మన్మోహన మాయాజాలం

ఈభూమి మార్చ్ 2011 సంచిక కొరకు

‘మంచోడు మంచోడు అంటే మంచం విరగ్గొట్టాడు’ అని సామెత. తరతరాల వివేకం నిక్షిప్తమైన ఆ మాటను ఈ దేశ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ అక్షరాలా నిజం చేస్తున్నారు.

క్షీరసాగర మథనంలో సమానపాత్ర వహించిన రెండు పక్షాలలో ఒక పక్షానికి ఫలితం ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి పురాణదేవతలు విష్ణుమూర్తి చేత మోహినీ రూపం ఎత్తించారు. మైమరపింపజేసిన ఆ జగన్మోహిని తన టక్కుటమారాలతో ఒక పక్షాన్ని మోసగించి వారికి అమృతం దక్కకుండా చేసింది. ఆ మోహిని లాగనే, ‘ఉత్తముడు, మంచి బాలుడు, నిరాడంబరుడు, నిజాయితీపరుడు, మహామేధావి’ అని పేరున్న మరొక మోహనుడి అవతారం రెండు దశాబ్దాలుగా ఆధునిక భారతాన్ని ప్రభావితం చేస్తున్నది. కోట్లాది శ్రమజీవుల ఫలితం ఎగ్గొట్టి పిడికెడు మంది దేశీయ సంపన్నులకు, వారి వెనుక ఉన్న బహుళజాతి సంస్థలకు అమృతం ధారపోయడానికి వచ్చాడు ఈ మన్మోహనుడు.

ప్రపంచ బ్యాంకుకూ, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకూ సన్నిహితుడైన మన్మోహన్ సింగ్ ఎక్కడా ఎన్నిక కాకుండానే సరాసరిగా దేశానికి ఆర్థిక మంత్రి స్థానంలోకి వచ్చి కూచున్నారు. నిజం చెప్పాలంటే 1991 ఎన్నికలలో ఈ ఒక్కటే కాదు, చాల విచిత్రాలు జరిగాయి. మూడు విడతలుగా జరిగిన ఆ ఎన్నికలలో మొదటి విడత తర్వాత రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఆ తర్వాత రెండు విడతలు కొన్నాళ్లు వాయిదా పడ్డాయి. అంత కీలకమైన పరిస్థితుల్లో అయినా మొత్తం మీద 53 శాతం వోటర్లు మాత్రమే వోట్లు వేశారు. అంటే దేశ జనాభాలో సగభాగం ఆ ఎన్నికల్లో తమ అభిమతం తెలియజేయలేదు. అభిమతం తెలియజేసినవారిలో ఎందరిది నిజమైన అభిమతమో, మరెందరు ఏయే ప్రలోభాలకు లోబడి తెలిపారో, అసలు వారి పేరు మీద మరెవరు బాలట్ పత్రాల మీద ముద్రలు గుద్దారో తెలియదు. మొత్తం మీద పోలయిన వోట్లలో అత్యధిక స్థానాలు తెచ్చుకున్న భారత జాతీయ కాంగ్రెస్ కు 35 శాతం వోట్లు, 244 స్థానాలు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం ఏర్పరచడానికి అవి సరిపోవు గనుక ఇతర చిన్నా చితకా పార్టీల మద్దతుతో మైనారిటీ ప్రభుత్వంగానే అది ఐదు సంవత్సరాలు కొనసాగింది. మైనారిటీ ప్రభుత్వంగా ఉంటూనే అది దేశ రాజకీయార్థిక వ్యవస్థలో గణనీయమైన, కీలకమైన మార్పులెన్నో చేసింది. లోకసభలో మూడింట రెండు వంతుల ఆధిక్యత ఉన్నప్పుడు కూడ చేయలేని పనులు ఈ మైనారిటీ ప్రభుత్వం చేయగలిగిందంటే, దాన్ని ప్రధాన ప్రతిపక్షంగానీ, వామపక్షాలు గానీ అడ్డుకోలేదంటే, ప్రపంచీకరణ విధానాల అమలుకు పార్లమెంటరీ రాజకీయ పక్షాలన్నిటి ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఉందని తేటతెల్లమవుతుంది.

అటువంటి ప్రభుత్వంలో మిగిలిన మంత్రులందరికన్న ముందు ఆర్థికశాఖ మంత్రిగా ఎంపిక అయినవాడు, ప్రధానికన్న ముందుగానో, ప్రధానితో సమానంగానో రానున్న ప్రభుత్వ విధానాన్ని ప్రకటించినవాడు డా. మన్మోహన్ సింగ్. ఆ ఐదు సంవత్సరాలలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నినాదాలతో నూతన ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక విధానాలను ప్రకటించి, అమలుచేసి దేశ వనరులమీద, దేశ మార్కెట్ల మీద విదేశీ పట్టును పెంచడంలో ఆయనదే కీలక పాత్ర. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడంలో, వ్యవసాయరంగానికి, ప్రజా పంపిణీ వ్యవస్థకూ, సంక్షేమరంగాలకూ నిధుల కేటాయింపులను తగ్గించడంలో, ద్రవ్య, బీమా రంగాలను మార్కెట్ శక్తులకు అప్పగించడంలో, ప్రజాసంక్షేమ చట్టాలను రద్దు చేయడంలో, సవరించడంలో తన మంత్రిత్వ శాఖలో ఆయన తీసుకున్న చర్యలు, ఇతర మంత్రిత్వశాఖలలో ఆయన ప్రోత్సహించిన చర్యలు దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థల మీద లోతయిన, ప్రమాదకరమైన  ప్రభావాన్ని చూపాయి.

ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం చేపట్టలేకపోయినా,  2004లో మొదటిసారి కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) అధికారంలోకి రాగానే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రధానమంత్రి అయిపోయారు. 1999 ఎన్నికలలో లోకసభ అభ్యర్థిగా దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయినా, మళ్లీ కూడ ఎక్కడా గెలవకుండానే ప్రధానమంత్రి స్థానంలోనూ కూచోగలిగిన మన్మోహన రూపం ఆయనది.

భారత ముడిసరుకులను, వనరులను, మార్కెట్లను కొల్లగొట్టదలచిన బహుళజాతిసంస్థలు, అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు – మరో మాటల్లో క్షీరసాగర మథనం తర్వాత అమృతం తామే దొంగిలించాలనుకున్న దేవతలు – 1991లోనూ, 2004 లోనూ, 2009లోనూ ఆయనను ఆ స్థానంలో కూచోబెట్టాయి. (కూచోబెట్టినది మన ప్రజలూ ప్రజాప్రతినిధులూ కాదా, దేశదేశాల సంపన్నులా, ప్రపంచ బ్యాంకా అని ఆశ్చర్యపోకండి. మన కేంద్ర మంత్రివర్గంలో స్థానాలను నీరా రాడియాలూ బర్ఖా దత్ లూ వీర్ సంఘ్వీలూ ఇప్పించగాలేనిది, రతన్ టాటాలూ ముకేశ్ అంబానీలూ తమ ప్రయోజనాలు కాపాడగల, తాము వరించిన బంట్లే ఆయా సంబంధిత శాఖల మంత్రులుగా ఉండాలని, తమ మాట వినని వారు మంత్రులు కాగూడదని చెప్పి మెప్పించగా లేనిది అంతకన్న ఎంతో బలమైన అంతర్జాతీయ దొంగల ముఠాలు, బహుళజాతి సంస్థలు ఈ పదవులను ఇప్పించలేవా?)

అందువల్ల తనను ఆ స్థానంలో ప్రతిష్టించిన వారికి అమృతం అందించడమే ఆ మోహిని పని. ఆ పనిని సమర్థించుకునే వాదనలు తయారు చేయడం, ఈ మోసాన్ని ఇతరులు గ్రహించకుండా ఉండడానికి తన వ్యక్తిగత నిజాయితీని, నిరాడంబరత్వాన్ని, నిస్సహాయతను ప్రదర్శిస్తూ ఉండడం, తనను నియమించినవారి స్తోత్రగీతాలు పాడడం ఈ మోహిని పనులలో కొన్ని. ఈ చివరి పని ఎంత నిస్సిగ్గుగా జరిగిందో చరిత్రకెక్కింది. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినప్పుడు, 2005 జూలై 8న ఆయన ధన్యవాదాలు తెలిపే ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంలో ఆయన ప్రస్తుత బహుళజాతి సంస్థలను మాత్రమే కాదు, మూడు శతాబ్దాలపాటు భారత ప్రజల మూలుగులు పీల్చి పిప్పి చేసిన బ్రిటిష్ వలసవాదాన్ని కూడ వేనోళ్ల ప్రశంసించారు. బ్రిటిష్ వ్యతిరేక భారత జాతీయోద్యమానికి నాయకత్వం వహించానని చెప్పుకునే పార్టీ ప్రభుత్వాధినేత బ్రిటిష్ పాలనను సమర్థించడం ఉచితమా అనే ప్రశ్నకూడ ఆయనకు తలెత్తలేదు. స్వయంపాలనకు సత్పరిపాలనకు పోటీ తెచ్చి, బ్రిటిష్ ప్రభుత్వానిది సత్పరిపాలన అని కితాబు ఇచ్చారు. జలియన్ వాలాబాగ్ నీడలో అమృత్ సర్ లో విద్యాభ్యాసం చేసిన వ్యక్తే ఆ నెత్తుటి సాక్షిగా బ్రిటిష్ పాలనను సత్పరిపాలన అని కీర్తించారు.

ఇక మిగిలిన రెండు పనులు, తన ప్రభుత్వం చేసే ప్రజావ్యతిరేక, దేశవ్యతిరేక కార్యక్రమాలను సమర్థించుకోవడం, తన వ్యక్తిగత నిజాయితీ మాటున అసలు విషయాలు దాటవేయడం ఎప్పుడూ జరిగేవే అయినా మొన్నటికి మొన్న ఫిబ్రవరి 16న దేశంలోని టెలివిజన్ ఛానళ్ల సంపాదకులతో ఆయన జరిపిన సమావేశంలో వచ్చిన ప్రశ్నలకు ఆయన చెప్పిన జవాబులు చదివి తీరవలసినవి.

ఆయన ప్రధానిగా మొదటి పాలనా కాలంలో ఐదు సంవత్సరాలలో రెండే రెండు సార్లు పత్రికా సమావేశాలు నిర్వహించారని పత్రికలు రాస్తున్నాయి. ఇక రెండో పాలనా కాలంలో పదవిలోకి రాగానే ఒకసారి పత్రికా సమావేశం నిర్వహించారు గాని, ఒక సంవత్సరానికి పైగా అనేక కుంభకోణాల ఆరోపణలతో దేశం హోరెత్తిపోతున్నా, తన మీద వ్యక్తిగతంగానూ, ప్రభుత్వం మీదా, మంత్రులమీదా అనేక విమర్శలు సాగుతున్నా వాటికి జవాబు చెప్పాలని, వివరణలు ఇవ్వాలని, తనవైపు వాదనలు వినిపించాలని ఆయన ప్రయత్నించలేదు.

అటువంటి నేపథ్యంలో, ప్రత్యేకంగా 2జి స్పెక్ట్రం, ఎస్ బ్యాండ్ స్పెక్ట్రం కుంభకోణాలు బయటపడిన తర్వాత, 2జి కుంభకోణంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని నియమించడం ససేమిరా కుదరదని పార్లమెంటు సమావేశాల కాలాన్నంతా వృథా చేసిన తర్వాత ఆయన స్వయంగా టెలివిజన్ సంపాదకులకు సమయం ఇవ్వడం చాల ఆహ్వానించదగిన, గుర్తించదగిన పరిణామం. అయితే కొండంత రాగం తీసి పిల్లి కూతతో ముగించినట్టు ఈ సమావేశం మన్మోహన్ సింగ్ లోని దివాళాకోరుతనాన్ని బయటపెట్టింది. వ్యక్తిగా ఆయన మచ్చలేనివాడేనని అనుకున్నా, ఈ సమావేశంలో ఆయన వివరణలు భారత రాజకీయాలలోని కూటనీతిని, అవకాశవాదాన్ని, అసలు సమస్యల దాటవేతను స్పష్టంగా బయటపెట్టాయి.

ఫిబ్రవరి 16న డా. మన్మోహన్ సింగ్ తన అధికారిక నివాసం 7, రేస్ కోర్స్ రోడ్ లో డెబ్బై నిమిషాల సేపు సంపాదకులతో మాట్లాడారు. ఈ సమావేశంలో 2జి స్పెక్ట్రం కుంభకోణం, అవినీతి ఆరోపణల తర్వాత కూడ 2009 మంత్రివర్గంలోకి రాజాను తీసుకోవడం, 2జి స్పెక్ట్రం విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు, న్యాయవ్యవస్థలో అవినీతి, ఆర్థిక సంస్కరణల కొనసాగింపు, కామన్ వెల్త్ క్రీడల అవినీతిపై విచారణ, సబ్సిడీలు, విదేశాల్లో భారత ప్రతిష్ట దిగజారడం, ప్రధాని వ్యక్తిగత నిజాయితీ, ప్రభుత్వ స్థిరత్వం, తమిళనాడు ఎన్నికలు, తమిళ మత్స్యకారులను శ్రీలంక నావికాదళం నిర్బంధించడం వంటి అనేక అంశాలు చర్చకు వచ్చాయి.

అన్ని అంశాల మీద మహా ఘనత వహించిన భారత ప్రధాని ఆణిముత్యాలెన్నో ప్రకటించారు గాని, ప్రజాజీవనానికి సంబంధించిన నాలుగైదు అంశాలు మాత్రం నిశితంగా పరిశీలించవలసి ఉంది.

పాత ప్రభుత్వంలోనే 2007 నవంబర్ లోనే టెలికాం మంత్రిగా రాజా అక్రమాలు ప్రధాని దృష్టికి వచ్చినప్పుడు, 2009 మేలో మళ్లీ అదే వ్యక్తికి అదే పదవి కట్టబెట్టడంలో ఔచిత్యం ఏమిటని వచ్చిన ప్రశ్నకు జవాబిస్తూ డా. మన్మోహన్ సింగ్ ఏమన్నారో చూడండి:

“2007 నవంబర్ లో ఆ ఆరోపణలు రాగానే రాజాకు ఉత్తరం రాశాను. ఆయన తానేమీ తప్పు చేయలేదని, అన్ని వ్యవహారాల్లోనూ పారదర్శకంగా ఉన్నానని, ఇకముందు కూడ అలాగే ఉంటానని జవాబు రాశారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖతో ఈ చర్చ జరిగినప్పుడు కూడ ఈ వ్యవహారమంతా 2003లో తయారయిన విధానం ప్రకారమే నడుస్తున్నదని తేలింది. అందువల్లనే నేనీ విషయంలో ముందుకు వెళ్లలేకపోయాను. స్పెక్ట్రం కొనుక్కుంటున్న వాళ్లు ఎందుకు కొనుక్కుంటున్నారో నాకు తెలియదు. వాళ్ల కొనుగోలు అప్పటికి కొనసాగుతున్న విధానాల ప్రకారం సక్రమంగానే జరిగింది. ఆ మంత్రిత్వశాఖలో ఏమి జరుగుతున్నదో నాకు తెలియదు. లైసెన్సులు ఎవరికి ఇస్తారనేది మంత్రివర్గానికి గాని, నాకు గాని చెప్పలేదు. అది పూర్తిగా టెలికాం మంత్రి నిర్ణయమే. స్పెక్ట్రం ఒకసారి కొనుక్కున్నవాళ్లు తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి అది ఎవరికైనా అమ్ముకోవడం తప్పేమీ కాదు. ఇక రాజాను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవడం గురించి, మనం ఒక సంకీర్ణ రాజకీయాల యుగంలో ఉన్నాం. సంకీర్ణ రాజకీయాలలో మనం సహాయం తీసుకుంటున్న పార్టీ నాయకుడు ఎవరి పేరు చెపితే వారికి మంత్రి పదవి ఇవ్వవలసిందే. అందువల్ల ఎన్నో వైపులనుంచి ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వనని చెప్పడం కుదరలేదు. ఇవ్వడం తప్పని నాకనిపించలేదు” అన్నారాయన.

ఈ జవాబులో ప్రతి వాక్యమూ మోసపూరితంగా, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నది. పాలనావిధానాల దివాళాకోరుతనాన్ని చూపుతున్నది. ఎవరయినా ఒకరిమీద ఆరోపణలు వచ్చినప్పుడు, ఆ ఆరోపణలకు ఆధారాలు కూడ చూపుతున్నప్పుడు, ఆ ఆధారాలు సరైనవో కావో నిర్ధారించి, అంతిమ నిర్ణయం తీసుకోవడం ఒక పద్ధతి. కాని ఎవరి మీద ఆరోపణలు వచ్చాయో, వారికి ఒక ఉత్తరం రాసి, వారు ‘నేనేమీ తప్పు చేయలేదు’ అంటే అదే చివరిమాటగా తీసుకోవడం కనీస ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరూ చేసే పని కాదు. పోనీ ‘ఆ మాట నమ్మాను, అతనేమీ తప్పు చేయలేదు’ అనే వైఖరికైనా కట్టుబడి ఉంటే సిబిఐ విచారణ, మంత్రివర్గం నుంచి తొలగింపు, అరెస్టు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియామకం వంటి చర్యలన్నీ తీసుకోకుండానైనా ఉండాలి. వీటిలో ఏది సత్యం, ఏదసత్యం, ఓ మహాత్మా, ఓ మహర్షీ?

ఇక అంతకు ముందరి ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే జరుగుతున్నదని తెలిసి మిన్నకున్నాను అనేది ఒక బాధ్యతగల మనిషి, ప్రభుత్వాధినేత అనవలసిన మాట కాదు. విభిన్న రాజకీయ పక్షాల పాలన ఉన్నప్పుడు, ఆయా రాజకీయ పక్షాల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పుడు పాత ప్రభుత్వ నిర్ణయాలను కొత్త ప్రభుత్వాలు మార్చడం, సవరించడం చాల సహజమైన, అనివార్యమైన చర్యలు. ఈ అరవై సంవత్సరాలలో అన్ని ప్రభుత్వాలూ అటువంటి పనులు చేశాయి. 2003లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్ డి ఎ కూటమి, లేదా అప్పటి టెలికాం మంత్రి తీసుకున్న నిర్ణయం కొనసాగించడానికి అది సరైనదా కాదా అనేది గీటురాయి కావాలి గాని, పాత వాళ్లు తీసుకున్నారు గనుక దాన్ని కొనసాగించాం అనేది దూడగడ్డి కోసం తాటిచెట్టు ఎక్కానన్నదాని కన్న పెద్ద వంచన.

లేదా, బహుళజాతి సంస్థలకు, ప్రైవేటు గుత్తాధిపత్య వ్యాపారులకు మేలు చేయడంలో భారతీయ జనతా పార్టీ మంత్రి చేసిన నిర్ణయానికీ, మా మంత్రి చేసే నిర్ణయానికీ తేడా ఏమీ లేదు అనైనా బహిరంగంగా చెప్పవలసి ఉంది. ఇంతకాలమూ ఒకటి అధికార పక్షమూ మరొకటి ప్రతిపక్షమూ అని, ఆ రెంటి మధ్య దేశ ఆర్థికవ్యవస్థ గురించి, ప్రజా సంక్షేమం గురించి భిన్నమైన దృక్పథాల తేడా ఉందని అనుకుంటున్న అమాయకులెవరయినా ఉంటే వాళ్ల కళ్లు తెరిపించవలసి ఉంది.

అంతకన్న ఘోరం కేంద్రంలోగాని, రాష్ట్రంలో గాని తీసుకునే పాలనాపరమైన నిర్ణయాలేవయినా మంత్రివర్గపు ఉమ్మడి బాధ్యత అవుతాయి గాని, ఏ ఒక్కరి సంపూర్ణ బాధ్యత కావు. అది ఆ టెలికాం మంత్రి ఇష్టారాజ్యానికి వదిలేశాం. మిగిలిన మంత్రులకు గాని, నాకు గాని తెలియదు అని డా. మన్మోహన్ సింగ్ వంటి పండితుడు అంటున్నారంటే మన రాజ్యాంగ వ్యవస్థనే తారుమారు చేస్తున్నారన్నమాట. ఒక ప్రత్యేకమైన నిర్ణయం నాకు తెలియదు అన్నా అర్థం చేసుకోవచ్చు గాని అన్ని నిర్ణయాలూ ఆ మంత్రిత్వశాఖ ఇష్టమే అంటే ఇక్కడ ప్రజా ప్రభుత్వం నడుస్తున్నదా, దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారా?

ఇక స్పెక్ట్రం కొనుక్కునేవాళ్లు ఎందుకు కొనుక్కుంటున్నారో తనకు తెలియదని, వాళ్లు డబ్బు సంపాదించుకోవడానికి ఇతరులకు అమ్ముకోవచ్చునని ఈ దేశపు ప్రధాని బహిరంగంగా అంటున్నాడంటే అంతకన్న సిగ్గు పడవలసిన విషయం మరొకటి ఉండదు. స్పెక్ట్రం మిగిలిన అన్ని వనరులలాగే ప్రజల ఉమ్మడి సంపద. ప్రభుత్వ బాధ్యత దానికి ధర్మకర్తగా, నిర్వాహకురాలిగా ఉండి, ప్రజల ఖజానాకు దాని నుంచి ఆదాయం సమకూర్చడమే తప్ప ఉచితంగానో చౌకధరలకో దొంగలకు పంపిణీ చేయడం కాదు. కారుచౌక ధరలకు ఒకరికి అమ్మజూపుతారట, దాన్ని వాళ్లు విపరీతమైన ఖరీదుకు ఇతరులకు అమ్ముకుంటారట. తమ జేబులోంచి ఒక్క పైసా బయటికి తీయకుండానే, ఈ మారు బేరంలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారట. ఇదంతా ఈ పేరుమోసిన ఆర్థికవేత్తకు తెలియదట. మారుబేరానికి అమ్ముకుని ఆ దొంగలు చేసుకునే వేల కోట్ల రూపాయలేవో, ప్రభుత్వమే సంపాదించి ఉండవచ్చునని, అలా సంపాదించకపోవడం ద్వారా ప్రజా ఖజానాకు అక్షరాలా ఒక లక్షా డెబ్బైఆరువేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, విమర్శకులు కాదు, స్వయంగా రాజ్యాంగబద్ధ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన తర్వాతనే ఈ వివాదం చెలరేగుతున్నది. అయినా ఈ మహామేధావి ఇంతగా బుకాయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

అక్కడితో ఆగిపోలేదు. 2జి స్పెక్ట్రం అవినీతి కుంభకోణం గురించే వచ్చిన మరొక ప్రశ్నకు జవాబిస్తూ “ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌకధరల దుకాణాలకు ఆహారపదార్థాల కోసం రు. 80,000 కోట్ల సబ్సిడీ ఇస్తున్నాం. రు. 60,000 కోట్లు ఎరువుల సబ్సిడీ ఇస్తున్నాం. కిరోసిన్ సబ్సిడీ ఇస్తున్నాం. ఎవరైనా ఈ సరుకులన్నిటినీ మార్కెట్ ధరలకు అమ్మి ఉంటే ఈ సబ్సిడీ ఇవ్వనక్కర లేదుగదా, ఆమేరకు వేల కోట్ల రూపాయలు నష్టమే కదా అంటే ఎలా ఉంటుంది” అని ఎదురు ప్రశ్నించారు. 1991 నుంచీ కూడ పేదప్రజలకు అందుతున్న సబ్సిడీని ఎలా కత్తిరించాలా, అన్ని సరుకులనూ మార్కెట్ శక్తుల లాభాపేక్షకు ఎలా అప్పగించాలా అని నిరంతరం ఆలోచిస్తున్న ప్రపంచ బ్యాంకు దళారీ ఇటువంటి మాటలు మాట్లాడడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు.

కాని ఇక్కడ గుర్తించవలసినది, ఆహార పదార్థాల సబ్సిడీ, కిరోసిన్ సబ్సిడీ అందుతున్నది బడుగు, బలహీన వర్గాలకు, దిగువ మధ్యతరగతికి. ఎరువుల సబ్సిడీ అందుతున్నది రైతాంగానికి. అది కూడ మన్మోహన్ సింగ్ తన జేబులోంచి ఏమీ ఇవ్వడం లేదు.  ఆ అశేష ప్రజానీకం, రైతాంగం ఆరుగాలం కష్టపడి పోగు చేసిన జాతీయ సంపద లోంచి నాలుగు మెతుకులు విదిలించడమే ఆయనకు ఇంత కష్టమవుతున్నది. మరొక పక్క దాన్ని టాటాలకూ, అంబానీలకూ, మిత్తల్ లకూ అటువంటి దేశదేశాల సంపన్నులకూ చెందిన టెలికాం కంపెనీలకు అప్పనంగా అప్పగించిన వనరులతో పోలుస్తున్నాడు. ఆ టెలికాం కంపెనీలు జాతీయ సంపదకు చేర్చినదేమీ లేదు, జాతీయ సంపదను కొల్లగొట్టడం తప్ప. నిజంగా ప్రజలకు రావలసిన ప్రతిఫలంలోని చిన్న భాగాన్ని తప్పుపడుతున్న ఈ ప్రపంచీకరణ వ్యాపారి, ప్రైవేటు గుత్త వ్యాపారులకు ప్రతిఫలమే ఇవ్వనక్కరలేని స్థితిలో లక్షల కోట్ల రూపాయలు అప్పగించి, దాన్ని సబ్సిడీలతో పోలుస్తున్నాడంటే ఎంత బేహద్బీ ఇది! తిండి పదార్థాలనూ, ఎరువులనూ, కిరోసిన్ నూ మార్కెట్ శక్తులకు అప్పగించాలట గాని, బడా సంపన్నులకు ఇబ్బడి ముబ్బడి లాభాలు చేకూర్చిపెట్టే స్పెక్ట్రం అమ్మకాలలో మాత్రం మార్కెట్ శక్తులు, సూత్రాలు పనిచేయగూడదట.

ఆర్థిక సంస్కరణల మార్గాన్ని తాము వదిలిపెట్టలేదని, ఇంకా చేపట్టవలసిన చర్యలు ఎన్నో ఉన్నాయని, భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటున్నందువల్ల మాత్రమే తాము ఆ పనులు చేయలేకపోతున్నామని కూడ ఆయన మరొక ప్రశ్నకు జవాబుగా అన్నారు. అంటే రానున్న రోజులలో చేపట్టనున్న సంస్కరణలలో ఇప్పుడు ఆయన ఏవగించుకుంటున్న ఆహార, ఎరువుల, కిరోసిన్ సబ్సిడీల కోత కూడ ఉండబోతుందని హెచ్చరిస్తున్నారన్నమాట.

ఇక అన్నీ తెలిసినా కేవలం సంకీర్ణ రాజకీయ నీతి వల్ల మాత్రమే అవినీతిపరుడికి మంత్రి పదవి ఇచ్చానని మరొక సమర్థన. అంత నీతిపరుడయితే, అంతగా సంకీర్ణ రాజకీయాల ఒత్తిడి పట్ల వ్యతిరేకత ఉన్నవారయితే ఆ అవినీతిపరులతో ప్రభుత్వం ఏర్పరచే బదులు, ప్రభుత్వం లేకపోయినా ఫర్వాలేదనుకోవచ్చు. సంకీర్ణ రాజకీయాల ఒత్తిడిని అంగీకరించడంలో చూపుతున్న నీతి అసలు పాలనాధికారాన్ని త్యజించడంలో చూపించవచ్చు. ఎవరిని మోసగించడానికి ఈ ధర్మపన్నాలు?

ఇంకొక ప్రశ్నకు జవాబుగా న్యాయవ్యవస్థలోగాని, అధికారవర్గంలోగాని, చట్టసభలలో గాని ప్రజాజీవనంలో ఎక్కడ అవినీతి ఉన్నా దాన్ని తుదముట్టించాలనే వాళ్లలో తాను మొట్టమొదట ఉంటానని ప్రధాని గంభీరంగా చెప్పారు. అవినీతిని నిర్మూలించాల్సిందే అని బీరాలు పలికారు. కాని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే స్వార్థం కొరకు మాత్రం రాజా అవినీతిని సహించడంలో మొదటివాడుగా ఉన్నారు. సంకీర్ణ రాజకీయాల అవకాశవాద సూత్రాలకు లోబడి రాజా అవినీతిని తుదముట్టించాలనే ఆలోచనను మాత్రం పక్కనపెట్టారు. తాను చాల నిజాయితీపరుడినని, సీజర్ భార్య కూడ పరీక్షకు నిలవాల్సిందేనని నానుడి చెప్పినట్టు తాను ఏ పరీక్షకైనా భయపడనని ఆయన అన్నారు. వ్యక్తిగత నిజాయితీ ఆయనకు వ్యక్తిగా మేలు చేస్తుందేమో గాని, దేశ పాలనా వ్యవహారాలలో, నూటపదికోట్ల మంది జీవితాలకు సంబంధించి ఆయన ఆమోదిస్తున్న, మౌనంగా సహిస్తున్న, అమలు చేస్తున్న నిజాయితీ రాహిత్యం, వంచన ఈ దేశ వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ధ్వంసం చేస్తున్నది.

చివరిగా ఆయన తనను కలిసిన టివి ఛానళ్ల సంపాదకులకూ, మొత్తంగానే ప్రచార సాధనాలకూ ఒక సలహా ఇచ్చారు. ఇటీవలి అవినీతి, కుంభకోణాల వార్తల వల్ల అంతర్జాతీయంగా భారతదేశపు ప్రతిష్ట దిగజారుతున్నదని, దాని సరిచేయడానికి ఏమి చేయనున్నారని ప్రశ్నించినప్పుడు ఆయన అది సరి చేస్తామని, సరి చేయడానికి చర్యలు తీసుకుంటామని అనలేదు. ఆ ప్రతిష్టను దిగజార్చే వార్తలు రాయవద్దని మాత్రం నర్మగర్భంగా కోరారు. “ఈ వాతావరణం మంచిది కాదు. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇది భారతదేశపు ప్రతిష్టను దిగజారుస్తుంది. కనుక ఈ ఘటనలను నివేదించేటప్పుడు మీ మీ అభిప్రాయాలేవయినా, వాస్తవాలను పవిత్రంగా చూడాలని కోరుతున్నాను. వాస్తవాలను వక్రీకరించగూడదు. మీ అభిప్రాయాలు స్వేచ్ఛగా ప్రకటించవచ్చు, కాని మన దేశ వ్యవహారాల గురించి రాసేటప్పుడు, వాస్తవాలను గురించి రాసేటపుడు జాగ్రత్త తీసుకోవాలి” అని సలహా ఇచ్చారు.

కుటుంబ గౌరవం కోసం ఇంట్లోని కుళ్లును బయటపెట్టవద్దని కోరడం, దేశంలో జరుగుతున్న తప్పులను కప్పిపుచ్చడంకోసం దేశభక్తిని రెచ్చగొట్టడం పాలకులకు అలవాటయిన విద్యే. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని, ప్రపంచవ్యాప్త అనుభవాలు సంపాదించిన మేధావి, ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యమని గొప్పలు చెప్పుకునే దేశపు ప్రధానమంత్రి, దేశప్రతిష్టను యథాతథంగా ఉంచాలంటే దేశంలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలను బయటపెట్టకండి, వాస్తవాలు జాగ్రత్తగా రాయండి (వాస్తవాలను దాచిపెట్టండి అని దానర్థం) అంటున్నాడంటే 1968లో చెరబండరాజు రాసినట్టు, “అమ్మా భారతీ, నీ గమ్యం ఏమిటి తల్లీ?”

 

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in వ్యాసాలు, Ee Bhoomi. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s