సామాజిక శాస్త్రాల అధ్యయనాలు
గ్రామాలను అధ్యయనం చేసే పద్ధతులు, పరికరాలు సామాజిక శాస్త్రాలలో గత శతాబ్దంలో విస్తృతంగా అభివృద్ధి అయ్యాయి. యూరపియన్ వలసవాద ప్రభుత్వాల పాలనా అవసరాల కొద్దీ కొంత, విశ్వవిద్యాలయాల విద్యా పరిశీలనలలో భాగంగా కొంత వివిధ దేశాలలోని ఆదిమ జాతులను పరిశీలించే మానవ శాస్త్రం (ఆంత్రొపాలజీ), సమాజ నిర్మాణాన్ని పరిశీలించే సమాజ శాస్త్రం (సోషియాలజీ) సామాజిక అధ్యయనాల మీద దృష్టి పెట్టాయి. ఈ రెండు శాస్త్రాల ఉమ్మడి చర్చనీయాంశాలతో సోషల్ ఆంత్రొపాలజీ, కల్చరల్ ఆంత్రొపాలజీ శాఖలు, సమాజ శాస్త్రంలో గ్రామాల అధ్యయనాల ప్రత్యేక శాఖగా రూరల్ సోషియాలజీ అభివృద్ధి అయ్యాయి. ఈ శాస్త్ర శాఖలన్నిటిలోనూ ప్రత్యేకమైన, నిశితమైన అధ్యయన పద్ధతులు, పరికరాలు తయారయ్యాయి.
అలాగే ఆర్థికవ్యవస్థలను పరిశీలించే అర్థశాస్త్రం, సామాజిక చలనాన్ని పరిశీలించే చరిత్ర, రాజకీయ నిర్మాణాలను పరిశీలించే రాజనీతిశాస్త్రం, పాలనావ్యవస్థలను పరిశీలించే ప్రభుత్వపాలనాశాస్త్రం, వ్యక్తి ప్రవర్తన మూలాలను, పర్యవసానాలను పరిశీలించే మనస్తత్వశాస్త్రం వంటి ఇతర సామాజికశాస్త్ర శాఖలు కూడ సమాజ పరిశీలనకు, గ్రామ పరిశీలనకు పూనుకుని తమ తమ పద్ధతులను, పరికరాలను అభివృద్ధి చేశాయి. అంతకుముందే రూపొంది ఉన్న పరికరాలతో, అవగాహనలతో పరిశీలన ప్రారంభించినా, పరిశీలనా క్రమంలో ఎన్నో కొత్త పరికరాలను కనిపెట్టడం జరిగింది. అలా ఈ శాస్త్ర శాఖలు, వాటి అధ్యయన పద్ధతులు ఇప్పటికీ విస్తరిస్తూనే ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి అన్ని సామాజిక శాస్త్ర శాఖలకూ ఉమ్మడిగా గుర్తించదగిన కొన్ని పరిశీలనా పరికరాలు తయారయి ఉన్నాయి. ఆ పరికరాలన్నీ కూడ భారత దేశంలో గ్రామ అధ్యయనాలకు ఉపయోగపడతాయి. ఆ పరికరాలన్నిటికీ కూడ వాటి సాంకేతిక ప్రత్యేకతలు, అవకాశాలు, పరిమితులు ఉన్నాయి. ఈ పరికరాలలో ప్రస్తుతానికి మనకు ఉపయోగపడే గ్రామ అధ్యయన పద్ధతులుగా సెన్సస్ (జనగణన), నమూనా సర్వే, ఇంటర్వ్యూ – ప్రశ్నావళి, గణాంకశాస్త్ర విశ్లేషణలు, కేస్ స్టడీ, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ (భాగస్వామ్య పరిశీలన) వంటి వాటిని అర్థం చేసుకుంటే సరిపోతుంది.
సెన్సస్
ప్రత్యేకించి సామాజిక శాస్త్రాలు అన్వేషించకపోయినా, ఆ శాస్త్రాలకన్న ముందునుంచే ఉనికిలో ఉన్నా, సామాజిక శాస్త్రాలన్నిటికీ గ్రామ అధ్యయనాలలో ఉపయోగపడే పరికరం సెన్సస్. దీన్ని జనగణన అని పిలుస్తున్నాం గాని అది కేవలం తలల లెక్కింపు మాత్రమే కాదు. దాని నిజమైన అర్థం ఒక ప్రాంతంలోని (సాధారణంగా ఒక దేశంలోని) జనాభా గురించిన క్రమబద్ధమైన సమాచారపు సమగ్ర గణాంకాలు అని. ఈ సమాచార వనరులో గ్రామ అధ్యయనాలకు ఉపయోగపడే అంశాలు ఎన్నో ఉంటాయి. భారత దేశంలో బ్రిటిష్ వలసకాలంలో 1872లో ఈ సెన్సస్ మొదలయ్యాయి. 1881 నుంచి క్రమబద్ధంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ సెన్సస్ సమాచార సేకరణ జరుగుతోంది. ఇప్పటికి పదిహేను సార్లు సేకరణ జరిగిన ఈ గణాంకాలు, వివరాలు గ్రామాల స్థితికీ, చలనానికీ సంబంధించిన పరిమాణాత్మక సూచికలను అందిస్తాయి. 1931 జనగణన వరకు దేశమంతా ఒకేరోజున జనసంఖ్యను లెక్కించేవారు. కాని సాంకేతికపరమైన ఇబ్బందుల రీత్యా ఆ ఒక్కరోజు జనగణనను వదిలేసి, 1941 నుంచీ ఫిబ్రవరిలో మూడువారాల పాటు జనసంఖ్య నమోదు చేయడం, మార్చ్ 1న చేర్పులు, మార్పులు (కొత్త జననాలు, మరణాలు) నమోదు చేసి జనగణన ఫలితాలు ప్రకటించడం మొదలయింది.
ఈ జనగణనలో కేవలం ఎంతమంది మనుషులు ఉన్నారనే అంకె మాత్రమే కాక, వారి వయసు, స్త్రీపురుష నిష్పత్తి, వైవాహిక హోదా, గ్రామ – పట్టణ నిష్పత్తి, వలసల వివరాలు కూడ ఉంటాయి. అంతకన్న ముఖ్యంగా, మతం, మాతృభాష, తెలిసిన భాషలు, షెడ్యూల్డ్ కులం లేదా తెగకు చెందినవారా, విద్యాస్థాయి, శ్రామిక స్థాయి, వృత్తి, పారిశ్రామిక ఉపాధి, నివాసస్థలం నుంచి పనిస్థలానికి దూరం, ప్రయాణసౌకర్యం, వ్యవసాయరంగ కుటుంబాల భూమి విస్తీర్ణం, యాజమాన్య స్థితి, నీటి పారుదల సౌకర్యం, నివాసగృహం స్థితి, నివాసగృహంలో గదుల సంఖ్య, శారీరక, మానసిక వైకల్యం, తాగునీటి వసతి, మరుగుదొడ్డి, స్నానాలగది వసతి, ఇంట్లో రాత్రిపూట వెలుగుకు వనరు, వంటకు వాడే ఇంధనం, ప్రయాణ, రవాణా వాహనాల వసతి, వినోద, విజ్ఞాన, సమాచార సాధనాల వసతి మొదలయిన సామాజిక, ఆర్థిక సమాచారం కూడ జనగణనలో భాగమే. ప్రస్తుతం ఈ జనగణన కుటుంబ జాబితా (హౌజ్ లిస్ట్ షెడ్యూల్), గృహ వివరాలు (హౌజ్ హోల్డ్ షెడ్యూల్) అనే రెండు ప్రధాన సమాచార పత్రాల ద్వారా జరుగుతోంది. వీటిలో మొదటి పత్రంలో ఒక కుటుంబానికి సంబంధించిన 34 వివరాలు, రెండవ పత్రంలో ఒక ఇంట్లో ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన 17 వివరాలు సేకరిస్తారు.
జనగణనలో విలువైన సమాచారమే పోగు పడుతుంది గాని ఆ సమాచారానికి సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు కూడ కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది, ఈ వివరాలు, గణాంకాల నాణ్యతలో, కచ్చితత్వంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. దేశపు స్థూల స్థాయిలో దాదాపు సమగ్రంగా, కచ్చితంగా ఉండే ఈ అంకెలు సూక్ష్మ స్థాయిలో అంతే సమగ్రంగా, కచ్చితంగా ఉంటాయని చెప్పలేం. “గ్రామం, పట్టణం/నగరం, వాటిలోని వీథులు వంటి చిన్న భౌగోళిక ప్రాంతాల సమాచారంలో కొన్ని పొరపాట్లుండే అవకాశం ఉంది. వయసు, వైవాహికస్థితి, విద్యాస్థాయి, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి సమాచార సేకర్తల, సమాచార దాతల నిర్లక్ష్యం వల్ల సమాచార నమోదు సమయంలో జరిగే పొరపాట్లు కావచ్చు. ఆ సమాచారాన్ని విశ్లేషించే సమయంలో జరిగే పొరపాట్లు కావచ్చు. లేదా ఆ సమాచారం అచ్చయ్యేటప్పుడు జరిగే పొరపాట్లు కావచ్చు. కాని ఆ సమాచారాన్ని విశాల స్థాయిలో, స్థూల స్థాయిలో కలగలిపినప్పుడు ఆ పొరపాట్లలో చాలభాగం ఒకదాన్ని ఒకటి సరిచేసుకుంటాయి, లేదా ఆ పొరపాట్ల తీవ్రత తగ్గుతుంది. అందువల్ల, జనగణన సమాచారాన్ని జిల్లాలకో, ఇంకా పెద్ద భౌగోళిక ప్రాంతాలకో వాడినప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. సూక్ష్మస్థాయిలో వాడినప్పుడు చాల జాగ్రత్త వహించవలసి ఉంటుంది” అని జనగణన మీద ప్రామాణిక పరిచయ గ్రంథం పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ది న్యూ మిలీనియం: సెన్సస్ 2001 లో మహేంద్ర కె ప్రేమి అన్నారు.
ఆ జాగ్రత్తతో పాటే, జనగణన సమాచార సేకరణలో ప్రతి విడతకూ మార్పులు చేర్పులు జరుగుతున్నాయని కూడ గుర్తించవలసి ఉంది. ఉదాహరణకు 1931 వరకు కులం నమోదయ్యేది, ఆతర్వాత రద్దయింది. 1941 వరకు నరజాతి (రేస్) నమోదయ్యేది, ఆతర్వాత రద్దయింది. 1951, 1961 లలో జాతి (నేషనాలిటీ) నమోదయింది గాని ఆ తర్వాత రద్దయింది. ప్రస్తుతం సేకరిస్తున్న సమాచారంలో ఎక్కువ అంశాలు 1991, 2001 జనగణనలలో కొత్తగా చేరినవే. అలాగే ఒక జనగణనకూ మరొక జనగణనకూ మధ్య వాడే పదజాలంలో మార్పులు, ఒకే పదానికి నిర్వచనాలలో మార్పులు కూడ ఉంటున్నాయి. ఉదాహరణకు పట్టణం అనే మాటకు, శ్రామికులు అనే మాటకు ఒక్కొక్క జనగణనలో ఒక్కొక్క రకమైన నిర్వచనం ఉంది. పట్టణం అనే మాటకు 1991 జనగణనలో నిర్వచనానికీ, 2001 జనగణనలో నిర్వచనానికీ తేడా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పట్టణాల సంఖ్య 1991లో 264గా ఉన్నదల్లా 2001 నాటికి 210కి తగ్గింది. ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో జనగణన నిర్వచనం ప్రకారం కొత్తగా 35 పట్టణాలు వచ్చాయి. పాత జాబితాలోని 89 పట్టణాలు ఇతర పట్టణాలలో కలిసిపోవడమో, పట్టణ నిర్వచనం నుంచి తొలగిపోవడమో జరిగింది. పట్టణాల సంఖ్య ఇలా మారిపోయిందంటే ఆ మేరకు గ్రామాల సంఖ్య, గ్రామీణ జనాభా కూడ మారిపోయినట్టే.
ఈ లోపాల గురించి జాగ్రత్త వహిస్తూనే జనగణన వివరాల నుంచి గ్రామానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు, గణాంకాలు సేకరించవచ్చు. సాధారణంగా జనగణనలో గ్రామ వివరాల పట్టికలు ఐదారు సంవత్సరాల తర్వాత అచ్చువేస్తారు. ఇటీవల ఆ వివరాలన్నిటినీ ఇంటర్నెట్ మీద సెన్సస్ వెబ్ సైట్ (http://www.censusindia.gov.in) లో కూడ పెడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని ఏ గ్రామానికైనా సంబంధించిన దాదాపు ఇరవై అంశాల మౌలిక సమాచారాన్ని ఈ జనగణన వివరాలనుంచి సేకరించవచ్చు. సాధారణంగా సామాజిక శాస్త్రపు గ్రామ అధ్యయనాలకు మొదటి మెట్టు ఈ జనగణన వివరాల సేకరణే.
ప్రత్యక్ష పరిశీలనా పద్ధతులు
జనగణన వివరాలయితే గ్రామానికి వెళ్లకుండానే సేకరించే వీలుంది గాని, గ్రామానికి వెళ్లకుండా గ్రామాన్ని అధ్యయనం చేయడం అసాధ్యం. గ్రామానికి వెళ్లినప్పుడు కూడ అక్కడ కనబడే వందలాది, వేలాది మందిని కలిసి మాట్లాడడం, ఆ మాటలవెనుక సారాంశాన్ని గ్రహించడం, గ్రామాన్ని తిరిగి చూడడం, అక్కడి పరిణామాలను పరిశీలించడం సులభమైన పని కాదు. అందుకు ఎక్కువ సమయమూ, నిశితమైన దృష్టీ మాత్రమే కాదు, ప్రజాభిప్రాయాన్ని, ప్రజాభిమతాన్ని గ్రహించగలిగే పరికరాలు కూడ కావాలి.
ఆ పరికరాలతో సాగే పరిశీలనను సామాజిక శాస్త్రాలు నియంత్రిత పరిశీలన, అనియంత్రిత పరిశీలన అని రెండు రకాలుగా విభజిస్తాయి. నియంత్రిత పరిశీలన అంటే పరిశీలించ దలచుకున్న అంశాన్ని వేరు చేసి, సూటిగా, ప్రత్యక్షంగా పరిశీలించడం. పరిశీలకులకు పరిశీలనా వస్తువు మీద నియంత్రణ, అదుపు ఉండేలా చూడడం. అనియంత్రిత పరిశీలనలో పరిశీలనా వస్తువు మీద పరిశీలకులకు ఎటువంటి అదుపూ లేకుండా పరిశీలనా వస్తువును దాని నిత్యజీవితాచరణలో సహజంగా, స్వేచ్ఛగా ప్రవర్తించనిచ్చి పరిశీలకులు తమ పరిశీలన సాగించడం. నియంత్రిత పరిశీలనా పద్ధతులలో నమూనా సర్వే, ఇంటర్వ్యూ – ప్రశ్నావళి, కేస్ స్టడీ ముఖ్యమైనవి. నమూనా సర్వే, ప్రశ్నావళి ద్వారా వచ్చిన సమాచారాన్ని సాధారణంగా గణాంకశాస్త్ర పద్ధతులలో విశ్లేషించడం జరుగుతుంది. అనియంత్రిత పరిశీలనా పద్ధతులలో పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ముఖ్యమైనది.
అయితే ఏ పరికరాలు ఉపయోగించినా సమాజాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి, పరిశోధించడానికి ఒక ప్రధానమైన పరిమితి ఉంది. ప్రకృతి పరిశీలనలో పరిశీలనా వస్తువుకూ పరిశీలకులకూ మధ్య స్పష్టమైన విభజన ఉంటుంది. చాలవరకు ప్రకృతి పరిశీలనావస్తువు నిశ్చలంగా ఉంటుంది, చలనంలో ఉన్నప్పుడు కూడ దానిమీద ఇతర ప్రభావాలు లేకుండా నియంత్రించి పరిశీలించడం జరుగుతుంది. కాని సామాజిక పరిశీలన చేసేటప్పుడు పరిశీలనా వస్తువూ మనిషే, పరిశీలన చేసేదీ మనిషే. పరిశీలనా వస్తువూ పరిశీలక వస్తువూ కూడ నిరంతర చలనంలో, ఆలోచనలో, ప్రభావాలలో, పరస్పర ప్రభావాలలో ఉంటారు. ఈ అన్యోన్య చర్య – ప్రతిచర్యల వల్ల పరిశీలనా వస్తువులోనూ పరిశీలకులలోనూ కూడ పరిశీలనాక్రమంలోనే మార్పులు వస్తాయి. ఈ మార్పులక్రమం కూడ సంక్లిష్టంగా, గజిబిజిగా, ఆదానప్రదానాలతో, వర్తులంగా, బహుముఖంగా ఉండడం వల్ల సంపూర్ణంగా గుర్తించడం కూడ కష్టమవుతుంది. పరిశీలకులు తమలో జరిగిన మార్పులను పరిశీలనావస్తువులో మార్పులుగా పొరపడుతున్నారా, పరిశీలనా వస్తువులో నిజంగా జరిగిన మార్పులను గమనించ గలుగుతున్నారా, అటూ ఇటూ కూడ జరిగిన మార్పుల సంబంధాన్ని గుర్తిస్తున్నారా కచ్చితంగా చెప్పలేని స్థితి ఉంటుంది. సమాజ స్థితిగతుల గురించి మనుషులలో భిన్నమైన అభిప్రాయాలు, అంచనాలు, నిర్ధారణలు ఉండడానికి కారణం ఇదే. కనుకనే సామాజిక పరిశీలనలో పరిశీలకులు తమ పరిశీలనా పరికరాలను ఎక్కువ జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. తాత్విక దృక్పథంలో, పరిశీలనా లక్ష్యంలో స్పష్టంగా ఉంటూనే, పరిశీలనా పరికరాలను కచ్చితంగా వాడినప్పుడు మెరుగైన నిర్ధారణలకు రావడానికి అవకాశం ఉంటుంది.
నమూనా సర్వే
ప్రకృతికి సంబంధించిన పరిశీలనలు సాధారణంగా ఒక నమూనా (శాంపిల్ – మచ్చు) ను తీసుకుని జరుగుతాయి. ఒక అణువు మీద పరిశోధన ద్వారా అటువంటి అనేక అణువులు ఉన్న పదార్థం స్థితినీ గతినీ విశ్లేషిస్తారు. అందరికీ తెలిసిన మామూలు ఉదాహరణ చెప్పాలంటే ఒక మెతుకు పట్టి చూసి అన్నం ఉడికిందా లేదా చెపుతారు. ఈ నమూనా పద్ధతినే సామాజిక పరిశీలనకు కూడ ఉపయోగించవచ్చునని భావించిన సామాజిక శాస్త్రాలు నమూనా పరిశీలన పద్ధతిని అభివృద్ధి చేశాయి. అయితే ప్రకృతిలోని పదార్థంలోని అణువుల చలనం కన్న సమాజంలోని మనుషుల చలనం విశిష్టమైనది. అణువులకు ఆలోచన, స్వీయ ఆచరణ, నిర్దిష్ట లక్ష్యం కోసం ఆచరణ లేవు, మనుషులలో ప్రతి ఒక్కరికీ, మానవమేధకు సహజంగానే అవన్నీ ఉన్నాయి. అందువల్ల ఒక మనిషిని అర్థం చేసుకుంటే మరొక మనిషిని అర్థం చేసుకున్నట్టు కాదు. సమాజంలో ఒక్కరిని మినహా మిగిలిన వారందరినీ పరిశీలించినా ఆ మిగిలిపోయిన ఒక్క వ్యక్తే తన ప్రత్యేకతలతో ఉండవచ్చు. మరి సమాజంలోని మొత్తం మనుషులను పరిశీలించడం ఏ ఒక్కరికీ, ఎంత పెద్ద పరిశోధనా సంస్థకూ సాధ్యం కాదు. అందువల్ల ఇక్కడ కూడ నమూనా పరిశీలన పద్ధతిని ఉపయోగించవచ్చునని, కాకపోతే ఈ నమూనాను ఎంచుకోవడంలో పరిశోధనా లక్ష్యాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక శాస్త్రాలు భావించాయి. ఎంపిక చేసిన నమూనాకు ప్రాతినిధ్య స్వభావం ఉండాలని, సమూహంలోని ఏ వ్యక్తినయినా నమూనాగా తీసుకునే అవకాశం ఉండాలని, సమాజంలోని ప్రత్యేకతలకు, విభజనలకు, వైవిధ్యాలకు నమూనాలో చోటు కల్పించాలని, పరిశీలనా వస్తువులో భిన్న స్థాయిలు ఉన్నప్పుడు నమూనాలను కూడ ఆయా స్థాయిలలో తీసుకోవాలని, ఆ నమూనా ఆధారంగా చేసే నిర్ధారణ మొత్తం సమాజానికి సరిపోగలిగేలా ఉండాలని, ఏవైనా మినహాయింపులు ఉన్నా అవి గణాంక పొరపాట్లుగా, అతి తక్కువగా మాత్రమే ఉండాలని సామాజిక శాస్త్రాలలో అనేక జాగ్రత్తలు ఉన్నాయి.
ఒక గ్రామానికి వెళ్లి అధ్యయనం చేసేటప్పుడు గ్రామంలోని రెండు మూడు వేల మంది ప్రజలలో ప్రతి ఒక్కరినీ కలిసి, వారి సమాచారం సేకరించి, పరిశీలించి, నిర్ధారణలు చేయడం అసాధ్యం. అది ఎక్కువ శ్రమనూ కాలాన్నీ వ్యయాన్నీ తీసుకుంటుంది గనుక ఈ నమూనా పరిశీలన పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. మొట్టమొదట గ్రామం గురించి సమగ్ర చిత్రాన్ని గ్రహించి, ఆ గ్రామంలోని కుల, మత, ఆర్థిక, వయో, స్త్రీ-పురుష, అక్షరాస్య-నిరక్షరాస్య విభజనల ఆధారంగా ఆయా సమూహాలను గుర్తించి ప్రతి సమూహం నుంచీ నమూనాలను ఎంపిక చేస్తారు. పరిశీలనా లక్ష్యాన్ని బట్టి ఆ నమూనాలను పరిశీలించి అంతిమ నిర్ధారణలకు వస్తారు. సమూనాలను పరిశీలించడానికి ఇంటర్వ్యూ, ప్రశ్నావళి, కేస్ స్టడీ వంటి పద్ధతులున్నాయి.
ఇంటర్వ్యూ – ప్రశ్నావళి
ఈ అధ్యయనాల నమూనాలుగా ఉండేది వ్యక్తులే గనుక వారితో సంభాషించడం ద్వారా, నిర్దిష్టమైన అంశాలపై ప్రశ్నలు వేసి వారినుంచి సమాధానాలు రాబట్టడం ద్వారా సమాచారం సేకరించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ పద్ధతి ముందే నిర్ణయించుకున్న ప్రశ్నావళి రూపంలోనైనా ఉండవచ్చు, సంభాషణలో అప్పటికప్పుడు ప్రస్తావనకు వచ్చే అంశాలను నమోదు చేయడం రూపంలోనైనా ఉండవచ్చు.
పరిశీలనాంశాన్ని బట్టి నమూనా నుంచి గాని, మొత్తం జనాభా నుంచి గాని రాబట్టదలచుకున్న సమాచారం ఏమిటో స్పష్టత ఉంటే ఆ సమాచార సేకరణకు అవసరమైన ప్రశ్నపత్రాలను తయారు చేసుకోవచ్చు. ఆ ప్రశ్నపత్రాల నిడివి ఎంతయినా ఉండవచ్చు. నాలుగైదు ప్రశ్నలకు పరిమితమైన ప్రశ్నపత్రాలనుంచి ముప్పై పేజీల ప్రశ్నపత్రం దాకా అనేక రకాల ప్రశ్నపత్రాలు ఉన్నాయి. లేదా విడివిడి ప్రశ్నలు కాక, ప్రశ్నలను రంగాలుగా విభజించి ఆయారంగాల మీద స్థూలంగా సమాచారం సేకరించే పద్ధతి కూడ ఉంది. పెద్దపెద్ద పరిశోధనా పథకాలలో సామాజిక శాస్త్ర శాఖలు ఈ ప్రశ్నపత్రాలను తయారు చేసి, గ్రామాలకు వెళ్లి ఆ ప్రశ్నపత్రాలకు సమాధానాలు నింపుకురావడానికి సమాచార సేకర్తలను, పరిశోధక విద్యార్థులను నియమిస్తాయి. ఆ సమాచార సేకర్తలు ఆ ప్రశ్నపత్రాలతో గ్రామస్తులలో ఎంపిక చేసిన నమూనాల దగ్గరికి వెళ్లి ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ సమాచారం నమోదు చేస్తారు. ఈ ప్రశ్నపత్రాలు తామే నాలుగైదు రకాల జవాబులు ఇచ్చి వాటిలో ఒకదాన్ని ఎంచుకొమ్మనడం గాని, లేదా ప్రశ్న మాత్రమే ఇచ్చి జవాబు చెప్పమనడం గాని చేస్తాయి. సమాచార స్పష్టత, సమగ్రత అడిగిన ప్రశ్నలమీదనే ఆధారపడి ఉంటాయి. ప్రశ్నలు అడిగిన పద్ధతే ఒకరకమైన జవాబును ఆశించినదైనా, సమాచారదాతకు అర్థంకానిదైనా, సమాచారదాతను గందరగోళపరిచేదైనా జవాబులు సరిగా రావు. పరిశీలనా లక్ష్యమే దెబ్బతింటుంది. అందువల్ల ప్రశ్నలు వీలయినంత తటస్థంగా, సూటిగా, భిన్నమైన అర్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
గణాంకశాస్త్ర విశ్లేషణలు
నమూనా పరిశీలన ద్వారా, ప్రశ్నపత్రాల జవాబుల ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించడం పెద్దపని. ఒక గ్రామ జనాభా కొన్ని వేలు అయితే నమూనా కొన్ని డజన్లో, కొన్ని వందలో కూడ కావచ్చు. నమూనా అతి తక్కువగా పదుల్లో ఉన్నప్పటికీ కూడ ప్రతి మనిషీ ఒక్కొక్క రకమైన జవాబు చెప్పి ఉండవచ్చు. అప్పుడు ఎన్ని నమూనాలు ఉంటే అన్ని రకాల జవాబులు ఉంటాయి. అన్నిరకాల జవాబులు ఉన్నప్పుడు వాటిని విశ్లేషించి నిర్దిష్టమైన నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఆ వైవిధ్యాన్ని గ్రహించాలంటే ఆ జవాబులలో సన్నిహితంగా ఉన్న జవాబులేవో, అత్యధిక స్థాయిలో వెలువడిన జవాబేదో, ఎక్కువ సంభావ్యమైన అంచనా ఏదో గుర్తించగలగాలి. ఈ సంభావ్యతలను అంచనా కట్టడానికి గణాంకశాస్త్ర పరికరాలు వాడవలసి వస్తుంది. సగటు, మధ్యరాశి, వృద్ధిరేటు, నిష్పత్తి, సంభావ్యత, సమీకరణం వంటి అనేక పరికరాల ద్వారా సామాజిక చిత్రాన్ని పట్టుకోవలసి వస్తుంది.
కేస్ స్టడీ
నమూనా పరిశీలనకు ఉండగల పరిమితులను దృష్టిలో పెట్టుకుని, ఒక రకంగా నమూనా పరిశీలన లోని సంఖ్యాత్మక నిర్ధారణలను గుణాత్మక నిర్ధారణలతో పూరించేందుకు కేస్ స్టడీ (సందర్భ పరిశీలన) అనే పరికరం తయారయింది. ఇది నమూనాలోని, లేదా నమూనాకు బైట ఉండే కొన్ని వాస్తవ చిత్రాలను తీసుకుని వాటిని వివరంగా చర్చిస్తుంది. ఒక మనిషిని, సమూహాన్ని, పరిణామాన్ని ఒక సందర్భంగా తీసుకుని దాన్ని సమగ్రంగా వివరించడం, చర్చించడం ద్వారా దానిలోని ప్రత్యేకతలను వెలికి తీయడానికి ప్రయత్నం జరుగుతుంది. నమూనా పరిశీలనలో అన్ని ప్రత్యేకతలూ రద్దయి సగటు నిర్ధారణలే బయటపడతాయి గాని, కేస్ స్టడీలో ప్రత్యేకతల చిత్రణ, విశ్లేషణ జరుగుతుంది. గ్రామాన్ని, సమూహాన్ని మొత్తంగా తీసుకుని పరిశీలించడం, నమూనాల మీద ఆధారపడక పోవడం, సమాచార సేకరణలో పొరపాట్లను తొలగించడానికి అనేక పద్ధతులు ఉపయోగించడం, సమాచారదాతలను సమాచారవనరులుగా మాత్రమే కాక జ్ఞానవంతులుగా చూడడం కేస్ స్టడీలో ప్రధానమైన అంశాలు. నమూనా పరిశీలనా పద్ధతితో పాటు కేస్ స్టడీ పద్ధతి కూడ ఉపయోగిస్తే గ్రామ అధ్యయనం సమగ్రం అవుతుంది.
పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ (భాగస్వామ్య పరిశీలన)
నమూనా పరిశీలన, ఇంటర్వ్యూ, ప్రశ్నావళి, సర్వే, గణితశాస్త్ర విశ్లేషణలకన్న భిన్నమైనది, ప్రపంచవ్యాప్తంగా మానవశాస్త్రం అభివృద్ధి చేసినది, భారతదేశంలో సమాజ శాస్త్రం ద్వారా ఎక్కువగా ప్రచారం లోకి వచ్చినది పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ పద్ధతి. ఒక సమాజాన్ని పరిశీలించదలచుకున్న పరిశీలకులు ఆ సమాజాన్ని బైటినుంచి పరిశీలించజాలరని, దానిలో భాగస్వాములైనప్పుడే సరైన పరిశీలన సాధ్యమవుతుందని, పరిశీలనావస్తువు విశ్వసనీయతను చూరగొనాలన్నా, పరిశీలనావస్తువుకు సంబంధించిన విశిష్ట సంస్కృతిని అర్థం చేసుకోవాలన్నా పరిశీలకులు ఆ పరిశీలనావస్తువులో భాగస్వామి కావాలని ఈ పద్ధతి చెపుతుంది.
ఇరవయో శతాబ్దపు తొలి దశకాలలో పాపువా న్యూగినియా దీవులలో ఆదిమజాతులను అధ్యయనం చేసిన పోలిష్ మానవ శాస్త్రవేత్త బి కె మాలినోవ్ స్కీ ఈ పద్ధతికి ఆద్యుడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన ప్రారంభించిన ఈ పద్ధతిని ఆ తర్వాత ఎంతో మంది మానవ, సమాజ శాస్త్రవేత్తలు అనుసరించారు. నెలల తరబడి, ఏళ్ల తరబడి కూడ గ్రామ సమాజాలలో, ఆదిమ సమూహాలలో నివసిస్తూ వారి ఆచార వ్యవహారాలను, నిత్య జీవితాచరణను గమనిస్తూ, నమోదు చేసుకుంటూ, వారితో సంభాషిస్తూ, సమాచారం సేకరిస్తూ తమ అధ్యయనాలను కొనసాగించారు. గ్రామ చరిత్రను, గ్రామంలోని సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక పరిణామాలను, గ్రామంలోని ప్రజల మధ్య సంబంధాలను సన్నిహితంగా పరిశీలించడానికి ఈ భాగస్వామ్య పరిశీలన అవకాశం ఇస్తుంది. ఈ క్రమంలో పరిశీలనకు గురవుతున్న సమాజం పరిశీలకులను ప్రభావితం చేస్తుంది. పరిశీలకులు ఆ సమాజాన్ని ప్రభావితం చేస్తారు. మామూలు పరిశీలకులు గుర్తించలేని సున్నితమైన, చిన్న విషయాలను కూడ సాన్నిహిత్యం వల్ల భాగస్వామ్య పరిశీలకులు గుర్తించగలరు.
ఇటువంటి భాగస్వామ్య పరిశీలన అధ్యయనం పరిశోధకుల మీద ఎంత గాఢమైన ప్రభావం వేస్తుందో చూపడానికి ప్రఖ్యాత భారత సమాజ శాస్త్రవేత్త ఎం ఎన్ శ్రీనివాస్ ఒక ఉదాహరణ. ఆయన తొలితరం సమాజ శాస్త్రవేత్తగా పాత మైసూరు రాష్ట్రంలోని రాంపుర అనే గ్రామంలో 1948లో దాదాపు పదినెలల పాటు నివసించి అధ్యయనం చేశారు. ఒక బహు కుల గ్రామీణ వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందో, భిన్న కులాల వ్యక్తుల మధ్య, ఒకే కులంలోని వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో పరిశోధించడం ఆయన లక్ష్యం. అప్పుడు ఆయన సేకరించి, విశ్లేషించిన సమాచారమంతా ఆ తర్వాత ఇరవై సంవత్సరాలకు 1970లో ఆయన స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ గ్రామ అనుభవం ఆయన మీద ఎంత గాఢమైన ప్రభావాన్ని వేసిందంటే, అలా ప్రాథమిక సమాచారాన్నంతా పోగొట్టుకున్నప్పటికీ కేవలం జ్ఞాపకాల మీద మాత్రమే ఆధారపడి ఆయన ఆ గ్రామం గురించి ది రిమెంబర్ డ్ విలేజ్ అనే అద్భుతమైన పుస్తకం రాశారు.
ఈ భాగస్వామ్య పరిశీలనా పద్ధతి గ్రామ అధ్యయన పద్ధతులన్నిటిలోకీ చాల లోతయినది, విశాల అవకాశాలు గలది. గ్రామం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, లోతుగా విశ్లేషించడానికి వీలు కలుగుతుంది. కాని పరిశోధక విద్యార్థులకు మినహా ఇతరులెవరికైనా ఈ పద్ధతికి అవసరమైన సమయం ఇవ్వడం కష్టమవుతుంది.
ఈ గ్రామ అధ్యయన పద్ధతులన్నీ వాటికవిగా మేలైనవీ, ఉపయోగకరమైనవీ అయినప్పటికీ మార్క్సిస్ట్ దృక్పథం నుంచి చూసినప్పుడు మాత్రం వీటిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ సామాజిక శాస్త్ర పరిశీలనా పరికరాలన్నీ రూపానికి ఇచ్చిన ప్రాధాన్యతను సారానికి ఇవ్వవు. పద్ధతికి ఇచ్చిన ప్రాధాన్యతను వస్తువుకు ఇవ్వవు. చరిత్ర గురించీ, పరిణామం గురించీ కొంతవరకు మాట్లాడినప్పటికీ, ఎక్కువగా ఘటనల చిత్రణ, విశ్లేషణ దగ్గరే ఆగిపోతాయి. కొంతవరకు కార్యకారణ సంబంధాలను కూడ స్పృశిస్తాయి గాని కార్యం కూడ కారణం అవుతుందని, పరస్పర సంబంధాలలో అది ఒక వర్తుల చలనమనీ గతితార్కిక అవగాహన లోపిస్తుంది. ఈ సామాజిక శాస్త్ర అధ్యయన పద్ధతులలో అవసరమైనవాటిని ఉపయోగించుకుంటూనే, వాటికి నేపథ్యంలో మార్క్సిస్టు దృక్పథం ఉండాలనే ఆలోచనతో సాగితేనే గ్రామ అధ్యయనాలు అర్థవంతమైన నిర్ధారణలను తీయగలవు. గ్రామసమాజపు చలనాన్ని అర్థం చేసుకోవాలంటే, భవిష్యత్ గమనానికి చోదకశక్తులను, చరిత్ర పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే మార్క్సిస్టు దృక్పథంతో, అంతకు ముందరి పరికరాలలో ఉపయోగకరమైన వాటన్నిటినీ ఉపయోగించుకుంటూ సాగవలసి ఉంటుంది.