అసలు నీటి కోసమేనా ఈ వివాదాలు?

నవ తెలంగాణ దినపత్రిక ఆగస్ట్ 4, 2021 కోసం – తెలంగాణార్థం

కొద్ది నెలలుగా జల వివాదాలు అనే పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీచులాటలు, ఖండన మండనలు జరుగుతున్నాయి. శ్ర్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు టిఎంసి ల నీటిని రాయలసీమకు తీసుకుపోయే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే మొదటి వారంలో అధికారిక అనుమతులు ఇవ్వడంతో అంతకు ముందరి చిటపటలు మంటలుగా రగుల్కొన్నాయి. నీరు నిప్పై మండడం ప్రారంభమైంది. దానికి ప్రతిగా తెలంగాణ కాబినెట్ జూన్ లో కృష్ణా నదీ జలాల వినియోగానికి ఆరు పథకాలను ఆమోదించింది. జూలైలో కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో జల విద్యుదుత్పాదన చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది.

ఇలా ఈ ఘర్షణ పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రాజెక్టుల యాజమాన్య పరిధి, ఆలంపూర్ బారేజి, వరదకాలువ, నాగార్జునసాగర్ టేల్ పాండ్ ఎత్తిపోతల పథకం వంటి ప్రతిపాదనలు, కృష్ణా మిగులు జలాలు, నికరజలాలు, పాత పంపిణీలలో అసమానతలు, కొత్త పంపిణీ జరగవలసిన అవసరం వంటి అనేక సంబంధిత అంశాల చుట్టూ తిరుగుతూ చినికి చినికి గాలివాన అయింది. ఇంతలోనే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు కేంద్ర ప్రభుత్వం (నిజానికి దాన్ని కేంద్ర ప్రభుత్వం అనడం తప్పనీ, సమాఖ్య ప్రభుత్వం అనాలనీ అంటున్న తమిళ సోదరుల నుంచి మనమింకా నేర్చుకోవలసే ఉంది) అన్ని హక్కులనూ కృష్ణా, గోదావరీ జలాల బోర్డులకు అప్పగిస్తూ దుర్మార్గమైన గెజెట్ నోటిఫికేషన్ ప్రకటించింది. ఆ ఢిల్లీ సర్కారు దుర్మార్గం అతి వేగంగా ముందుకు సాగుతూ ఉండగానే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ తమ మీదికి వస్తున్న ఉత్పాతాన్ని పట్టించుకోనట్టు తమలో తాము కీచులాడుకుంటున్నాయి. దాదాగిరీ అనీ, దౌర్జన్యం అనీ, మోసం అనీ, కొల్లగొట్టడం అనీ ఒకరి మీద ఒకరు దుర్భాషలాడుకుంటున్నారు.

రెండువైపులా సామరస్యంగా ఆలోచించలేని, ఉద్రేకాలు పెరిగిన ఈ నేపథ్యంలో చరిత్ర తవ్వి ఎవరి తప్పు ఎంత నిర్ధారించడం అసాధ్యమవుతుంది. కాని గుర్తించవలసిన విషయమేమంటే రెండు వైపులా పాలకుల దృష్టి నీటి మీద మాత్రమే లేదు. రెండు వైపులా నీరు ఒక సాకు మాత్రమే. రెండు ప్రాంతాల పాలకులూ నీటిని సెంటిమెంటుగా వాడుకుంటున్నారు. ప్రజల భావోద్వేగాల్ని రెచ్చగొట్టే దినుసుగా మాత్రమే చూస్తున్నారు. జలవివాదాన్ని వోటు బ్యాంక్ ను బలోపేతం చేసుకునే, స్థిరపరచుకునే సాధనంగా చూస్తున్నారు. న్యాయాన్యాయాల జోలికి, చట్టబద్ధత చట్టవ్యతిరేకత జోలికి పోకుండా ఎవరు ఎంత ఎక్కువ బిగ్గరగా అరిస్తే, ఎవరు అవతలివాళ్ల మీద ఎంత ఎక్కువ అభాండాలు వేస్తే అంత ఎక్కువగా తమ ప్రాంతంలోని ప్రజలను ఆకర్షించగలమని అనుకుంటున్నారు.

ఇటువంటి వాతావరణంలో చరిత్ర, వాస్తవాలు, న్యాయభావన, ప్రజాప్రయోజనాలు వంటివన్నీ గాలికి, కాదు నీళ్లలో, కొట్టుకు పోతున్నాయి. అంతకన్న ముఖ్యంగా ఏ స్థానిక, ప్రాంతీయ హక్కు కోసం ఇరు పక్షాలూ ఇంత ఘర్షణకు దిగుతున్నాయో, ఆ స్థానికత, ప్రాంతీయత ధ్వంసమై, మొత్తంగా ఎటువంటి హక్కూ అధికారమూ లేని సమాఖ్య ప్రభుత్వ జోక్యం పెరుగుతున్నది. ఇప్పుడిది సుప్రీంకోర్టుకు కూడ చేరి, అస్సాం-మిజోరాం రాష్ట్రాల మధ్య హింసాయుతంగా మారిన ఘర్షణ ప్రస్తావన కూడ వచ్చింది. అంటే మొత్తం మీద నదీ జలాల పంపిణీ సమస్యను తమ మధ్య సామరస్యంగా పరిష్కరించుకోవలసిన రెండు పరీవాహక రాష్ట్రాల పాలకులు తమ రాజకీయ, తాత్కాలిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అనవసరమైన వివాదానికి కాలు దువ్వుతున్నారు.

ఎక్కువగా సాంకేతిక అంశాలలోకి పోకుండానే, ఈ వివాదానికి మూలాలు చరిత్రలోనే ఉన్నాయని గుర్తించవలసి ఉంది. పశ్చిమ కనుమలలో పుట్టిన కృష్ణా నది మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు దాటి తెలంగాణలో ప్రవేశిస్తుంది. పద్నాలుగు వందల కి.మీ. పొడవైన ఈ నదిలో సాలీనా 2,060 టిఎంసిల నీరు (75 శాతం లభ్యతతో) ఉంటుందని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ (బచావత్ ట్రైబ్యునల్) అంచనావేసింది. ఆ ట్రైబ్యునల్ అవార్డ్ ప్రకారం అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి 811 టిఎంసిలు దక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణానది తెలంగాణలో 68.5 శాతం ప్రవహిస్తుండగా, నీటి వాడకం మాత్రం 19.7 శాతం ఉండేలా ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణం జరిగాయి. కృష్ణా జలాల మీద న్యాయంగా హక్కు ఉండే పరీవాహక ప్రాంతాలైన మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరవలసినంతగా నెరవేరలేదు. కృష్ణానదీ జలాల వినియోగదారులలో దిగువన ఉన్న రెండు మూడు జిల్లాల రెండు పంటల, మూడు పంటల ప్రయోజనం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎగువ జిల్లాల ప్రజల పొలాలూ గొంతులూ ఎండబెట్టాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదిన అసంతృప్తులలో అది ఒకటి.

అలా ఉమ్మడి రాష్ట్రానికి దక్కిన వాటాను న్యాయబద్ధంగా పంపిణీ చేయకపోవడం ఒక అంశమైతే, అసలు కొన్ని సంవత్సరాలు వందల టిఎంసిల నీరు వృథాగా సముద్రంలోకి ప్రవహిస్తుండగా, కొన్ని సంవత్సరాలు వాటాకు తగిన నీరు కూడ రాని పరిస్థితి ఉండేది. నిజానికి కృష్ణా జలాల లభ్యత 2,060 టిఎంసిలు అనేది సరైన అంచనా కాదని, అంత నీరు లభ్యమయ్యే సంవత్సరాలు అతి తక్కువ అని, ఆ మొత్తం లభ్యతను వాస్తవికంగా, అంటే తక్కువగా నిర్ధారించి ఆమేరకే వాటాలు కేటాయించవలసి ఉండిందని రాసిన జల నిపుణులు కూడ ఉన్నారు. ఈ నికర జలాలు కాక, ఉంటాయో ఉండవో తెలియని మిగులు జలాల మీద హక్కు ఎవరిదనే వివాదం ఉండనే ఉంది.

బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపిణీని పునఃపరిశీలించవలసి ఉందనే ఆకాంక్ష, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలో మిళితమైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఈ జల వివాదాల పరిష్కార బాధ్యతను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న బోర్డులకు అప్పగించింది. అప్పటికి ఐదు సంవత్సరాల కింద ఏర్పడిన బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ దీర్ఘకాలిక పరిష్కారం కోసం చర్చలు, సంప్రదింపులు జరపవలసి ఉందని, ఈ లోగా తాత్కాలిక కేటాయింపుగా 2015లో అప్పటికి ఉన్న 811 టిఎంసిల నీటినే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 66:34 నిష్పత్తితో పంపిణీ చేసింది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ కు 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలు దక్కాయి. ఈ అసమాన పంపిణీలోనే అన్యాయం ఉంది. నిజానికి అప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో తమ నీటి వాటా తమకు దక్కలేదని, అన్యాయం జరిగిందని వాదిస్తూ వచ్చిన తెలంగాణ ఉద్యమ నాయకులు పాలకులు కాగానే ఈ అసమాన పంపిణీని పేరుకు సుప్రీం కోర్టులో సవాలు చేసినప్పటికీ, వాస్తవంగా అంగీకరించారు. ఒకరకంగా అప్పటివరకూ జరిగిన అన్యాయాలను స్థిరీకరించారు. బహుశా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అవకాశం ఉండే ఈ అసమానతను యథాతథంగా ఉంచడమే భవిష్యత్తులో తమకు ఉపయోగపడుతుందని అనుకున్నారేమో తెలియదు. నిజానికి ప్రస్తుత వివాదంలోని దాదాపు అన్ని అంశాలకూ మూలాలు 2014 ముందరి చరిత్రలో ఉండగా, ఆ అంశాలను 2015 అసమాన పంపిణీ స్థిరీకరించింది.

ఈ స్థితిలో ప్రధానంగా మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయాలని, కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు పనితీరు సమన్వయపూరితంగా, ప్రజాస్వామికంగా, పారదర్శకంగా ఉండాలని వాదించవలసిన తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయలేదు. బేసిన్ లో ఉన్నదా లేదా అనే ప్రశ్నతో సంబంధం లేకుండా కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ సాగునీటి, తాగునీటి అవసరాల కోసం, కృష్ణా, గుంటూరు ప్రయోజనాలు తగ్గించి అయినా కృష్ణా జలాలు అందించవలసి ఉంటుందని, అందుకు ఎగువ రాష్ట్రాల నుంచి రాదగిన అభ్యంతరాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకోలేదు.

ఇటు తెలంగాణ ప్రభుత్వం నీటిని ఇంకా ఇంకా ఎక్కువగా సెంటిమెంటుగా మార్చడమెట్లా, నీరు కోరే ప్రజలకు ఎండమావులు చూపుతూ తన వెనుక ఉంచుకోవడమెట్లా, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షకురాలిని తాను మాత్రమేననిపించే రాజకీయ క్రీడలో పావులు కదపడం ఎట్లా, సమస్య వచ్చినప్పుడల్లా తెలంగాణ తెలంగాణ అని ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టే వీలు ఉంచుకోవడం ఎట్లా అని మాత్రమే ఆలోచిస్తూ వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్ పాలకులు పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయార్థిక విధానాలనూ, రాయలసీమ పట్ల వివక్షనూ అట్లాగే కొనసాగిస్తూ, మాటల్లో మాత్రం రాయలసీమకు ఏదో ఒరగబెడుతున్నట్టు నటించే కళను యథాతథంగా కొనసాగించారు. అంతకు ముందరి ఉమ్మడి ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ కేంద్ర జల సంఘం, నదీజల బోర్డులు, పర్యావరణ సంస్థలు ఇవ్వవలసిన అనుమతులు, ఆర్థిక అనుమతులు లేకుండానే ప్రజలను మాయ చేయడానికి ప్రాజెక్టులు ప్రకటించడం, కాంట్రాక్టర్లను మేపడానికి నిధులు విడుదల చేయడం, ప్రతి పనీ వివాదంలో చిక్కుకుని ముందుకు కదలకపోవడం అనే క్రమాన్ని కొనసాగించారు.

అయితే ప్రస్తుత సమస్య రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ కాదు, జలవివాదాలూ కాదు, అంతకన్న తీవ్రమైన సమస్య రెండు రాష్ట్రాలకూ ఎదురైంది. అది రెండు రాష్ట్రాలలోని అన్ని భారీ, మధ్యతరహా నీటి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరీ నదీజల నిర్వహణ బోర్డులకు అప్పగిస్తూ సమాఖ్య ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు.  సమాఖ్య ప్రభుత్వపు జలశక్తి మంత్రిత్వ శాఖ జూలై 15న జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం నీటి విడుదల, నీటి పారుదల, జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతించడం వంటి పనులన్నిటి మీద ఈ బోర్డులకే అధికారం ఉంటుంది. రెండు రాష్ట్రాలూ ఇప్పటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నిటినీ తక్షణమే ఆపవలసి ఉంటుంది.

హిందీలోనూ, ఇంగ్లిష్ లోనూ కలిసి డెబ్బై పేజీలు ఉన్న ఈ గెజెట్ నోటిఫికేషన్ ఎంత అప్రజాస్వామికంగా, సమాఖ్యభావనకు విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను ఉల్లంఘిస్తూ తయారయిందో వివరంగా చర్చించవలసి ఉంది. ఎచ్ అనే ఒకే ఒక్క నిబంధన చూస్తేనే ఇవి ఎంత దుర్మార్గమైన ఉత్తర్వులో అర్థమవుతుంది. కృష్ణా నదీజల నిర్వహణ బోర్డులో “ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని చైర్మన్ గా గాని, సభ్య కార్యదర్శిగా గాని, సభ్యులుగా గాని, చీఫ్ ఇంజనీర్లుగా గాని నియమించడానికి వీలులేదు” అని ఆ నిబంధన చెపుతుంది. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వారెవరూ ఈ రెండు రాష్ట్రాల గురించి జరిగే చర్చలో భాగం కావడానికి వీలు లేదనడం సంఘ్ పరివార్ గుత్తాధిపత్య రాజకీయాలకు నిదర్శనం. కశ్మీరీల భవిష్యత్తు గురించి జరిగే చర్చలలో భారత ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడ భాగం పంచుకోవచ్చు గాని కశ్మీరీలకు మాత్రం స్థానం లేదని చెప్పే భారత పాలకవర్గాల దృక్పథం అది.

నిజానికి ఇది భారత అధికార వ్యవస్థలో అలవాటైన పద్ధతి కూడ కాదు, పంజాబ్, హర్యానాల మధ్య, తమిళనాడు కర్నాటకల మధ్య, తుంగభద్ర పరీవాహక రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు వచ్చినప్పుడూ, అంతకుముందూ రూపొందించిన మధ్యవర్తి యంత్రాంగాలలో తప్పనిసరిగా ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు ఆ పద్ధతి ఎందుకు వదిలేస్తున్నారో వివరణ లేదు. జలవివాదాలు పరిష్కరించడానికి ఢిల్లీయో సుప్రీంకోర్టో జోక్యం చేసుకోవాలని కోరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ అప్పుడు ఆ ఆకాంక్షను ఎందుకు వ్యక్తం చేసిందో గాని, ఇప్పుడు ఢిల్లీ బొటనవేలు పెత్తనం కింద నలిగిపోక తప్పదు.

ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ సమస్యను తమ మధ్యనే పరిష్కరించుకోవాలనీ, దానికన్న ముఖ్యంగా ఈ ప్రజా సమస్యను తమ రాజకీయ, తాత్కాలిక అవసరాల కోసం ఉపయోగించుకోగూడదనీ అనుకోవలసి ఉంది. అవి అలా అనుకునేలా ఒత్తిడి తేవలసింది ప్రజలే.   

  • ఎన్ వేణుగోపాల్

ఆగస్ట్ 3, 2021

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in Telugu. Bookmark the permalink.

Leave a comment