఇవ్వాలి గదా.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s