మహాప్రస్థానం మహాప్రచురణ – ఒక ఉత్సవ సందర్భం

శ్రీశ్రీ విశ్వేశ్వరరావు ఆలోచనాచరణతో వెలువడిన మహాప్రస్థానం మహా ప్రచురణ నిజంగా తెలుగు సమాజమూ సాహిత్యలోకమూ జరుపుకోవలసిన ఒక ఉజ్వల ఉత్సవ సందర్భం. నిన్న ఉదయం ఆ పుస్తకం నా చేతికి అందగానే నా సంతోషం మీతో పంచుకున్నాను. నిన్నంతా ఆ పుస్తకంతోనే గడిచింది. ఇవాళ విశ్వేశ్వరరావు గారిని కలిశాను. మహాప్రస్థానం మహా ప్రతిలో ప్రతి పేజీనీ శ్రద్ధగా, ప్రేమగా, గొప్ప కళా హృదయంతో, సాంకేతిక నైపుణ్యంతో అలంకరించిన అరసవల్లి గిరిధర్ గారిని కలిశాను. వాళ్లిద్దరూ సాధించిన అద్భుతానికి ప్రశంస ఏ రూపంలో ఇచ్చినా సరిపోదు గాని ఉద్వేగభరితమైన కంటి తడితో, ప్రేమపూర్వక ఆలింగనంతో నా ధన్యవాదాలు చెప్పుకున్నాను.

నిన్న పుస్తకంతో నా ఫోటో, పోస్ట్ మీద వ్యాఖ్యానిస్తూ మిత్రులు కన్నెగంటి రామారావు గారు “మీకు ఈ పుస్తకం ఇంకా అర్థవంతం. ఇప్పటికీ, కవితా ఓ కవితా మద్దిపాటి గారింట్లో మీరు చెప్పడం గుర్తుంది” అని రాసి, జ్ఞాపకాల గని తవ్వకానికి పురికొల్పారు. పదమూడు సంవత్సరాల కింద 2008 జూన్ రెండో వారంలో నేనూ వనజా డెట్రాయిట్ లో మిత్రులు ఆనంద్ – శారదల ఇంట్లో ఉన్నప్పుడు, జూన్ 13 సాయంత్రం మిత్రులు మద్దిపాటి కృష్ణారావు గారి ఇంట్లో ఆరి సీతారామయ్య గారు, కన్నెగంటి రామారావు గారు వంటి డెట్రాయిట్ మిత్రులందరూ కలిశారు. అక్కడ నేను ఒకటి రెండు నా కవితలు చదివి, ఆ తర్వాత శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’ చదువుతుంటే కృష్ణారావు గారు రికార్డ్ చేశారు.

మహాప్రస్థానం గురించి తెలుగు పాఠకులకు, సాహిత్యాభిమానులకు కొత్తగా చెప్పవలసిందేమీ లేదు. గత ఏడు దశాబ్దాలలో అది పుస్తకంగానే కనీసం లక్ష ప్రతులు అచ్చయి ఉంటుంది. అందులో కవితలు విడివిడిగా కవితా సంకలనాలలో, పాఠ్యపుస్తకాలలో, సినిమాలలో, నాటకాలలో, వక్తల ఉపన్యాసాలలో, వేదికల మీద పఠనాలలో లక్షలసార్లు పునరుక్తమై ఉంటాయి. మహాప్రస్థానం మాత్రమే కాక, ఖడ్గసృష్టి, సిప్రాలి, మరోప్రస్థానం, కథలు, నాటకాలు, అనంతం ఎన్నోసార్లు ప్రచురణ అయ్యాయి. ఆయన సమగ్ర రచనలు ఇప్పటికీ కనీసం మూడు ప్రచురణాల్లో వెలువడ్డాయి. మొత్తంగా శ్రీశ్రీ సాహిత్యం మీద, ప్రత్యేకించి మహాప్రస్థానం మీద ఇతరుల రచనలు, వివరణలు, వ్యాఖ్యానాలు నూటయాబై పుస్తకాలైనా వెలువడి ఉండవచ్చు. సింగంపల్లి అశోక్ కుమార్ గారి శ్రీశ్రీ సాహిత్య నిధి ఒక్కటే శ్రీశ్రీ మీద వంద పుస్తకాలు ప్రచురించింది.

అయినా శ్రీశ్రీ మీద తెలుగు సమాజ సాహిత్యాల ఆసక్తి తరగలేదు. తెలుగు సమాజ సాహిత్యాలకు శ్రీశ్రీ అవసరం తీరలేదు. కాఫీ టేబుల్ బుక్ అనే మహా ప్రచురణ చదవడానికి అంత సౌకర్యవంతం కాకపోవచ్చు. అది ఒక గౌరవ ప్రకటన. ఒక ఆత్మీయ సంస్మరణ. ఒక విలువైన స్మరణిక. జాబిల్లిని తలచుకుంటే మనసు వెర్రెత్తి ఇదివరకెవరో అన్నదే, ఇంకా బాగా అన్నదే మళ్లీ వల్లిస్తానని శ్రీశ్రీ అన్నట్టు గానే, మహా ప్రస్థానం మహా ప్రచురణ శ్రీశ్రీ మాటలే వాడుకుని చెప్పాలంటే ‘ఒక చాలా సున్నితమైన పువ్వు, చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం.’ ఈ పువ్వు వికసిస్తున్న, ఈ కత్తి దూస్తున్న, ఈ వజ్రం వెలుగులు చిమ్ముతున్న ఈ సందర్భం నిజంగా ఉత్సవం చేసుకోవలసిన సమయం.               

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s