ఒక కన్నీటి చుక్క, ఒక కొవ్వొత్తి, ఒక ప్రతీకార ప్రకటన సరిపోతాయా? ఎన్ని పాతర్ల లోతు నుంచి మారాలి మనం?!

ఈభూమి జనవరి 2013 సంచిక కోసం

డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అమానుష కృత్యం, ఇరవై మూడేళ్ల యువతిపై ఆమె స్నేహితుడి ముందే బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం, ఆమెపై, ఆమె స్నేహితుడిపై దౌర్జన్యం, ఇనుప చువ్వలతో, ఇతర సాధనాలతో ఆమె కడుపు మీద, మర్మావయవాలలో పొడిచిన భయంకరమైన హింస, ఇద్దరినీ విపరీతంగా కొట్టి దాదాపు స్పృహలేని స్థితిలో రోడ్డు పక్కన పడేసి పోవడం, ఆ హింస ఫలితంగా పేగులన్నీ చితికిపోయి, ఎన్నో అవయవాలు దెబ్బతిని, పదమూడు రోజుల చికిత్స తర్వాత ఆ యువతి మరణం… ఈ ఘటనా పరంపర హృదయం ఉన్న వారినెవరినైనా కంట తడి పెట్టించేంత కర్కోటక పరిణామాలు. మనిషిగా స్పందించే వారెవరిలోనైనా నేరస్తుల పట్ల కసి రగిలించే పాశవిక సంఘటనలు.

నిజంగానే దేశం తనకింకా ఎక్కడో లోలోతుల్లోనయినా హృదయం ఉందని చూపెట్టుకుంది. దేశం యావత్తూ కంట తడి పెట్టింది. ఎన్నడూ పత్రికావార్తలను, సమాజ పరిణామాలను పట్టించుకోని వారు కూడ కదలిపోయారు. నిజంగానే రాజధానీ నగరం నడిబొడ్డునా, దేశంలో అనేక చోట్లా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ముఖ్యంగా రాజధానిలో లక్షలాదిగా యువతీయువకులు కదిలి వచ్చి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గమా, ఇంత దుర్మార్గం జరిగినా ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. నేరస్తులకు కఠినాతి కఠిన శిక్షలు విధించాలనే ఆకాంక్ష ఢిల్లీలోనూ, దేశమంతా కూడ పెల్లుబికింది. ప్రభుత్వం మాత్రం యథావిధిగా ప్రదర్శనకారులను అనుమతి నిరాకరించడానికి ప్రయత్నించింది. అయినా వచ్చిన ప్రదర్శనకారుల మీద లాఠీలు, బాష్పవాయువు, వాటర్ కానన్లు ప్రయోగించి తన ఉదాసీనత ఎంత ఘనమైనదో చాటుకుంది. తనది ఎంత మొద్దు చర్మమో వెయ్యిన్నొకటోసారి ప్రకటించింది.

ఆ ఔదాసీన్యం, నిరసనకారుల మీద దౌర్జన్యంతో పాటుగానే ప్రభుత్వ స్పందనలో ఈ సారి కొంత అనూహ్య, అసాధారణ పార్శ్వం కూడ ఉంది. ప్రభుత్వం వెంటనే ఒక న్యాయవిచారణ సంఘాన్ని నియమించి, మూడు నెలలలోపల ఆ విచారణ సంఘం తన సిఫారసులను తెలియజేయాలని ఆదేశించింది. బాధిత యువతికి ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో జరుగుతున్న చికిత్స సరిపోవడం లేదని భావించి, ఇటువంటి హింసాఘాతాలకు చికిత్స చేయడంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించింది. ఎన్నో అవయవాలు దెబ్బ తిని, అప్పటికే పేగులు తొలగించబడి ఉన్నందువల్ల ఆ యువతి ప్రాణాలు కాపాడడం ఎంత ఉన్నత ప్రమాణాల చికిత్స అందినా సాధ్యం కాలేదు.

అత్యాచార సమాచారం వెలుగులోకి వచ్చిన డిసెంబర్ 17 నుంచి యువతి మరణించిన డిసెంబర్ 29 దాకా, ఆ తర్వాత కూడ ఈ ఘటనా పరంపరకు ప్రచార, ప్రసార సాధనాలలో చాల ఎక్కువ చోటు దొరికింది. రాష్ట్రపతి, యుపిఎ చైర్ పర్సన్, ప్రధానమంత్రిల నుంచి స్థానిక రాజకీయ నాయకుల వరకూ ఎందరెందరో స్పందించారు. స్వయంగా సోనియా గాంధీ, షీలా దీక్షిత్, జయా బచ్చన్ వంటివారు బహిరంగంగా కంటతడి పెట్టారు. సామాజిక, సాంస్కృతిక జీవనంలోని ప్రముఖులెందరో ఈ ఘటనా పరంపర మీద తమ వ్యాఖ్యానాలు వినిపించారు. వీథుల్లోకి వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శనలు చేశారు. అనేక రూపాలలో నిరసన ప్రకటించారు. నిరసనను అడ్డుకున్న పోలీసులతో వీథిపోరాటాలు చేశారు.

ఒక యువతి మీద జరిగిన అత్యాచారం మీద ఇటువంటి స్పందన రావడం చాల ఆహ్వానించదగిన పరిణామం. ఇంతకాలం సమాజ పరిణామాల పట్ల ఎటువంటి స్పందన లేకుండా తమ జీవితాలు తాము గడుపుతున్న ఉన్నతవర్గ, ఉన్నత మధ్యతరగతి యువతీయువకులు ఢిల్లీ చలిలో ఇండియా గేట్ దగ్గర బహిరంగ వీథి ప్రదర్శనలకు దిగడం చాల ప్రశంసనీయం. ఈ మొత్తం ప్రదర్శనల లోను, ప్రకటనల లోను ఆ అత్యాచార నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలనే ఆకాంక్ష ప్రధానంగా వ్యక్తమయింది. భారత శిక్షా స్మృతిలో అత్యాచార నేరం గురించి మాట్లాడే సెక్షన్ 375ను కఠినతరం చేయాలని, ఇప్పుడున్న శిక్షలకన్న కఠినశిక్షలు విధించాలని, మరణశిక్ష మాత్రమే సరైన శిక్ష అని, నేరస్తులను బహిరంగంగా ఉరి తీయాలని, నేరస్తులను ఎన్ కౌంటర్ చేయాలని, నేరస్తులకు ఎద్దుకొట్టడం (శస్త్రచికిత్స ద్వారా గాని, రసాయనిక చర్య ద్వారా గాని   నపుంసకుడిని చేయడం) లాంటి శిక్షలు విధించాలని ఎన్నో సూచనలు, డిమాండ్లు పెల్లుబికాయి. అంతకన్న ఆలోచించవలసిన లోతయిన విషయాలు ఉన్నాయని అక్కడక్కడా కొన్ని గళాలు వినిపించినా అవి అంత బలంగా వినిపించలేదు.

ఈ ఘటనా పరంపరలో వెల్లువెత్తిన ఈ ఆలోచనలూ ఆకాంక్షలూ అన్నిటినీ, జరిగిన దుర్మార్గపు తీవ్రత వల్ల వస్తున్న తక్షణ ప్రతీకార వాంఛలుగా చూస్తే ఫరవాలేదు. ఇవే దీర్ఘకాలిక, సామాజిక, పాలనాపర వైఖరులు అయితే ఒక తప్పును సరిచేసే క్రమంలో మరెన్నో తప్పులకు దారి తీసినట్టవుతుంది. ఈ డిమాండ్లు తెలిసీ తెలియని యువతీయువకులు ఆగ్రహావేశాలతో వెల్లడిస్తే ఫరవాలేదు, సమాజ నిర్వాహకులుగా ఉన్న, సమాజగమన సారథులుగా ఉండవలసిన రాజకీయపక్షాల నాయకులూ, మేధావులుగా, విశ్లేషకులుగా చలామణీ అవుతున్నవాళ్లూ కూడ వ్యక్తం చేయడం ప్రమాదకరం.

ఈ నేపథ్యంలో స్త్రీలపై అత్యాచారం అనే నేరం పట్ల మన సమాజంలో ఉన్న అభిప్రాయాలను మరొకసారి పరిశీలించుకోవలసి ఉంది. ఈ ఘటన తీవ్రత వల్ల, జరిగిన దుర్మార్గపు పద్ధతి వల్ల, దొరికిన ప్రచారం వల్ల కదిలిపోయి ఏదో ఒక రోజో, ఒక వారమో కొవ్వొత్తులు పట్టుకుని ప్రదర్శన చేయగానే సరిపోదు. ఈ ఘటనలో బాధితురాలిపట్ల ఒక కన్నీటి చుక్క వదిలితే సరిపోదు. ఈ ఘటన నేరస్తులకు కఠిన శిక్షలు విధిస్తే సరిపోదు.

ఇంతకూ నేరస్తులెవరు? ఆ రోజు అర్ధరాత్రి బస్సులో ఆ అత్యాచారానికి ఒడిగట్టిన ఆరుగురు మాత్రమేనా? ఆ ఆరుగురి ప్రాణాలు తీస్తే, లేదా కొందరు వాదిస్తున్నట్టు వారిని ఎద్దుకొడితే, లేదా నేరశిక్షాస్మృతిలో అత్యాచార నేరానికి మరణశిక్ష విధిస్తే సమాజంలో స్త్రీల మీద అత్యాచారాలు ఆగిపోతాయా? ఈ నేరంలో సమాజం పాత్ర, సంస్కృతి పాత్ర, విలువల పాత్ర ఎంతో ఆలోచించుకుని వాటిని సంస్కరించుకునే ప్రయత్నం చేయకుండా ఎంత కఠినమైన శిక్షలు విధించినా ప్రయోజనం ఏమిటి?  ఇంత దుర్మార్గ ఘటన అయినా మనలో సమగ్రమైన ఆలోచనలు రేపకపోతే, కేవలం ఇప్పటికిప్పుడు తోచిందేదో చేసి అదే అంతిమం అనుకుంటే సరిపోదని ఈ పదమూడు రోజులలో కూడ జరిగిన ఎన్నో అత్యాచార ఘటనలు రుజువు చేస్తున్నాయి. దేశంలో స్త్రీల మీద జరిగిన అత్యాచారాలన్నీ నమోదు కానే కావు గాని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అధికారిక లెక్కల ప్రకారం 2011లో నమోదైన అత్యాచారాల సంఖ్య 24,206. అంటే సగటున ప్రతి రోజూ 66 మంది, ప్రతి అరగంటకు ఒకరు అత్యాచారానికి బలి అవుతున్నారు. ఈ వ్యాసం చదవడం ప్రారంభించి ముగించేలోపు దేశంలో ఎక్కడో ఒక చోట ఒక స్త్రీ అత్యాచారానికి గురై ఉంటుంది. కొనసాగుతున్న సాంస్కృతిక విలువల వల్ల ప్రతిక్షణం ఒక అత్యాచార నేరస్తుడు తయారవుతూ ఉంటాడు. వీటిలో ఎన్ని అత్యాచారాల గురించి, ఎన్ని అత్యాచారాల ప్రేరణల గురించి ఆలోచిస్తున్నాం మనం? ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ అకృత్యాన్ని నిజంగా ఆపాలంటే ఎన్ని పాతర్ల లోతు నుంచి మారవలసి ఉంది మనం? అసలు ఇటువంటి అత్యాచారం మాత్రమే కాదు, ఇటువంటి అత్యాచారాలకు పురికొల్పే పురుషాధిపత్య, స్త్రీ వ్యతిరేక, అసమానతా భావజాలాన్ని కడిగేసుకోవడానికి మనకు మనం ఎంత సుదీర్ఘ కష్టభరిత శిక్షణ ఇచ్చుకోవలసి ఉంటుంది?

ఆ పారామెడికల్ విద్యార్థిని, ఆమె స్నేహితుడు ఆ రోజు రాత్రి సినిమా చూసి ఇంటికి వెళ్తూ ఉండడం, ఆ సమయానికి మరొక బస్సు దొరకక ఈ బస్సు ఎక్కడం, ఆ బస్సులో ఆ ముష్కరులు కాక మరెవరూ లేకపోవడం యాదృచ్ఛికం కావచ్చు గాని, ఆ అత్యాచారం మాత్రమే కాదు, అసలు స్త్రీల మీద అత్యాచారాలనేవి యాదృచ్ఛికం కావు. అదేదో హఠాత్తుగా అనుకోకుండా జరిగిపోయే సంఘటన కాదు. ఒక స్త్రీ మీద జరిగిన అత్యాచారం ఆ నేరస్తుల కామప్రకోపానికి మాత్రమే సూచన కాదు. దాని వెనుక ఉన్న సుదీర్ఘ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, పితృస్వామ్య ఆలోచనలను గుర్తించవలసి ఉంది. వాటిని గుర్తించి వాటిని పరిహరించడానికి, తగ్గించడానికి ఏం చేయగలం, ఏం చేస్తున్నాం అని ఆలోచించకపోతే, అప్పుడప్పుడు ఇటువంటి ఏదో ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు తాటాకు మంట లాగ ఆవేశపడడం, మర్నాటికల్లా మరచిపోవడం జరుగుతాయి. అప్పుడిక మన ప్రతిస్పందనలు తక్షణ ప్రతీకారానికీ, ఉపరితల ఉపశమనాలకూ మాత్రమే పరిమితమవుతాయి గాని దీర్ఘకాలిక సవరణలకు, లోతయిన పరిష్కారాలకు దారితీయవు. కావలసింది శిక్ష మాత్రమే కాదు, సరైన శిక్షణ.

తప్పకుండా ఈ నేరస్తులకు కఠినమైన శిక్షలు పడవలసిందే. నేరానికి తగిన శిక్ష ఉండవలసిందే. అందులో మరొక అభిప్రాయం లేదు. కాని నేరాలు జరగడానికి మూలకారణమేమిటో తెలుసుకుని, ఆ మూలకారణాన్ని రద్దుచేసేదాకా, తగ్గించేదాకా నేరాలు ఆగవు. మూలకారణాలదాకా కూడ పోనక్కరలేదు. కఠినమైన శిక్షలు నేరాలను తగ్గిస్తాయనే భ్రమలను మొదట వదులుకోవాలి. ఆ అమాయక ఆలోచనకు చరిత్రలో ఎక్కడా ఆధారం లేదు. నిజానికి శిక్షాభయానికి నేరం జరగకుండా ఉండడమనేది ఎక్కడాలేదు. శిక్ష బెదురుగా పని చేస్తుందని, ఆ భయంతో నేరస్తులు నేరం చేయకుండా ఉంటారని ఒక సైద్ధాంతిక వాదన. ఆ వాదనతోనే శిక్షాస్మృతిని కఠినంగా తయారు చేయడం, అధికారవర్గాల అధికారాన్ని పెంచడం జరుగుతున్నది గాని ఆ సైద్ధాంతిక వాదన తప్పు, శిక్షాభయంతో ఒకటో రెండో నేరాలు ఆగిపోవచ్చుగాని, ఆ నేరాలు జరిగే పరిస్థితులు మారేదాకా నేరాలు ఆగవు. ఇక ఆపేరుతో శిక్ష విధించే, అమలు చేసే వ్యవస్థలకు ఎక్కువ అధికారాలు ఇస్తే ఆ అధికారులు ఆ అదనపు అధికారంతో సమాజం మీద ప్రశ్నించడానికి వీల్లేని పెత్తందారీ దౌర్జన్యం చేయడానికి దారి దొరుకుతుంది గాని నిజంగా నేరాలనేమీ ఆపడం లేదని చరిత్ర పొడవునా లక్షల నిదర్శనాలున్నాయి. ఈ నేరస్తులను ఎన్ కౌంటర్ చేయాలని, ఎన్ కౌంటర్ అనే దుర్మార్గ, చట్టవ్యతిరేక, విచారణాతీత శిక్షాపద్దతిని కె. నారాయణ వంటి సిపిఐ నాయకుడే సమర్థిస్తే ఇక సమాజంలో చట్టబద్ధపాలన, క్రమబద్ధ విచారణ, ఒక న్యాయస్థానం తప్పుడు తీర్పు చెపితే పై న్యాయస్థానానికి నివేదించుకునే అవకాశం వంటి ఆధునిక ప్రజాస్వామ్య పద్ధతులు ఏం కావాలి?

మరణ శిక్ష ఉందనే భయంతో హత్యానేరాలు ఆగడం లేదు. అది నేరమని, కఠిన శిక్షలు ఉన్నాయని తెలిసినా దళితుల మీద అత్యాచారాలు ఆగడం లేదు. వరకట్నం తీసుకోవడం ఆగడం లేదు. లంచం తీసుకోవడం ఆగడం లేదు. ఈ ఉదాహరణలన్నీ చూపేదేమంటే ఒక పని నేరం అని తెలిసినా చేసేవాళ్లుంటారు. పథకం ప్రకారం ఆ పనిచేసే వారిని ఎటువంటి శిక్షాభయం కూడ ఆపదు. క్షణికావేశంతో ఆ పనిచేసేవారు అసలు ఆలోచన, తర్కం నశించిన సమయంలోనే ఆ పని చేస్తారు గనుక వారికి  శిక్షాభయం కలగనే కలగదు. కనుక తెలిసి చేసేవారి విషయంలోనైనా, పరిస్థితులు తోస్తే చేసేవారి విషయంలోనైనా కఠిన శిక్షలు అనేది సమస్యే కాదు.

ఇది సాధారణంగా నేరం – శిక్ష ప్రక్రియకు సంబంధించిన వాదన కాగా, స్త్రీల మీద అత్యాచార నేరం పథకం ప్రకారం జరిగే సందర్భాలూ ఉంటాయి, క్షణికమైన కామోద్రేకం వల్ల జరిగే సందర్భాలూ ఉంటాయి. పథకం ప్రకారం జరిగే అత్యాచార నేరాలు శిక్షాభయంతో తగ్గవు. అయినా వారికి శిక్షవిధించాలి గనుక కఠిన శిక్షలు ఉండవలసిందే. ఇక కామోద్రేకం కూడ క్షణికం అనిపిస్తుంది గాని స్త్రీపురుష అసమానత నిండిన పితృస్వామిక సమాజంలో అది నిజంగా క్షణికమైనదో, మదోన్మత్తత అనే అప్పటికప్పుడు పుట్టుకు వచ్చే లక్షణమో కాదు. అది మన సమాజంలో ప్రతి మగవాడికీ పుట్టుక నుంచి మరణం దాకా నూరిపోయబడుతున్న, సామాజికీకరణలో భాగమైన ఒక సాంస్కృతిక లక్షణం. ఆ లక్షణాన్ని మన మగవాళ్లలో పెంచి పోషించడానికి మతం ఉంది, చారిత్రక వారసత్వం ఉంది, స్వయంగా దైవమే పితృస్వామిక భావజాలానికి మూలమైన సమాజం మనది. అవన్నీ కాకపోతే ఇవాళ్టికివాళ మన విద్యావిధానం, మన ప్రచార సాధనాలు, మన వినోద సాధనాలు, మన వాడకంలోకి వస్తున్న ఆధునిక వస్తువులు, మన పాలనా వ్యవస్థ అన్నీ కూడ అదే నేర్పుతున్నాయి.

స్త్రీ పురుషుడికన్న తక్కువ. స్త్రీ పురుషుడి భోగవస్తువు, స్త్రీకి ఇష్టాయిష్టాలు లేవు, స్త్రీని అణచి ఉంచాలి, స్త్రీ ఆలోచనలకు విలువ ఇవ్వనక్కరలేదు అని మగవాళ్లకు చిన్ననాటి నుంచీ నూరిపోసి, సినిమాలలో, టెలివిజన్ లో, విద్యలో, సమాజంలో స్త్రీ కనబడితే భోగవస్తువులా, ఖాద్యవస్తువులా చూసే దృక్పథాన్ని మెదళ్లలో నింపి, అత్యాచారం చేయడానికి మగవాడికి ఎంత లైసెన్స్ ఇస్తున్నాం మనం?! దేవుడే ఒక అవతారంలో ఎనిమిది మంది భార్యలను చేసుకున్నాడు. పదహారువేల మంది స్త్రీలను తన భోగవస్తువులుగా ఉంచుకున్నాడు. ఉంపుడుగత్తె అనే రాచరిక భూస్వామ్య వాసనల మాట పలకడానికి ఎబ్బెట్టుగా భావించిన మనం ఇప్పుడు ‘చిన్న ఇల్లు’ ‘సెటప్’ అని అత్యాధునికంగా, నాజూకుగా పిలవడమూ అలవాటు చేసుకున్నాం. ఒక రాజు తన దాయాదులను అవమానించడానికి నిండు సభలో సమస్త పరివారం చూస్తుండగా ఆ దాయాదుల స్త్రీకి వస్త్రాపహరణం చేయించాడు. ఆ సంఘటనా ఈ హస్తినాపురిలోనే కొన్ని వేల ఏళ్ల కింద జరిగింది. ఆ ప్రాచీన గతం నుంచి ఇవాళ నడుస్తున్న బస్సులో చుట్టూ ఆరుగురు మూగి దౌర్జన్యంతో అత్యాచారం చేసి, దుర్మార్గమైన చిత్రహింసలు పెట్టి, బైటికి తోసిన వర్తమానం దాకా దేశ రాజధాని హస్తినాపురానిది, మన సమాజానిది మహాఘనత వహించిన అమానుష చరిత్ర. ఈ చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని తోసివేయడానికి, కనీస ప్రజాస్వామిక భావనలను, స్త్రీపురుష సమానత్వాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడానికి ఎప్పుడైనా మనం ప్రయత్నించామా?

కడుపులో పిండ దశలో ఉండగానే, జన్మించబోయే శిశువు స్త్రీ అని తెలుసుకుని, భ్రూణహత్యలకు పాల్పడుతున్నాం. ఆ భ్రూణ హత్యలు నేరం అని ఎంత కఠినమైన చట్టం ఉన్నా పరీక్షలు చేసే ప్రయోగశాలలూ వైద్యులూ తగ్గలేదు, పరీక్ష చేయించుకుని గర్భస్రావాలు చేయించే కుటుంబాలూ తగ్గలేదు. నిస్సహాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న పిండాలూ, గర్భిణి యువతులూ తగ్గలేదు.

మెరుపు మెరిస్తే వానకురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే అమాయకపు వయసులోనే మన ఇంటి మహాలక్ష్మి అని పొగడుతూనే స్త్రీపురుష భేదాన్ని పాటించి, చిన్నారి ఆడపిల్లల మీద వివక్షను పాటిస్తున్నాం. ఆడపిల్లను మగపిల్లవాడితో సమానంగా సంపూర్ణ మానవిగా చూడలేకపోతున్నాం. లెక్కలేనన్ని ఆంక్షలు విధిస్తున్నాం. గుండెల మీద కుంపటి అని ఆమె ముందే అని ఆమెను అవమానిస్తున్నాం. చదువు ఎందుకు అని బోన్ సాయి చెట్టులా ఎదగకుండా కొమ్మలు విరిచి కడుతున్నాం. కౌమారం దాటకుండానే మగపిల్లలకు స్త్రీ భోగవస్తువనే ఆలోచనలు మప్పుతున్నాం. సినిమాలు, సినిమా పాటలు, ఆ పాటల్లో బూతు, టెలివిజన్ కార్యక్రమాలు, సెల్ ఫోన్లలో బూతు చిత్రాలు, సామాజికీకరణలో ఎక్కడ చూస్తే అక్కడ మొత్తంగా అసహజ, వికృత సెక్స్ ఆకలిని పెంచి పోషిస్తున్నాం. స్త్రీపట్ల అటువంటి అసహజ, వికృత వాంఛలను బలోపేతం చేసే మద్యం అమ్ముకోకపోతే ప్రభుత్వాలు గడవవని, ఇంకా ఇంకా ఎక్కువ తాగాలని కోటాలు విధిస్తున్నాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రతి యువకుడినీ అవకాశం దొరికితే అత్యాచార నేరస్తుడు కాగలిగిన అవకాశం కలిపిస్తున్నాం.

మరి ఈ సమాజం మారడం ఎక్కడ మొదలుపెట్టాలి? ఇన్ని ఇన్ని దుష్ప్రభావాలు మగవాడ్ని మనిషి కాకుండా చేస్తుంటే, మృగంగా మారుస్తుంటే, ఒక్క శిక్షాభయం మాత్రమే వాడ్ని మనిషిని చేస్తుందా?

అట్లాగే అత్యాచారం అనేది కేవలం పురుషుడిలోని వికృత కామ వాంఛ ఫలితమే అనే దురభిప్రాయం వల్ల కూడ ఎద్దు కొట్టడం (నపుంసకుడిగా తయారు చేయడం) వంటి శిక్షలు ఉండాలనే వాదనలు, స్త్రీలు ఒంటరిగా తిరగగూడదని, రాత్రుళ్లు తిర్గగూడదని, “రెచ్చగొట్టే దుస్తులు” వేసుకోగూడదని వాదనలు వస్తున్నాయి. ఈ చర్యలో పురుషుడి కామ ప్రవృత్తి పాత్ర ఉన్నమాట నిజమే గాని, చాల సందర్భాలలో ఇది కేవలం కామ ప్రవృత్తి ఫలితం కాదు. సాధారణంగా అత్యాచారం చేసేవాడి ఆధిపత్య ప్రదర్శనకు, హింసకు సూచిక. దేశవ్యాప్తంగా స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాల ఘటనలను పరిశీలిస్తే, పోలీసులు, అర్ధసైనిక బలగాలు, సైనిక బలగాలు, పెత్తందారీ శక్తులు, అగ్రవర్ణాలు అత్యాచార నేరస్తులలో అగ్రభాగాన నిలుస్తున్నారు. వారు స్త్రీలను, తమ ప్రత్యర్థి వర్గాలను, ప్రశ్నించేవారిని, ఎదుగుతున్నవారిని అణచివేయడానికి, వారికి ఒక “పాఠం” చెప్పడానికి  సాధనంగా అత్యాచారం అనే ఆయుధాన్ని వాడుతున్నారు. ఈ దేశంలో కశ్మీర్ లో, ఈశాన్య రాష్ట్రాలలో సైనిక అర్ధసైనిక బలగాలు స్త్రీల మీద చేసిన అత్యాచారాల సంఖ్య వేలల్లో ఉంది. దేశవ్యాప్తంగా పోలీసు కస్టడీలలో అత్యాచారాల సంఖ్య కూడ వేలల్లో ఉంది. విచారణ జరగడమూ, శిక్షలు పడడమూ సంగతి  అలా ఉంచండి, ఇవేవీ వార్తలు కావు, చర్చకు కూడ రావు, ఇక అగ్రవర్ణాలు, ఆధిపత్యవర్గాలు ఆదివాసుల మీద, దళితుల మీద, వెనుకబడిన సామాజిక వర్గాల మీద ఆత్యాచారాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నాయి. అధికార వర్గాలకు తమ అధికారాన్ని చూపుకోవడానికి అత్యాచారం ఒక సాధనంగా ఉంది. దేశంలో శాసనసభ్యులలో, పార్లమెంటు సభ్యులలో, వారి ఆశ్రితులలో, సంపన్నులలో అత్యాచార సంస్కృతి విపరీతంగా పెరిగిపోతున్నది.

ఆదివాసి ఉపాధ్యాయురాలు సోని సోరిని చత్తీస్ గడ్ పోలీసులు నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి స్వయంగా జిల్లా ఎస్ పి సమక్షంలో అత్యాచారం చేశారు. ఎస్ పి ఆదేశాల మేరకు ఆమె మర్మావయవాలలో రాళ్లు జొప్పించారు. ఆ అత్యాచారం మీద కేసు లేదు సరిగదా, ఆ ఎస్ పి కి రిపబ్లిక్ డే ఉత్సవాలలో శౌర్య పతకం దక్కింది. మణిపుర్ లో అస్సాం రైఫిల్స్ అనే అర్ధసైనిక బలగాల శిబిరంలో మనోరమ అనే యువతిపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ అత్యాచారం, హత్యలపై కేసు లేదు. ఆ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అస్సాం రైఫిల్స్ కార్యాలయం ముందర మణిపురి యువతులు నగ్న ప్రదర్శన చేసినా భారత జాతి సిగ్గుపడలేదు. కశ్మీర్ లో షోపియన్ పట్టణంలో ఆసియా, నీలొఫర్ అనే ఇద్దరు అక్కచెల్లెళ్లపై సి అర్ పి ఎఫ్ జవాన్లు అత్యాచారం చేసి, చంపి కాలువలో పారవేస్తే, ఆ పట్టణమంతా రెండు వారాల పాటు నిరసన తెలిపినా ఇంతవరకూ కేసులేదు. కేసు లేకపోవడం మాత్రమే కాదు, పదిహేను రోజుల తర్వాత మృతదేహాలను ఢిల్లీ అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థకు తీసుకువచ్చి ‘వారి కన్నెపొర చిరగలేదు, కనుక అత్యాచారం జరగలేదు’ అని దొంగ సర్టిఫికెట్ ఇచ్చిన మహాఘనత వహించిన పాలకుల పాలన మనది. విశాఖపట్నం జిల్లా వాకపల్లిలో గ్రే హౌండ్స్ పోలీసులు ఆదివాసి గూడెంపై దాడి చేసి పదకొండు మంది మహిళలపై సామూహిక అత్యాచారం జరిపితే, రాష్ట్రమంతా గగ్గోలెత్తినా కేసు లేదు. నాలుగు సంవత్సరాల పాటు హైకోర్టుదాకా పోరాడితే గాని స్థానిక పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయాలనే ఆదేశం రాలేదు. ఇటువంటి అత్యాచార ఘటనలు, వాటి నేరస్తులు, ప్రభుత్వాల ఉదాసీన వైఖరి చరిత్ర ఎంత చెప్పినా తరగదు.

ఈ పూర్వరంగంలో, ప్రస్తుతం వినబడుతున్న ప్రతీకార, శిక్షా నినాదాలు ప్రతి అత్యాచారం సందర్భంలోనూ వెల్లువెత్తుతున్నాయా, లేక కొన్ని అత్యాచారాలకు మాత్రమే ఆ శక్తి ఉందా అని ఆలోచించవలసి ఉంది. ఇవాళ వెల్లువెత్తిన స్పందన చాల అవసరమైనదే. సహజమైనదే. న్యాయమైనదే. అది మన వ్యవస్థలో ఇంకా మిగిలి ఉన్న ఆర్ద్ర, మానవీయ భావనలకు అద్దంపట్టింది. కాని అది సరిపోదు. అది ఇంకా విస్తృతం కావాలి. అది ఇంకా లోతు పెరగాలి. అది కేవలం శిక్ష దగ్గర ఆగిపోగూడదు. సామాజిక శిక్షణ గురించి ఆలోచించాలి. సామాజిక నిర్మాణం గురించి ఆలోచించాలి. ఈ వ్యవస్థలో జరుగుతున్న ప్రతి అన్యాయం గురించీ, ప్రతి దుర్మార్గం గురించీ అటువంటి స్పందన రావాలి. అది సంఘటితం కావాలి. నిర్మాణయుతం కావాలి. ఇంకా బలోపేతం కావాలి. ఇంకా సమగ్రంగా, దీర్ఘకాలికంగా, మానవీయంగా సాగాలి. అప్పుడే ఒక్క నిర్భయకు కాదు, వేలాది మంది అనామక, అజ్ఞాత నిర్భయలకు నిజమైన నివాళి అవుతుంది.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

2 Responses to ఒక కన్నీటి చుక్క, ఒక కొవ్వొత్తి, ఒక ప్రతీకార ప్రకటన సరిపోతాయా? ఎన్ని పాతర్ల లోతు నుంచి మారాలి మనం?!

 1. బోనగిరి says:

  మీ వ్యాసం చాలా విపులంగా ఉంది.
  కొవ్వొత్తులు వెలిగించి, అవి ఆరిపోగానే సమస్యని మరిచిపోకూడదు.
  తొందరపాటు నిర్ణయాలు కాకుండా సమాజాన్ని సంస్కరించే ప్రక్రియ కూడ చేపట్టాలి.

  • charasala says:

   మీ వ్యాసం ఈ సమస్యని సంపూర్ణంగా, సమగ్రంగా, క్షణికావేశాల ప్రభావం లేకుండా చర్చించింది.

   “అది మన సమాజంలో ప్రతి మగవాడికీ పుట్టుక నుంచి మరణం దాకా నూరిపోయబడుతున్న, సామాజికీకరణలో భాగమైన ఒక సాంస్కృతిక లక్షణం.”

   నిజం. ఇన్ని ప్రదర్షణలు జరిగినా ఇంత మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపినా ఇంకా అంతకంటే ఎక్కువమంది ఆడపిల్ల ఆరుబయట తిరగటమే తప్పనీ, మన పాత చింతకాయ పచ్చడికిమల్లే ఆడది వంటీంటికి పరిమితం కాకపోవడం వల్లే ఈ అనర్థాలనీ నమ్ముతున్నారు.

   మీరన్నట్లు ఈ ఆలోచనాధోరణి మారటమే అసలు మార్పు. అలాంటి మార్పే సురక్షితమైన సమాజాన్ని సృష్టిస్తుంది. అయితే మీరన్నట్లు ఎన్నో లోలోతుల్లోనుండి పాతుకున్న ఈ భావజాలాన్ని పెకిలించడం అంత సులభంగా అయ్యేది కాదు.

   మొన్నా మధ్య పొరబాటున సాక్షి చానల్ చూడటం జరిగింది. అక్కడో పెద్దాయన రాజన్న పాలన ఎంత గొప్పదో వివరిస్తూ, ఆయన పాలనలో ఆసిడ్ దాడి చేసిన యువకులని ఎలా ఎన్‌కౌంటర్ చేశారో వుదహరిస్తున్నాడు. ఇలాంటి పనికిమాలిన వారి భావజాలంతో చానెళ్ళు, సినిమాలు, సమాజమూ అన్నీ కుళ్ళిపోతున్నాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s