పాలస్తీనా రక్తాశ్రుసిక్త విషాద గాథ

పాలస్తీనా లోని గాజా నగరం మీద ఇజ్రాయెల్ వైమానిక దళం నవంబర్ 14న జరిపిన దాడిలో గాజాను ప్రస్తుతం పాలిస్తున్న హమస్ సైనిక నాయకుడు అహ్మద్ జబారీ మరణించాడు. అప్పటినుంచి నవంబర్ 21 న ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగేవరకూ వారం రోజుల పాటు ఇజ్రాయెల్ దాడులు, హమస్ ప్రతిదాడులతో గాజా దద్దరిల్లిపోయింది. ఈ వారం రోజుల యుద్ధంలో పాలస్తీనా వైపు మొత్తం మీద 13 మంది స్త్రీలు,  43 మంది పిల్లలతో సహా 173 మంది మరణించారు. 1300 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ వైపు ఇద్దరు సైనికులతో సహా మొత్తం ఆరుగురు మరణించారు. గాజాలో హమస్ వంటి “తీవ్రవాద” సంస్థలు తమ మీద దాడికోసం ఆయుధాలు పోగు వేస్తున్నాయని, ముందస్తు నిరోధక చర్యగా వారి నిర్దిష్ట లక్ష్యాల మీద దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. కాని మృతుల సంఖ్య చూస్తేనే ఇజ్రాయెల్ భద్రతా దళాలు ఎంత విచ్చలవిడిగా, పౌర, నివాస స్థలాల మీద దాడి జరిపాయో అర్థమవుతుంది.

పాలస్తీనీయులు దాడికి సిద్ధపడుతున్నారని తెలిసిందనే అబద్ధం పునాదిగా దాడి చేయడం ఇజ్రాయెల్ కు కొత్త కాదు. అసలు పాలస్తీనాను ఆక్రమించుకుని కూచుని, వారి దేశంలో వారికి పదోవంతుకన్న తక్కువ ప్రాంతం కేటాయించి, వారిని వారి స్వదేశంలోనే శరణార్థులుగా మార్చి, వారి మీద కట్టుకథలు అల్లడం, దుర్మార్గమైన దాడులు చేయడం ఇజ్రాయెల్ కు వెన్నతో పెట్టిన విద్య అయింది. ఇజ్రాయెల్ దుర్మార్గానికి ఎల్లప్పుడూ తోడునీడగా నిలిచే పెద్దన్నలు అమెరికా, బ్రిటన్ లకూ ఇదే అలవాటు. జనవిధ్వంసక ఆయుధాలు ఉన్నాయనే అబద్ధంతో దాడి చేసి ఇరాక్ ను భస్మీపటలం చేసి, అధ్యక్షుడు సద్దాం హుసేన్ ను ఉరి కూడ తీసిన అమెరికా ఆ జన విధ్వంసక ఆయుధాల జాడ మాత్రం ఇప్పటికీ చెప్పలేకపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడ గాజాలో ఆయుధ గిడ్డంగులు ఉన్నాయనే అబద్ధంతో 173 మందిని పొట్టన పెట్టుకుంది.

ఇజ్రాయెల్ దాడులు సైనిక స్థావరాల మీద జరగలేదని, స్పష్టంగానే పౌర, నివాస స్థలాల మీద జరిగాయని చెప్పడానికి గాజాలో రెండు మీడియా కేంద్రాల మీద, కనీసం ఆరు వార్తాసంస్థల మీద జరిగిన దాడులు, ఆరుగురు పాత్రికేయులు గాయపడడం నిదర్శనం. హమస్ కు చెందిన టెలివిజన్ కేంద్రం అల్ అఖ్సా, లెబనాన్ కేంద్రంగా నడిచే ప్రసార సంస్థ అల్ ఖుద్స్ టివి కి చెందిన గాజా స్టుడియోల మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది.

ఇజ్రాయెల్ నుంచి గాజా లోని పౌర, నివాస స్థలాల మీద విచ్చలవిడిగా క్షిపణిదాడులు, బాంబుదాడులు సాగుతూ, రోజురోజూ డజన్ల కొద్దీ పిల్లలూ స్త్రీలూ సాధారణ పౌరులూ చనిపోతూ, గాయపడుతూ ఉన్న వార్తలు చదువుతుంటే, ప్రవాసంలో ఉన్న పాలస్తీనియన్ గణితశాస్త్రవేత్త నహీదా రాసిన ‘గాజా గళం’ ఫొటో కవిత కనబడింది. ఆరు దశాబ్దాలుగా తమ నేల నుంచి తాము తొలగించబడి శరణార్థులుగా, బాంబుదాడుల లక్ష్యాలుగా, అనుక్షణ భయంలో, అణచివేతలో, దుఃఖంలో, పోరాటంలో బతుకుతున్న పాలస్తీనా రక్తాశ్రుసిక్త విషాదగాథ కళ్లకు కట్టింది. కళ్ల ముందర జరిగిపోతున్న ఈ మహా దుర్మార్గాన్ని చూస్తూ చూసీ చూడనట్టు నటిస్తూ సభ్య ప్రపంచం ఎంత అసభ్యంగా బతుకుతున్నదో చూసి సిగ్గు కలిగింది. ఆ విషాదగాథ నాకు పరిచయమైన ముప్పై ఏళ్ల వెనుకటి జ్ఞాపకాలు తోసుకొచ్చాయి.

ముప్పై ఏళ్ల కింద, 1982 జూలైలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎం. ఎ. ఎంట్రెన్స్ రాయడానికి వెళ్లినప్పుడు, అప్పటికి ఆ విశ్వవిద్యాలయ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న సి వి సుబ్బారావుతో కలిసి క్యాంపస్ కు వెళ్లాను. ఆ క్యాంపస్ లో కలిసిన విద్యార్థులు పాలస్తీనా సమస్య ఏమిటని సుబ్బారావును అడిగారు. అప్పటికి పాలస్తీనా నగరాల మీద ఇజ్రాయెల్ బాంబుదాడులు జరుగుతున్నాయి. ప్రతిరోజూ మరణాల వార్తలు వస్తున్నాయి. అక్కడి క్యాంటీన్ లో కూచుని సుబ్బారావు ఆ విద్యార్థులకు పాలస్తీనా విషాదగాథ, ఇజ్రాయెల్ దుర్మార్గ గాథ, ఆ దుర్మార్గానికి ప్రత్యక్షంగా వత్తాసు పలుకుతున్న అమెరికా, బ్రిటన్ ల కుటిల రాజకీయాలు, పరోక్షంగా, మౌనంగా ఆ దుర్మార్గాన్ని ఆమోదిస్తున్న భారత్ వంటి దేశాల అన్యాయం అన్నీ ఓ గంట, రెండు గంటలు వివరించాడు. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న నాలుగైదు రోజులూ పాలస్తీనా చరిత్ర, రాజకీయాలు, అత్యద్భుతమైన పాలస్తీనా ప్రవాస కవిత్వంతోనే గడిచాయి. ఆ సంభాషణల ఫలితంగానే ఇద్దరమూ కలిసి పాలస్తీనా మీద ఒక వ్యాసం రాశాం. అది 1982 సెప్టెంబర్ సృజనలో అచ్చయింది. ఆ వ్యాసంతో పాటు మూడు పాలస్తీనా కవుల కవితలు కూడ అనువదించాను. ఈ మూడు దశాబ్దాలలో పాలస్తీనా కవితల అనువాదాల్లో, పాలస్తీనా గురించి వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో పాలస్తీనా ప్రజల దీనగాథ, ధీరగాథ నా మనసు మీదినుంచి ఎప్పుడూ చెరిగిపోలేదు. అప్పటినుంచి ఇప్పటిదాకా పాలస్తీనియన్ల ఎడతెగని ఆరాట పోరాటాలు నన్ను కదిలిస్తూనే ఉన్నాయి.

నహీదా తన కవితలో ‘ఇక్కడ/ నేనూ/ అయ్యో! నా దిక్కులేని చిన్నారి పిల్లలూ/ చచ్చిపోతుంటే/ నీ మౌనం చాలిక…/ మానవత్వమా నువ్వెక్కడ’ అని ప్రశ్నించింది. నిజంగానే కళ్ల ముందర జరిగిపోతున్న మహా విధ్వంసం గురించి, అమానుష మారణ కాండల గురించి, దుర్మార్గమైన, దౌర్జన్యపూరితమైన ఆక్రమణ గురించి మానవాళి మౌనం వహిస్తోంది. మానవత్వానికి తామే చిరునామా అని వీరాలాపాలు పలికేవాళ్లందరూ ఆరు దశాబ్దాలుగా, వేలాది మంది చిన్నారి పిల్లల ప్రాణాల సాక్షిగా, లక్షలాది మంది శరణార్థుల కడగండ్ల సాక్షిగా మౌనం వహిస్తున్నారు. తమ మౌనంతో హంతకులకు అవకాశమిస్తున్నారు.

పాలస్తీనా పశ్చిమాసియాలో మధ్యధరా సముద్రానికీ జోర్డాన్ నదికీ మధ్య ఉన్న భూభాగం. పాలస్తీనియన్లు అరబ్బులలో భాగమైన ఒక జాతి. చరిత్రలో పాలస్తీనా ప్రస్తావనలు కనీసం రెండువేల ఐదు వందల ఏళ్లుగా ఉన్నాయి. దీనిలో అత్యధిక భాగం గాని, విడివిడి భాగాలుగా గాని పందొమ్మిదో శతాబ్దం వరకూ అనేక సామ్రాజ్యాలలో భాగంగా ఉన్నాయి. జూడాయిజం, క్రైస్తవం, ఇస్లాం, బహాయి వంటి మతాలన్నిటికీ ప్రధానమైన కేంద్రాలు ఈ భూభాగంలోనే ఉన్నందువల్ల ఆయా మతాల ప్రజలందరికీ ఈ ప్రాంతం తమకే చెందాలన్న ఆకాంక్షలున్నాయి. దానితో పాటు పశ్చిమాసియాలో, చమురు ఉత్పాదక గల్ఫ్ దేశాలకు పొరుగున ఉండడం వల్ల కూడ ఈ ప్రాంతపు ప్రాధాన్యత పెరిగిపోయింది.

పందొమ్మిదో శతాబ్దం మధ్యలో ఈ భూభాగాన్ని టర్కిష్ ఆటోమన్ సామ్రాజ్యం నుంచి ఈజిప్ట్ కైవసం చేసుకుంది. కొద్ది సంవత్సరాలలోనే బ్రిటన్ జోక్యం చేసుకుని ఈ ప్రాంతాన్ని మళ్లీ ఆటోమన్ సామ్రాజ్యంలో చేర్చింది గాని అది ప్రధానంగా బ్రిటిష్ సామ్రాజ్య ప్రభావంలోనే ఉండింది.

ఈ లోగా 1897లో థియొడర్ హెర్జెల్ అనే యూదు సిద్ధాంత కర్త జియోనిజం అనే సిద్ధాంతాన్ని ప్రవచించాడు. ఆ సిద్ధాంతం బైబిల్ లోని బుక్ ఆఫ్ జెనెసిస్ లో ఈ ప్రాంతాన్ని అబ్రహాం వారసులకు ఇస్తున్నట్టుగా భగవంతుడు చెప్పాడని, దానిపేరు ఇజ్రాయెల్ అని, తాము అబ్రహాం వారసులమని, అందువల్ల ఇది తమకు చెందాలని వాదించడం మొదలుపెట్టింది. ఈ జియోనిజం ప్రారంభకులూ, సమర్థకులూ ప్రధానంగా యూదులు. వడ్డీ వ్యాపారులుగా, వర్తకులుగా, సంపన్నులుగా యూదుల పట్ల అప్పటికి మూడు నాలుగు వందల ఏళ్లుగా యూరప్ లో ఉండిన వ్యతిరేక భావనల వల్ల యూదులను ఏకం చేసి, వారికే ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచడం జియోనిజం లక్ష్యం. ఇది భగవంతుడి ఆదేశంగా మాత్రమే కాక, “భూమిలేని ప్రజలకు, ప్రజలు లేని భూమి” అనే నినాదాన్ని కూడ తీసుకుంది. కాని పాలస్తీనా ప్రజలు లేని భూమి కాదు, అక్కడ నిండా అరబ్బులు ఉన్నారు.

మత విశ్వాసాల ప్రకారం పాలస్తీనా జనాభా అప్పటికి పూర్తిగా ముస్లింలు కాగా ఇది యూదు – ముస్లిం మత వైరంగా కూడ బలపడింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్న యూదులైనా ఈ తమ మాతృభూమికి వెళ్లి స్థిరపడాలని అంటూ భారీ వలసలను ఈ జియోనిజం ప్రోత్సహించింది. మొదటి ప్రపంచయుద్ధం సమయంలో వెలువడిన బాల్ ఫోర్ డిక్లరేషన్ తో ఈ నినాదం ప్రచారంలోకి రాగా బ్రిటన్ ఈ జియోనిస్టు వలసలను పూర్తిగా సమర్థించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి పాలస్తీనా భూభాగమంతా బ్రిటన్ చేజిక్కింది. పాలస్తీనీయులు బ్రిటన్ కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించినప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసేవరకూ పాలస్తీనా బ్రిటన్ చేతిలోనే ఉండిపోయింది.

చివరికి 1947లో పాలస్తీనా మీద తన అధికారం వదులుకుంటున్నానని ప్రకటించిన బ్రిటన్, అప్పటికే బలపడిన అమెరికాలు ఐక్యరాజ్యసమితి చేత ఒక తీర్మానం చేయించాయి. ఆ తీర్మానం ప్రకారం పాలస్తీనాను మూడు భాగాలుగా విడగొట్టారు. ఒకటి అరబ్ రాజ్యం, ఒకటి యూదుల రాజ్యం. మరొకటి అంతర్జాతీయ సంస్థల అదుపులో ఉండే జెరూసలెం నగరం. అరబ్బుల నేలలో ఉన్న, తనకు అత్యంత అవసరమైన చమురు కోసం వారితో తనకు ఎప్పటికైనా ఘర్షణ తప్పదని, విభిన్న మతవిశ్వాసాల వల్ల ఆ ఘర్షణ సమసిపోవడం సాధ్యం కాదని గుర్తించిన అమెరికా అరబ్బు దేశాల పక్కలో బల్లెంలా ఇజ్రాయెల్ ను తయారుచేసి, దాన్ని తన కీలుబొమ్మగా మార్చుకోవాలని చేసిన దురాలోచన ఫలితమే యూదుల రాజ్యంగా ఇజ్రాయెల్ ఏర్పాటు.

ఈ విభజనను వ్యతిరేకించిన అరబ్బులు యుద్ధం ప్రారంభించారు. అయినా ఇజ్రాయెల్ ఏర్పాటు కావడం మాత్రమే కాదు, ఐరాస తీర్మానంలో లేని మరొక 26 శాతం భూభాగం మీద కూడ ఇజ్రాయెల్ తన పాలన స్థాపించుకుంది. ఆ ప్రాంతం నుంచి పారిపోయిన ఏడు లక్షల మంది పాలస్తీనీయులు శాశ్వతంగా శరణార్థులయిపోయారు. ఈ యుద్ధంలో పాలస్తీనాలో కొంత భాగం జోర్డాన్ చేతికీ, కొంత భాగం ఈజిప్ట్ చేతికీ వెళ్లాయి. 1967లో జరిగిన మరొక యుద్ధంలో ఈ రెండు దేశాల నుంచి పాలస్తీనా భాభాగాల్ని ఇజ్రాయెల్ కైవసం చేసుకుంది.

రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో, ముఖ్యంగా యూరప్ లో నాజీ హిట్లర్ అత్యాచారాలకు బలి అయిన యూదులు శరణార్థులుగా ఈ ప్రాంతానికి వలస రావడం ప్రారంభించారు. నిజానికి హిట్లర్ దుర్మార్గాలను తప్పించుకోవడానికి వలస వచ్చిన ఈ శరణార్థుల వలసలను మానవతా దృష్టితో సమర్థించవలసిందే గాని, వారు పాలస్తీనాలో స్థానికులను తోసివేసి, స్థానికుల భూమిని ఆక్రమించుకుని, వారినే శరణార్థులుగా మార్చివేశారు.

పాలస్తీనాను దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసి స్వతంత్ర రాజ్యం ఏర్పరచాలనే లక్ష్యంతో 1964లో ఏర్పడిన పాలస్తీనా విమోచన సంస్థ (పి ఎల్ ఒ) యాసర్ అరాఫత్ నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవాదరాలు సంపాదించుకుంది. వంద దేశాలు పి ఎల్ ఒ ను గుర్తించాయి. ఐక్యరాజ్యసమితి పిఎల్ ఒ ను గుర్తించింది. అమెరికా, ఇజ్రాయెల్ లు మాత్రం దాన్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఈ రాజకీయ, అర్థ సైనిక జాతీయ విమోచనా సంస్థ పాలస్తీనా విముక్తి కోసం రాజకీయ, దౌత్యపరమైన పోరాటం చేస్తూనే సాయుధ పోరాటాన్ని కూడ చేపట్టింది. ఆ సాయుధ పోరాటాలు అనేక మలుపులు తిరిగాయి.

ఐక్య  రాజ్య సమితిలో ఇజ్రాయెల్ దురాక్రమణ కు వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజల న్యాయమైన పోరాటానికి మద్దతుగా జరిగిన తీర్మానాలకు లెక్కలేదు. ఆ తీర్మానాల అమలు ప్రసక్తి వచ్చేసరికి అమెరికా, బ్రిటన్ లు వీటో ప్రకటించి అడ్డుకునేవి. సుదీర్ఘకాలం ఘర్షణల తర్వాత 1993లో పి ఎల్ ఒ కు ఇజ్రాయెల్ కు మధ్య నార్వే లోని ఓస్లోలో శాంతి ఒప్పందం కుదిరింది. పి ఎల్ ఒ సాయుధ పోరాటాన్ని విరమించి, ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని గుర్తించింది. ఇందుకు ప్రతిగా పాలస్తీనీయులకు గాజా నగరంలో, వెస్ట్ బ్యాంక్ లో, జెరికోలో పరిమిత స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అంటే ఒక దేశపు పౌరులను అణచివేసి, నిర్వాసితులను చేసి, వారి మీద నాలుగు దశాబ్దాలకు పైగా యుద్ధం చేసి, చివరికి వారి దేశంలో పదో వంతు భూభాగం మీద వారికి పరిమిత స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారన్నమాట. పాలస్తీనాకు సంపూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ పి ఎల్ ఒ నాయకత్వాన మరొక సాయుధ పోరాటం జరగడంతోపాటు పి ఎల్ ఒ రాజీని వ్యతిరేకించే సంస్థలెన్నో పుట్టుకువచ్చాయి. అటువంటి సంస్థలలో ఒకటైన హమస్ గాజా నగరంలో అధికారానికి కూడ వచ్చింది.

ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చి, తమ నేల మీద తమ పాలన నడుపుకుంటున్న హమస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి, పాలస్తీనియన్లకు మిగిలిన ఆ నేలచెక్కను కూడ కబళించడానికి, పాలస్తీనియన్లను బెదిరించడానికి ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర కుటిల ప్రయత్నాలలో భాగమే తాజా బాంబుదాడులు.

 Palestine

భారత ప్రభుత్వానికి 1960లలో, 70లలో అలీనోద్యమంలో భాగంగా పాలస్తీనా ప్రజాపోరాటాన్ని సమర్థించిన ఘనచరిత్ర ఉండేది. కాని 1980ల మధ్య నుంచి అమెరికా కనుసన్నలలో నడవడం ప్రారంభించిన భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజా ఆకాంక్షలకు ద్రోహం చేయడం తలపెట్టింది. చివరికి నిన్నా మొన్నా గాజా నెత్తురోడుతుంటే భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ “అవసరమైన దానికంటే ఎక్కువ బలప్రయోగం చేస్తున్నందుకు” మాత్రం అభ్యంతరం తెలిపారు. అవసరమైనంత బలప్రయోగం అంటే ఏమిటో, అది చేస్తే ఫరవాలేదని భారత ప్రభుత్వ అభిప్రాయమేమో తెలియదు. కాకపోతే కన్నీటి తుడుపు లాగ జెరూసలెం రాజధానిగా సంపూర్ణ, స్వతంత్ర, సార్వభౌమాధికార పాలస్తీనా ఏర్పడాలని భారత ప్రభుత్వం కోరుతున్నదని ఒక సన్నాయి నొక్కు నొక్కారు. అందుకోసం భారత ప్రభుత్వం ఏం చేస్తుందో మాత్రం అక్షరం కూడ లేదు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు, ఒకప్పుడు పాలస్తీనా ప్రజా పోరాటాన్ని నిర్ద్వంద్వంగా సమర్థించిన భారత ప్రజాభిప్రాయం కూడ ఇటీవలికాలంలో వినబడవలసినంత బలంగా వినబడడం లేదు.

అంతేనా? ఇంకా దుడ్డున్నవాడిదే బర్రె అనే విలువలేనా? న్యాయం అన్యాయం అనేవేమీ లేవా? ప్రజాస్వామ్యం, నాగరికత, మాతృభూమి, స్వదేశం, విదేశీ దురాక్రమణను ఎదిరించడం అనే విలువలన్నీ బోలుసరుకేనా? ఈ అమెరికా సర్వంసహాధికార ప్రపంచంలో రేపు భారత దేశాన్ని ఆక్రమించినా మాట్లాడేవారెవరూ ఉండరా?

Box

విషాదగాథలో కొన్ని మైలురాళ్లు

1914: టర్కీ (ఆటోమన్ సామ్రాజ్యం) లో భాగమైన పాలస్తీనా జనాభాలో అరబ్బులు ఐదు లక్షల మంది (87 శాతం), యూరప్ నుంచి వలస వచ్చిన యూదులు 65,000 (13 శాతం) ఉండేవారు.

1917: బ్రిటిష్ విదేశాంగ మంత్రి బాల్ ఫోర్ యూదు ప్రజల జాతీయ మాతృభూమిగా పాలస్తీనాను ఇస్తామని ప్రకటించాడు.

1918: మొదటి ప్రపంచ యుద్ధానంతరం పాలస్తీనా పాలనాధికారం బ్రిటన్ చేతికి చిక్కింది.

1922-39: యూరప్ లోని అన్ని దేశాల నుంచి మూడు లక్షల మంది యూదులు పాలస్తీనాకు వలస వచ్చారు. అరబ్బులకూ యూదులకూ మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వం అరబ్బుల ప్రతిఘటనను అణచివేసింది.

1947-48: పాలస్తీనానుంచి బ్రిటన్ వైదొలగింది. 1948 మే 15న ఇజ్రాయెల్ దేశం స్థాపనను ప్రకటించారు. అరబ్బుల ప్రతిఘటనను ఇజ్రాయెల్ సైన్యం అణచివేసింది. లక్షలాది మంది పాలస్తీనీయులు పొరుగుదేశాలకు తరలివెళ్లారు.

1964: పాలస్తీనా విమోచన సంస్థ (పి ఎల్ ఒ) ఏర్పాటు. 1969లో యాసర్ అరాఫత్ నాయకత్వంలోని అల్ ఫతా చేతుల్లోకి వచ్చిన పి ఎల్ ఒ.

1967: ఆరు రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ అరబ్ దేశాలపై దాడి చేసి ఈజిప్ట్ నుంచి సినాయి ని, సిరియా నుంచి గోలన్ హైట్స్ ను, జోర్డాన్ నుంచి వెస్ట్ బ్యాంక్, జెరూసలెంలను ఆక్రమించుకుంది.

1973: సిరియా, ఈజిప్ట్ లు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి దిగాయి.

1978: ఈజిప్ట్, ఇజ్రాయిల్ ల మధ్య కుదిరిన కాంప్ డేవిడ్ ఒప్పందం.

1982: ఇజ్రాయెల్ లెబనాన్ ను ఆక్రమించి పి ఎల్ ఒ ను బహిష్కరించింది. బీరుట్లో పాలస్తీనా శరణార్థి శిబిరాల మీద దాడి చేసి వందలాది మంది పాలస్తీనియన్లను ఊచకోత కోసింది.

1980: దశాబ్దం పొడవునా వెస్ట్ బ్యాంక్ లో యూదుల స్థిర నివాసాలు ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్.

1987: వెస్ట్ బ్యాంక్, గాజాలలో సాయుధపోరాటం ప్రారంభించిన పాలస్తీనియన్లు.

1993: ఇజ్రాయెల్ కు, పి ఎల్ ఒ కు మధ్య ఓస్లోలో కుదిరిన ఒప్పందం. పాలస్తీనాకు పరిమిత స్వీయ పాలనాధికారం.

2000: వెస్ట్ బ్యాంక్ లో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్. రెండో సాయుధ పోరాటం ప్రారంభం.

2004: నలభై లక్షల మంది పాలస్తీనియన్లు సిరియా, లెబనాన్, జోర్డాన్లలో తలదాచుకున్నారని, వెస్ట్ బ్యాంక్, గాజాలలో నిత్య భయంలో ఉన్నారని అంచనా.

2005: గాజా నుంచి ఇజ్రాయెల్ ఉపసంహరణ. ఎన్నికల్లో హమస్ గెలుపు.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

1 Response to పాలస్తీనా రక్తాశ్రుసిక్త విషాద గాథ

  1. Narendra Mohan says:

    Palestine has been ruled in turn by the Greeks, Romans, European Crusaders, Turks and the British. No one claims a “right” to return, except European Zionists with no known connection to the land.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s