వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం
పది సంవత్సరాల సాయుధ పోరాటంతో దేశవ్యాప్త అధికారానికి చేరువ అయిన నేపాల్ మావోయిస్టుల పట్ల ప్రపంచవ్యాప్తంగానే ఆసక్తి, ఆదరణ వెల్లువెత్తాయి. భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ కూడ చాల మంది ప్రగతిశీలవాదులు, విప్లవ సానుభూతిపరులు నేపాల్ విప్లవాన్ని సగౌరవంగా ప్రశంసించారు. పదహారు వేలమంది కార్యకర్తలు, ప్రజలు అమరులైనప్పటికీ, వెనుకబడిన దేశాలలో ఇరవై ఒకటో శతాబ్ది విప్లవాలకు ‘ప్రచండ మార్గం’ దారి చూపుతుందని ఆశించారు. నాలుగు దశాబ్దాల సాయుధ పోరాటం తర్వాత కూడ విజయానికి చేరువ కాలేకపోయిన భారత విప్లవోద్యమం నేపాల్ నుంచి నేర్చుకోవలసి ఉంటుందని అన్నారు, అనుకున్నారు. సాయుధ పోరాటాన్ని 2006లో విరమించి ఖాట్మండులో ప్రభుత్వాధికారాన్ని హస్తగతం చేసుకునే వ్యూహాలలో ప్రచండ, నేపాల్ మావోయిస్టు పార్టీ వేసిన పిల్లిమొగ్గలను కూడ కొందరైనా ఆ దృష్టితోనే సమర్థించారు. వారిని అప్పుడే కొట్టివేయగూడదని, మరికొంత వేచి చూడాలని అన్నారు. కాని ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణ కింద ఆయుధాల అప్పగింత, ప్రజాసైన్యాన్ని బారక్ లకు పరిమితం చేయడం, చివరికి ప్రజాసైన్యం ఉపసంహరణ, అధికారం కోసం అవకాశవాద ఎత్తుగడలు, రాజ్యాంగ రచనలో రాజీలు, విప్లవక్రమంలో స్వాధీనం చేసుకుని పేదలకు పంచిన భూములు, ఆస్తులు వెనక్కి ఇవ్వడం, వగైరా ఒక్కొక్క చర్యా ప్రచండ మార్గపు దివాళాకోరుతనాన్ని ఎత్తిచూపింది. ఆ దిశలో ఇప్పుడు రెండు తాజాపరిణామాలు జరిగాయి.
పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయం
నేపాల్ పశ్చిమ కొసన హిమాలయ పర్వత సానువుల మధ్య అన్నపూర్ణ శిఖరానికి దగ్గరలో పోఖరా అనే పట్టణం ఉంది. అది ఖాట్మండు తర్వాత అతి పెద్ద పర్యాటక కేంద్రం. దాదాపు ఆరు దశాబ్దాలుగా అక్కడ ఒక చిన్న విమానాశ్రయం ఉంది. అక్కడికి వచ్చే విదేశీ యాత్రికుల సౌకర్యార్థం అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలనే ఆలోచన కూడ నేపాల్ పర్యాటక విమానయాన సంస్థకు చాల కాలంగా ఉంది. ఆ విమానాశ్రయం నిర్మించడానికి నేపాల్ ప్రభుత్వం ఏడాది కింద 2011 సెప్టెంబర్ 20న చైనా ప్రభుత్వ సంస్థ అయిన చైనా సిఎఎంసి ఇంజనీరింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు నేపాల్ పార్లమెంటులోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) ఈ ఒప్పందాన్ని తప్పు పడుతున్నది. అందుకు అక్కడి రాజకీయ సమీకరణాలు, సంక్షోభం ఒక కారణం కావచ్చు గాని, పిఎసి చూపుతున్న ఆర్థిక కుంభకోణం కారణం పూర్తిగా కొట్టిపారేయదగినదేమీ కాదు. గతంలో నేపాల్ ప్రభుత్వం ఈ విమానాశ్రయ నిర్మాణ వ్యయం 180 మిలియన్ డాలర్లు అని అంచనా వేయగా, ఈ ఒప్పందం మాత్రం 70 శాతం ఎక్కువగా 305 మిలియన్ డాలర్లకు కుదిరిందని పిఎసి అభ్యంతర పెట్టింది. నేపాలీ కరెన్సీలో చెపితే ఇది రు. 1600 కోట్ల రూపాయల తొలి అంచనా నుంచి రు. 2700 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఈ నిర్మాణానికి అవసరమైన నిధులను నేపాల్ ప్రభుత్వం చైనాకే చెందిన ఎక్స్ పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా నుంచి రుణంగా తీసుకుంటున్నది. ఇంత పెద్దఎత్తున నిర్మాణ వ్యయం పెంచి చూపడానికి కారణం ముడుపులు చేతులు మారడమేనని నేపాల్ లో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒప్పందం కుదరడానికి మావోయిస్టు అధినేత ప్రచండకు, ఆర్థిక మంత్రి బర్సా మాన్ పున్ కు, ప్రధానమంత్రి బాబూరామ్ భట్టరాయ్ సతీమణి హిసిలా యామి కి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మావోయిస్టుల అవినీతి పెచ్చరిల్లుతున్నదని, ప్రచండ ఇప్పటికే పదిహేడు వందల కోట్ల రూపాయలు వెనకేశాడని, పోఖరా విమానాశ్రయ కాంట్రాక్టులో తమకు యాభై లక్షల రూపాయలు ముట్టాయని మావోయిస్టులే స్వయంగా ఒప్పుకున్నారని ప్రతిపక్ష యుఎంఎల్ కు చెందిన మాధవ్ కుమార్ నేపాల్ అన్నాడు. ఈ వార్తను భారత బడా పెట్టుబడిదారీ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పెద్దఎత్తున ప్రచారం చేయడంతో ఇదంతా నేపాల్ కు, చైనా కు వ్యతిరేకంగా భారత-అనుకూల రాజకీయవేత్తలు చేస్తున్న దుష్ప్రచారమేనని ఆ దేశాల అధికార వర్గాలు అంటున్నాయి.
గెరిల్లా టూరిజం
సాయుధ పోరాటం విరమించి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని పర్యవేక్షక బృందానికి తమ ఆయుధ గిడ్డంగుల తాళాలు అప్పగించిన తర్వాత ఒక ఒప్పందం కుదిరిందని, తాము సాయుధ పోరాటకాలంలో తిరిగిన అడవుల, కొండల దారుల పటాలను మావోయిస్టు పార్టీ ఆ ఒప్పందంలో భాగంగా ఐక్యరాజ్య సమితి బృందానికి అప్పగించిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమై ఉండవని, బూర్జువా పత్రికల దుష్ప్రచారం కావచ్చునని అప్పట్లో ప్రచండ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పుడు ఆ వార్తలు నిజమో కాదో గాని, ఇప్పుడు మాత్రం ప్రచండ ప్రపంచంలోనే మొదటిసారిగా ‘గెరిల్లా పర్యాటక మార్గం’ (గెరిల్లా ట్రెక్) పేరుతో తాము గత దశాబ్దంలో తిరిగిన దారుల్లోకి పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. ఈ గెరిల్లా పర్యాటక మార్గం పశ్చిమ, మధ్య నేపాల్ లోని గత ఉద్యమ జిల్లాల మీదుగా సాగుతుంది. ఇది పర్యాటకుల సౌకర్యాన్ని బట్టి 14 రోజులు గాని, 19 రోజులు గాని, 27 రోజులు గాని ఉంటుంది. సాధారణంగా నేపాల్ లోని హిమాలయ పర్వత సానువులలో ఎవరెస్ట్, అన్నపూర్ణ శిఖరాల ప్రాంతానికి, లాంగ్ టాంగ్ ప్రాంతానికి విపరీతంగా విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు ఆ ప్రాంతాలకు తోడుగా 1996 నుంచి 2006 వరకు సాగిన సాయుధపోరాటంలో ముఖ్యమైన ఘట్టాలు జరిగిన గ్రామాలను, కొండలను, గుహలను, నదులను, అడవులను, లోయలను కూడ పర్యాటకులు సందర్శించవచ్చు. ఎక్కడెక్కడ మావోయిస్టు గెరిల్లాలు కందకాలు తవ్వారో, ఎక్కడెక్కడ రాజు సైనిక బలగాలతో హోరాహోరీ ఘర్షణలు జరిగాయో అవన్నీ చూడవచ్చు. ఆ ప్రాంతాలలో బస చేయవచ్చు. ఈ పర్యాటక మార్గం గురించి అమెరికన్ యాత్రా రచయిత అలోంజో లయన్స్ తో కలిసి ప్రచండ ఒక పుస్తకం కూడ రాశారు. ఆ పుస్తకాన్ని, యాత్రా మార్గపు పటాన్ని అక్టోబర్ 2న ప్రచండ ఆవిష్కరించారు. విప్లవం నిజంగా విజయం సాధిస్తే ఆ విప్లవ క్రమంలో తాము ఎటువంటి కఠోర పరిస్థితులను అనుభవించారో భవిష్యత్ తరాలకు చెప్పడం అవసరమే కావచ్చు. కాని మధ్యదారిలో వదిలేసిన విప్లవ అనుభవాన్ని ఇలా విహారయాత్రగా మార్చి విదేశీ పర్యాటకులకు అమ్ముకోవడానికి ప్రయత్నించడం, అది కూడ ‘విప్లవం విందు భోజనం కాదు, విహారయాత్ర కాదు’ అని చెప్పిన మావో పేరుతో నడుస్తున్న పార్టీ పేరుమీదనే సాగించడం నిజంగా ప్రచండ మార్గమే.
Does the party have a strong working class base ? It is a necessary condition for any party claiming to be proletarian internationalist that its cadres should be drawn from the base of theoretically educated workers steeled in class struggles. Without such a base all revolutionary parties degenerate.