ఫిబ్రవరి 23, 2010, ఈభూమి కోసం
తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని ఒక పెద్దమనిషి జవాబిచ్చాడని మనందరికీ తెలిసిన సామెత. పొంతనలేని అబద్ధాలు చెప్పే వ్యవహారాన్ని సూచించడానికి ప్రాచీన వివేకం ఈ నుడికారాన్ని తయారు చేసింది. దూడగడ్డికోసం ఎక్కవలసింది తాటిచెట్టు కాదని, అక్కడ గడ్డి దొరకదని, ఆ రెండిటికీ సంబంధం లేదని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా తాడిచెట్టు ఎక్కదలచిన తాగుబోతు తనను తాను వంచించుకుంటూ ఇతరులను వంచించడానికి ప్రయత్నిస్తుంటాడు.
డా. మన్మోహన్ సింగ్ విశ్వ విఖ్యాత అర్థశాస్త్రవేత్త గనుక, భారతీయ రిజర్వ్ బ్యాంకు లోనూ, ప్రపంచ బ్యాంకు లోనూ, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలోనూ, సౌత్ కమిషన్ లోనూ చిరకాలం పనిచేసి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిగా చేరి ప్రపంచీకరణ క్రమాన్ని ప్రారంభించారు గనుక, గత ఆరు సంవత్సరాలుగా ప్రధాన మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు గనుక అంతటి పెద్దమనిషిని ఆ దూడగడ్డి సాకు చెప్పిన తాగుబోతుతో పోల్చడం భావ్యం కాదు.
కాని ఆయన నోటివెంట ఫిబ్రవరి 6న వెలువడిన ఒక ప్రకటన అక్షరాలా దూడగడ్డి సామెతకు సరిపోయేలా ఉండడం ఆశ్చర్యకరం. ఆరోజున న్యూఢిల్లీలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడులను రానిస్తేగాని ధరలు తగ్గవని ప్రబోధించారు. లేదా తిరగేసి చెప్పాలంటే చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎందుకు అహ్వానిస్తున్నారంటే ధరలు తగ్గించడానికే అని చెప్పారు. ఇటీవల జనసామాన్యాన్ని తీవ్రంగా ఆందోళన పరుస్తున్న నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల గురించి చర్చించడానికి ఆ సమావేశం ఏర్పాటయింది. మరీ ముఖ్యంగా ఆహారపదార్థాల ధరల వార్షిక పెరుగుదల రేటు 17.56 శాతం దాటిన ఆందోళనకర స్థితిలో ఈ సమావేశం ఏర్పాటయింది. అంటే అక్కడ ప్రధానంగా ధరల గురించి, ధరల పెరుగుదల గురించి, ఆ ధరల పెరుగుదలను అరికట్టే మార్గాల గురించి చర్చించవలసి ఉండింది. ఆ చర్చ ఎంత జరిగిందో తెలియదు గాని, ‘జీ హుజూర్, జో హుకుం’ అని బహుళజాతి సంస్థలకు మరొకసారి విన్నవించడానికి సర్వసత్తాక ప్రజాస్వామిక భారత ప్రధానమంత్రి ఆ వేదికను కూడ వినియోగించుకున్నారు.
ఆ సమావేశంలో ప్రధాన ప్రసంగం చేసిన ప్రధాని, ధరల పెరుగుదలను అరికట్టాలంటే చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవేశంపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను రద్దుచేయవలసిందేనని బల్లగుద్ది చెప్పారు. రైతులకు వ్యవసాయోత్పత్తులకు అందుతున్న ధరలకూ మార్కెట్లో కొనుగోలుదారులు చెల్లిస్తున్న చిల్లర ధరలకూ మధ్య చాల వ్యత్యాసం ఉందనీ, ఆ వ్యత్యాసాన్ని తగ్గించాలంటే, వినియోగదారులకు పొలంధరకు సరుకులు అందేలా చూడాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆహ్వానించవలసిందేనని అన్నారు. ఇటీవల చిల్లర ధరల పెరుగుదల టోకు ధరల పెరుగుదల కన్న ఎక్కువగా ఉంటున్నదని, ఎక్కువ పోటీ ఉన్నప్పుడే చిల్లర ధరలు టోకు ధరలకన్న తక్కువగా పెరుగుతాయని ఆయన కొత్త ఆర్థిక సిద్ధాంతాలు కూడ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు వేసే పన్నులు, సెస్సులు, లెవీలు ఇటీవలి కాలంలో చాల పెరిగిపోయాయని, ఒక్కోచోట అవి చిల్లర ధరలలో 10-15 శాతం దాకా కూడ ఉంటున్నాయని, అందువల్లనే ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించడమంటే ప్రస్తుతం ఉన్న ఆంక్షలను తొలగించడం అని అర్థం. ప్రస్తుతం ఒకే బ్రాండు అమ్మకాల చిల్లర వ్యాపారంలో 51 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవేశానికి అనుమతి ఉంది గాని, వివిధ బ్రాండుల సరుకులను ఒకేచోట అమ్మే చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవేశంపై నిషేధం ఉంది. అంటే, అందరికీ తెలిసిన భాషలో చెప్పాలంటే, ఒకే ఒక్క బ్రాండు సరుకులు – అది మెక్ డొనాల్డ్స్, కెంటకీ ఫ్రైడ్ చికెన్, పిజ్జా హట్, రీబోక్, నైకీ, అదిదాస్, లీవైస్, టామీ హిల్ ఫిగర్, సోనీ వంటి ఏ సరుకు అయినా కావచ్చు – అమ్మే దుకాణాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 51 శాతానికి లోబడి దేశంలోకి ప్రవేశించవచ్చు. అది స్వదేశీ ఎగుమతి గృహంతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త రంగ దుకాణం రూపంలోగాని, ఫ్రాంచైజీ రూపంలోగాని, దుకాణంగా పనిచేయని కార్యాలయ రూపంలోగాని ఉండవచ్చు. ఇప్పటికే దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, ఆహారపదార్థాలు, వినోద సాధనాలు అమ్మే ఇటువంటి ఒకేబ్రాండు దుకాణాలు ఇప్పటికే ఏర్పడి ఉన్నాయి.
కాని దేశవ్యాప్తంగా దుకాణాల గొలుసు వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి, ఆ దుకాణాలలో అన్ని బ్రాండ్ల సరుకులూ అమ్మదలచుకున్నట్టయితే, ఆ సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఉండడానికి వీలులేదు. ఆ దుకాణాలలో పూర్తిగాగాని, ఎంతో కొంత వాటా రూపంలో గాని విదేశీ పెట్టుబడి జోక్యం ఉండడానికి వీలులేదు. నిజానికి బహుళజాతి సంస్థలకు అటువంటి దుకాణాల మీద చాల మోజు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లాభాలు సంపాదిస్తున్న, అత్యధిక జనాభాను ఆకర్షిస్తున్న వ్యాపార సంస్థల జాబితాలో అగ్రభాగాన ఉన్నవి అటువంటి చిల్లర వ్యాపారంలో ఉన్న గొలుసు సంస్థలే. అమెరికాలోనూ, యూరప్ లోనూ అటువంటి దుకాణాలదే రాజ్యం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లాభాలు సంపాదిస్తున్న బహుళజాతిసంస్థల జాబితాలో ఒక చమురు కంపెనీ మొదటి స్థానంలో ఉండగా చిల్లర వర్తకంలో ఉన్న వాల్ మార్ట్ స్టోర్స్ రెండో స్థానంలో ఉంది. ఫార్చూన్ 500 ప్రకారం 2009 లో దాని అమ్మకాలు 40,560 కోట్ల డాలర్లు (19,06,320 కోట్ల రూపాయలు) గానూ, లాభాలు 1340 కోట్ల డాలర్లు (62,980 కోట్ల రూపాయలు) గానూ ఉన్నాయి.
ఈ భారీ దుకాణాల ఉదాహరణ చూడలంటే అమెరికాలో తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం దాకా, ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా ఎంత చిన్న పట్టణానికి వెళ్లినా నాలుగైదు వ్యాపారసంస్థల సువిశాలమైన మాల్స్ మాత్రమే ఉంటాయి. అవి వాల్ మార్ట్, కె మార్ట్, టార్గెట్, కాస్ట్ కో, షాప్ కో వంటి భారీ దుకాణాలు. ఎకరాలకొద్దీ విస్తరించిన ఆ దుకాణాలలో గుండుసూది నుంచి విమానందాకా, ఆవాల నుంచి బియ్యందాకా, కొత్తిమీర నుంచి కంప్యూటర్ల దాకా అన్ని బ్రాండ్లకు చెందిన అన్ని సరుకులూ దొరుకుతాయి. అవి సాధారణంగా పట్టణానికి చివర వందలాది ఎకరాలలో విస్తరించి ఉంటాయి. వాటి కార్ పార్కింగ్ స్థలమే డజన్ల ఎకరాలు ఉంటుంది. ఒక్క అగ్గిపెట్టె అత్యవసరంగా కావలసి వచ్చినా ఇరుగుపొరుగు దుకాణాలు ఉండవు గనుక, అటువంటి చిన్న దుకాణాలన్నిటినీ పద్ధతి ప్రకారం చంపేశారు గనుక ఏం కావాలన్నా ఈ మాల్స్ కు వెళ్లవలసిందే. ప్రతిదీ కావలసినదానికన్న ఎక్కువ పరిమాణంలో కొనుక్కోవలసిందే. ప్రతి కుటుంబమూ కారులో అక్కడికి వెళ్లి గంటల తరబడి అక్కడ సరుకులు చూస్తూ, కొనుగోళ్లు చేస్తూ గడుపుతుంది. విలువైన సమయాన్ని ఇలా వృధా చేయడానికి అమెరికన్ సంస్కృతి ‘కొనుగోలు అనుభవం’ అని ఒక ముద్దు పేరు కూడ పెట్టింది.
ఇటువంటి పెద్ద దుకాణాలలో సరుకులను నేరుగా ఉత్పత్తి దారులనుంచి సేకరిస్తారు గనుక, మధ్యవర్తుల గొలుసు ఉండదు గనుక చివరి కొనుగోలుదారు తక్కువ ధరకు కొనుక్కోవచ్చునని ఒక సైద్ధాంతిక సమర్థన కూడ చేస్తుంటారు. కాని మొదట ఇతర చిల్లర దుకాణాలను దెబ్బతీయడానికి తక్కువకు అమ్మినా, ఆ దుకాణాలన్నీ మూతబడిన తర్వాత మధ్యవర్తులందరూ కలిసి వేసుకునే లాభాలను ఈ ఒక్క అమ్మకందారే వేసుకున్నా చేయగలిగిందేమీ లేదు. అప్పుడు వినియోగదారులకు ఆ ధరలకు కొనుక్కోవడం కన్న గత్యంతరం ఉండదు. అలాగే ఒక పట్టణంలోనో, గ్రామంలోనో కొన్ని డజన్ల, వందల దుకాణాలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ, ఇరుగుపొరుగున మానవసంబంధాలతో కొనసాగుతుండగా, ఈ పెద్ద దుకాణాలు వాటన్నిటినీ చంపేసి, యాంత్రీకరణ చేసి, ఉపాధికల్పనను తగ్గిస్తాయి, మానవసంబంధాలను తగ్గిస్తాయి. ఒక వాల్ మార్ట్ లో కనీసం 30,000 రకాల సరుకులు ఒకే చోట దొరుకుతాయని, ఆ గందరగోళంలో ఎటూ తేల్చుకోలేని వినియోగదారులు, కొనుగోలుదారులు ఏదో ఒక బ్రాండుకు కట్టుబడి అది ఎలా ఉన్నా అదే కొనుక్కుంటూ ఉండడానికి సిద్ధపడతారని, అలా బ్రాండ్ విధేయత రూపొందుతుందని సామాజిక శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అలాగే కొన్ని గంటలపాటు అన్ని సరుకుల మధ్య కొన్ని కిలోమీటర్ల పాటు తిరిగినప్పుడు అవసరం లేకపోయినా ఏదో ఒకటి కొనకతప్పని మానసినస్థితి ఏర్పడుతుందని, వారి జేబులో డబ్బు లేకపోయినా, క్రెడిట్ కార్డ్ సహాయంతో కొనవచ్చునని చెప్పి వారికి ఆ సరుకులను మప్పడం మొదలవుతుందని కూడ అధ్యయనాలు చెపుతున్నాయి.
ఇలా చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడి, గొలుసు దుకాణాల భారీవ్యవస్థలు ఎందుకు రాగూడదో, వాటివల్ల అనర్థాలేమిటో ఇప్పటికే ఎన్నో వాదనలు ఉన్నాయి. మన దేశంలో ఈ భారీ దుకాణాలు ప్రవేశిస్తే, కోట్లాది మంది ఉపాధి కోల్పోతారని, చిన్న, గ్రామీణ, ఇరుగుపొరుగు దుకాణాల చుట్టూ అల్లుకున్న మానవసంబంధాలు ధ్వంసమవుతాయని ఆందోళనలు వినబడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒక కోటీ యాభై లక్షల చిల్లర దుకాణాలు ఉన్నాయని, వాటిలో మొత్తం ప్రత్యక్షంగా నాలుగుకోట్ల మంది ఉపాధి పొందుతున్నారని, వీటిని ధ్వంసంచేసి పెద్ద దుకాణాలను అనుమతించగూడదని వాదనలు ఉన్నాయి.
కాని 1992 నుంచీ సాగుతున్న ప్రపంచీకరణ క్రమంలో అన్ని ప్రభుత్వాలూ క్రమక్రమంగా దేశీయ, స్వావలంబన విధానాలకు తూట్లు పొడుస్తూ, బహుళజాతి సంస్థల అనుకూల విధానాలను కొద్దికొద్దిగా ప్రవేశపెడుతూ వచ్చాయి. ఆ క్రమంలోనే టోకు వర్తకంలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడి ప్రవేశానికీ, ఒకే బ్రాండు వ్యాపారంలో 51 శాతానికి మించని పెట్టుబడి ప్రవేశానికీ అనుమతి దొరికింది.
ఇంకా మిగిలిపోయిన ఆంక్షలు విభిన్న బ్రాండుల విశాల విపణులలో విదేశీ పెట్టుబడి ప్రవేశం మీద మాత్రమే. అటువంటి విభిన్న బ్రాండుల విశాల దుకాణాల గుత్తాధిపత్య వ్యాపారాన్ని అనుమతించాలని భారీ బహుళజాతి సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు, వారి స్వదేశీ దళారులు, పారిశ్రామిక, వ్యాపారవర్గాల సంస్థలు చాల కాలంగా కోరుతున్నాయి. ఆ కోరికలకు మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం లొంగకపోతే ఆశ్చర్యం గాని, లొంగితే ఆశ్చర్యం ఏమీలేదు. అందుకే ఫిబ్రవరి 6 మన్మోహన్ సింగ్ ప్రకటన తర్వాత బహుళజాతి సంస్థలు, వారి దళారులు ఆయన మీద ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
అలా చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవేశిస్తే కలగబోయే అనర్థాలేమిటి, ఆ పరిణామం ఏ ప్రయోజనాలను చూపెట్టి, ఏ దుష్పరిణామాలను దాస్తున్నది, ఆ చూపెట్టే మేళ్లయినా సక్రమంగా అమలు జరుగుతాయా, ఆ కీడులకు అంతిమ పర్యవసానం ఎంత విధ్వంసంగా రానున్నది మరొకసారి వివరంగా చర్చించవచ్చు గాని, ప్రస్తుతానికి ఆ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవేశానికీ, సరుకుల చిల్లర ధరలు తగ్గడానికీ ఏమన్నా సంబంధం ఉన్నదా లేదా చూడాలి. స్వయంగా ఆర్థికవేత్త అయిన ప్రధాన మంత్రి బట్టతలకూ మోకాలికీ ముడివేయడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో చూడాలి.
ఏ సరుకుకయినా నిర్దిష్టంగా ఏదో ఒక ధర ఉండడం అనేది అందరికీ తెలిసిన విషయమే. పారిశ్రామిక ఉత్పత్తులకయితే ఆ ధరలు చాల కచ్చితంగా ఉండడం, వ్యవసాయోత్పత్తులకయితే ఆ ధరలు ఒకచోట తక్కువగా, ఒకచోట ఎక్కువగా ఉండడం, రుతువులను బట్టి మారుతుండడం, సాధారణంగా అన్ని సరుకుల ధరలూ పైపైకి పోతూ ఉండడం అందరికీ తెలిసిన విషయాలే. కాని అసలు ఒక సరుకు ధరను నిర్ణయించే అంశాలేమిటి? అర్థశాస్త్రపు సాంకేతికమైన, జటిలమైన అంశాలను పక్కనపెట్టి సాధారణ పరిభాషలో ధరలను నిర్ణయించే అంశాలను చెప్పుకోవాలంటే అవి ఆరు. ఉత్పత్తి వ్యయం, రవాణా వ్యయం, నిర్వహణ వ్యయం, లాభం, పన్నులు, చిల్లర వర్తక కమిషన్.
ఏ సరుకునయినా తయారుచేయాలంటే కొన్ని ముడి సరుకులు, ఉత్పాదకాలు, కొంత మానవశ్రమ అవసరమవుతాయి. ముడి సరుకులు, ఉత్పాదకాలు ఎక్కువగా ప్రకృతిలో లభ్యమయ్యేవే గాని, వాటికి కూడ యజమానులు ఉండే సామాజికస్థితిలో మనం ఉన్నాం గనుక వాటిని ధరపెట్టి కొనుక్కోవలసిందే. వ్యవసాయానికయితే విత్తనాలు, నీళ్లు వంటి ప్రకృతి సహజమైన ఉత్పాదకాలు, ఎరువులు, రసాయనాలు, పనిముట్లు వంటి ఇతరంగా ఉత్పత్తి అయిన ఉత్పాదకాలు కావాలి. ఇతర సరుకులకయితే ఖనిజాలు, అటవీ ఉత్పత్తులు, వ్యసాయోత్పత్తులు వంటి సహజ వనరులు, యంత్రాలు వంటి ఇతరంగా ఉత్పత్తి అయిన ఉత్పాదకాలు కావాలి. ఈ సహజ వనరులనైనా, ఇతరంగా ఉత్పత్తి అయిన ఉత్పాదకాలనైనా వినియోగించి కొత్త ఉత్పత్తులను సృష్టించడానికి మానవశ్రమ లేకపోతే ఏ సరుకూ తయారు కాదు. అంటే సహజ వనరులు, పనిముట్లు, యంత్రాలు, మానవశ్రమల మీద పెట్టే ఖర్చు అంతా ఉత్పత్తి వ్యయంలో భాగమవుతుంది.
ఏ సరుకయినా ఒకచోట ఉత్పత్తి అవుతుంది గాని దాని వాడకం సమాజమంతా వ్యాపించి ఉంటుంది. ఆ పంపిణీ సక్రమంగా జరగాలంటే ఏ సరుకయినా ఆ సమాజంలో నాలుగు మూలలకీ రవాణా కావలసి ఉంటుంది. ఆ రవాణా వ్యయం కూడ సరుకు ధరలో భాగం అవుతుంది.
ఉత్పత్తిని నిర్వహించడానికి గాని, పంపిణీని నిర్వహించడానికి గాని, పంపిణీ అయ్యేలోపు నిలువలను నిర్వహించడానికి గాని అయ్యే నిర్వహణ వ్యయం కూడ ఇటీవలి కాలంలో చాల పెరిగిపోతున్నది గనుక ఆ వ్యయాన్ని కూడ ధరలోనే భాగం చేస్తున్నారు.
ఈ నిర్వహణ చేసినందుకుగాను తమకు అందవలసిన ప్రతిఫలం అనే పేరుతో ప్రతి ఉత్పత్తిదారూ, పంపిణీదారూ, గిడ్డంగి నిర్వాహకులూ మరికొంత భాగాన్ని ధరలో కలుపుతున్నారు. అది న్యాయమైనదేనా, అది ఉన్నా అంత ఉండవచ్చునా అనే ప్రశ్నలు ఉంటాయి గాని ఈ భాగాన్ని లాభం అనే పేరు మీద అందరూ అంగీకరిస్తున్నారు.
ఇక ఒక సరుకు ఉత్పత్తికీ, వినియోగదారుకు చేరడానికీ మధ్య ప్రభుత్వం విధించే పన్నులు ఎన్నో ఉంటాయి. డ్యూటీ, సెస్, టారిఫ్, అమ్మకం పన్ను, వాణిజ్య పన్ను, స్థానిక పన్ను, సర్ ఛార్జ్ అని వేరువేరు రూపాలలో ఉండే ఈ పన్నులు సరుకు ధరలోనే భాగమవుతాయి.
ఇవన్నీ కాక, వినియోగదారుకూ సరుకుకూ మధ్య ఉండే సరఫరా గొలుసులో ఉండే మధ్య వర్తులు, ఆ గొలుసులో చిట్టచివరి చిల్లర వర్తకులు ఆ సరుకును అమ్మినందుకు తమకు ప్రతిఫలం ఆశిస్తారు. దాన్ని సాధారణంగా వర్తక కమిషన్ అంటారు. అది కూడ ధరలో భాగమవుతుంది.
ఇవన్నీ కాక, సరుకుల ధరలు సప్లై – డిమాండ్ సూత్రం మీద ఆధారపడి ఉంటాయని, ఒక సరుకు సరఫరా కన్న గిరాకీ ఎక్కువ ఉంటే దాని ధర పెరుగుతుందని, గిరాకీ కన్న సరఫరా ఎక్కువ ఉంటే ధర తగ్గుతుందని అర్థశాస్త్రం బోధిస్తుంది. ఐతే మొత్తంగా ధరల మీద దీని ప్రభావం స్వల్పకాలికంగా ఉండవచ్చు గాని దీర్ఘకాలికంగా అంత ఎక్కువ ఉండదు. మార్కెట్ లో ఒక సరుకు సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధర పెరుగుతుందనుకుంటే, అలా ధర పెరగగానే, తమ లాభం కూడ పెరుగుతుంది గనుక ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి పెంచుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. అలా సరఫరా పెరిగింది గనుక ధర తగ్గుతుంది. అప్పుడు ఆ సరుకు ఉత్పత్తి లాభసాటి కాదు గనుక ఉత్పత్తిదారులు ఆ సరుకును తగ్గిస్తారు. ఇలా అటూ ఇటూ ఊగిసలాట అంతిమంగా ధర మధ్యస్తంగా స్థిరపడడానికి దారి తీస్తుంది. అంటే సరఫరా – గిరాకీ ప్రభావం తగ్గిపోతుంది.
ఈ వివరణంతా ఎందుకంటే ధరలను నిర్ణయించే ఆరు అంశాలలో దేని కారణంగా ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయో నిర్ధారించుకుంటే, దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తే ధరల పెరుగుదలను అరికట్టవచ్చు. ఉత్పత్తి వ్యయం సాధారణంగా సహజవనరుల విషయంలో ఆ కాలపు సాంకేతిక పరిజ్ఞానం స్థాయిని బట్టి, మానవశ్రమ విషయంలో ఆ కాలపు జీవన ప్రమాణాలను బట్టి నిర్ణయమవుతుంది. కనుక ఉత్పత్తి వ్యయాన్ని కచ్చితంగా అంచనాకట్టడం, అదుపు చేయడం, ధరమీద అది ఎంత ప్రభావం వేస్తుందో గుర్తించడం సాధ్యమే.
ఇక రవాణా వ్యయం సాధారణంగా రవాణా దూరాన్ని బట్టి, రవాణాకు అవసరమైన ఇంధనవ్యయాన్ని బట్టి ఉంటుంది. ఉత్పత్తిని, పరిశ్రమలను వికేంద్రీకరించడం ద్వారా దూరాన్ని తగ్గించవచ్చు. ఇంధన వనరుల సక్రమ వినియోగంద్వారా, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణ ద్వారా ఆ వ్యయాన్ని కూడ అదుపులో పెట్టవచ్చు.
నిర్వహణ వ్యయాన్ని కూడ ప్రణాళికా బధ్దమైన ఉత్పత్తి, పంపిణీ, రవాణా, నిలువల ద్వారా అదుపులో పెట్టవచ్చు, సరుకుల ఉత్పత్తిదారులు విపరీతమైన లాభాలు గడించకుండా, గుత్తాధిపత్యం ద్వారా అభ్యంతరకరమైన వర్తక పద్ధతులను పాటించకుండా చూసే చట్టాలు ఉన్నాయి. 1992 తర్వాత ఆ చట్టాలను ప్రభుత్వమే సవరించి, పలుచబరచినప్పటికీ, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం కూడ మితిమీరిన లాభాలనూ, గుత్తధిపత్యాన్నీ అరికట్టవచ్చు. కనుక ప్రభుత్వం తలచుకుంటే లాభాలరేటు మీద, వర్తక కమిషన్ రేటు మీద ఆంక్షలు విధించవచ్చు.
ఇక పన్నులు విధించే అధికారం పూర్తిగా ప్రభుత్వానిదే గనుక పన్నుల విధానాన్ని హేతుబద్ధంగా, న్యాయంగా తయారు చేయవలసి ఉంటుంది. అక్రమార్జన మీద ఎటువంటి పన్నులు విధించకుండా, ఎప్పటికప్పుడు రాయితీలు ప్రకటిస్తూ వస్తున్న ప్రభుత్వమే పరోక్ష పన్నుల రూపంలో ప్రతి సరుకు కొనుగోలు మీద కనబడని పన్నులు విధించి ప్రజల నెత్తురూ చెమటా పీల్చుకుంటున్నది. పన్నుల విధానాన్ని మార్చడం ద్వారా సరుకుల ధరలను అదుపులో పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు.
అందువల్ల ధరలు తగ్గుతాయా లేదా అనేది ప్రభుత్వం చేతిలో ఉన్న పని. దానికీ విదేశీ పెట్టుబడి ప్రవేశానికీ సుదూర సంబంధం కూడ లేదు. తాడిచెట్టుకూ దూడగడ్డికీ, బట్టతలకూ మోకాలికీ ఉన్నంత సంబంధం కూడ ధరల తగ్గుదలకూ విదేశీ పెట్టుబడులకూ లేదు. ప్రజలు అనుభవిస్తున్న ఒక నిత్యజీవిత సమస్యను సాకుగా చూపి ప్రపంచబ్యాంకు మాజీ ఉద్యోగి ప్రవేశపెట్టదలచుకున్న మూడో తరం ఆర్థిక సంస్కరణలలో భాగమే చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి
though i agree that whatever manmohan singh said is untrue. But i disagree with the point that multibrand retail is bad for our economy & our country.
you have missed out important point on y prices r raising……..excess supply of money/govt. printing excess money
మీరు చెప్పిన రెండు సామెతల కన్నా, “పృష్ట తాడనాద్దంత భఙ్గః” (తుంటి మీద కొడితే పళ్ళు రాలిపోయాయ్!) అన్న సామెత ఇంకా బాగా సరిపోతుంది.
నా “ఓ ప్రపంచ పౌరుడు” బ్లాగులో యేడాదీ రెండేళ్ళ క్రితమే, “మూడ్డబ్బులు బెల్లం, కాణీ కాప్పొడుం” గురించి ఓ టపా వ్రాశాను.
ఇక, xyx వ్యాఖ్యలో వ్రాసినట్టు, ఎక్సెస్ సప్ లై ఆఫ్ మనీ/ఎక్సెస్ ప్రింటింగ్ ఆఫ్ మనీ కూడా ఓ కారణం.
దువ్వూరి వారు, రెపో రేటు పెంచారు బాగానే వుంది–రివర్స్ రెపో రేటు తగ్గించాలికదా? యెందుకు పెంచుతున్నారు?
డ్వాక్రా సంఘాల ద్వారా, మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా, కొన్నివేల కోట్లు ఆర్థిక వ్యవస్థలోకి యెందుకు ప్రవహింపబడుతున్నాయి?
సోకాల్డ్ “వృధ్ధి” రేటు పేరు చెప్పుకొని! (ఇది నిజం గా వాపు గానీ బలుపు కాదు!)
ముందుందిలెండి ముసళ్లపండగ!