సంఘ్ పరివార్ ఫాసిజానికీ, హంతక అసహనానికీ మరొక స్వతంత్ర ఆలోచనాపరుడు బలయ్యాడు. సంఘ్ పరివార్ లో భాగమైన భారతీయ జనతా పార్టీ, అందులోనూ గుజరాత్ నరమేధపు నెత్తురంటిన చేతుల నరేంద్ర మోడీ, కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత పెట్రేగి పోతున్న హిందూ మతోన్మాద శక్తుల దాడులలో బలి అయిపోయిన జాబితాలో మరొక పేరుగా రోహిత్ వేముల పేరు చేరింది. కాకపోతే అంతకు ముందరి నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే, ఎం ఎం కల్బుర్గి, మహమ్మద్ అఖ్లాక్ లను సంఘ్ పరివార్ శక్తులు ప్రత్యక్షంగా హత్య చేయగా, రోహిత్ వేములది ఆత్మహత్యగా కనిపించే వ్యవస్థీకృత హత్య. కేవలం భిన్నాభిప్రాయాలు ఉన్నందువల్ల ఈ దేశంలో హిందూ బ్రాహ్మణీయ హంతక భావజాలానికీ, దాని ఉగ్రరూపమైన సంఘ్ పరివార్ దాడులకూ బలి అయినవారిలో రోహిత్ వేముల మొదటివారూ కాదు, చివరివారూ కాకపోవచ్చు. కాని ఒక అత్యున్నత విద్యాసంస్థలో పరిశోధక విద్యార్థిగా, విశాలమైన సృజనాత్మక ఆలోచనలు, అద్భుతమైన వ్యక్తీకరణ శక్తి ఉన్న మేధావిగా ఆయన మరణం అత్యంత విచారకరమైనది. ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులు, మరణానంతర ప్రజాగ్రహం, ఆ ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి సంఘ్ పరివార్ శక్తులు చేస్తున్న తప్పుడు వాదనలు సమాజం తీవ్రంగా పట్టించుకోవలసిన, ఆలోచించవలసిన ఎన్నో మౌలిక అంశాలను లేవనెత్తుతున్నాయి.
ఆత్మహత్యగా కనబడుతున్న రోహిత్ ది నిజానికి వ్యవస్థ చేసిన హత్య అనడానికి అనేక కారణాలున్నాయి. సమాజంలో అసంఖ్యాకుల పట్ల అమలవుతున్న అసమానతలను, అవమానాలను, వివక్షను హిందూ బ్రాహ్మణీయ భావజాలం నిర్దేశిస్తున్నది. అపౌరుషేయమని చెప్పే రుగ్వేదంలోని పురుషసూక్తం, స్వయంగా భగవంతుడి నోటి నుంచి వెలువడినట్టు చెపుతున్న భగవద్గీత, సమాజ ధర్మశాస్త్రంగా వెలువడిన మనుస్మృతి వర్ణాశ్రమ ధర్మాన్ని, అంతరాలను, వివక్షను స్పష్టంగా నిర్దేశించి అసమానతలకు మత ఆమోదాన్ని ప్రకటించాయి. సమాజంలోని అత్యధిక సంఖ్యాకులను విద్యకూ, సామాజిక జీవితానికీ, సంస్కృతికీ, రాజకీయాలకూ, అధికారానికీ దూరం చేయాలని హిందూ ధర్మపు ప్రధాన గ్రంథాలన్నీ ఘోషించాయి. ఆ గ్రంథాల గురించి తెలియకపోయినా, అవి చదవకపోయినా అవి ప్రబోధించే విలువలు సమాజ సంస్కృతిగా మారినందువల్ల ఆ విలువలను పాటించేవారు విస్తృతంగా ఉన్నారు. అసమానతల, నిచ్చెనమెట్ల వ్యవస్థ సహజమైనదనీ, దాన్ని ఆమోదించి, పునరుత్పత్తి చేయడం కన్న మనుషులు చేయగలదేమీ లేదనీ అనుకునే స్థితి వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నది. అసమానతలను, వాటికి మూలమైన మత-కుల వ్యవస్థలను ప్రశ్నించిన గొంతులను నులిమేయడం కూడ వందల సంవత్సరాలుగా జరుగుతున్నది. కాలక్రమంలో మతం వ్యక్తిగత విశ్వాసం స్థాయి నుంచి సామూహిక మతోన్మాద హింస స్థాయికి మారింది. రాజ్యమూ మతమూ కలగలిసిన విష కషాయానికి సామ్రాజ్యవాదం రంగులద్దింది.
ఇదీ ఇవాళ భారత సమాజంలో హిందూ బ్రాహ్మణీయ భూస్వామ్య సామ్రాజ్యవాద దళారీ శక్తుల మిలాఖత్తు. ఈ దుర్మార్గ పాలనలో పుట్టుకే ఒక ప్రాణాంతక ప్రమాదం. పుట్టకముందే అత్యధికుల పేర్లు దేశద్రోహుల, మతద్రోహుల, అవమానితుల, బహిష్కృతుల జాబితాలో చేరిపోతున్నాయి. ఇక వారు జీవితాంతం ఆ శిలువ మోస్తూ ఒంటరితనంలో బతకవలసిందే. అలా మత, కుల అసమానతల వ్యవస్థ చేసిన హత్య రోహిత్ ది.
ఆధునిక సమాజంలో కుల అసమానతలు, కుల వివక్ష ఉండగూడదని, మనుషులందరూ సమానమేనని, తరతరాలుగా వివక్షకు, అవకాశాల నిరాకరణకు గురైన సమూహాలకు రక్షణలు కల్పించాలని ఎన్నో ఉద్యమాలు, ఎందరో ఆలోచనాపరుల చర్చల ఫలితంగా విద్యారంగంలో దళితుల ప్రవేశానికి అవకాశం దొరికినప్పటికీ, అప్పటికే విద్యాసంస్థలను ఆక్రమించుకుని కూచున్న అగ్రవర్ణాలు వాటిని అగ్రహారాలుగా మార్చాయి. విద్యాలయాలలో కూడ సామాజిక అసమానతలను, వివక్షను, కుల, మత విద్వేషాలను పెంచి పోషించే సంఘ్ పరివార్ సంస్థలూ పుట్టుకొచ్చాయి. విద్యాసంస్థల యాజమాన్యాలకూ సంఘ పరివార్ సంస్థలకూ మధ్య ఉన్న మిలాఖత్తు ఫలితమే రోహిత్ మీద, మరి నలుగురు దళిత విద్యార్థుల మీద అమలయిన సాంఘిక బహిష్కార శిక్ష. ఆ రకంగా కూడ రోహిత్ ది వ్యవస్థ చేసిన హత్యే.
మన సమాజంలో సమసమాజ ఆలోచనలు, ప్రగతిశీల ఉద్యమాలు, దళిత అనుకూల సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇంకా బహిష్కృత దళిత విద్యార్థులు తమ సమస్యలను ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కునే పరిస్థితి లేకపోవడం, వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒంటరితనాన్ని, వెలివాడ లోని స్థితిని అనుభవించవలసి రావడం ప్రగతిశీల ఉద్యమాలన్నీ తమను తాము ప్రశ్నించుకోవలసిన సవాళ్లను ముందుకు తెస్తున్నాయి. సామాజిక అసమానతలకు వ్యతిరేక చైతన్యం అవసరమైన స్థాయిలో ప్రచారం కాలేదని, కుల దురభిప్రాయాలు, కుల వివక్షా ఆలోచనలు ఇంకా బలంగానే ఉన్నాయని, కుల వివక్ష మీద పోరాటం ఇంకా అవసరమైన స్థాయిలో జరగడం లేదని చేదు నిజాలను రోహిత్ హత్య చూపుతున్నది. ఆ రకంగా రోహిత్ హత్య మన సమాజంలో ప్రగతిశీల ఆలోచనల, ఆచరణల లోపాలనూ, వైఫల్యాలనూ ప్రకటిస్తున్నది. అలా కూడ రోహిత్ ది వ్యవస్థ చేసిన హత్యే.
ఈ నేపథ్యంలో కంటికి కనబడుతున్న ప్రత్యక్ష శత్రువులకు, హంతకులకు శిక్షలు పడాలని, రోహిత్ కు న్యాయం జరగాలని ఎలుగెత్తడం ఎంత అవసరమో, ఈ హత్య వెనుక ఉన్న వ్యవస్థాగత కారణాలను అన్వేషించి, వాటిని తొలగించే దిశగా ఆలోచనలనూ ఆచరణలనూ పెంచుకోవడం అంత అవసరం. హిందూత్వ భావజాలపు దుర్మార్గానికీ, కుల వివక్షకూ, సంఘ్ పరివార్ శక్తుల దౌర్జన్యాలకూ, విద్యాసంస్థల యాజమాన్యాల నిరంకుశత్వానికీ, ప్రగతిశీల శక్తులలో ఉన్న అలసత్వానికీ వ్యతిరేకంగా చైతన్యాన్ని సమీకరించడం, పోరాడడం ఇవాళ ఎంత తక్షణ అవసరమో రోహిత్ హత్య చెపుతున్నది. గత రెండు సంవత్సరాలుగా పెచ్చరిల్లిన సంఘ్ పరివార్ హంతక అసహనం మీద కేంద్రీకరిస్తూనే, వ్యవస్థాగత కారణాలన్నిటి మీదా పోరాటం ఎక్కు పెట్టడమే ఇవాళ్టి చారిత్రక కర్తవ్యం.
(వీక్షణం ఫిబ్రవరి 2016 సంపాదకీయం)