ఎంత గొప్ప స్వాతంత్ర్యం!

ఆరుపదులు నిండిన స్వతంత్రభారతం గురించి మురిసిపోవడానికేమున్నది? ఈ దేశ ప్రజలు ఏ ఆశలతో, కలలతో బ్రిటిష్ పాలకులను వెళ్లగొట్టే మహోజ్వలపోరాటాలు నడిపారో ఆ ఆశలన్నీ అడియాసలయిన, ఆ కలలన్నీ కల్లలయిన అరవైగ్రీష్మాలను చూసి గర్వపడడానికి ఏమున్నది?

స్వాతంత్ర్యమంటే తెల్లదొరలు దిగిపోయి నల్లదొరలు ఎక్కడం కాదని, ఒకమనిషిని వేరొక మనిషి పీడించే సాంఘికధర్మం మారడమని భగత్ సింగ్ ఇచ్చిన నిర్వచనం గుర్తులేనంత మొద్దునిద్దరలో సాగాయి ఈ ఆరుపదులు. ఆ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ముహూర్తాన జవహర్ లాల్ నెహ్రూ భవిష్యత్తుతో చేసుకున్న ఒప్పందం గురించి భాషా సౌందర్యానికి ముచ్చట పడడమే తప్ప ఆ ఒప్పందం ఎవరి మధ్య జరిగిందో, ఎవరి భవిష్యత్తు బండలై పోయిందో తెలుసుకోలేనంత సుషుప్తిలో సాగాయి ఈ ఆరుపదులు. ఎవరి ప్రయోజనాలు గీటురాయిగా పాలన సాగాలని గాంధీ చెప్పాడో ఆ నిరుపేద, చిట్టచివరి మనిషి పాలకుల దృష్టిలో లేనేలేకుండా గడిచిపోయాయి ఈ ఆరుపదులు. మువ్వన్నెల మీదినుంచి కాషాయం నుంచి ముదురు ఎరుపు దాకా పాలకుల జెండాలు ఎన్ని రంగులుమార్చినా దోపిడీ, పీడనలలో, ప్రజల బతుకులో ఏమీ మార్పురాలేదు.

‘స్వతంత్ర భరత వర్ష వాస్తవ్యుడా మానవుడు, అతికించండి అతడి ముఖానికి మళ్లీ చిరునవ్వు’ అని శ్రీశ్రీ రాసి సరిగ్గా అరవై సంవత్సరాలవుతున్న సమయాన వందకోట్ల భరతవర్షవాస్తవ్యుల ముఖాలమీద నిరాశానిస్పృహలు అరవైసంవత్సరాల కిందటికన్నా ఎక్కువయ్యాయి. భారతపౌరుల ముఖాలమీద చిరునవ్వులుఅతికించడం కాదు, పెదాలమీదప్లాస్టర్లు అతికించే, చెవుల్లో సీసంపోసే, కళ్లకు గంతలు కట్టే, అసలు మనుషులనే మాయంచేసే కార్యక్రమం నిర్విరామంగా సాగుతున్నది. దౌర్జన్యం ప్రజాస్వామ్యం పేరుపెట్టుకుని రాజ్యం చేస్తున్నది. దేశప్రజల వనరులను దేశదేశాల సంపన్నులకు దోచిపెట్టే కార్యక్రమం నిరాటంకంగా, అరవైఏళ్లకిందికన్న ఎక్కువగా సాగుతున్నది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం రద్దయిపోయినా, రవి అస్తమించని బహుళజాతిసంస్థల సామ్రాజ్యం కొనసాగుతూ దానికి ప్రధానవలసగా, ముడిసరుకుల వనరుగా, సువిశాల మార్కెట్ గా భారతదేశం అలరారుతున్నది. నూటయాభైఏళ్లకింద మొదలయి, అరవైఏళ్లకింద విజయం సాధించినట్టనిపించిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలు బలిపెట్టిన వేలాదిమంది అమరవీరుల భవిష్యదుజ్వల ఆశలు ఈ వర్తమానంలో అబద్ధాలై విషాదగానం చేస్తున్నాయి.

రాష్ట్రంలోనూ, దేశంలోనూ జరుగుతున్న ఏ ఒక్క సంఘటన చూసినా మనం అనుభవిస్తున్నది స్వాతంత్ర్యం కాదనీ, స్వాతంత్ర్యమే అయితే అది ఏ పిడికెడు మందికోవచ్చినది తప్ప ప్రజలందరికీ అందినది కాదనీ అర్థమవుతుంది. అరవై సంవత్సరాలలో దేశం ఏమి సాధించిందో, ఆ సాధించిన ఫలితాలు ఎవరి బొక్కసాలకు చేరాయో, దేశం ఏమి సాధించలేకపోయిందో, ఆ వైఫల్యాలు ఎవరి ఇంట కన్నీటినీ చీకటినీ నింపాయో కథలుకథలుగా వందకోట్ల కథలు చెప్పవచ్చు. వెలుగులేదని కాదు, ఆ వెలుగు ఎవరు హక్కుభుక్తం చేసుకున్నారు? ఇంత పెద్దఎత్తున దేశవ్యాప్తంగా, దేశ జనాభాలో తొంభై శాతం మందిమీద నీడను వ్యాపింపజేసి కులుకుతున్న వెలుగు సమర్థనీయమేనా?

ఆరుదశాబ్దాల స్వతంత్ర, ప్రజాస్వామిక, సమసమాజ, లౌకిక, సామాజికన్యాయ పాలన సాగినతర్వాత ఈ జనాభాలో అత్యధికులు తమకు న్యాయంగా అందవలసిన వాటా అందలేదని ఫిర్యాదుచేస్తున్నారు. శాసనవ్యవస్థ, కార్యనిర్వాహకవర్గం మాత్రమే కాదు న్యాయవ్యవస్థ, ప్రచారమాధ్యమాలు కూడ ప్రజాప్రయోజనాలకన్న స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్న ఈ స్వతంత్ర భారతం అరవైఏళ్లకింది అస్వతంత్ర భారతం కన్న ఎక్కడ మెరుగ్గా ఉన్నదని ప్రశ్నిస్తున్నారు.

ఆరుదశాబ్దాల స్వతంత్ర భారత జనాభాలో పదిహేనుశాతం మందికి ఇంకా అస్పృశ్యత తొలగలేదు. అస్పృశ్యులైతే చాలు వాళ్లమీద దాదూఫిర్యాదూ లేకుండా దౌర్జన్యం చేయవచ్చుననే, చంపిపారవెయ్యవచ్చుననే అగ్రవర్ణ అహంకారమూ చెక్కుచెదరలేదు. ఈ అరవై సంవత్సరాలలో దళితులమీద అత్యాచారం జరగని రోజు ఉండి ఉండదు. ఆ అత్యాచారాలలో న్యాయస్థానందాకా వెళ్లి నేరస్తులకు శిక్షలు పడినవి నూటికి ఒక్కటి కూడ ఉండవు. ఎక్కడో ఒకచోట న్యాయం జరిగినట్టనిపించినా అది ఒక ప్రదర్శనవస్తువే, మినహాయింపే తప్ప సర్వసాధారణం కాదు.

ఆరు దశాబ్దాల స్వతంత్రభారతంలో ఆదివాసులమీద బ్రిటిష్ పాలనలో కన్న ఎక్కువ దౌర్జన్యం జరిగింది. ఆదివాసులను వారి సహజ ఆవాసాలనుంచి నిరాశ్రితులను చేయడానికి, వారి నేలలో ఉన్న వనరులను, ఖనిజ సంపదను, అటవీసంపదను బహుళజాతిసంస్థలకు, ఆ సంస్థల భారతీయ దళారీలకు దోచిపెట్టడానికి సకలప్రయత్నాలూ జరిగాయి, జరుగుతున్నాయి.

ఢాకా నేతపనివాళ్ల చేతివేళ్ల కణుపులు తెగగోసిన, అనేక చేతివృత్తులకులాల జీవితాలను అతలాకుతలం చేసిన, భారతీయ వ్యవసాయాన్ని ధ్వంసంచేసిన దుర్మార్గం గురించి బ్రిటిష్ పాలకులను నిందిస్తూ ఉంటాం. మరి ఆరుదశాబ్దాల స్వతంత్రభారతంలో ఎంతమంది నేతపనివాళ్లు ఆత్మహత్యలకు బలి అయ్యారో, లక్షలాది పల్లెలు కన్నీరు పెట్టి సబ్బండవర్ణాలు చితికిపోయిన దృశ్యాలు ప్రదర్శించాయో, అధికారిక గణాంకాల ప్రకారమే ఎన్ని లక్షలమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారో – ఎవరిని నిందిద్దాం?

జనాభాలో సగంగా ఉండి ఇవాళ్టికీ అధికారాలలో, అవకాశాలలో సగం కాదుగదా, మూడో వంతు పొందడానికి కూడ అనేక అవరోధాలు ఎదుర్కొంటున్న మహిళల మీద భ్రూణహత్యలనుంచి సతీసహగమనాల దాకా బ్రిటిష్ పాలనాకాలపు అత్యాచారాలలో ఏ ఒక్కదాన్నీ తుదముట్టించలేకపోయిన ఆరుదశాబ్దాల స్వాతంత్ర్యం మనది. మతం, భాష, జాతి పరంగా అల్పసంఖ్యాకులైనవారిమీద నిత్యం దౌర్జన్యం జరుగుతున్న సర్వధర్మ సమభావ రాజ్యం మనది. పౌరహక్కులు రాజ్యాంగంలో అలంకారంగా మిగిలిపోయి, చట్టబద్ధపాలన అనేది హాస్యాస్పదమైపోయి, చట్టం అమలుకావాలని అడిగినందుకు నెత్తుర్లు పారి, అధికారంలోఉన్నవారి ఇష్టారాజ్యంగా చట్టం చలామణీ అవుతున్న హింసారాజ్యం మనది. ఆరుదశాబ్దాల స్వతంత్రపాలనతర్వాత, తిండిగింజల ఉత్పత్తిలో నాలుగున్నరరెట్ల పురోగతి సాధించికూడ మూడురెట్లు పెరిగిన జనాభాకు అన్నం పెట్టలేకపోతున్న అన్నపూర్ణరాజ్యం మనది. ప్రపంచ పేదలలో సగానికన్న ఎక్కువకు ఆశ్రయమిస్తున్న సంక్షేమరాజ్యం మనది. తరతరాలుగా మన ప్రజలు కాపాడుకుంటూ వస్తున్న ఖనిజ వనరులనూ, సహజసంపదలనూ ఒకటిరెండుతరాలలో ఖాళీ చేయగలిగే, ఆధునిక ఈస్టిండియా కంపెనీలకు అప్పగించగలిగే విధానాలనూ ఆచరణనూ నిస్సిగ్గుగా అమలు చేస్తున్న సర్వసత్తాక రాజ్యం మనది. శాసననిర్మాతలు, రాజకీయవేత్తలు కావడమంటే అతిఎక్కువ లాభాలు సంపాదించే వ్యాపారంలోకి దిగడంగా అర్థం మార్చిన ప్రజాస్వామిక వ్యవస్థ మనది.

అంతంత పెద్ద విషయాలు అక్కరలేదు, అంత వెనక్కికూడ వెళ్లనక్కరలేదు. గత రెండువారాలలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, అన్ని రాజ్యవ్యవస్థలూ చేసిన పనులు – అణు ఒప్పందం నుంచి ఖైదీల క్షమాభిక్ష నుంచి తస్లీమా మీద దాడిదాకా – చూస్తే గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చాడనే సామెత గుర్తు వస్తుంది. ఇది స్వాతంత్ర్యం అవునోకాదో, అయితే ఎవరిదో ఎవరికి వారే తేల్చుకోవచ్చు.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in English, Vartamaanam. Bookmark the permalink.

5 Responses to ఎంత గొప్ప స్వాతంత్ర్యం!

 1. “ఎవరి ప్రయోజనాలు గీటురాయిగా పాలన సాగాలని గాంధీ చెప్పాడో…”

  గాంధీగారిని ఏకవచనంలో ప్రస్తావించేటంత ఎదిగాం, ఈ జన్మకిది చాలు !

 2. gopinath says:

  cheppina mukhyamaina vishayaalanu pattinchukokunda anavasaramga maatlaade vaallani pattinchu kokandi..

 3. శంకర్ says:

  ” పరాయి పాలన నుండి స్వతంత్ర్యం సంపాదించ గలిగాము కాని , 50 యేళ్లు దాటిన స్వ పరిపాలనలో అంతగా అభివృద్ది సాదించ లేకపోతున్నాము”

 4. శంకర్ says:

  “స్వాతంత్ర్యమంటే తెల్లదొరలు దిగిపోయి నల్లదొరలు ఎక్కడం కాదని, ఒకమనిషిని వేరొక మనిషి పీడించే సాంఘికధర్మం మారడమని భగత్ సింగ్ ఇచ్చిన నిర్వచనం గుర్తులేనంత మొద్దునిద్దరలో సాగాయి ఈ ఆరుపదులు”

 5. vamshidhar reddy says:

  chala baga undi,manam sadinchina swathanthram ea vidanga undo chala chakkaga chepparu, 60 years lo manam sadinchindi edi ledu ekanina prathi vidyarthi melkoni oka kalam garini adharsham chesukoni mana deshanni munduku nadupudam ,prapanchm lone manadeshanni mundunchudam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s